రామాయణం - రావణుని చరిత్ర


రామాయణ కావ్యం తెలియని భారతీయులు (ఏ మతస్తులు గానీయండి) ఉండరని చెప్పటం అతిశయోక్తి కాదేమో. అయితే ఈ పురాణ గాధను నిజమని నమ్మేవారు మాత్రం బహుకొద్ది మంది మాత్రమే. బహుశా హిందుత్వాన్ని తృణీకరించటమే అభ్యుదయవాదమనుకునే మన దుస్థితి దీనికి కారణం కావచ్చు. ఈ రామాయణ కధాసారం ఎలా ఉన్నా, రామాయణ ఘట్టంలోని పలు పాత్రల ఉనికికి చారిత్రక ఆనవాళ్ళు ఉన్నాయి. రాముడు అయోధ్యకు చెందిన రఘువంశీకుడని, రావణుడు బ్రాహ్మడని పురాణాలు చెప్తున్నాయి. వీటికి గల చారిత్రక ఆధారాలను పరిశీలిద్దాం.

రామాయణాన్ని - ముఖ్యంగా చివరిదైన ఉత్తరకాండ ను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే, రావణుడు శ్రీలంకలో స్థిరపడ్డవాడే తప్ప ద్రవిడుడు కాదని అర్ధం అవుతుంది. ఈ ప్రకారం చూస్తే మధుర - ప్రస్తుత దక్షిణ డిల్లీ ల మధ్య విస్తరించిన యదువంశం నుండి రావణుడు వచ్చిన ఆనవాళ్ళు ఉత్తరకాండలో కనపడతాయి. నిజానికి సీతాపహరణానికి ముందు రావణుని ప్రస్తావన ఎన్నో ఉత్తరాది ప్రాంతాలలో ఉంది. రామాయణానికి ఎంతో కాలం పూర్వమే శ్రీలంకపై ఈ విధమైన ఉత్తరాది వలస జీవుల ఆధిపత్యానికి చారిత్రక ఆధారాలున్నాయి. మొట్టమొదటిసారిగా శ్రీలంకపై పట్టు సాధించిన గుజరాత్ ప్రాంతానికి చెందిన యదు వంశీకులు రామాయాణానికి ఎంతో ముందర కాలంవారు. గుజరాత్ సముద్ర తీరం నౌకాయానానికి అనుకూలంగా ఉండుటచే వీరు అరేబియా సముద్రతీర ప్రాంతాలైన దక్షిణాది భారతం మొదలుకుని శ్రీలంక వరకు రాజ్యాధికారాన్ని స్థాపించగలిగారు. వీరి వ్యాపార, సంఘ నిర్మాణ విస్తరణలో భాగంగా ఇది సాధ్యమయ్యింది. ఉత్తరకాండం రావణునికీ, గుజరాత్- మహారాష్ట్ర-రాజస్థాన్-మరియు మధురల మధ్య విస్తరించిన యదు వంశీకులకు గల సంబంధ బాంధవ్యాలను విశదీకరించింది.

మధురను పాలించిన సురశేనుల రాజు లవణునికి, రావణునికి గల బంధుత్వ ప్రస్తావన ఇందులో ఉంది(ఈ లవణుడే రాముని తమ్ముడైన శతృఘ్నుని చేతిలో పరాజయం పాలై రాజ్యాన్ని కోల్పోయాడు). రావణుడు యదు వంశీకులకు పట్టుకొమ్మైన నర్మదానదీ తీరాన శివలింగధారిని పూజిస్తుండగా మరో యదువంశపాలకుడైన కార్త్యవీర అర్జునునికి (ఈతడు తదనంతర కాలంలో పరశురాముని చేతిలో హతమయ్యాడు) పట్టుబడినట్లు చెప్పబడింది. రావణుడు మహారాష్ట్ర ప్రాంతంలోని గోదావరీ నదీ సమీప ప్రాంతాలలో సీతాదేవిని అపహరించినట్లు వర్ణించి ఉంది. ఈ ప్రాంతాలన్నీ యదువంశీకులకు పట్టున్న ప్రాంతాలగుటచే రావణునికి - యదు వంశీకులకు ఉన్న సంబంధాలను కొట్టి పారేయలేం.

దాదాపుగా ఇవే ప్రాంతాలలో(అరణ్యవాసంలో భాగంగా సీతారాములు కాలిడిన ప్రదేశం) రావణుని చెల్లెలు శూర్ఫణఖ నివసించినట్లుగా రామాయణం పేర్కొంది. రావణుడు మహర్షి పులస్త్యుని వంశానికి చెందిన బ్రాహ్మణునిగా ఎక్కువ శాతం నమ్ముతారు. నిజమేదైనా (రావణుడు బ్రాహ్మడే గానీయండి లేదా యదువంశీకుడే కానీయండి) చరిత్రలో ఇన్ని సుధీర్ఘ వివరణలున్న వ్యక్తుల ఆనవాళ్ళను పుక్కిట పురాణమనటం అవివేకమే అవుతుంది.

రావణుడు సామవేదాన్ని వల్లించేవాడు. శివుని అనుగ్రహానికై కైలాసంలో అడుగిడినాడు. హిమాలయా ప్రాంతానికి చెందిన కైలాసం మధురకు దగ్గరగా ఉన్న కారణం చేత కూడా రావణుడు యదువంశీకుడయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

సంస్కృత భాషలో ప్రావీణ్యాన్ని సంపాదించిన రావణుడు శివతాండవ స్తోత్రాన్ని స్వరీకరించాడు. శివతాండవ స్తోత్రం రామాయణం జరిగిన చాలా ఏళ్ళ తర్వాత ఉద్భవించిందని భావించేవాళ్ళు చెప్పింది నిజమని అనుకున్నా కూడా రావణునికి సంస్కృతంలో గల పాండిత్యాన్ని కొట్టిపారేయలేకుండా ఎన్నో వర్ణనలు రామాయణ కావ్యంలో కనిపిస్తాయి. రావణుని మాతృభాష ద్రవిడ భాష కాదని, జన్మ స్థలం శ్రీలంక కాదని, రాజ్య విస్తీరణలో భాగంగా కుబేరుని ఓడించి శ్రీలంకను కైవశం చేసుకున్నాడని ఈ చరిత్ర చెబుతుంది.

