ఈ చిన్ని విజయాలు నాకొద్దు ఈ అల్పానందాలు అసలే వద్దు
నాకు సంచలనం కలిగించే శక్తి కావాలి
సాఫీగా సాగే జీవితాన్ని నే కోరను
నాకు రెక్కలు కావాలి
ఆ రెక్కలతో నేన్నింగికి ఎగిరి,
మరుగుజ్జు మానవులకు
మరింత దూరంగా
విశ్వ సంచారం చేయాలి
నాకు అర్హత లేదని నీవు తలిస్తే
తరువాత కత్తిరించేయ్.
కానీ ముందొక అవకాశాన్ని ఇవ్వు
సత్యాన్వేషినై
విహరించే నేను,
గదుల్లో గడియ బిగుంచుకుని
జీవించే జనాలకు
కనిపించనీ, పోనీ
ఎక్కడో చుక్కల్లో
నా రూపాన్ని వీరు,
చూడనీ, పోనీ
నేన్నింగికి ఎగసానన్న
అనుభూతిని నాకివ్వు
నాకు అర్హత లేదనుకుంటే
మళ్ళీ క్రిందికి దించేయ్.
కానీ అందుకు ముందు
నాకొక అవకాశం ఇవ్వు.