నిన్నటి కలలో నీ రూపం

అందమైన నీ రూపం
"అదేంటో..!?"

రంగులు చిందిస్తోంది
ఒక్కో రంగు చర్మం తొలగిస్తే,
వేరొక రంగు ముఖం బయట పడుతోంది.

నువు చేతులు లోనికి పోనిచ్చి
నీ గుండెను తీసి చూపిస్తే,
అది అచ్చం
మంచుగడ్డలా కనిపిస్తోంది.
కానీ కించిత్ కూడా కరగట్లా!

ఎందుకా అని చేరువై చూస్తే
అది కటిక స్ఫటిక!
నువ్వు నాపై ఓ నవ్వు విసిరి
తిరిగి నీ గుండెను దాచేసరికి,

నీ చెవులు సాగి ఉన్నాయ్
తలపై కురులు రాలి
ముఖానికి అంటుకున్నాయ్
నెత్తిన కొమ్ములు మొలుస్తున్నాయ్

చర్మం ముడుతలు పడి
నోట్లో దంతాలు కోరలయ్యాయ్
శరీరంలోని అవయువాలన్నీ
క్రమపధ్ధతి నొదిలి
ఇష్టానుసారం రూపాంతరం చెందాయ్

వికారమైన వికృతరూపంతో
నీలో నెమ్మదిగా
మృగరూపు సంతరించుకుంది...

ఇదీ...

...నా నిన్నటి కలలో నీ రూపం!

రెక్కలు కావాలి

చిన్ని విజయాలు నాకొద్దు
ఈ అల్పానందాలు అసలే వద్దు

నాకు సంచలనం కలిగించే శక్తి కావాలి
సాఫీగా సాగే జీవితాన్ని నే కోరను
నాకు రెక్కలు కావాలి

ఆ రెక్కలతో నేన్నింగికి ఎగిరి,
మరుగుజ్జు మానవులకు
మరింత దూరంగా
విశ్వ సంచారం చేయాలి


నాకు అర్హత లేదని నీవు తలిస్తే
తరువాత కత్తిరించేయ్.
కానీ ముందొక అవకాశాన్ని ఇవ్వు

సత్యాన్వేషినై
విహరించే నేను,

గదుల్లో గడియ బిగుంచుకుని
జీవించే జనాలకు
కనిపించనీ, పోనీ

ఎక్కడో చుక్కల్లో
నా రూపాన్ని వీరు,
చూడనీ, పోనీ

నేన్నింగికి ఎగసానన్న
అనుభూతిని నాకివ్వు

నాకు అర్హత లేదనుకుంటే
మళ్ళీ క్రిందికి దించేయ్.
కానీ అందుకు ముందు
నాకొక అవకాశం ఇవ్వు.

కోర్కెల కావడి



కోర్కెల కావడి
బరువెక్కుతోంది
మోయలేకున్నాను.

ఫలించని కలల సమూహంతో
కావడి నిండి,
ఒక్కొక్క కలా ఒలుకుతుంటే -
గుండె చివుక్కుమంటోంది

ఆ ఒలికిన కలలపై
ఆశ వదలటం తప్ప,
సఫలం చేసే వీలే లేదా?

పోనీ కొన్నింటిని త్యజిద్దామంటే,
"అమ్మో!" ఎన్నెన్ని కలలు కన్నానూ...?
నా కలలు ఫలించాలని,

ఒకటో అరో ఫలించి -
జన్మ సార్ధకం చేసుకున్నట్లు
మాయమవుతున్నా,

అదేదో సామెతలా,
మరిన్ని ఆశలు ఆవిర్భవించి -
ఆ భారాన్ని నాపై ఆపాదించి -
నా గమ్య సాధనలో జాప్యాన్ని కలిగిస్తున్నాయి.

ఈ కాంక్ష్యల బరువునకు
కృంగక ముందే -
కోర్కెల భారంలో
కూరుకొనక ముందే -
బయటపడాలి

ఎలా....?
సలహాఇవ్వవూ??



**************


దాదాపు పదిరోజుల తర్వాత ఇదే వికాసంలోనికి తొంగిచూడటం. :) ఈ విరామానికి కారణం ఉంది. గతవారం 29వ తేదీన 'బృహస్సతి' మగబిడ్డకి జన్మనిచ్చి నన్ను తండ్రిని చేసింది. ఆ హడావుడిలో పడీ, ఈ ఆలస్యం. :)