రామ రావణుల చరిత్రకు సుర-అసుర వైరాలకు చాలా సారూప్యతలున్నాయి.

వేద, పురాణ, ఉపనిషత్తుల మొదలుకుని, మహాభారతం వరకు దేవతల - రాక్షసుల నిరంతర శతృత్వం పై అనేక కధనాలున్నాయి. ఈ దేవ దానవుల చరిత్రకు గల ఆధారాలను పరిశీలిద్దాం.

సురులుగా పిలవబడే దేవతల గురువు బృహస్పతి కాగా , అసురులుగా లేదా దైత్యులగా పిలవబడే రాక్షసుల(దానవుల) గురువు భృగు వంశానికి చెందిన శుక్రుడు. ఓ విధంగా ఇరు వర్గాలూ సనాతన వేద ధర్మాలను ఆచరించినవారే. ముఖ్యంగా భృగు వంశీకులకు సురులకు మూలం ఒక్కటే. అయినప్పటికినీ శుక్రుడు వివిధ కారణాల వల్ల అసుర పక్షం చేరినాడు. మను సంహితం ప్రకారం సుర సంస్కృతి సరస్వతీ నదీ సమీపాల్లో ఆవిర్భవించింది(ఇది ఇప్పటి ఉత్తర భారత దేశం).

కాగా దైత్యుల (అసురుల) సంస్కృతి యొక్క ఆనవాళ్ళు భృగువంశీకులకు నిలయమైన దక్షిణాది ప్రాంతాలలో కనిపిస్తుంది. ఈ ప్రదేశాలు అరేబియా తీర ప్రాంతాల్లోగల భృగు రాజ్యంగా నిర్ధారింపబడ్డాయి. 'భృగుకక్ష్య' గా పిలవబడే భృగు రాజ్యం కాలక్రమేపీ 'బారుచ్చ్' గా రూపాంతరం చెంది, నేడు బరోడాగా ఆధునీకరంపబడింది. భృగువంశీకులు పూజించే వరుణుడు/సముద్రుడు వీరికి ఆద్యులు. తొలి నాళ్ళల్లోని మను వంశీకుడైన శౌర్యతమ మానవుడు గుజరాత్ చుట్టుప్రక్కల ప్రాంతాలను ఏలినవాడు. ఇతడే కుశస్థలి నగరాన్ని (ద్వారకగా రూపాంతరం చెందినది) నిర్మించినవాడు.

ఈ శౌర్యతముని గురువు భృగువంశీకుడైన చ్యవన భార్గవుడు. అయితే తదుపరి కాలంలో అసురులు శౌర్యతముని నుంచి మను రాజ్యాన్ని చేజిక్కించుకున్నట్లుగా మను సంహితంలో చెప్పబడింది.

దేవ దానవుల మధ్యన ఈ నిరంతర వైరం వల్ల వర్గాలు ఏర్పడ్డాయి. మను వంశస్థుడైన యయాతికి ఇద్దరు భార్యలు. ఒకరు శుక్రుని(భృగు వంశం) కుమార్తెయగు దేవయాని కాగా మరొకరు దైత్యరాజైన(అసుర వంశం) వృషపర్వుని కుమార్తె షర్మిష్ట. ఈ విధంగా మను వంశీకుడైన యయాతి దానవ కన్యనూ, ఆర్యకన్యనూ (భృగువంశం) పెండ్లాడి ఒక కొత్త వర్గానికి శ్రీకారం చుట్టినాడు. యయాతి ఆఖరి కుమారుడైన 'పురు' డు(షర్మిష్టకు పుట్టినవాడు) అసుర వంశ లక్షణాలను పుణికి పుచ్చుకుని మధ్య సరస్వతీ రాజ్యాలను స్థాపించాడు. దీని వల్ల దేవతల(ఆర్యుల)తో అసుర వైరం మరింత ముదిరింది.

యయాతి పెద్ద కుమారుడైన 'యదు' డు(షర్మిష్టకు పుట్టినవాడు) దైత్యుల పట్టుకొమ్మయైన అరేబియా ప్రాంతాలను పాలించాడు. ఇతని సైనిక తరహా పాలన ఇతనికి గల అసుర లక్షణాలను తెలియజేస్తుంది.

ఇక యయాతి రెండవ పుత్రుడు 'తూర్వేషుడు' (దేవయాని సంతానం) ద్రవిడ సంస్కృతికి ఆద్యునిగా ఈ మనుసంహిత చెబుతుంది.

ఓ విధంగా చూస్తే రామ రావణుల యుధ్ధం, తరతరాలుగా సాగుతున్న ఆర్యుల-యదువంశీకుల మధ్యన వైర పరంపరలో భాగంగా భావించవచ్చు.

ఇంతకు పూర్వమే ఇటువంటి వర్గ వైషమ్యాలకు సంబంధించిన సంఘటనలు వేద పురాణాల్లో కనిపిస్తాయి.

పరశురాముడు కార్త్యవీర అర్జునినిపై (యదు వంశీకుడు) సాధించిన విజయం,

కాశీని పాలించిన దేవదాసుడు వితిహవ్యునిపై (యదువంశీకుడు) విజయం,

అయోధ్యను పాలించిన సాగరుడు వైహితునిపై (యదు వంశీకుడు) విజయం ఈ కోవలోనివే.

ఈవిధంగా రాముడు రావణునిపై సాధించిన విజయాన్ని రావణునికి గల యదు సంబంధాలతో కలిపి చూస్తే యదు వైర పరంపరలో భాగంగా అనిపిస్తుంది.

యదువంశీకులు బలపరాక్రమ వంతులు, వేద విద్యా పారంగతులు కావటంచేత ఎన్నో ఏళ్ళు వీరి ఆధిపత్యం చెల్లింది. రావణుడు కూడా ఇట్టి సైనిక పాలనకు పాల్పడ్డ యదువంశీకుడయ్యే ఆస్కారం ఉంది. యాదవుడైన మరో నియంత కంసుడు తదుపరి కాలంలో మధురను పాలించాడు.

