నిన్నటి కలలో నీ రూపం

అందమైన నీ రూపం
"అదేంటో..!?"

రంగులు చిందిస్తోంది
ఒక్కో రంగు చర్మం తొలగిస్తే,
వేరొక రంగు ముఖం బయట పడుతోంది.

నువు చేతులు లోనికి పోనిచ్చి
నీ గుండెను తీసి చూపిస్తే,
అది అచ్చం
మంచుగడ్డలా కనిపిస్తోంది.
కానీ కించిత్ కూడా కరగట్లా!

ఎందుకా అని చేరువై చూస్తే
అది కటిక స్ఫటిక!
నువ్వు నాపై ఓ నవ్వు విసిరి
తిరిగి నీ గుండెను దాచేసరికి,

నీ చెవులు సాగి ఉన్నాయ్
తలపై కురులు రాలి
ముఖానికి అంటుకున్నాయ్
నెత్తిన కొమ్ములు మొలుస్తున్నాయ్

చర్మం ముడుతలు పడి
నోట్లో దంతాలు కోరలయ్యాయ్
శరీరంలోని అవయువాలన్నీ
క్రమపధ్ధతి నొదిలి
ఇష్టానుసారం రూపాంతరం చెందాయ్

వికారమైన వికృతరూపంతో
నీలో నెమ్మదిగా
మృగరూపు సంతరించుకుంది...

ఇదీ...

...నా నిన్నటి కలలో నీ రూపం!