Showing posts with label కవితలు: అమ్మ. Show all posts
Showing posts with label కవితలు: అమ్మ. Show all posts

అమ్మ


నేన్నిద్దట్లో ఉన్నాను నువ్వు లాలించినప్పుడు...
నీ గుండెలపై పరున్న సంగతి గ్రహించలేదు.
మేల్కొన్నాకైనా కృతజ్ఞతలు చెప్పలేదు నీకు!

నే నాకలి గైకొని ఉన్నాను నువ్వు వడ్డించినప్పుడు...
నీ ప్రేమని పంచి ఇస్తున్నట్లు తెలుసుకోలేదు.
పూర్తయినాకయినా అడగలేదు నువ్వు తిన్నావో లేదో అని!

నేనెంతో గర్వపడ్డాను నువ్వు ముద్దించినప్పుడు...
నీ ముద్దు పొందటం నా అదృష్టమని తట్టలేదు.
అరచేత్తో నీ ముద్దుని తుడిచి మనసారా ముద్దివ్వలేదు నీకు!

నేడు హంస తూలికా తల్పం ఉంది.
జో కొట్టేందుకు చల్లని గాలులున్నాయి.
మైమరపించే సంగీతం ఉంది.
నువ్వు లేవు... నిద్ర పట్టటంలేదు!

పంచభక్ష్య పరమన్నాలున్నాయి.
మత్తెక్కించే మధుపానీయాలున్నాయి.
వడ్డించే సేవకులున్నారు.
నువ్వు లేవు... ఆకలి లేదు.

అభిమానం కురిపించే అత్మీయులున్నారు.
తోడుగ నిలిచే స్నేహితులున్నారు.
కంటికి రెప్పలా చూసుకునే వారెందరో ఉన్నారు.
నువ్వు లేవు... మనశ్శాంతి లేదు.