యదువంశంనందు ఇటువంటి కర్కశులే కాక ఎందరో మహానుభావులు కూడా జన్మించారు. కృష్ణుడు, రావణుని తమ్ముడైన విభీషణుడు వంటి వారు ఈ కోవలోనికి వస్తారు.

అదే విధంగా ఆర్యుల్లో అందరూ మహనీయులనే అనుకోనఖ్ఖరలేదు. ధుర్యోధనుడు, కౌరవులు ఇటువంటి ఆర్యుల జాబితాలోనికి వస్తారు.

దీనిని బట్టి ద్రవిడులంటే రాక్షసులని, ఆర్యులంటే దేవతలని అపోహను తొలగించవచ్చు. ద్రవిడుల ప్రాబల్యంగల కిష్కింధ(నేటి కర్ణాటక) హనుమంతునికి జన్మనిచ్చింది. రామరావణ యుధ్ధంలో హనుమంతుడు తనకు బలిచక్రవర్తి వంశీకులతో గల పూర్వ బంధాల సహాయంతో ద్రవిడ సైన్యాన్ని రామునికి అండగా తెచ్చాడు.

1980 దశకం వరకూ కూడా శ్రీలంకనందు ఆర్య సంస్కృతి క్రీస్తుపూర్వం 600సం,, తరువాతనే బయల్పడినదని భావించేవారు. అయితే 90లలో సఫలీకృతమైన హరప్పా అధ్యయనాలలో క్రీస్తు పూర్వం 6000 ఏళ్ళనాటికే ఈ వలసలు ఉండేవని నిర్ధారణ అయ్యింది.

శ్రీలంక దేశస్థులు బౌధ్ధ మతానికి స్వీకరించటానికి గల కారణాలు కూడా రావణుడు ఉత్తరాదికి చెందిన యదువంశీకుడయ్యే ఆధారాలను చూపిస్తుంది. యదువంశీకులు పాలించిన మధుర నేపాల్ సరిహద్దుల్లో ఉన్నందువల్లనే కాక ఆశ్చర్య కరంగా ప్రసిధ్ధ బౌధ్ధ సూత్రమైన లంకావతారం శ్రీలంకను పవిత్ర స్థలంగా పేర్కొంది. ఈ బౌధ్ధసూత్రాలలోనే రావణుని యక్ష రాజుగా కీర్తిస్తారు. (దీనికి సమాంతరంగా హిందుత్వం రావణునికి పూర్వం అదే లంకను పాలించిన కుబేరుడని యక్షరాజుగా ప్రస్తుతిస్తుంది.)

ఈ ప్రకారం దక్షిణాదివారు గర్వపడే విధంగా రావణుడు ద్రవిడుడు కాకపోవచ్చు. ప్రాదేశికంగా రావణుడు శ్రీలంకలో స్థిరపడినప్పటికినీ అతని ప్రస్తావన, ఆనవాళ్ళు ఉత్తరాదిన ఎన్నో సంఘటనలలో ఉదహరించబడింది.

ఇక రామభక్తుడు హనుమంతునిలో ద్రవిడ సంస్కృతి ప్రతిఫలించినప్పటికినీ ఆతని వంశబీజాలు బలి చక్రవర్తితోనూ, తమను తాము ఆర్యులుగా ప్రకటించుకున్న వేదపారంగతులైన అగస్త్య, విశ్వామిత్రులలోనూ ఉన్నాయి.

స్థూలంగా చెప్పాలంటే అందరూ ఊహించే విధంగా వీరు ఆర్యులు, వీరు ద్రవిడులు అన్న వివరణ అందరికీ స్పష్టంగా చరిత్రలో ఎక్కడా లభించలేదు. అయితే ఈ విధమైన లోతైన అధ్యయనం చేయక పైపైన గల కధను కట్టె -కొట్టె - తెచ్చె చందాన తెలుసుకుని రామాయణం అభూత కల్పనంటూ కొట్టిపారేసేవారు ఇప్పటికీ కోకొల్లలు. మరో రూపంలో ఇది ఇప్పటి రాజకీయ నాయకులకు కూడా ఒక ఆయుధమయ్యింది. (రామ సేతువు, బాబ్రీ మసీదు ల వివాదాల రూపేణా..)

ఈ ప్రకారం ఉత్తరాది నుంది దక్షిణకు వచ్చినవారిలో రాముడు మొదటివాడేమీ కాదు. యదువంశీకులు, దైత్యులు అంతకు ఎన్నో ఏళ్ళపూర్వమే శ్రీలంకలో స్థిరపడ్డారు. రాముడు కేవలం తన వ్యక్తిగత కారణాలవల్లనే కాక దక్షిణాదిని రావణుని కబంధహస్తాల నుండి విముక్తి చేసేందుకు అక్కడ సుస్థిరమైన, సౌఖ్యమైన పాలనను అందించేందుకు దండెత్తినట్లు ఈ విధమైన చారిత్రక ఆనవాళ్ళు లభిస్తాయి.

రాముడు తన విజయానంతరం, ఉత్తరాది ప్రాబల్యాన్ని దక్షిణాదిపై రుద్దకుండా విభీషణునికే పట్టం కట్టి వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ కారణం చేతనే రాముడు దైవ స్వరూపునిగా ప్రజలందరిచేత పూజింపబడ్డాడు.

ఈ విధమైన తార్కిక ఆలోచన, లోతైన అధ్యయనం - రామాయణం ఎందుకు నిజం కాకూడదు అన్న ప్రశ్నను, విజ్ఞతను బుధ్ధిమంతులలో తప్పక మొలకెత్తిస్తుంది.

