ఎవ్వరికీ చెప్పను




మంచుగడ్డ కరగటం కంటే విషాదం ఏముంటుంది?

కాలం గడిచే కొద్దీ
మంచు కరగటమే కాదు
నువ్వూ నా చెంతనే
ఉంటావని ఏమిటి నమ్మకం?

అందుకే నీ సహచర్యంలో
సమయం నడవటం కూడా
నే సహించలేను.

గడుస్తున్న సమయం
తిరిగి గతంలోలా
నన్ను ఒంటరిని
చేస్తుందేమోనని భయం

అందుకే ప్రస్తుతం
శాశ్వతంగా ఇలాగే నిలచి పోవాలి
భూత భవిష్యత్తులన్నీ
వర్తమానంలో ఐక్యమవ్వాలి

ఈ ప్రస్తుతం పొడుగునా
నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.
ఒట్టు! విసుగు చెందను.

కొందరు అడుగుతారు నన్ను
ఎవరిని ప్రేమిస్తున్నావని
చిరునవ్వుతో చెప్తాను
ఎవరినీ లేదని...

కానీ వాళ్ళకూ తెలుసు
నా మాటలు అసత్యాలని
ఐతే నిన్ను,
ఓ అమ్మాయిగా ఊహించుకుంటారు.

వీలయినప్పుడల్లా
గేలి చేస్తారు
చుట్టూ చేరి గోల చేస్తారు
నీవెవరో చెప్పమని.

నా మౌనంలో మళ్ళీ
నాకు ఈడైన అమ్మాయిని వెతుక్కుంటారు.

కొందరు గ్రహిస్తారు, నువ్వు
ప్రేయసివి కావని...
అయితే నిన్ను
మరెవరిగానో చిత్రించుకుంటారు.

తల్లనుకుంటారు, చెల్లనుకుంటారు.
మిత్రుడనుకుంటారు, అదీ కాకపోతే
మళ్ళీ ముక్త కంఠంతో
“స్వప్న సుందరి” అంటారు.

మరికొందరుంటారు.
మనస్తత్వ వేత్తల్లా
పరిశోధించి
అసలు నువ్వే లేవని నిర్ధారిస్తారు.

నే తప్పించుకుని వచ్చి
గదిలో గడియ బిగించి కూర్చుని
నీకెదురుగా ఈ ప్రస్తుతం పొడుగునా
నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.

అయితే ప్రస్తుతం మాత్రం
నా కోరికతో తనకేమిటి
నిమిత్తమన్నట్లు
మళ్ళీ మూడు రూపాలూ ధరిస్తుంది.

నే గది వదలి బయటకు వచ్చినా
దేవుడ్ని వేడుకుంటూనే ఉంటాను
నీ చెంతలో వర్తమానం
ఒక్కటే ఉండాలని

నీ కలయికలో క్రొవ్వత్తి
కరగకూడదు
అమర దీపమై వెలగాలని

నీ బంధంలో కాలం
నడవకూడదు
జడమై పడి ఉండాలని

నీ జతలో కనురెప్పలు
ఆర్పకూడదు
ఎడమై నిన్నే గమనించాలని

నా ఊపిరి సైతం మన ప్రేమకు
విఘాతం కలిగించకూడదు
వర్తమానం ఒక్కటే నిలవాలని.

బయట మళ్ళీ అడుగుతారు
ఎవరిని ప్రేమిస్తున్నావని
చిరునవ్వుతో చెప్తాను
ఎవరినీ లేదని

నా మాటలు అసత్యమని
వాళ్ళకీ తెలుసు
నాకూ తెలుసు

అయినా నీ గురించి
ఎవ్వరికీ చెప్పను.
ఒట్టు!!
నీ ఉనికిని పదిలంగా
నా గుండెల్లోనే దాచుకుంటాను.

ఎవ్వరికీ చెప్పను!!

**********

ఎవరికీ చెప్పనని ఎన్నో ఏళ్ళగా ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచినా, ఈ రోజెందుకో చెప్పేయాలనిపిస్తోంది.
నే చెప్పే ముందు మీరు ఓ సారి ఎవరో కనుక్కునే ప్రయత్నం చేయొచ్చు కదా...
చిన్న క్లూ కూడా ఇస్తా... పై కవితలోనే ఆ ఎవరనేది ఉంది.

సమాధానాన్ని క్రిందన డబుల్ కోట్స్ మధ్యన ఫాంట్ సైజ్ తెగ తగ్గించేసి పెట్టా...! వేరే ఎక్కడైనా(లేఖినిలో అయినా ఫర్వాలేదు) కోట్స్ తో సహా కాపీ చేసుకుని, మాగ్నిఫై చేసి కనుక్కోండి. :)

"
కవిత (అమ్మాయి పేరు కాదండీ బాబూ...! :( నిఝ్ఝంగా నిజం కవితే...)
"

తొండి లేకుండా ఉండాలంటే మీ సమాధానం కామెంట్లో పెట్టిన తరువాత మాత్రమే చూడాలి మరి...

