Showing posts with label కవితలు: ఆఖరి అవకాశం. Show all posts
Showing posts with label కవితలు: ఆఖరి అవకాశం. Show all posts

ఆఖరి అవకాశం


లుచబడ్డ నా ప్రతిఙ్ఞ లాగనే
నిలకడ లేని మేఘాలు
మలినపడ్డ నా ప్రవర్తన లాగనే
నీలాకాశాన్ని వీడి పరిగెడుతున్నాయి

కాలం మృత జీవితాన్ని తలచి పలవరిస్తే
గాలి ముభావంగానే పలకరిస్తుంది
మన స్నేహం గత ఙ్ఞాపకంతో పరితపిస్తే
నా మనసు మాత్రం..
పైశాచికంగా పరవశిస్తోంది

నీటిలోని నా ప్రతిబింబం ఒక్కటే...
నన్ను చూసి అసహ్యించుకోక,
రప్పో వేయించుకుని
అలల తరంగాలలో
నా గతాన్ని చూపింది

నిజం! ఎంత మధురం నా గతం
పట్టిందల్లా బంగారం
ఎందుకంటే... అత్మస్ధైర్యం

నేడు మాత్రం నా వ్యసనాలు
కర్ణుని చావుకి కారణాల్లా
నా పతనానికి తలుపులు తెరిచాయి

సందేహం లేదు
సైతానేదో ఆవహించింది
కనుకనే కనుల చుట్టూ
స్వార్ధం ఆవరించింది

క్షణక్షణానికి ఒక చేతగా
రోజురోజుకీ ఒక రీతిలో
రంగు మార్చుతున్న నేను..

కోల్పోయినదేమిటో
ఇప్పటికి..., ఇప్పటికి తెలుసుకుని
కుమిలిపోతున్నా!

జారవిడిచిన జీవితాన్ని
తిరిగిపుచ్చుకునే ప్రయత్నంలో
చివరి అవకాశానికై అభ్యర్ధన!

పరివర్తనతో పశ్చాత్తాప పడినా
ఎలాంటివాణ్ణి ఇలా మారానేమంటూ
కళ్ళు చెమ్మగిల్లినా
నన్ను నమ్మవు కదూ..?

నే శ్వాస విడిచేలోపు
నీ విశ్వాసాన్ని పొందగలనా...?