మహాభారతం - హిందుత్వ ఆత్మ


చాలా మంది విద్యావంతులు సైతం, బ్రిటిష్ పాలనకు మునుపు భారతదేశం చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేదని, బ్రిటిష్ వారి పుణ్యాన భారతదేశం ఆ రాజ్యాలన్నీ కలుపుకుని ఒక పరిపూర్ణదేశంగా రూపాంతరం చెందిదని అభిప్రాయపడతారు. వారి ఈ అభిప్రాయానికి కారణం మనం చిన్నప్పుడు చదువుకున్న పాఠ్య పుస్తకాలే. అంతే కాక భారత దేశం అంతటా వివిధ రకాల సంస్కృతులు (ఈ వాదనకు ఊతంగా వివిధ భాషలను తీసుకుంటారు.) ఉండేవని, రాజకీయపరంగా భారతదేశాన్ని ఒక్క గాటిన పెట్టటానికి వీటన్నటినీ సమ్మేళనం చేసి హిందుత్వం అన్న వాదనని తెరపైకి తెచ్చారని కూడా మార్కిస్టులూ మరియూ హిందువేతరులూ భావిస్తారు. వీటిలో నిజానిజాలను పరిశీలిద్దాం.

హిందూ గ్రంధాల ప్రకారం మహాభారత పర్వం సుమారు 3500 ఏళ్ళ కాలం నాటిది. సరే హిందూ మత గ్రంధాల నిబధ్ధతను ప్రశ్నించే ఆస్కారం ఉంది కనుక, మహాభారతం నిజంగా జరిగిందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడదాం. అయితే క్రీస్తుపూర్వమే లిఖించిన శిలాశాసనాలపై(ఇవి తమిళనాడులో బయల్పడ్డాయి) మహాభారతం గూర్చిన వివరణ ఉంది. వీటిలో మహాభారత కాలంలో సామ్రాజ్యం ఎక్కడనుండి ఎక్కడ వరకు విస్తరించి ఉన్నదన్న వివరాలు ఉన్నాయి. ఈ శాసనాలలో వర్ణించిన మహాభారత పర్వం జరిగిన ప్రదేశాలు ఇప్పటి భారతావనిలో గుర్తింపబడ్డాయి.

కురుపాండవుల యుధ్ధం గంగా-యమున నదుల మధ్య భాగాన జరిగినట్లు ఉంది(ఇప్పటికీ ఈ ప్రదేశం కురుక్షేత్రం గా పిలవబడుతుంది). కౌరవుల తల్లి గాంధారి పుట్టినిల్లయిన గాంధార దేశం ఆఫ్ఘనిస్తాను-పాకిస్తానుల మధ్య గుర్తింపబడినది. ముందు చెప్పినట్లు మహాభారతం నిజంగా జరిగిందా లేదా అన్నది ఇక్కడ అప్రస్తుతం. 3500 ఏళ్ళ క్రితం భారతం జరగనీ జరగకపోనీ, కానీ ఈ క్రీస్తు పూర్వపు శిలాశాసనాల వర్ణన ప్రకారం, కనీసం ఆనాటికైనా అఖండ మహాభారతావని ప్రస్తావన ఉంది.

పాండవుల తల్లి కుంతీ దేవి పుట్టినిల్లు ఇప్పటి మధ్యప్రదేశ్ నకు చెందినట్లుగా గుర్తింపబడినది. మహాభారత సూత్రధారి శ్రీ కృష్ణుని జన్మస్థలం యమునానదీ తీరాన ఉన్న మధురగా, కృషుడు పాలించిన ద్వారక గుజరాత్ సమీపాన చరిత్రకారులు గుర్తించారు. జరాసంధుడు పాలించిన మగధ బీహార్ నందున్న ఆనవాళ్ళు కనపడగా, భారత యుధ్ధంలో పాల్గొన్న మిగిలిన రాజుల రాజ్యాల పేర్లు అస్సాం నుండి సింధూ వరకు గుర్తింపబడ్డాయి. పాండవులు వనవాసం మరియూ రాజ్యవిస్తరణలో భాగంగా పశ్చిమాన ఆఫ్ఘనిస్తాను నుండి తూర్పున అస్సోం వరకు, ఉత్తరాన టిబెట్ట్ నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు సంచరించినట్లు ప్రస్తావన ఉంది.

మహాభారతం పుక్కిట పురాణమా లేదా నిజమా అన్న తర్కం ఇక్కడ ఏ విధంగానూ ఉపయోగపడదు. ఎందుకంటే ఈ శిలాశాసనాల ఆధారంగా అఖండ భారత దేశం యొక్క ఉనికి సుస్పష్టం. చాలా మట్టుకు ప్రపంచదేశాలు నాగరికత సాధించక మునుపు, అఖండ భారతావని ఉండేదని ఇవి ఋజువు చేసాయి(రోమన్ చక్రవర్తులు యూరప్ ఖండాన్ని ఒక్కటిగా చేసే ప్రయత్నానికి చాలా ముందర). ఈ శాసనాల ద్వారానే అఖండ భారతావని తో పాటూ భిన్నసంస్కృతుల వాదనకు కూడా తెర దించవచ్చు. ఎన్నోఏళ్ళ క్రితమే భారతదేశం మొత్తం ఒక్క సంస్కృతితో ఒక్క తాటిపై నడచింది. తదుపరి కాలంలో మొఘల్ చక్రవర్తుల దండయాత్రల ఫలితంగానో, బ్రిటిష్ పరిపాలనల వల్లనో మన సంస్కృతిలో ఈ వైవిధ్యాలు ఆవిర్భవించాయి తప్ప ఇన్ని వైరుధ్యాలు హిందూ సంస్కృతిలో లేవు.

