నీటి బుడగలు - 1



ది 1999 నాటి సంగతి. సంతోషం తూనిగ రెక్కలను, ఆట మైదానాలను ఎప్పుడో దాటిపోయింది. ఏదో ఒకటి సాధించి తీరాలన్న అయోమయ నిశ్చయాలతో ఊగిసలాడుతున్న వయసది. మనం దేనికి పనికొస్తామో మనకే తెలియని స్థితిలో రామచంద్రపురం నుంచి చెల్లూరు దాకా రోజూ పోయి సంగీతం నేర్చుకునే రోజులవి. నేను గిటార్ అయితే, నా జూనియర్ అరుణ్ డ్రమ్స్. మేం నేర్చుకునేది నాయీ బ్రాహ్మణుని వద్దనే అయినా, మా గురువుగారు నిష్టా గరిష్టులు. తెల్లారి ఆరుకల్లా పూజ ముగించి పాచి ముఖాలతో మేం చెప్పే అబధ్ధాలను నమ్మి మాకు నేర్పించేవారు. ఆయన బ్రాహ్మణుడు కాకపోవచ్చునేమో గానీ ఆయన నేర్పే విద్య మా దృష్టిలో శంకరాభరణమే... ఈ ముచ్చట కఠోరంగా కొనసాగించకుండా మధ్యలో ఎన్నో - ఎన్నెన్నో ఆవాంతరాలు. మనసుని లగ్నం చేయనివ్వకుండా పక్కకు మళ్ళించే వ్యాపకాలు, సావాసాలు. అయినప్పటికీ మనసులో సంగీత తృష్ణ మాత్రం అలానే ఉండిపోయింది.

సరే ఆ అనుభవాలన్నీ మజిలీ కధల్లో కొనసాగిస్తే ఆసక్తికరంగా ఉంటుంది. విషయానికొస్తే, చదువు పూర్తయ్యాక హైదరాబాద్ లో అడుగుపెట్టిన మాకు కలిసిన జగన్ సంగీతం అంటే కంఠం కోసుకునే రకం. ఇంట్లో వాళ్ళు మేం బుధ్ధిగా ఇంటర్వ్యూలకి పోతున్నామనుకునే భ్రమల్లో బ్రతుకుతుండగా, స్నేహితులు మేం శ్రధ్ధగా పేకాడుకుంటూ గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నామని భావిస్తున్న ఆ రోజుల్లో, ఎవ్వరికీ తెలియకుండా మేం చేసేది సంగీత సాధన. (నేను సంగీతమన్నప్పుడల్లా మీరు దయచేసి శంకరాభరణం రేంజ్లో మాత్రం ఊహించుకోకండి ప్లీజ్. మీకు రియల్ పిక్క్చర్ కనిపిస్తే అక్కడ సంగీత,సాహిత్యాలతో చెట్టాపట్టాలేసుకునే మందు బాటిళ్ళను చూసి ముఖం చిట్లిస్తారు)

మేం అలా కష్టపడి కంపోజ్ చేసిన కొన్ని పాటలు పాత తవ్వకాలలో బయల్పడ్డాయి. వీటిని రికార్డ్ చేసిన నా కంప్యూటర్ కాన్ఫిగరేషన్ ఇదీ:

ప్రోసెసర్: 1.6 M.Htz. (గెగా కాదు)
హార్డ్ డిస్క్: 4 GB
RAM: 64 MB

Sound Forge లో వాయిద్య పరికరాలను కలుపుకుని, Voice Recorderలో (ఇది ఒక్క నిముషం మాత్రమే రికార్డ్ చేయనిచ్చేది) కంపోస్ చేసిన ఒక పాట క్రింద వినండి. ఒక్కో పాటకి ఒక్కో genre అనుకుని కంపోజ్ చేసే వాళ్ళం. ఈ పాటకి మేం అనుకున్న theme Solo_Deep_Love.

ఈ పాట చరణం రికార్డ్ చేసినప్పటికినీ ఎక్కడో మిస్స్ అయ్యింది. నాకు గుర్తున్నంత వరకు చరణాల్లో పంచేంద్రియాలు ప్రేమకి ఎలా స్పందిస్తాయో అన్నది రాసా...

అన్నట్టు నా గొంతు విని నవ్వుకోకండేం. నేనేం సింగర్ ని కాదు. ఈ డ్రాఫ్ట్ వెర్షన్ కోసం - పాటేంటంటే ఐడియా తెప్పించటానికి మాత్రమే పాడా... :)

video

మీరు భయపడలేదని హామీ ఇస్తే త్వరలో మరో పాటేస్కుంటా... :)

6 comments:

Sravya Vattikuti said...

చాల బాగుంది అని చెప్పలేను కాని నిజం గా మంచి ప్రయత్నం అస్సలు భయపడవలసిన పనిలేదని నా హామీ .
గొంతు మాత్రం చాల బాగుంది !

sunita said...

కధలు, కవిత్వమే కాదు, సంగీతం, సాఫ్ట్వేరూ బాగున్నదండీ జీవనకదంబం. మిమ్మల్ను చూసి నాక్కూడా ఎప్పుడో నేర్చుకుని వదిలేసిన కూచిపూడీ, నేర్చుకోవాలని వదిలేసిన సంగీతం ఓసారి తవ్వకాల్లోంచి తీస్తే బాగుండుననిపిస్తుంది.మీరు ధైర్యంగా ఇంకో పాట వినిపించవచ్చు.

బృహఃస్పతి said...

శ్రావ్యగారూ, మరందుకే - నీటిబుడగలు అని పెట్టాను టైటిల్. చాలా బాగుంటే అజరామరాలు అని పెట్టేసేవాడిని. :)

సునీత గారూ, మరింకేం - తవ్వకాలు మొదలు పెట్టేయండి. కళలు మనోల్లాసానికి మార్గాలు.

భాస్కర్ రామరాజు said...

నాకు భయం అటుంచి కుళ్ళుగా ఉందోయ్. నే నేర్చుకోలేక పోయిన విద్యని నువ్వు ప్రదర్శిస్తున్నావ్.
:(:(.

బాగా పాడావు. మంచి ప్రయత్నం....

భావన said...

బాగుంది. నాకు మనస్పూర్తి గా నచ్చింది.
'వసించినా కృశించదే' , 'తనంత తానే దరి చేరినదేమో'.. ఈ పదాల దగ్గర బాగా పాడేరు.. కొన్ని పదాలు కూసంత ఎక్కువ నొక్కేరు కాని, కాని బాగా పాడేరు.. నేనైతే రడీ ఇంకా వినటానికి. ఎంత మంచి కాలమో ఇలాంటి ప్రయోగాలకు ప్రయత్నాలకు కావలసినంత సమయ మిచ్చిన కావలసినంత హృదయ మిచ్చిన కాలమా జీవన ప్రవాహమా నీకిదే వందనాలు..

బృహఃస్పతి said...

@భాస్కర్ & భావన గారూ, టాంకూ అండీ. మీరామాత్రంమెచ్చుకోవాలే గానీ, మళ్ళీ మీరంతా చెవులు మూసుకుని 'ఇక చాలు ఆపు గార్ధభ కచేరీ' అనేంత వరకూ వినిపిస్తా :)