
మేమంతా సముద్రం దగ్గర ఆడుకుంటున్నాం. అప్పుడు నేను చాలా చిన్నవాణ్ణి. పదేళ్ళుంటాయేమో!! సముద్రం ఒడ్డున గవ్వలేరుకుంటున్నాం. అప్పుడు సముద్రాన్ని ఆస్వాదించేంతటి పరిజ్ఞానం లేదు. ఏదో అక్కడైతే గవ్వలేరుకోవచ్చుకదాని, వచ్చి - ఏరుకుని వెళ్ళిపోయేవాడ్ని. నాతో పాటూ చాలా మంది పెద్దవాళ్ళు కూడా గవ్వలేరుకునేవారు. వాళ్ళేరుకునే గవ్వలకి, మేం ఏరుకునే గవ్వలకి తేడా ఉంది. అక్కడక్కడా కొంత మంది సముద్రం వైపు చూస్తూ ఆనందించేవారు. వారి సంఖ్య చాలా తక్కువ. వాళ్ళు కూడా సముద్రంలో ఈత కొట్టే వాళ్ళను కాక, సముద్రంలో పడవలేసుకుని ప్రయాణించే వారినే గమనించేవారు. కొంత మంది ఏదీ చేయక - ఒడ్డున కూర్చుని, తమ ప్రేయసితోనో మరెవరితోనో మాట్లాడుకుంటూ గడిపేవారు. నేను గవ్వలేరుకుని వెళ్ళిపోయేవాడ్ని.
అయిదేళ్ళు గడిచాయి. ఆ రోజున నాకెందుకో సముద్రంలో కాలు పెట్టాలనిపించింది. నా ఈడు వారందరూ గవ్వలేరుకుంటున్నారు. నెమ్మదిగా వెళ్ళి కాస్తా తడిగా ఉన్న దగ్గర నించున్నాను. ఓ కెరటం వచ్చి నా కాలిని తడిపి రమ్మనట్లుగా ఆహ్వానించింది. నాకు చాలా ఆనందం వేసింది. ముందుకు వెళ్దామనుకున్నాను. ఏం లాభం? అమ్మ చూసింది. మరోసారి సముద్రం వైపు వెళ్తే కాళ్ళిరగ్గొడతానంది. బుధ్ధిగా గవ్వలేరుకోమంది. నోరుమూసుకుని గవ్వలేరుకున్నాను.
అయితే రోజులు గడిచే కొద్దీ నేను ఎవ్వరికీ తెలియకుండా కాళ్ళు తడుపుకోవటమేమిటి? ఏకంగా ఈత కొట్టటమే నేర్చుకున్నాను. మొదట్లో కొంచెం కొంచెమే వచ్చినా ఏళ్ళు గడిచేసరికి ఈతలో ప్రావీణ్యం సంపాదించాను. నా తోటి వాళ్ళే కాక నాకన్నా పెద్దవాళ్ళు కూడా సాధించలేనిది నేను సాధించానని కించిత్ గర్వంగా కూడా ఉండేది. అయితే అది నాలో అహంభావాన్ని మాత్రం పెంచలేదు.
ఓ రోజు దీర్ఘంగా ఆలోచించాను. నా ఈత ప్రావీణ్యాన్ని అందరికీ ప్రదర్శించాలన్న కోరిక బలంగా పెరిగింది. వారి మెప్పు కోసం కాదది. నేనంటే ఏమిటో నాకు నేనుగా నిరూపించుకోవటం కోసం.
ముహూర్తం పెట్టుకున్నాను. నన్ను అభిమానించే ఓ నలుగురికి ఈ విషయం చెప్పాను.
"అది అనంతసాగరం" అన్నాడొకడు.
"నువ్వు ఈదలేవు" అన్నాడు మరొకడు.
"నీలాగనే చాలా మంది ప్రయత్నించి మధ్యలోనే మునిగిపోయారు. నువ్వూ అంతే!" వేరొకడన్నాడు.
"పోన్లే ప్రయత్నించు. నీ ఆసక్తి మేమెందుకు కాదనటం, అయితే అలసిపోతే మాత్రం వెనక్కి వచ్చేయ్. ఏం?!" నాలుగోవాడన్నాడు.
ఉత్సాహంగా ఈత మొదలు పెట్టాను. ఏ మాత్రం అలుపు లేదు. నా స్నేహితుల ప్రోత్సాహం మాత్రం వినపడుతుంది. అలా చాలా సమయం ఈదాను. అప్పటికే పడవల్లో ప్రయాణించే వారిని దాటేసాను. వారిని దాటిన గర్వంతో వెనక్కి తిరిగి చూసాను.