ఒక రకంగా చూస్తే ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంత పెద్ద విస్తీర్ణంలో ఒకే రకమైన సంస్కృతి తన ఉనికిని చాటుకున్న ఆనవాళ్ళు లేవు. ఈ ఘనత ఒక్క హిందుత్వానిదే అని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదేమో! దీని ఆధారంగానే భారతదేశం అత్యంత ప్రాచీన దేశమని కూడా భావించవచ్చు. ఈ సారూప్యత దేశ విస్తీర్ణతకే కాక దేశసంస్కృతికీ, హిందుత్వానికీ కూడా ఆపాదించవచ్చు. భిన్న సంస్కృతులుగా భావిస్తున్న శైవం, వైష్ణవం తాలూకు మూలాలు కూడా కాలక్రమంలో ఏర్పడ్డాయన్న సత్యాన్ని మహాభారతం తెలియ చెబుతుంది. మహభారతంలో హిందూ దేవుళ్ళైన శివుడు, విష్ణువు, ఆది పరాశక్తి వివరణలతో పాటుగా విఘ్నాధిపతి గణేశుడు, స్కంధుడు, సూర్యభగవానుడు ప్రస్తావన ఉంది. బ్రహ్మ సిధ్ధాంతం ఆధారంగా మిళితమైన ఈ ఆచారాలు వేదాంత సత్యాలను ఉపదేశించిన వేదాలకు, ఋషులకు, ఉపనిషత్తులకు అత్యంత గౌరవాన్ని కల్పించాయి. వేదాంతం పాటూ యోగ, సంఖ్యా పరమైన బోధనలు కూడా మహాభారతంలో ఉన్నాయి. అంతే కాక పాలకునికి కావలసిన లక్షణాలూ, మానవ జీవన విధానాన్ని, వర్గీకరణాన్ని, వైద్యాన్ని మరియు జ్యోతిష్య శాస్త్రాలను కూడా భారతం వ్యక్తీకరించింది. మహాభారతం ఒక మత గ్రంధం కాదు. పరిపూర్ణ నాగరికతకు ప్రతిబింబం.

ఇందులో మానవ జీవితానికి, సంఘ నిర్మాణానికి సంబంధించి ప్రతిఫలించని విషయం అంటూ లేదు. ప్రాచీన వేదాల సారాంశాన్ని అందరికీ అర్ధమైనట్లు చెప్ప బడిన చరిత్ర తప్ప ఒక మతానికో సంస్కృతికో చెందిన గ్రంధం కాదు. నిజానికి ప్రాచీన ఉపనిషత్తుల్లో కూడా బ్రాహ్మణ, క్షత్రియ మరియూ యోగుల వివరణ ఉంది. ఇదే ఉపనిషత్తుల్లో గాంధార రాజ్యం (ఇప్పటి ఆఫ్ఘనిస్తాను) నుండి వైదేహ (ఇప్పటి తూర్పు బీహార్ - నేపాల్ సరిహద్దులు) వరకు మరియు విదర్భ (మహారాష్ట్ర)ల ప్రస్తావన ఉంది. ఇలా విస్తీర్ణతా పరంగా, సంస్కృతి పరంగా అధిక భూభాగంలో ఆచరించబడిన హిందుత్వం బ్రిటిష్ పరిపాలనా ఫలితంగా ఏకత్వాన్ని సంపాదించిందని చదువుకోవటం(పాఠ్య పుస్తకాలలో) నిజంగా మన దురదృష్టం. బైబిలు ప్రకారం క్రైస్తవం పాలస్తీనా వంటి చిన్న దేశానికి, ఖురాను ప్రకారం ఇస్లాం అరబ్బు, మక్కా వంటి పరిమిత ప్రాంతాలలో ఉనికిని చాటుకుని బలవంతపు మత మార్పిడుల కారణంగా విస్తరించింది.

మిగిలిన మతాలవలే పరిమితమైన ప్రవక్తల గూర్చి కాక వేదాలు వివిధ (వైరుధ్య) వ్యక్తిత్వాలను కలిగిన అసంఖ్యాకమైన యోగులనూ, మహర్షులనూ ఉదహరించాయి. 90 దశకంలో మహాభారతం టెలివిజన్ లో ప్రసారమైనప్పుడు యావత్ భారతదేశం పులకించింది. దుకాణాలు మూసివేయబడ్డాయి. రైళ్ళ రాకపోకలు నిలిపివేయబడ్డ సందర్భాలున్నాయి. రోడ్లు దాదాపు నిర్మానుష్యమయ్యేవి. ప్రపంచంలో మరే దేశంలోనూ బైబిలుకు చెందిన, లేదా మరే ఇతర మతానికి చెందిన కార్యక్రమాలు ఇంత ఎత్తున ఆకర్షించిన దాఖలాలు లేవు. కారణం సుస్పష్టం. ఆ మహాభారతం యొక్క ఆత్మ ఇప్పటికీ ఈ దేశాన్ని, ఇక్కడి హిందువులనూ ఒక్కటిగా చేస్తుంది.

ఎవరైతే ప్రాచీన అఖండ భారతావనిని, సంస్కృతిని, హిందుత్వ ఆత్మను అంగీకరించరో - వారొక్కసారి మహాభారతాన్ని (మత గ్రంధంగా కాక చరిత్ర దృక్పధంతో) చదవాల్సిఉంది. నిజానికి 'మహాభారతం' అన్న పేరు ఒక్కటే చాలునేమో... వాళ్ళ ఆలోచన తప్పు అని చెప్పటానికి.

హిందుత్వం - ఆది లేదు. అంతమూ లేదు



హిందుత్వం ఒక వ్యక్తిచే సృష్టింపబడినది కాదు. మానవాళి మనుగడలో భాగంగా ఏర్పడిన నియమాలు, కట్టుబాట్ల నుండి పుట్టినది. కాలాతీతమైన పధ్ధతులను, హిందుత్వం మార్చుకుంటూ/సంస్కరించుకుంటూ ముందుకు సాగిందే తప్ప మానవ నడవడికను ఏనాడూ ఒకే పధాన నిర్దేశించలేదు. అందు చేతనే హిందుత్వానికి ఆది లేదు, అంతంలేదు. ప్రపంచం అంతరించే వరకు అది ఉండి తీరుతుంది.

అన్ని నదులూ కలిసేది సముద్రంలోనే అయితే అన్ని మతాల సారాంశమూ హిందుత్వంలో ఐక్యమయ్యేవే... ప్రపంచంలోని మిగతా మతాలను లోతుగా అధ్యయనం చేసి చూడండి. క్రైస్తవం, ఇస్లాం, జూడిజం, బౌధ్ధం, తావోయిజం ఇలా ఎన్నో ఉన్నాయి. హిందుత్వాన్ని అర్ధం చేసుకునే ముందు, మిగిలిన మతాలను - ముఖ్యంగా భారత దేశంలో అధిక సంఖ్యాకులు ఆచరించే క్రైస్తవం, ఇస్లామ్ మతాల పుట్టు పూర్వోత్తరాలను సమీక్షిద్దాం.

