నిన్నటి కలలో నీ రూపం

అందమైన నీ రూపం
"అదేంటో..!?"

రంగులు చిందిస్తోంది
ఒక్కో రంగు చర్మం తొలగిస్తే,
వేరొక రంగు ముఖం బయట పడుతోంది.

నువు చేతులు లోనికి పోనిచ్చి
నీ గుండెను తీసి చూపిస్తే,
అది అచ్చం
మంచుగడ్డలా కనిపిస్తోంది.
కానీ కించిత్ కూడా కరగట్లా!

ఎందుకా అని చేరువై చూస్తే
అది కటిక స్ఫటిక!
నువ్వు నాపై ఓ నవ్వు విసిరి
తిరిగి నీ గుండెను దాచేసరికి,

నీ చెవులు సాగి ఉన్నాయ్
తలపై కురులు రాలి
ముఖానికి అంటుకున్నాయ్
నెత్తిన కొమ్ములు మొలుస్తున్నాయ్

చర్మం ముడుతలు పడి
నోట్లో దంతాలు కోరలయ్యాయ్
శరీరంలోని అవయువాలన్నీ
క్రమపధ్ధతి నొదిలి
ఇష్టానుసారం రూపాంతరం చెందాయ్

వికారమైన వికృతరూపంతో
నీలో నెమ్మదిగా
మృగరూపు సంతరించుకుంది...

ఇదీ...

...నా నిన్నటి కలలో నీ రూపం!

రెక్కలు కావాలి

చిన్ని విజయాలు నాకొద్దు
ఈ అల్పానందాలు అసలే వద్దు

నాకు సంచలనం కలిగించే శక్తి కావాలి
సాఫీగా సాగే జీవితాన్ని నే కోరను
నాకు రెక్కలు కావాలి

ఆ రెక్కలతో నేన్నింగికి ఎగిరి,
మరుగుజ్జు మానవులకు
మరింత దూరంగా
విశ్వ సంచారం చేయాలి


నాకు అర్హత లేదని నీవు తలిస్తే
తరువాత కత్తిరించేయ్.
కానీ ముందొక అవకాశాన్ని ఇవ్వు

సత్యాన్వేషినై
విహరించే నేను,

గదుల్లో గడియ బిగుంచుకుని
జీవించే జనాలకు
కనిపించనీ, పోనీ

ఎక్కడో చుక్కల్లో
నా రూపాన్ని వీరు,
చూడనీ, పోనీ

నేన్నింగికి ఎగసానన్న
అనుభూతిని నాకివ్వు

నాకు అర్హత లేదనుకుంటే
మళ్ళీ క్రిందికి దించేయ్.
కానీ అందుకు ముందు
నాకొక అవకాశం ఇవ్వు.

కోర్కెల కావడి



కోర్కెల కావడి
బరువెక్కుతోంది
మోయలేకున్నాను.

ఫలించని కలల సమూహంతో
కావడి నిండి,
ఒక్కొక్క కలా ఒలుకుతుంటే -
గుండె చివుక్కుమంటోంది

ఆ ఒలికిన కలలపై
ఆశ వదలటం తప్ప,
సఫలం చేసే వీలే లేదా?

పోనీ కొన్నింటిని త్యజిద్దామంటే,
"అమ్మో!" ఎన్నెన్ని కలలు కన్నానూ...?
నా కలలు ఫలించాలని,

ఒకటో అరో ఫలించి -
జన్మ సార్ధకం చేసుకున్నట్లు
మాయమవుతున్నా,

అదేదో సామెతలా,
మరిన్ని ఆశలు ఆవిర్భవించి -
ఆ భారాన్ని నాపై ఆపాదించి -
నా గమ్య సాధనలో జాప్యాన్ని కలిగిస్తున్నాయి.

ఈ కాంక్ష్యల బరువునకు
కృంగక ముందే -
కోర్కెల భారంలో
కూరుకొనక ముందే -
బయటపడాలి

ఎలా....?
సలహాఇవ్వవూ??