నా ఈడు వారు గవ్వలేరుకుంటున్నారు. ప్రేయసీప్రియులు మాట్లాడుకుంటున్నారు. కొందరు తిండిలో నిమగ్నమయి ఉన్నారు. ఎక్కువ మంది పెద్దవాళ్ళు గవ్వలు లెక్క పెట్టుకుంటూ కనపడ్డారు.
'సముద్రాన్ని ఆస్వాదించే వాళ్ళు ఎక్కడున్నారా? నన్ను గమనిస్తున్నారా లేదా?' అని చూసాను. అదేంటో! వాళ్ళు నన్ను గమనించటం లేదు. పడవలేసుకుని, ఈత కూడా రాకుండా - చేపలు పట్టుకునేందుకు సముద్రాన్ని ఉపయోగించుకునే వాళ్ళకు ఒడ్డున నించుని జేజేలు పలుకుతున్నారు.
నేన్నిర్ఘాంతపోయాను.
"మేమే గొప్ప!" అన్నారు పడవలోని వాళ్ళు నాతో - తమకు చప్పట్లు కొడుతున్న వారికి అభివాదం చేస్తూ.
"మీకు ఈత వచ్చా?" ప్రశ్నించాన్నేను.
"ఏమో! ప్రయత్నించలేదు."
"పోనీ ప్రయత్నించి చూడవచ్చు కదా?"
"ఎందుకూ? చేపలు పట్టుకోవటానికి పడవలైతేనే అనుకూలం. ఈదుతూ ఒక్క చేప కూడా పట్టుకోలేం."
"అంటే మీరు, చేపలు పట్టుకోవటం కోసమే వచ్చారా?" ఆశ్చర్యంగా అడిగాను.
హేళనగా నవ్వారు.
"మరి నువ్వెందుకు వచ్చావేమిటి?"
"ఏమో!? ఈదుదామనిపించింది. వచ్చాను. అంతే!"
ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
"మంచిది. ఈదు...ఈదు..." ఉచిత సలహా ఇచ్చేసారు. నేనెక్కడ చేపలు పట్టటం ప్రారంభించి వారికి పోటీ అవుతానేమోనని.
మళ్ళీ ఈత ప్రారంభించి బయలుదేరుతూ వారిని చూసాను. నేను వెళ్ళిపోయానని భావించి, వారు ఒడ్డు వైపు తిరిగి అక్కడ్నుంచి చూస్తున్న జనాలతో "మేమే గొప్ప!" అంటున్నారు.
వెనువెంటనే కరతాళ ధ్వనులు వినపడ్డాయి. నన్నెవరూ గమనించటం లేదు. నన్ను అభిమానించే ఆ నలుగురు మాత్రం చప్పట్లతో నన్ను ప్రోత్సహిస్తున్నారు. అవి నాకు కనపడుతున్నాయి కానీ, వినపడటం లేదు.
మరింత పట్టుదలతో ఈత కొనసాగించాను. అయితే మనసులో భయంగానే ఉంది. నాకు తోడెవ్వరూ లేరు. కనీసం ప్రోత్సహించే వాళ్ళు గానీ, బాగా ఈదుతున్నావనే వాళ్ళు గానీ లేరు. అంతలోనే మొండి ధైర్యం వచ్చింది. ఈదుతూనే ఉన్నాను.
కొంత కాలం గడిచింది. ఈ మధ్యలో నేను చాలా శ్రమ పడ్డాను. కొన్ని చేపలు కనపడి 'మమ్మల్ని పట్టుకుని వెన్నక్కి పోయి సుఖంగా ఉండు' అన్నట్లు చూసాయి. సముద్రం కూడా నా కష్టానికి జాలి పడ్డట్లు అనిపించింది.
ఓ రోజు సాయంసమయానికి నాకు ఏదో అలజడి వినిపించింది. ఈదుతున్న వాడ్నల్లా ముందుకు చూసాను. నాకు ఎదురుగా ఎవరో కొంతమంది ఈదుతున్నట్లుగా కనపడింది. నాకు భయం వేసింది.