దేవుని సందేశంగా ముస్లింలు పూజించే పవిత్ర గ్రంధం ఖురానును ప్రపంచం అంతటా క్రైస్తవుల బైబిలు, హిందువుల భగవద్గీత లతో సమానమైన హోదాను కల్పించారు. ఇస్లామ్ మత వ్యవస్థాపకుడు, చివరి ప్రవక్తగా అభివర్ణించే మహ్మద్ జీవిత చరిత్రను ఇప్పుడు సమీక్షిద్దాం.

ప్రవక్త అంటే భగవంతుని సందేశాన్ని ప్రజలందరికీ చాటిచెప్పి, భగవంతుని ఆజ్ఞగా ఆచరించమని చెప్పేవాడు.

యోగి అంటే అత్మానుభూతిని పొందేవాడు.

హిందుత్వం మానవులలో యోగికి అత్యున్నత స్థానం కల్పిస్తే - క్రైస్తవం, ఇస్లాం మతాలు ప్రవక్తకు దేవుని తరవాత స్థానాన్ని కల్పించాయి.

హిందూ ఆధ్యాత్మికవాది స్వామి వివేకానందుడు, తాను రచించిన 'రాజయోగం' లో ఈ విధంగా పేర్కొన్నాడు.

"చాలా సందర్భాల్లో యోగి జ్ఞాన పిపాస తీవ్ర రూపం దాల్చినప్పుడు ఓ విధమైన మాయావస్థ అతనిని కమ్ముతుంది. ఇది జ్ఞానానికి బదులు అతడిని చీకటిలోనికి తోసేసేందుకు ఆస్కారం ఉంది. మహ్మద్ సరియైన శిక్షణలేని కారణాన ఈ రకమైన ఆధ్యాత్మికతలో ఊగిసలాడిన వ్యక్తి.

తాను సమాధి అవస్థ ఉండగా, ఒకనాడు భగవంతుడు తన గుహలోనికి వచ్చాడని, హరక్ అను గుర్రం మీద స్వర్గానికి తోడ్కొని పోయెనని మహ్మద్ చెప్పుకున్నాడు. ఈ విధంగా మహ్మద్ ప్రవక్త ప్రవచించిన కొన్ని అద్భుత సూక్తులూ, సత్యాలూ అతిశయాలతో నిండిఉన్నాయి.

ప్రవక్త ఆధ్యాత్మికంగా ప్రభావితం అయ్యాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ అతిశయాలకు సరియైన వివరణ లేదు. ప్రవక్త శిక్షణలేని యోగి కావటం చేత ఏ విధమైన వివరణలూ లేక, తానేమి చేసెనో తెలుసుకోలేని సంకట స్థితిని అనుభవించినాడు. ప్రవక్త ప్రపంచానికి చేసిన మంచి ఏమిటో ఓ సారి ఆలోచించండి. ప్రవక్త ప్రభోధనల వల్ల లోకానికి జరిగిన కీడుని పరికించండి. 18 వ శకం వరకూ ఇస్లాం మత మార్పిడుల హింసలో లక్షలాది మంది తల్లులు తమ పిల్లల్ని కోల్పోయారు. మరెందరో పిల్లలు అనాధలు అయ్యారు. దేశాలకు, దేశాలే సమూలంగా నిర్మూలింపబడి స్మశానాలయ్యాయి.
"

తీవ్రవాదం రూపంలో ఈ హింస ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ విధమైన అయోమయ స్థితిలో తమ ఆధ్యాత్మిక జీవితాన్ని మళ్ళించిన ఎందరో యోగులు, తాము భగవంతునితో మాట్లాడామని, భగవంతుడు తమకు మతాన్ని ఉపదేశించి ప్రపంచాన్ని ఆ మతంలో నడిపించమన్నాడని చెప్పుకున్నారు. (క్రైస్తవం కూడా ఈ కోవలోనిదే).

ఎవరు అంగీకరించినా లేకున్నా, వివేకానందుడు పై విమర్శలను వాస్తవిక ధృక్పధంతో ఆధ్యాత్మికతను విశ్లేషించి చేసాడన్నది సత్యం.

హిందుత్వం ప్రకారం ఆధ్యాత్మికత, జ్ఞాన సముపార్జన అన్నవి ఎవరైనా పొందగలిగేటివి. వీటికి అంతం అంటూ, అవి పొందిన చివరి వ్యక్తి అంటూ ఉండరు. చిట్ట చివరి చిత్రకారుడూ, చిట్ట చివరి కవి అంటూ ఎవరూ లేనట్టే చిట్టచివరి యోగి అంటూ ఎవరూ ఉండరు. అయితే ఇస్లాం ఇందుకు విరుధ్ధంగా మహ్మద్ ను చిట్ట చివరి ప్రవక్తగా పేర్కొంది.

(దురదృష్ట వశాత్తూ ఈ విధమైన చిట్ట చివరి పోకడలను అప్పుడప్పుడూ హిందుత్వానికీ అంటిస్తున్నారు. ఉదాహరణకు, జిడ్డు కృష్ణ మూర్తి చిట్ట చివరి తత్వవేత్త అంటూ... ఈ చిట్ట చివరి పోకడలు హిందుత్వానికి విరుధ్ధం. ఒక వ్యక్తి మీదునున్న అభిమానంతో, వారితర్వాత వారిని మించిన వ్యక్తి పుట్టబోడని చెప్పటం అవివేకమే అవుతుంది. అదే నిజమైతే రేడియో తర్వాత టెలివిజన్, ఇప్పుడీ ఇంటర్నెట్ లు వచ్చేవి కాదుకదా!)