శిల - తుది



తడు శిలను స్పృశించాడు. అతని చేతికి శిల మృదువుగా తగిలింది. శిలను తన పెదవులతో చుంబించాడు. పెదవులకి వెచ్చని స్పర్శ తాకింది.

అతని చర్యలను శిల ముభావంగా చూస్తోంది.

అతడు శిలలో ప్రవేశించటానికి సిధ్ధమయ్యాడు. శిలలోనికి చేతిని పోనిచ్చాడు. అతని చేయి లోనికి ప్రవేశించలేదు. శిల మొరటుగా అడ్డుకుంది. అతనికి భయం వేసింది. రెండు చేతులను శిలపై ఆన్చి గుండెలతో ఢీకొన్నాడు. అతడిని శిల అనుమతించలేదు.

అతనికంతా అయోమయంగా ఉంది. చెప్పలేనంత బాధగా ఉంది. దుఃఖం కలుగుతోంది.

చివరకు శిల కూడా తనని మోసగిస్తోంది. చిన్నప్పటినుండి తననెరిగిన శిల సైతం తన పట్ల క్రూరంగా ప్రవర్తిస్తోంది.

ఏదేమైనా అతడు శిలలో ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు. నిజానికి అతనిలో ఏమంత శక్తిలేదు. అయినా ప్రయత్నించటానికి నిశ్చయించుకున్నాడు. శిలను బలంగా గుండెలతో ఢీకున్నాడు. అతని ఛాతీ శిలకు తగిలి గుండెలనుండి రక్తం స్రవిస్తోంది. అతడు తన మోకాళ్ళను శిలలోనికి చొప్పించటానికి ప్రయత్నించాడు. మోకాళ్ళు రక్తసిక్తమయ్యాయి. మతి భ్రమించినవాడి వలే కనిపిస్తున్నాడు.

అతనికి స్పృహ తప్పుతోంది. కళ్ళముందు లీలగా శిల హృదయం కనిపిస్తోంది. తనను ఆహ్వానిస్తోంది. తనలో ఐక్యం చేసుకోవటానికి పిలుస్తోంది. ఆమె చెంతకు చేరుస్తానన్నట్లుగా మాటిస్తోంది.

అతడు తలతో శిలను బలంగా ఢీకున్నాడు. నొసలు చిట్లి నెత్తురు కారింది. రక్తం శిలపై చింది శిలను నెత్తుటి మయం చేస్తోంది. నెత్తురు శిలమీదుగా క్రిందికి జారి ఇసుకలో కలిసిపోతోంది.

అతడిలో సత్తువ ఉడిగిపోతోంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. హృదయం మాత్రం ఆమె గురించే ఆలోచిస్తోంది. తొలిసారి చూసిన సంఘటనను గుర్తుకు తెస్తోంది.

మేలి ముసుగులో నర్తిస్తున్న ఆమెను తాను చేయి పట్టుకుని ఆపినట్లు జ్ఞాపకం వస్తోంది.

ఆమెను భుజాలపై వేసుకుని మేనాలో పడుకోబెట్టినట్లు జ్ఞాపకం వస్తోంది.

ఆమెను నిర్భందించినట్లు జ్ఞాపకం వస్తోంది.

ఆమెను శిలపై విసిరేసినప్పుడు తనను గాయపరచిన శూలలు జ్ఞప్తికి వస్తున్నాయి.

ఒక అపరిచితుని కౌగిలిలో నున్న ఆమె తనను గుర్తుపట్టని సంఘటన జ్ఞాపకం వచ్చింది.

అతడు బలంగా తలను శిలపై మోదాడు.

శిలలో చలనం లేదు. అతని తల మాత్రం పగిలిపోయింది. నెత్తురు ధారాళంగా ఉబికి వచ్చింది. శిలపైనున్న అన్ని ఒంపులలోనూ ప్రవహించి ఇసుకలో ఇంకిపోవటానికి క్రిందికి జాలువారుతోంది.

అతనిలో శిల తనను అనుమతిస్తుందన్న ఆశ చావలేదు. అంచేతనే తన ప్రయత్నాన్ని ఉధృతం చేస్తున్నాడు. మరోసారి తన ముఖాన్ని శిలకేసి మోదాడు. నాశిక చిట్లి నెత్తుటి చారలు చెక్కిలిపై ఆరిపోయాయి. పెదవులు తెగి పళ్ళు రాలిపోయాయి.