ఇంతవరకు కనపడని వాళ్ళు ఇప్పుడు కనపడటంతో జడుపు వచ్చింది. ఒంటరినైన నాకు తోడు దొరికారన్న ఆనందం మాత్రం ఆ సమయానికి కలుగలేదు. వెనుదిరుగుదామని చూసాను. సముద్రం ముందెలా ఉందో వెనక్కీ అలానే ఉంది. నా వాళ్ళు కాదు కదా, కనీసం ఒడ్డు కూడా కనపడటం లేదు. నిజానికి అప్పటికే నేను మునిగిపోయానని నిర్ణయించుకుని వాళ్ళు వెళ్ళిపోయారు.
"అబ్బాయ్! ఎవరు నువ్వు? మాలానే ఈదుదామని ఆసక్తితో వచ్చావా?" ప్రశ్నించిందొక గొంతు.
"ఆ...! మరి మీరెవరు?" వణుకుతూ అడిగాను.
ఓ క్షణం పాటూ అందరూ ముఖముఖాలు చూసుకున్నారు.
"నేను కృష్ణశాస్త్రిని"
"నేను గోపీచందుని"
"నేను శ్రీశ్రీని"
"నేను కుటుంబరావుని"
నా కళ్ళ నుండి ఆనంద భాష్పాలు జాలువారాయి. వాళ్ళ దగ్గరకు వెళ్ళాలనిపించి ఈదబోయాను.
"అగాగు! ఎక్కడికీ?"
"ఈదటానికి" అమాయకంగా బదులిచ్చాను.
"ఏం సాధించాలని...?"
"మీరు సాధించినదే!! ఆత్మ సంతృప్తి"
"మేం సాధించామని ఎలా చెప్పగలవు?"
"ఏమో! అలా అనుకోవాలనిపించింది."
కొంతసేపు మౌనం రాజ్యమేలింది. తిరిగి నేనే ప్రశ్నించాను.
"ఇది అనంతమంటారు కదా! నిజంగా ఇప్పటి వరకు ఎవ్వరూ దీని అంతు తేల్చలేదా?"
"ఏమో! దీని అంతు తేల్చటం ఏ ద్వాపరయుగానికి చెందిన వారికి తప్ప, మన కలికాలం కవులకు సాధ్యం కాదని మా నమ్మకం."
"ఠాగూరికి కూడా?" నా అభిమానాన్ని ప్రకటించాను.
"ఏమో! మాకు తెలియదు. అతనిది మన భాష కాదు కదా! వారిది వేరే సముద్రం. ఐతే అన్ని భాషా సముద్రాలూ అనంతమన్నది వాస్తవం."
"పోనీ మనం ప్రయత్నిస్తే?" అత్యుత్సాహం ప్రదర్శించాను.
"నువ్వు ఇక ఈదటం కష్టం" కృష్ణశాస్త్రి వైపు నుండి వినపడింది.
"ఈదినా సాధించేది ఏదీ లేదు" గోపీచంద్ వైపు నుండి వినపడింది.
"అప్పట్లో ఏదో ఆవేశంతో ఈదేశాను" శ్రీశ్రీ గొంతు ఖంగుమంది.
"వెనక్కి పోవటానికి ప్రయత్నించరాదూ?" కుటుంబరావు గొంతు ప్రశ్నించింది.
"ఇది అనంతసాగరం" అన్నారంతా ముక్తకంఠంతో.
నాకు చెమటలు పట్టాయి. స్వేదం చెంపల మీదుగా జారి సముద్రంలో కలసిపోయింది.
"నిజమే! కావొచ్చిది అనంతసాగరం
ఐతే మాత్రం?!?!
నా ఈత కూడా నిర్విఘ్నమే నిరంతరం"
అప్రయత్నంగా నా నుండి ఆ మాటలు వెలువడ్డాయి.
అంతా ఓ ఘడియ గంభీరంగా ఆలోచించారు.
"నిన్ను నేను ప్రోత్సహిస్తాను" - కుటుంబరావు
"అందరం కలిసే ఈదుదాం" - గోపీచంద్
"మాతో పాటే నువ్వూనూ" - కృష్ణశాస్త్రి
"పదండి ముందుకు, పదండి తోసుకు" - శ్రీశ్రీ
నలుగురూ ఒక్కసారి సాదరంగా అహ్వానించారు.
ఇప్పుడు నాకు నా ఈతను ఎవరికైనా ప్రదర్శించాలన్న తపన లేదు. అంతకు మించిన ఆనందానుభూతిని పొందాను.
రెట్టించిన ఉత్సాహంతో వారి వైపు ఈత కొనసాగించాను.
"తెలుగు సాహితి - అనంతసాగరం
'ఐతే మాత్రం?!?'
నా ఈత సైతం
నిరాటంకమే నిరంతరం!"