మహ్మద్ జీవిత చరిత్ర:

మహ్మద్ 40 ఏండ్ల వరకూ సాధారణ జీవితాన్ని గడిపినాడు. ఈయన తరచూ సమాధి అవస్థ (ట్రాన్స్)పొందుతూ భగవంతునితో ముఖాముఖీ మాట్లాడానని ప్రకటించుకునేవాడు. భగవంతుని ఆజ్ఞ మేరకే తనని తాను చిట్ట చివరి ప్రవక్తగా అభివర్ణించుకున్నానని చెప్పి ఉన్నాడు. మహ్మద్ తనని తాను ప్రవక్తగా, దేవుని సేవకుడిగా చెప్పుకున్నాడు. మరణావస్థలో సైతం తన చావుని స్వర్గానికి ప్రయాణంగా అభివర్ణించినాడు తప్పితే భగవంతునిలో ఐక్యత గూర్చి మాట్లాడలేదు. హిందువు నమ్మే ఆత్మ సిధ్ధాంతాన్ని (అహం బ్రహ్మస్మి) ఇస్లాం గానీ, మహ్మద్ గానీ ఒప్పుకోజాలరు.

ఖురాను ప్రకారం ఏ వ్యక్తీ తనని తాను భగవంతునిగా భావించరాదు. తొమ్మిదవ శతకంలో తనని తాను భగవంతునిగా అభివర్ణించుకున్న సుఫీ ఆల్ అఫీజ్ ముక్కలు ముక్కలుగా నరకబడి నదిలో విసిరివేయబడ్డాడు. మహ్మద్ ప్రవక్త అంతటివాడే తనని తాను భగవంతుని సేవకునిగా భావించినప్పుడు ఇతరులు భగవదానుభూతిని పొందటం ఇస్లాం ప్రకారం అసంభవం.

మహ్మద్ ప్రవచనాల్లో అద్భుత అనుభవాలూ, భగవంతునితో సంభాషించటాలూ, ఆయన అనుగ్రహించిన శక్తిపాటవాలూ తప్పితే ఆత్మను గూర్చి గానీ, ఆత్మానుభూతిని గూర్చిగానీ , కర్మ సిధ్ధాంతాలను గూర్చిగానీ ప్రస్తావనలు లేవు.

మహ్మద్ భగవంతుడిని ఎల్లప్పుడూ ప్రభువు స్థానంలో, మానవుణ్ణి సేవకుడి స్థానంలో కూర్చోబెట్టాడు. ఈ ద్వంద్వాన్ని ప్రభోదించటం ద్వారా మానవుణ్ణీ, భగవంతుడ్నీ వేరుగానే ఉంచాడు. మహ్మద్ వర్ణించే భగవంతునికి భావోద్వేగాలున్నాయి. కోపం ఉంది. తనను నమ్మిన వారికి స్వర్గాన్ని, మిగిలిన వారికై నరకాన్ని భగవంతుడు సృష్టించినట్లు మహ్మద్ చెప్పియున్నాడు. వేదాల్లో చెప్పబడ్డ బ్రహ్మ సిధ్ధాంతం, బౌధ్ధంలో ఆచరించే ధర్మకాయం ఇస్లాంకు విరుధ్ధం. పై రెండు సిధ్ధాంతాలూ మనిషిని, భగవంతుడిని వేరుగా కాక కలిపి ఉంచెడివి.

ఈ వైరుధ్యాన్ని క్రైస్తవంలో కూడా గమనించవచ్చు. నిజానికి ఇస్లాం, బైబిలు అడుగుజాడల్లో నడచిందనడానికి ఆధారాలున్నాయి. ఆధ్యాత్మిక పరంగా బైబిలూ, ఖురానులలో సారూప్యతలు సుస్పష్టం.(ఈ సారూప్యాలను ముందు ముందు విపులంగా తెలుసుకుందాం).

ఈ రెండు మతాలూ భగవంతునిలో ఐక్యతను విభేదిస్తాయి.

మహ్మద్ అత్యంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. శుభ్రతకు ప్రాధాన్యతను ఇచ్చేవాడు. మధువును త్యజించినాడు. పేదలనూ, బానిసలనూ, నల్ల జాతీయులను సైతం చేరదీసి వారికి ప్రేమను పంచినాడు. తన అనుచరులందరినీ కుటుంబ సభ్యులవలే భావించి సోదర ప్రేమను పంచినాడు. వర్ణ విచక్షణ లేకుండా అందరినీ సమానంగా ఆదరించినాడు. తన కోసమై ఏనాడూ సంపదలను ఆర్జించ యత్నించలేదు. తిరిగి తన సంపదలను సైతం పరుల కొఱకు త్యజించినాడు. మసీదుల కొరకు ఖరీదయిన కట్టడాలను కాక, వీలయినంత సామాన్యమైన, లేదా మైదానాలను ఉపయోగించాడు. భగవంతునికీ మానవునికీ మధ్య ఏ విధమైన మధ్యవర్తినీ (పూజారులు అనుకోవచ్చు)ఉంచకుండా ముఖాముఖి అనుబంధాన్ని ఏర్పరిచాడు.

అయితే తాను నమ్మిన ఇస్లాంను ప్రభోదించే మహ్మద్ జీవితంలో రెండు విషయాలకు సరియైన వివరణ లభించదు.

1. వ్యక్తిగతం: మహ్మద్ తన 25 వ ఏట 40 ఏండ్ల ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెతో పాతికేండ్లు గృహస్థు ధర్మాన్ని ఆచరించినాక - ఆమె మరణానంతరం 8 మంది అందమైన, యుక్తవయస్కులైన కన్యలను పెండ్లాడినాడు. అప్పటికి మహ్మద్ వయస్సు 50 ఏండ్లు పైబడినది. తన స్నేహితుడైన అబు బక్ర్ కుమార్తె ఐషా ను ఆమె 6వ ఏట పెండ్లాడినాడు. తన దత్త పుత్రుడైన జైద్ చే అతని భార్య జైనాద్ కు విడాకులు ఇప్పించి, ఆమెను పెండ్లాడినాడు. (ఈ వివాహం అనంతరం జైద్ వారసత్వం రద్దు చేయబడింది). ఇస్లాం వివాహేతర మరియూ వివాహానికి మునుపు స్త్రీ పురుషులు నెరపే సంబంధాలను విభేదించినప్పటికినీ, బహుభార్యత్వాన్ని సమర్ధించింది.

సంతాన వ్యాప్తిని దేవుడు ఆజ్ఞాపించిన విధిగా భావించింది. ఇలా సంసార భాద్యతలకు పెద్ద పీట వేయటం ద్వారా, జ్ఞానార్జనకోసమై సర్వం త్యజించే సన్యాసులూ, యోగులూ, బుధ్ధులకు ఇస్లాం సముచిత విలువను ఆపాదించలేకపోయింది.