అతను చూడటానికి చాలా భయం గొలుపుతూ ఉన్నాడు. ముఖం అంతా నెత్తుటి మయంతో ఒళ్ళంతా గాయాలతో ఉన్నాడు. అతని కళ్ళు మాత్రం తేజస్సును విరజిమ్ముతూ ఉన్నాయి. మునుపటి కంటే ప్రకాశవంతంగా ఉన్నాయి. అతనిలో శక్తి క్షీణిస్తున్న కొద్దీ అతని కళ్ళు మరింత తేజోపేతంగా తయారవుతున్నాయి.

అతనికి అంతిమ ఘడియలు సమీపించాయి. నిజానికి అతనికి చావాలని లేదు. ఎలానైనా సరే తన ప్రేమలోకంలోనికి ప్రవేశించి ఆమెను పొందాలన్న కోరికతో ఉన్నాడు. అందుకు ఏకైక ఆధారం శిల. అందుకనే శిలలో ప్రవేశించటానికి శాయశక్తులా కృషి చేస్తున్నాడు.

బురదలో పాలరాతి శిల్పంలా పడిఉన్న ఆమె రూపం గుర్తుకు వచ్చింది. తలను మరోసారి శిలకేసి మోదాడు.

ఊబిలో నుండి ఆమెను రక్షించినప్పుడు ఆమెను కౌగిలించుకున్న క్షణాలను గుర్తుకు తెచ్చుకున్నాడు.

ఆమె తన ప్రియుని గుండెలపై తలనాన్చి నడవటం గుర్తుకు తెచ్చుకున్నాడు.

తమకోసం ఆమె అల్లిన కలువహారాలు జ్ఞాపకం వచ్చాయి.

చివరగా ఆమెను చుంబించిన సంఘటన గుర్తు చేసుకున్నాడు.

అప్రయత్నంగా అతని పెదవులు మూతబడ్డాయి. శక్తిలేనట్లుగా శిలపై తల వాల్చాడు. అతడి పెదవులు శిలను ముద్దాడాయి. తేజస్సును విరజిమ్మే అతని కళ్ళు నిర్జీవంగా శూన్యంలోనికి చూస్తూ ఉండిపోయాయి.

అతనిలో జీవం ఆరిపోయింది. క్షణంలో రాలేందుకు తారలు లేవు. అతడిని చూసి కన్నీళ్ళు కార్చేందుకు మానవమాత్రులెవరూ దరిదాపుల్లో లేరు. అతడు శిలపై నిర్జీవంగా పడి ఉన్నాడు. తన చేతులను శిలపై చాచి కావలించుకోవటానికి ప్రయత్నిస్తున్న భంగిమలో శిలను చుంబిస్తూ శవమయ్యాడు.

అతని అవశేషం తన తల్లి ఒడిలో సేద తీరుతున్నంత ప్రశాంతంగా నిద్రిస్తోంది.

అతని కళ్ళల్లో మాత్రం ఆమెను కలుసుకోలేకపోయానన్న క్షోభ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కళ్ళు ఆమె కోసం నిరీక్షిస్తున్న భావనను ప్రతిబింబిస్తున్నాయి.

అతనిలో ఆరిపోయిన ప్రాణం శిలలో ప్రవేశించినట్లుగా శిల క్షణకాలం వెలుగును చిమ్మింది.

శిల హృదయం ఇప్పుడు జాలిగొలుపుతూ ఉంది. విలపిస్తున్నట్లుగా ఉంది. అతడిని ఒడిలో చేర్చుకుని నిస్సహాయంగా కన్నీరు కారుస్తున్నట్లుగా ఉంది.

ఔను! అతని నెత్తుటి చారల ప్రక్కనే శిల కార్చిన కన్నీరు క్రిందికి జాలువారి ఇసుకలో కలిసిపోతోంది.

********

సమాప్తం

********

కరగక తప్పదుగా...
కదలక తప్పదుగా...

కన్నీటి గాధలకు,

కటిక శిలైనా...
కర్కశులైనా...

కటిక శిలైనా...
కర్కశులైనా...

*********

శిల - 9 వ భాగము


తనికి ఆ దెబ్బ చాలా బలంగా తగిలింది. లేచే శక్తి లేక అక్కడే కూలబడ్డాడు.

ఆమెలో భయం తగ్గింది.

ప్రియుని కౌగిలి నుంచి బయటకు వచ్చి తనవంక చూస్తోంది.

