దానవుని జీవనం

ఈ మధ్యన కొన్ని బ్లాగుల్లో అయిదేండ్ల తెలుగు కధలు ప్రతిపాదన చూసాక, హఠాత్తుగా గతంలో నేను పనికిరావనుకుని నలిపి పారేసిన కధలు గుర్తుకొచ్చాయి. అసలు మన కధలకంత సీనుందా? లేదా ఏదన్నా భ్రమలో ఉన్నానా? అని సందిగ్ధావస్థలో పడిపోయాను. ఎందుకంటే ఒకటో అరో కధలు ఇది వరకు బ్లాగుల్లో దర్శనమిచ్చినా ఒక్క విమర్శకైనా నోచుకోలేదు. ఈ క్రింది కధ సంభాషణలతో నిమిత్తం లేకుండా, ఏ విధమైన సందేశాల జోలికి పోకుండా వర్ణనలతో ప్రయత్నించాను. ఈ కధపై విమర్శలను సవినయంగా ఆహ్వానిస్తున్నాను. (గతంలో ఈ కధ విహారి పేరుతో కోడీహళ్ళి మురళీమోహన్ గారి కధాజగత్తులో ప్రచురించాను.) చదివి మీ అభిప్రాయాలను(ముఖ్యంగా లోటుపాట్లు) తెలియజేయండి. ఈ లోపు రేపటి వికాసంలో తీర్థ రాముని పరిచయ ఏర్పాట్లు చేస్తూ ఉంటాను.

దేవతలు, రాక్షసులు తాంబూలాలు పుచ్చుకున్నారు. పెళ్ళి నిశ్చయించారు. నిజానికా సంబంధం దేవతల తరపు వారికి ఇష్టం లేదు. కానీ వేరే దేవతల సంబంధం చేసే స్థోమత లేక, రాక్షసుల కట్నం తక్కువ కావటం చేత ఒప్పుకున్నారు.

దేవతకి, రాక్షసునికి పెళ్ళైపోయింది. దేవతంటే ఆమె నిజంగా దేవతే! అలా అని ఆమెకి గొప్ప ఆదర్శాలు కానీ, విలక్షణ వ్యక్తిత్వం కానీ, ఒకళ్ళని ఉద్ధరించే గుణం కానీ ఉన్నాయనుకోకూడదు. ఆమె చాలా అమాయకురాలైన దేవత. వెన్నపూసలాంటి మనసున్నది. ఎదుటి వారిలోని ఎంతటి తప్పైనా క్షమించగలిగేది. ఆమె రాక్షసునితో వివాహమనగానే తల్లికి ఎదురు చెప్పలేదు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన తనకు తల్లి అంతకంటే ఎక్కువ కట్నం ఈయలేదని గ్రహించింది. అదీ గాక ఆమెకు తల్లిని ఎదిరించటం తప్పని తోచింది. అలా అని లోలోన బాధపడనూ లేదు. ఒక వేళ బాధపడినా తాళి పడ్డ మరుక్షణం ఆ బాధను మరచిపోయింది. పతియే ప్రత్యక్ష దైవం అనుకుంది.

రాక్షసుడు కూడా, రాక్షసుడంటే నలుగురికి కష్టాలు కలిగించేవాడో, ఎదుటి వారికి కీడు తలపెట్టేవాడో కాదు. అతను ఇతరుల జోలికే పోయేవాడు కాదు. కాని అతనిలో రాక్షస సాంప్రదాయాలు మూర్తీభవించి ఉన్నాయి. అతనికి హృదయం లేదు. హృదయం లేదంటే కఠినాత్ముడు అనుకోకూడదు. హృదయం బండరాయంటే కఠినాత్ముడు కానీ, హృదయం లేడంటే కఠినాత్ముడని అర్థం ఎలా వస్తుంది? అతనిలో మృగచేష్టలు ఎక్కువగా కనపడతాయి.

ఆమెకు రాక్షసుని వికృత చేష్టలెన్నో బాధ కలిగించినై. రాక్షసుడు గట్టిగా అరచినట్లు మాట్లాడేవాడు. భాష కూడా జుగుప్సాకరంగా ఉండేది. నవ్వితే బండరాళ్ళు కురిసినట్లు ఉండేది. పళ్ళు వికృతంగా ఉండేవి. శుభ్రంగా ఉండేవాడు కాదు. తినేటప్పుడు అసహ్యకరమైన లొట్టల చప్పుడు వినపడేది. తైల సంస్కారం లేని తల గోక్కుంటూ ఉండేవాడు. పెళ్ళైన కొత్తలో రాక్షసులతోనే గడుపుతూ ఆమెను దూరంగా వేరుగా ఉంచేవాడు. ఆమె అన్నింటికీ ఓర్చుకుంది. భర్త వైఖరిలో మార్పు తేవటానికి ప్రయత్నించేది. కొంచెం కొంచెం పరివర్తన అతనిలో కలిగేది. ఆమెతో బాగానే కాపురం చేసేవాడు. కానీ తన రాక్షసుల మధ్యకు పోయేసరికి రాక్షసుడైపోయేవాడు. రాక్షసుల మధ్యకు వెళితే, రాక్షసులను తన వారిగానూ దేవతలను పరాయి వారిగానూ భావించేవాడు. తనవారు తనకు మంచి చేస్తారని నమ్మేవాడు. మిగిలిన రాక్షసులు అతడిని దేవతలతో చేరి చెడిపోయావనేవారు. అతడు బుర్రూపేవాడు. వట్టి 'వాజమ్మ' వలే తయారయ్యావనేవాళ్ళు. దానికీ బుర్రూపేవాడు.