2. పధానిర్దేశం: సుఫీల ప్రకారం పవిత్ర యుధ్ధం రెండు రకాలు. ఒకటి బాహ్యం, రెండు అంతర్గికం. అంతర్గిక యుధ్ధం శాంతి యుతమైనది. అయితే మహ్మద్ బాహ్య యుధ్ధానికి కూడా ప్రాధాన్యతనిచ్చినట్లు రుజువులున్నాయి. మహ్మద్ 8 కి పైగా యుధ్ధాలు చేసి యున్నాడు. పలుమార్లు గాయపడ్డాడు కూడా. 'బను క్వారైజ' అను తెగకు చెందిన ఏడు వందల మంది యూదులు యుధ్ధ ఖైదీలుగా లొంగిపోయినపుడు - వారిని మహ్మద్, అతని అనుచరులూ ఊచకోత కోసారు. ఒక్కోసారి, తన అనుచరగణంలోని వారిని సైతం సంహరించిన చరిత్ర ఉంది.

షియా తెగకు చెందిన ముస్లింల కధనం ప్రకారం, ఈ హింసాకాండకు కారణం అబు బక్ర్ (కలీఫ్ తెగకు చెందినవాడు. దీనినే సున్నీ అని కూడా పిలుస్తారు.) ఇస్లాం మత సిధ్ధాంతాలను తప్పు ద్రోవ పట్టిస్తున్న కారణంగా, ఇస్లాం సంరక్షణలో భాగంగా మహ్మద్, అబూ బక్ర్ ని తుద ముట్టించాల్సి వచ్చినట్లు వీరు చెబుతారు. తదనంతర పరిణామాల్లో, మహ్మద్ అల్లుడైన అలీ నేతృత్వానికీ, కలీఫ్ తెగకూ వైరం మరింత ముదిరి - అలీ, అతని కుమారులను, మనుమళ్ళనూ సున్నీ తెగ సంహరించిందని కూడా చరిత్రలో ఉంది. ఇక్కడితోనే మహ్మద్ వంశం అంతరించినది. షియా మరియు సుఫీ తెగల వారు అలీని మహ్మద్ యొక్క నిజమైన వారసునిగా భావించేవారు.

కలీఫ్ (సున్నీ) తెగవారు భగవంతునితో ముఖాముఖి అనుబంధాన్ని అంగీకరించలేదు. వీరు వాస్తవికంగా తాము అనుభవించినదానికే కట్టుబడి, మహ్మద్ తనకు తాను చెప్పుకున్న భగవంతునితో సంభాషణలను ఒప్పుకోలేదు. వీరు కూడా మహ్మద్ ఒకప్పటి అనుచరులే. ఈ తెగకు చెందిన అబూ బక్ర్, ఒమర్ల కుమార్తెలను మహ్మద్ పెండ్లాడినాడు. మహ్మద్ తన ఇరువురి కుమార్తెలను మరో కలీఫ్ నాయకుడైన ఓత్మాను కు ఇచ్చి వివాహం జరిపించాడు.

ఆస్మా అను మక్కాకు చెందిన కవయిత్రి, మహ్మద్ ను దూషించిన కారణంగా, మహ్మద్ అనుచరుడైన ఆమీర్ చేతిలో ప్రాణాలను కోల్పోయింది. తన శత్రువుల పండ్ల(ఖర్జూర) తోటలను సైతం మహ్మద్, అతని అనుచరులు తగలబెట్టినట్లు చరిత్ర చెబుతోంది.

ఈ విధమైన సంక్లిష్ట ప్రశ్నలకు, సంఘటనలకు చరిత్రలో ఎక్కడా సరి అయిన వివరణ లభించలేదు.

హిందుత్వం... మతం కాదు. ఒక జీవన విధానం!


చాలా కాలంగా కొన్ని బ్లాగుల్లో 'హిందుత్వ' మెక్కువేంటి? మిగిలిన మతాల తక్కువేంటి? అనే స్ధాయిలో ప్రారంభమయ్యి - మతమౌఢ్యమంటూ 'హిందూ తీవ్రవాదా'న్ని భూతద్దంలో చూపిస్తున్న రచనలను చూసి మధనపడి ఈ బ్లాగునకు శ్రీకారం చుట్టాను.

హిందుత్వ మీద ఇదివరకే కొన్ని బ్లాగులు ఉండవచ్చును గాక! కానీ అవి మత పరమైనవి, అధ్యాత్మిక పరమైనవీనూ! చారిత్రాత్మకంగా హిందుత్వాన్ని విశ్లేషించే బ్లాగు లేనందున, అట్టి బ్లాగు అవసరం ఎంతయినా ఉందనిపించింది.

భావితరాలు పుస్తకాలను మరచి - Ebooksకి, internetలకు అలవాటయిన రోజు, వారికి మొదట పేర్కొన్న రచనలే లభ్యమౌతాయి. అదీగాక ఆ రచయితలు తమ భావాలను వ్యక్తీకరించటంలో ఉధ్ధండులగుటచే, రాబోయే తరాలకు వారి ఉద్దేశ్యాలు ఆదర్శమయ్యే ప్రమాదం ఉంది.

హిందుత్వ మూలాలు తెలియకపోవటం వల్లనో, లేక వాటితో విభేదించటం చేతనో, ఈ రచయితలు చేసే ప్రచారం బలం పుంజుకోక మునుపే చికిత్సా చర్యలు చేపట్టటం మంచిదనిపించింది. లేదంటే పోనుపోనూ హిందుత్వ మూలాలను మన భారతీయులే మరచి ఎంతో practicalగా హిందుత్వాన్ని మత మౌఢ్యంగా అభివర్ణించే అవకాశం ఉంది.

వీటన్నిటికీ సమాధానంగా హిందుత్వ చరిత్రను ఇక్కడ ప్రతీ వారాంతాల్లో సమీక్షించుకుందాం!

సిధ్ధంకండి...


--- బృహఃస్పతి