అ ప్రేయసీ ప్రియులిద్దరూ అంతలోనే ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వారిద్దరిలో మునుపటి ఆనందం ప్రవేశించింది. అతడి వంక ఆసక్తిగా చూస్తున్నారు. తమ ప్రేమలోకంలో అడుగుపెట్టిన పరాయి వ్యక్తిని అపరిచితంగా చూస్తున్నారు. అనవసరంగా అడుగుపెట్టి అభాసు పాలయిన ఆగంతకుని జాలిగా చూస్తున్నారు.

ఆమె నవ్వుతూ ప్రియుని చేతిని విడిపించుకుంది. తనను పట్టుకోమన్నట్లుగా పరిగెడుతోంది. ఆమె ప్రియుడు ఆమెను అందుకోవటానికి వెంబడించాడు. వారిద్దరూ అక్కడినుండి నిష్క్రమించారు.

అతడు తల పైకెత్తి చూసాడు. సూర్యకిరణాల వేడిమి సూటిగా కళ్ళను తాకుతోంది. అతని నోటినుండి నెత్తురు స్రవిస్తోంది. కెరటాల తాకిడికి సముద్రపు నీరు నోటికి తగిలి మరింత నొప్పి పుడుతోంది. హృదయానికి తగిలిన దెబ్బకన్నా పెద్దది కాదు కనుక భరించగలిగాడు. అలసట తీర్చుకుంటూ వారి వంక చూసాడు. వారిద్దరూ నవ్వుకుంటూ, ఒకరినొకరు వెంబడించుకుంటూ అక్కడినుండి వెళ్ళిపోతున్నారు.

సముద్రంలో పొంగుతున్న కెరటాలు అతడిని బలంగా తాకుతున్నాయి. ఆ అలలు చేతులు చాచి నేలను ఆహ్వానిస్తున్నాయి. కానీ కావలించుకోలేక విఫలమై వెనుదిరుగుతున్నాయి. అతనికి ఇంతకు పూర్వం కెరటాల ఆరాటం అర్ధం కాలేదు. ఇప్పుడు తన అనుభవాన్ని ఆ ఆరాటంలో చూస్తున్నాడు.

అతడు లేచి నించున్నాడు. ఆమె వంక చూస్తూ నిలబడ్డాడు. ఆమె కనుమరుగు అవుతున్నా రెప్పవాల్చకుండా చూస్తున్నాడు.

కళ్ళు కరడు కట్టినా
తనువు రక్తసిక్తమైనా
మనసు ముక్కలైనా
మమత దూరమైనా

ఆమె గతించిన వైపే
నిష్క్రమించిన వైపే
ఆమె సుదూరమగు వరకూ..
తదేకంగా దేహం మరచి

రెప్ప వాల్చక
గాలి పీల్చక
చూసిన....
చిట్ట చివరి ఎదురు చూపది.

క్షణక్షణానికి తీక్షణమౌచున్నది.
ఘడియ ఘడియకు ప్రబలమౌచున్నది.

అతడికి తన కాళ్ళు నేలలో కూరుకు పోయినట్లనిపించింది. తాను వృక్షమయ్యాడు. అక్కడ పాతుకుని పోయి ఆమె రాక కోసం నిరీక్షిస్తూ చూస్తున్నాడు. యుగాల పొడుగునా ఎండా వానలను ఓర్చుకుంటూ ఆమెనే చూస్తూ ఉండిపోతున్నాడు.

అతడు తల పక్కకు తిప్పేసాడు. వారిని ఇక చూడాలనిపించటంలేదు. ఇంకా ఎక్కువ సేపు చూస్తే ఇటువంటి ఆలోచనలే వస్తాయి.

అతడికిప్పుడు ఆకలి వేస్తోంది. అలసట వేస్తోంది. తాను ఆహారం తిని చాలా రోజులైనట్లు తెలుస్తోంది. అతనికి ఎటు పోవాలో అర్ధంకాలేదు. తాను సముద్రంలో కేరింతలు కొట్టాలని అనుకున్నట్లు గుర్తుకు వచ్చింది. తన కోరికను తీర్చుకోవటం కోసం కాసేపు ఆనందంగా సముద్రంలో ఈదులాడాడు. మరింత ముందుకు పోవటానికి అతనికి భయం వేసింది. మళ్ళీ తీరానికి వచ్చేసాడు.

అతని కంటికి ఆమె, ఆమె ప్రియుడు ఇంకా చిన్నగా కనిపిస్తున్నారు. అతడు గడ్డం తడుముకున్నాడు. గడ్డం బాగా మొలిచింది. ఆమె ప్రియుడు కొట్టిన దెబ్బకు నొప్పి కలుగుతోంది.

అతడు చిన్నగా నవ్వుకున్నాడు. ఆమె 'ఆమె' కాదు. ఆమె అయివుంటే కనుక కనీసం తనకు దెబ్బ తగిలినప్పుడైనా పోల్చుకునేది.