**************


దాదాపు పదిరోజుల తర్వాత ఇదే వికాసంలోనికి తొంగిచూడటం. :) ఈ విరామానికి కారణం ఉంది. గతవారం 29వ తేదీన 'బృహస్సతి' మగబిడ్డకి జన్మనిచ్చి నన్ను తండ్రిని చేసింది. ఆ హడావుడిలో పడీ, ఈ ఆలస్యం. :)



ఎడబాటు

కవిత మజిలీ కధ ముగింపు కోసం రాసినది. అయితే ఎందుకనో కధకు అతకలేదనిపించింది. అందుకే విడిగా ప్రచురిస్తున్నా! :)

ముంగిటన విలసిల్లు పాడి పశువుల నుండి
మండువాలో విరియు మందరములన్నిటికి,
పెరటిలో
వెలసిన తులసికోటతో పాటు
వాకిటిన
విలపించు మా చిట్టి చిలుకకు,

గాలికీ
, నేలకి, మా వాడ కోవెలకు,
నడవడిక
నేర్పిన ఊరు, పుట్టిపెరిగిన ఇంటికి
ఎడబాటు
మన మధ్య ఇకనుండి తప్పదని
కడసారి
చెప్పె, నా చెమ్మగిల్లిన కళ్ళు

చెమర్చిన
అశ్రువులు తుడువగ ఈనాడు
ఓదార్చ
ఏతెంచె మా వీధి మారేడు

సాగనంపగ
ఏడ్చె మా ఊరి రహదారి
చెఱువైతె
రోదించె పొంగి బైటకి పారి
కుమిలి
ఆక్రోశించె మూగదైన బావి
మౌనంగ
శోకించె మా ఇంటి చావిడి

మందారములు
ముడిచె విరియనే లేక
పాడి
పశువులు గడ్డి ముట్టనేలేదు
వేసారి
అలసింది తులసి చలనము లేక
చిలుకైతె
రెన్నాళ్ళు పలుకనేలేదు

బండబారిన
గుండెతో ఆశీస్సులందించె
అందరికి
అండైన మా రచ్చబండ
దీవింప
ఉబలాటపడెను పొలిమేర
దూరాన
ఉండేటి మా ఊరికొండ

చివరిసారిగా
మా మట్టి వాసన పీల్చి
మరువలేని
అనుబంధములు వదలి
మరల మీ అందరిని కలియు క్షణమునకు
నోరార
మిమ్మల్ని పిలుచు దినమునకు

ఎదురుచూస్తూ
వెనుదిరిగి చూడక
తపిస్తూ నిష్క్రమిస్తున్నా

శిలగ
మారిన మనసు సెలవంటు పలికింది
ఇలపైన కలవంటి మా నెలవు వీడి

...మజిలీ కధ - 8

వయసులో కూడా అమ్మమ్మ ఒకరికి సపర్యలు చేయగలదంటే వింతే! అన్ని సేవలు చేస్తున్నా హాస్పిటల్లో మావయ్య అమ్మమ్మను ఇంకా తిడుతూనే ఉన్నాడు. ఇంతకు మునుపులానే పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేవాడు. ఎముకలగూడులా, కర్రపుల్లకి తోలు కప్పినట్లుగా అయిపోయింది మావయ్య శరీరం. సుగర్ పెరిగినప్పుడు కొయ్యలా అయిపోయేవాడు. చావొక్కటే మిగిలిందా అనిపించేది.

అమ్మమ్మ అదృష్టమో, దురదృష్టమో గానీ, కొన్ని రోజులకు మావయ్య కోలుకున్నాడు. అమ్మమ్మ కబురు పంపింది సంబరంగా. అయితే మరుసటి రోజే చెప్పాపెట్టకుండా మావయ్య హాస్పిటల్ నుంచి మాయం అయ్యాడు. డాక్టర్ల ఫీజుల కోసం అప్పు చేసి తెచ్చిన 10 వేల రూపాయలు కనిపించలేదు.

అమ్మ, నేను వెళ్ళేసరికి అమ్మమ్మ హాస్పిటల్ లో రోదిస్తూ ఉంది. అమ్మ ఫీజు చెల్లిస్తున్నప్పుడు డాక్టరు చెప్పాడు. మరోసారి తాగడమంటూ చేస్తే మావయ్య ఖచ్చితంగా నాలుగు రోజుల్లో ఛస్తాడని.

అమ్మమ్మని మా ఇంటికి తీసుకు వచ్చాం. వస్తుండగా అమ్మమ్మ నాకో ఉత్తరం ఇచ్చి చెప్పింది.

"నీ కోసమే ఉత్తరం పెట్టిపోయాడు."

నాకప్పుడు ఉత్తరం చదవాలనిపించలేదు. జేబులో పెట్టుకున్నాను. అందులోనే ఒక వందనోటు కూడా ఉంది.

