అది ఒక వెన్నెల రాత్రి.
నేను పాడుబడ్డ శిధిలాల మధ్య ఉన్నాను. ఒంటరిగా ఉన్నాను. మోకాళ్ళల్లో తల దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూఉన్నాను. కాసేపటికి తల ఎత్తి చూస్తే ప్రక్క గోడపై, నా నీడ కూడా ఏడుస్తూ ఉంది.
"నువ్వెందుకు ఏడుస్తున్నావ్?" అడిగా నా నీడను.
"నీ ఏడుపు చూసి ఏడుపు వచ్చింది."
"ఇంతకీ నువ్వెందుకు ఏడుస్తున్నావ్?" ప్రశ్నించింది.
"నాకెవ్వరూ లేరు" ఏడుపు ఆపి జవాబిచ్చాను.
నీడ నవ్వింది.
"నీకంతా ఉన్నారు."
"నిజమే! నాకంతా ఉన్నారు." దిగాలుగానే అన్నాను. "కానీ అర్ధం చేసుకునేవారే లేరు."
"అర్ధం చేసుకునేలా ఎప్పుడు ప్రవర్తించావు గనుక?" నీడ నిష్థూరమాడింది.
"ఆ అవసరం నాకు లేదు." జవాబిచ్చాను.
"అనవసరమనే బదులు, చేతకాదనవచ్చుగా..?" నీడ వెటకారంగా అంది.
కోపం వచ్చింది. కాని వ్యక్తం కాలేదు. ఎందుకంటే - చెప్పాగా, ఆ అవసరం నాకు లేదు.
ఐతే నీడ నా కోపాన్ని గ్రహించింది.
"సంజాయిషీ ఇచ్చుకోవచ్చు కదా!" అడిగింది నన్ను.
"ఆ అవసరం నాకు లేదు."
"ఐతే చేతకానితనమే అనుకోవలసి ఉంటుంది" నీడ విషయాన్ని పెద్దది చేయటానికి ప్రయత్నించింది.
అభ్యంతరం లేదన్నట్లుగా కనుబొమలు చిట్లుస్తూ భుజాలెగరేసాను. నీడకు నోరు పెగల లేదు.
కాసేపాగి అంది.
"నీ ప్రవర్తన వల్ల అపకీర్తిని వెంట తెచ్చుకుంటున్నావ్."
"నేను పట్టించుకోను."
"సంఘంలో..."
"ప్చ్...." విసుగ్గా బుర్ర ప్రక్కకు తిప్పుతూ నీడ మాటలకు అడ్డు తగిలాను.
నీడ చెప్పి తీరాలని నిశ్చయించుకుంది.
"సంఘంలో బ్రతికున్నంత కాలం ప్రక్క వ్యక్తిని మెప్పిస్తూ ఉండాలి."
"నాకా అవసరం లేదు." మనసులో అనుకున్నాను.
నేను వ్యక్తం చేయక పోయినా నీడ నా భావాలను గ్రహించగలదు.
"ఇలా అయితే నువ్వు ఎవ్వరి ప్రేమనూ పొందలేవు."
"నాకు ఎవ్వరి ప్రేమా అవసరం లేదు." సమాధానమిచ్చాను.
"మరి ఇందాక నీ ఏడుపుకి కారణం అదేనని చెప్పినట్లు గుర్తు.." నీడ గుర్తు చేసింది.
సమాధానం ఇవ్వలేక తడబడ్డాను.
'నిజమే!! ఇంతకాలం నా వేదనకి కారణం ఒంటరితనమేమోనని పొరబడుతూ వచ్చాను. కాదని ఖచ్చితంగా తేలింది.'
క్రొత్త ప్రశ్న మొలకెత్తింది.
'నా కన్నీరుకి కారణం ఏమై ఉంటుంది?'
ఎంతగా అలోచించినా అంతు చిక్కలేదు.
"చూస్తూ ఉంటే నీకు మిగిలిన ఏకైక నేస్తాన్ని నేనేలా ఉంది." నీడ నవ్వుతూ అంది.
"లేదు."
"మరి??" నీడ నవ్వుతూనే అడిగింది మళ్ళీ.
"నువ్వు మనిషివి. నిన్ను నేను నమ్మను." జవాబిచ్చాను.
"అలా ఐతే నువ్వు ప్రేమించేది ఎవరిని?"
"కేవలం నన్ను నేను" గర్వంగా బదులిచ్చాను.
నీడ బిగ్గరగా నవ్వింది.
నవ్వాపుకోలేక ఆపసోపాలు పడుతూ చాలా మెత్తగా నెమ్మదిగా అంది.
"నువ్వంటే..... నేను కాదూ....?!?"
చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాను.
నీడ చెప్పినదంతా అర్ధం అయ్యింది. నా కన్నీరుకి కారణం అవగతమయ్యింది. కానీ ఆ కారణం గుండెల్లో గుచ్చుకుంది.
నిజమే....!!
'నన్ను నేనే ప్రేమించుకోలేకపోతున్నాను!'
"సరే నీకు చేతకానివి... అదే.. అదే.. నువ్వు అనవసరమనుకున్నవన్నీ నేను చేసి చూపిస్తాను." నీడ శెలవు తీసుకుని జనారణ్యంలోనికి వెళ్ళిపోయింది.
నీడ నవ్వులు చెవుల్లో బిగ్గరగా ప్రతిధ్వనిస్తున్నాయి.
"నువ్వంటే..... నేను కాదూ....?!?" అన్న నీడ మాటలు బాకుల్లా గుచ్చుకుంటున్నాయి.
నేను విలపిస్తున్న సమయంలో నీడ నా ప్రక్కనే కూర్చుని తోడుగా కన్నీరు కార్చటం ఙ్ఞాపకం వచ్చింది.
గోడపై చూసాను.
నీడ లేదు. ఆ నేస్తం కావలనిపించింది.
జనారణ్యంలో ఉంటుందని తెలుసు.
"వెళ్ళనా?" ప్రశ్నించుకున్నాను.
"ఆ అవసరం నాకు లేదు." సమాధానమూ ఇచ్చుకున్నాను.
తెలియకుండానే కన్నీరు వచ్చింది. మోకాళ్ళల్లో ముఖాన్ని ఆజన్మాంతం దాచేసుకున్నాను.
ఇప్పటికీ నేనీ శిధిలాల మధ్య ఒంటరిగా, వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నాను.
4 comments:
So, who has written this article? మీరా? లేక మీ నీడా?
చదువుతున్నంత సమయం చాలా ఆసక్తికరంగా అనిపించింది. కాని చివరకు వచ్చేసరికి ఇలా అంతం చేస్తారని అనుకోలేదు. May be all stories doesn't have a happy ending.
ప్రవీణ్ గారూ, ధన్యవాదాలు. Happy endingల కంటే కూడా tragic endingల నుంచే ఎక్కువ నేర్చుకోగలమండీ.
Anonymous: మీరెవరనుకుంటే వాళ్ళే. నేనూ నా నీడా వేరు కాదు. ఇప్పుడు కలిసిపోయాం :)
మ్మ్......నాకేంటో ఒక భార్యా భర్తా సంభాషించుకున్నట్టు అనిపించింది.నేను--కొంచం అహంకారాంగా, నీడ కొంచం సబ్మిసివ్ గా.కాని బాగా రాసారు.
Post a Comment