అతనిలో మళ్ళీ ఆమెను అన్వేషించాలన్న తపన ఆరంభమయ్యింది.

ప్రేమ విఫలమయినప్పుడు ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తారో చెప్పలేం. అతి సున్నిత మనస్కులు సైతం ప్రేమ విఫలమైన సమయంలో చిన్న విషయంగా కొట్టిపారేయవచ్చు. వాస్తవికంగా ఆలోచించే వారైనా భగ్న ప్రేమికుల వలే మారిపోవచ్చు. అది వారి హృదయాంతరాల్లో పెంచుకున్న ప్రేమ పైన ఆధారపడి ఉంటుంది. ఏ భావాన్నైనా విశ్లేషించవచ్చును కానీ, ప్రేమను - అందునా ప్రత్యేకంగా ఒకరిలో కలిగిన ప్రణయానుభవాన్ని వ్యక్తీకరిస్తూ విశ్లేషించటం చాలా కష్టం. అది అర్ధం చేసుకోవటానికి మనం స్వయంగా ప్రేమికులమై ఉండాలి. నిజానికి ఏదైనా భావాన్ని అర్ధం చేసుకునేందుకు ఆ భావాన్ని అనుభవించి ఉండనవసరంలేదు. అక్కడి పరిస్థితులలో మనల్ని మనం అన్వయించుకోవచ్చు. కానీ ప్రేమ అందుకు మినహాయింపు.

అతను ఆకాశం వంక చూసాడు. నీలవర్ణంలోని ఆకాశం లేలేత ఎండను ప్రతిబింబిస్తోంది. అక్కడ వేడిగా కూడా ఉంది.

అసలు తన ప్రేమలోకానికీ - ఈ ప్రదేశానికి ఎక్కడా పొంతన లేదు. తన ప్రేమలోకంలో ప్రస్తుతం పొడుగునా రేయి మాత్రమే నిలచి ఉంటుంది. ఇక్కడ మాత్రం నిత్యం పగలు తిష్ట వేస్తోంది. తన ప్రేమలోకంలోని చల్లదనం ఇక్కడ లేదు. తన వెన్నెల లోకంలో కురిసే వెన్నెలకు, ఇక్కడి ఎండకు పోలిక లేదు. తనది స్వప్న ప్రపంచం. ఇది వాస్తవం. స్వప్నాలిచ్చే ఉల్లాసాన్ని, సంతృప్తిని వాస్తవం అందించలేదు. తానెంతో అదృష్టవంతుడయి ఉండబట్టి స్వప్నాలు కూడా తనకు కళ్ళముందు సాక్షాత్కరించాయి. తన ప్రేమలోకానికి దారి చూపించాయి.

అతడికి ఆమె అక్కడ ఉండి ఉంటుందనుకోవటం భ్రమగా అనిపించింది.

ఆమె ఇంకా అక్కడే ఎక్కడో తన వెన్నెల లోకంలో విహరిస్తూ ఉండిఉంటుంది. దాగుడుమూతలు ఆడుతూ ఉంది. తాను తొందరపడి ఇక్కడకు వచ్చాడు.

అతనిలో విరహం మొదలయ్యింది. మునుపటి ఆందోళన ఇప్పుడిక లేదు. మళ్ళీ ఆమెను అన్వేషించుదామనుకున్నాడు. ఎక్కడ వెదకాలో తెలియలేదు. అక్కడ మాత్రం ఉండదని అర్ధం అయ్యింది. తలతిప్పి చూసాడు. చాలా దూరంలో అతడిని అక్కడకు ప్రవేశపెట్టిన శిల లీలగా కనిపిస్తోంది.

అతనిలో ఆశ ప్రవేశించింది. శిల వైపు పరుగు ప్రారంభించాడు. కాళ్ళు ఇసుకలో కూరుకుపోతున్నాయి. అతనిలో శక్తి నశించింది. అయినా తన పరుగును ఆపలేదు. అంతకంతకూ శిలకు చేరువౌతున్నాడు.

శిల అతడిని గమనిస్తోంది. ఎప్పటిలానే ఏ భావమూ పలికించకుండా. సృష్టి రహస్యాలన్నీ తనకు తెలుసునన్నట్లుగా.

అతడు శిలను సమీపించాడు. శిలను చూడగానే అతడికి తన బాల్యం గుర్తుకు వచ్చింది. చిన్నప్పటి నుంచి తాను చూస్తున్న శిల రూపం గుర్తుకు వచ్చింది. తన స్వప్నాలు గుర్తుకు వచ్చాయి. ఆ స్వప్నాలు శిలపై చేసే నృత్యం గుర్తుకు వచ్చింది.