మా ఇంట్లో ఉన్న పది రోజులూ అమ్మమ్మ మావయ్య సంగతులే చెప్పేది. చిన్నప్పుడు మావయ్య చెడు తిరుగుళ్ళు ఆపలేకపోయానే అంటూ నెత్తి కొట్టుకునేది. 'వాడ్ని ముద్దు చేసానేమిటే' అంటూ అమ్మ దగ్గర వాపోయేది. అమ్మమ్మ మా ఇంట్లో ఎక్కువ రోజులుండటానికి ఇష్టపడలేదు. 'ఒక్కదానివే ఎందుకక్కడ' అని అమ్మ నచ్చజెప్పినా వినక వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది.

అలా వెళ్ళిన నెలరోజులకే కబురు వచ్చింది. అమ్మమ్మ పరిస్థితి బాగాలేదని. వెళ్ళేసరికి అమ్మమ్మ మూలుగుతూ ఉంది. అమ్మమ్మ పదేపదే ఒకటే వాక్యం ఉఛ్ఛరిస్తోంది. 'తాతబాబూ, నా మాట వినరా'

మాట కూడా కొద్ది సేపటికి ఆగిపోయింది. అమ్మమ్మ గాల్లో చూస్తూ శ్వాస విడిచింది. ఆమె శూన్యంలోనికి చూస్తుందో,గోడకు తగిలించి ఉన్న మావయ్య ఫోటో వైపు చూస్తుందో తెలియటంలేదు. ఆమె చూపుల్లో మాత్రం తన కొడుకెక్కడో ఇంకా క్షేమంగా ఉన్నాడన్న భావం కనిపిస్తోంది.

తన చితికి నిప్పు పెట్టటానికి అతడు తప్పక వస్తాడన్నట్లు ఎదురుచూస్తున్న భావం వ్యక్తమవుతోంది.

అమ్మమ్మ కోరిక నెరవేరలేదు. పెదనాన్న చేతుల మీదుగా దహనసంస్కారాలు పూర్తయ్యాయి.

'అప్పుడనగా మూసిన ఇంటి తలుపులు ఇప్పటికీ తెరుచుకోలేదు. లోపల అమ్మమ్మ ఆత్మ మావయ్య ఆత్మకి ముద్దలు తినిపిస్తూ ఉంటుంది. వాణత్త స్వయంగా తలంటుతూ ఉంటుంది. మావయ్యకు ఇప్పుడే వ్యసనమూ లేదు. ఊరంతా మావయ్యని దేవుడ్ని చూస్తున్నట్లుగా చూస్తారు. పండక్కి మేమంతా స్వర్గంలో కాలు పెట్టే భాగ్యాన్ని పొందుతూ ఉంటాం.'

*********

నేను ఊహలు అంతటితో ఆపేసాను.

నా స్నేహితులంతా క్షణకాలం స్తబ్దులై నించున్నారు.

"అయితే మీ మావయ్య చచ్చిపోయాడా?" హేమ అడిగింది.

"ఏమో, చచ్చిపోయాడనే అనుకుంటున్నాం." చిరునవ్వుతో నా సమాధానం.

కాసేపు మౌనం.

"ఇక పోదాం. కారు బాగై ఉంటుంది" రెడ్డి తొందరపెట్టాడు.

దూరం నుంచి రవి కేకలు వినిపించాయి. కారు బాగైంది, రమ్మంటూ.

అందరం పరుగులాంటి నడకతో రోడ్డున పడ్డాం.

దారిలో చంద్ర అడిగింది.

"ఇంతకీ మీ మావయ్య ఉత్తరంలో ఏం రాసాడో చెప్పనేలేదు"

"ఏముందీ! తన ఆస్థినంతా నా పేరున పత్రం రాసినట్లు రాసి సంతకం పెట్టాడు."

"ఇంకేం అదృష్టవంతుడివే" హేమ అంది.

"ఆస్థా??" నవ్వాను.

"సర్లే! చిల్లిగవ్వ కూడా మావయ్య మిగల్చలేదు. పైగా ఊరంతా అప్పులు. నాకొద్దు బాబూ ఆస్థి" చేతులు అడ్డంగా ఊపుతూ భయం అభినయించాను.

జ్ఞాపకాలు మళ్ళీ కలుద్దామంటూ వీడ్కోలు తీసుకున్నాయి.

********************
మళ్ళీ లుద్దాం. వీడ్కోలు!!
********************