అతడు బాగా అలసిపోయాడు. శిలకు రెండడుగుల దూరంలో మోకాళ్ళపై కూలబడి అలసట తీర్చుకున్నాడు. అతనికి అక్కడ ఉండాలనిలేదు. త్వరగా తన ప్రేమలోకంలోనికి ప్రవేశించి తన ప్రేయసిని అన్వేషించాలని ఉంది. ప్రస్తుతం ఉన్న వాస్తవం నుండి దూరంగా పారిపోవాలని ఉంది.

తన వెన్నెల లోకంలో ఆమెతో గడపబోయే మధురక్షణాలను ఊహించుకుంటూ లేచి నించున్నాడు. అతడు శిలవంక ప్రేమగా చూసాడు. శిల హృదయాకారంలో ఉంది. ఏదో రహస్యాన్ని తనలో నిగూఢపరచుకున్నట్లుగా ఉంది.

అతడు చేతిని పైకెత్తి శిలను స్పృశించాడు.

*************
(సశేషం) - శిల చివరి భాగం రేపటి వికాసంలో...

శిల - 8 వ భాగము



తడు పరుగు లాంటి నడకతో వారిని చేరుకున్నాడు.

అతనికి కళ్ళముందరి దృశ్యం ఇప్పుడిప్పుడే అవగతం అవుతోంది. 'తన ప్రేమకావ్యంలో పరాయి వ్యక్తి ప్రవేశం తాను కలలో కూడా ఊహించి ఉండలేదు.'

అతనికి బాధగా, భయంగా ఉంది. ఆందోళన గా ఉంది. జీవితంలోని మలుపులను అతని గుండె తట్టుకోలేకుండా ఉంది.

వారిరువురూ నడవటం ఆపి అతని వంక చూసారు. వారికి అతనిని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. వారు లోకంలో పరాయి వ్యక్తిని చూస్తున్నారు. వారి ప్రేమలోకంలో అప్పుడే అడుగిడిన మూడవ వ్యక్తిని చూస్తున్నారు. అక్కడకు వచ్చిన ఆగంతకుడు ఎవరా అని చూస్తున్నారు. ఆమె తన ప్రియుని గుండెలకాన్చిన తన తలనెత్తి అతని వంక చిరునవ్వుతో ఆసక్తిగా చూస్తోంది. ఆమె ప్రియుని చేతివేళ్ళు ఆమె సన్నని నడుముని పలకరిస్తున్నాయి.

అతడు ఆమె ప్రియుని వంక చూసాడు. వ్యక్తి తనలా పీలగా కాక ధృఢంగా, బలిష్టంగా ఉన్నాడు. ఆమె కన్నా కొంచెం పొడుగ్గా ఉన్నాడు. తన కన్నా తెల్లగా ఉన్నాడు. చిరునవ్వులో, చూపుల్లో మంచి పరిణితి కనిపిస్తోంది. నిజం చెప్పాలంటే తనకన్నా అందంగా ఉన్నాడు.

అతడు ఆమెవంక కన్నార్పకుండా చూస్తూ వారిని సమీపించాడు.

ఆమె అతడిని గుర్తించలేదు. విషయం అతనికి అర్ధం అయ్యింది. అతడికి విపరీతమైన దుఃఖం వచ్చింది. వారి సమీపానికి వచ్చాడు.

ఆమె తన ప్రియునికి దగ్గరగా జరిగింది. ఆమెకు అక్కడ ఉండటం ఇష్టంలేదు. ఆమె ప్రియుడు ఆమె ఆంతర్యం అర్ధం అయినట్లుగా అక్కడ నుండి తీసుకుపోయాడు.

అతడు మాత్రం అక్కడే ఉండిపోయాడు. అతడింకా నిజం నుండి తేరుకోలేదు. ఆమె తనని గుర్తించలేదు. అతడికి అయోమయంగా అనిపించింది. పరిగెత్తుకుంటూ మళ్ళీ వారిని సమీపించాడు.

ఆమె ప్రక్కనే నడుస్తూ ఆమె కళ్ళల్లోనికి పిచ్చి చూపులు చూస్తున్నాడు. అతనికేదో చెప్పాలని ఉంది. కానీ దవడలు చచ్చుబడినట్లు అనిపించాయి. మాట రావటం లేదు.

తానెవరయిందీ గుర్తు చేయటానికి నానా అవస్థ పడుతున్నాడు. అతను తన రెండు చేతులను గుండెకు ఆన్చుకుని, కళ్ళల్లో శోకాన్ని దిగమింగుతూ తనను గుర్తుచేయటానికి ప్రయత్నిస్తున్నాడు. అతని కాలిని సముద్రం అలలు తాకుతున్నాయి. అతడు సముద్రతీరంలో ఉన్నాడు. సముద్రం అలలు ఎగసి నేలను తాకేందుకు ప్రయత్నిస్తున్నాయి. నేల నిశ్చలంగా ఉంది. సముద్రం చేసే చేష్టలను ముభావంగా చూస్తోంది. నేలపై ఆమె అతడి వైపు అపరిచితంగా చూస్తోంది.

ఆమె కంటికి అతడు ఉన్మాదిలా కనిపించాడు. అతని ప్రవర్తన ఆమెను భయపెడుతోంది. కళ్ళు మూసుకుంటూ ప్రియుని గుండెల్లో ఒదిగిపోయింది. ఆమె ప్రియుడు అతడి వంక చిరాగ్గా చూస్తూ ఆమెను నడిపించుకుని తీసుకుపోయాడు.

అతడు తన కనుల ముందరి దృశ్యం భరించలేకపోయాడు.

తన ప్రేయసి ఒక అపరిచితుని కౌగిలిలో ఉంది. అపరిచితుడనే ప్రియునిగా భావిస్తూ తనని గుర్తించలేకుండా ఉంది. ఇలాంటి పరిస్థితి ప్రేమికునికీ దాపురించి ఉండదు. బహుశా ఎదురైనా దానిని తట్టుకునే స్థైర్యం ఉండదు. తానూ నిబ్బరంగా ఉండగలిగేవాడు కాదు. కనుకనే గుండెలవిసేలా మూగగా రోదిస్తున్నాడు.

అయితే అతడు అంతటి దుఃఖాన్ని బయటపెట్టటం లేదు. ఎందుకంటే దృశ్యాన్ని అతడు ఇంకా జీర్ణం చేసుకోలేదు.

ఆమె కనీసం తన వంక చూడటంలేదు. ఆమె ప్రియుడు తనకు దూరంగా ఆమెను తీసుకుపోతున్నాడు.

అతడికి ఎంతో చెప్పాలని ఉంది. ఆమెను తాను ఎత్తుకు వచ్చిన విషయం గుర్తు చేయాలని ఉంది. ఆమెను నిర్భందించినట్లు, శిలపై విసిరేసినట్లు జ్ఞాపకం చేయాలని ఉంది. ముఖ్యంగా తమ ప్రేమలోకాన్ని జ్ఞప్తికి తేవాలని ఉంది. వెన్నెల లోకంలో గడిపిన మధుర క్షణాలను, ఆమెను కాపాడిన వైనాన్ని, ఆమె అల్లిన కలువమాలల గురించి...

అతడు మెడ తడుముకున్నాడు. మెడలో కలువ హారాలు లేవు. అవి వాడి రాలిపోయిన విషయం అతనికి తెలుసు. కానీ మళ్ళీ ఎందుకనో ఆశగా వెతుక్కున్నాడు. అతని ప్రయత్నం వృధా పోలేదు. అతని దుస్తుల్లో వాడిపోయిన కలువపూవు ఒకటి లభించింది. కలువ అతడు చివరిసారిగా కోసినది. కొంచెం ఆనందంగా కలువని ఆమెకు చూపించేందుకు అతడు పరిగెత్తుతూ మళ్ళీ వారిని సమీపించాడు. పుష్పం అప్పటికే పూర్తిగా వాడిపోయిఉంది. నిర్జీవంగా ఉంది. అతడు పైకెత్తిన క్షణమే తల వాల్చేసింది.

అతడామె ప్రియుని వంక చూసాడు. ఆమె ప్రియుడిని ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది. రోజు ఆమెను శిలపై విసిరివేయబోయేముందు తనపై శూలాన్ని ప్రయోగించిన వ్యక్తిలా అనిపిస్తున్నాడు. లేక తన జన్మదినాన నృత్య ప్రదర్శనలో ఢమరుహం మ్రోగించిన వాడా? వ్యక్తి ఇక్కడ ప్రవేశించటం ఎట్లా సాధ్యం? ఒకవేళ అతడు తనకంటే గొప్ప ప్రేమికుడా?

అతడు పళ్ళు బిగపట్టాడు.

ఆమె నిజమైన ప్రేమికుడు తాను కానప్పుడు తనలో అంత స్వఛ్ఛమైన ప్రేమ ఎలా జనించింది? తమ ప్రేమలోకంలో ఆమెకు తనపై అభిమానం ఎలా కలిగి ఉంటుంది?

ఆమెకు గతాన్ని ఎలా గుర్తుచేయాలో అతనికి అర్ధం కాలేదు. తాము గడిపిన మధుర క్షణాలను మరొక్కసారి గుర్తుచేసుకుంటూ ఆమె ప్రక్కగా నడుస్తున్నాడు.

అతడికి వెన్నెలలోకంలోని పండువెన్నెల గుర్తుకు వస్తోంది.

ఆమె స్నానం చేసేందుకు కొలనులోనికి దిగటం గుర్తుకు వస్తోంది.

తన వంక ఓరకంట చూడటం గుర్తుకు వస్తోంది.

తాను స్నానం చేసే సమయంలో ఆమె అల్లిన తామరహారాలు గుర్తుకు వచ్చాయి. ఆమె ప్రక్కన కూర్చున్నప్పుడు ఆమె కురుల నుండి తన చేతి పైన రాలిన నీటి బిందువులు జ్ఞాపకం వచ్చాయి.

తానామెను చుంబించినట్లు జ్ఞాపకం వచ్చింది.

అతని ముఖంలో వెలుగు ప్రవేశించింది.

తొలి చుంబనాన్ని ప్రేయసీ మరువదు. ఆమె నిజంగా తన ప్రేయసి అయిఉంటే కనుక తానామెను మళ్ళీ ముద్దాడితే గతాన్ని గుర్తిస్తుంది. తనను, తన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటుంది.

అతడు ఆమెకు తమ తొలి చుంబనాన్ని గుర్తుచేద్దామని నిశ్చయించుకున్నాడు. కానీ ఎలా జ్ఞప్తికి తేవాలో అతనికి అర్ధంకాలేదు. ఆమె ఇంకా తన ప్రియుని కౌగిలిలోనే ఉంది. కళ్ళు మూసుకుని ఉంది. తనని గమనించకుండా భయపడుతోంది.

తనకూ తోడెవరైనా ఉంటే బాగుండేది. ఆమెకు నచ్చచెప్పేందుకు. కనీసం ఆమె ఒంటరిగా ఉన్నా బాగుండేది. ఏదో విధంగా ప్రయత్నించవచ్చు. ప్రక్కన ఉన్న ఆమె ప్రియుడు అన్నింటికీ ఆటంకంగా ఉన్నాడు.

అతనో నిర్ణయానికి వచ్చాడు. 'తమ చుంబన సంగమాన్ని ఆమెకు గుర్తు చేయాలి.'

అతడు వేగంగా అడుగులు వేసుకుంటూ వారిని సమీపించాడు. ఆమె ఇంకా కళ్ళుమూసుకునే ఉంది. తన ప్రియుని గుండెలపై తల వాల్చి నడుస్తూ ఉంది. అతడామె ప్రియుని వంక చూసాడు. ఆమె ప్రియుడు తన వంక చిరాగ్గా చూస్తున్నాడు. కోపంగా చూస్తున్నాడు.

అతడిలో పట్టుదల పెరిగింది. తమ చుంబనాన్ని గుర్తు చేద్దామనుకున్నాడు.

ఆమె చేయి పట్టుకున్నాడు.

ఆమె తనలో కలుగుతున్న భయాందోళనలను ఇక ఓర్చుకోలేకపోయింది. అతడి చేతిని బలంగా విదుల్చుకుని అమాంతం తన ప్రియుణ్ణి అల్లుకుపోయింది. తన ప్రియుడి మెడను వాటేసుకుని అతని భుజానికి తలనాన్చి కౌగిట్లో ఒదిగిపోయింది.

ఆమె ప్రియునిలో ఆవేశం ప్రవేశించింది. ఒక చేతిలో ఆమెను ఒద్దికగా తీసుకుని భయపడవద్దన్నట్లుగా ఆమె కురులు నిమిరాడు.

మళ్ళీ తమవద్దకు రాబోతున్న అతడిపై ఆమె కురులు నిమిరిన చేతిని బలంగా విసిరాడు.

చేయి అతడి చిబుకాన్ని విసురుగా తాకింది. అమాంతం అతను వెనక్కి బలంగా ఎగిరిపడ్డాడు. ఒక అల అతడిని కమ్మింది. అతడా అలను చుంబించాడు. ఆమెను చుంబించబోయిన పెదవులు కెరటాన్ని స్పృశించాయి. క్షణం అతడికి కళ్ళు మసకబారాయి. దవడల నుంచి నెత్తురు స్రవించి సముద్రపు కెరటాలలో కలిసిపోయాయి. అతనిలో అలసట ప్రవేశించింది.

లేచే శక్తి లేక కూలబడ్డాడు. ఆమె పాదాలను తాకిన మెత్తటి ఇసుకను అతడి పెదవులు నిస్సహాయంగా ముద్దాడాయి.


*********
(సశేషం) తరువాయి భాగం - రేపటి వికాసంలో...