దేవత వద్దకు వచ్చి ఓ రెండ్రోజులు ఆ ద్వేషాన్ని వెళ్ళగ్రక్కేవాడు. మళ్ళీ అంతలోనే దేవత విలువ తెలుసుకుని బుధ్ధిగా మసలే వాడు. దేవత అతడినెప్పుడూ కించపరచలేదు. అతని తప్పులను తనపై వేసుకుని చూపరులకు దేవతదే తప్పన్న భ్రమ కలిగించేది. అతడు కూడా తన తప్పులను ఆమెపై రుద్ది ఆమెదే తప్పన్న భ్రమ కలిగించేవాడు. తన సంపాదనంతా రాక్షసులకు ధారపోసేవాడు. అయినా దేవత ఎదురు చెప్పలేదు. రాక్షసులను కూడా తన వారిగా భావించగలిగే ఉన్నత మనస్తత్వం ఆమెది.

దేవత తన భర్త ప్రవర్తన మార్చటానికి నానా తంటాలూ పడేది. కొంతవరకు విజయం సాధించింది కూడా. ఎందుకంటే రాక్షసుడు దేవత సాంగత్యంలో రాక్షసునివలే ఉండేవాడు కాదు. మనసున్న వాడిలా మసలే వాడు. కాని అంతలోనే రాక్షసుల సహచర్యంలో రాక్షసుడై పోయేవాడు. దేవత తన లక్ష్య సాధనలో ఎన్నో కష్టాలనుభవించింది. ఆమె గుణాలు కొన్ని రాక్షసునికి అలవడి అతను మంచివాడైనా, అతడి గుణాలు కొన్ని ఆమెకు అబ్బాయి. రాక్షసుల మూర్ఖత్వం కొంతమేరకు ఆమెకు అలవడింది. అయినా ఆమె దేవతే! వజ్రాన్ని కొంత అరగదీసినంత మాత్రాన వజ్రం కాకపోతుందా? పాపం ఆమె మాత్రం ఏం చేస్తుంది? ఆమె అమాయకురాలు. ఎలాంటి పరిస్థితులలోనూ కూడా దుర్గుణాలను దరి చేరనీయనంతటి ధీరోధాత్తురాలూ, ఆదర్శవంతురాలూ కాదు. అసలామెకు ఆదర్శాలే లేవు. కానీ ఆమె దేవతే! ఎందుకంటే ఆమె మనసు వెన్నపూస! కాదు మంచుగడ్డ.

రాక్షసునికి, దేవతకి మొదట ఓ కొడుకు పుట్టాడు. అయితే క్రొద్ది కాలమే బ్రతికి ఏడాదికే పోయాడు. బహుశా పరస్పర విరుద్ధ స్వభావంగల రాక్షసునికి, దేవతకి పుట్టటం వల్ల గాబోలు, కొద్ది కాలమే జీవించగలిగాడు. దేవత కుమిలిపోయింది. భోరున విలపించింది. రాక్షసుడూ ఏడ్చాడు. కానీ ఎందుకు ఏడ్చాడో అతనికి తెలియదు. భార్య ఏడుపు చూసి అతనికి కన్నీళ్ళు వచ్చాయి. అంతే!

కొన్నాళ్ళకు వారికి మరొక సంతానం కలిగింది. ఈ సారి భగవంతుడు బాగా అలోచించి పూర్తి రాక్షసపుత్రికనే పుట్టించాడు. రాక్షసులంతా పండగ చేసుకున్నారు. తమ రాక్షస సోదరుడ్ని అభినందించారు. దేవతకు రాక్షసపుత్రి కలిగినందుకు బాధ కలగలేదు. ఎందుకంటే రాక్షసుడు ఆనంద పడ్డాడు గనుక. సంతోషమూ కలుగకపోయినా, ఆమె భర్త ఆనందాన్ని పంచుకుంది.

రాక్షస పుత్రి రెండేళ్ళదయ్యింది. ఆమెకు అచ్చం రాక్షస వంశ గుణాలే వచ్చాయి. రాక్షసుని ముద్దుల కూతురయ్యింది. పోలికలో కూడా అచ్చం తండ్రిలానే ఉండేది.

మరొక ఏడాదికి వారికి మరొక సంతానం కలిగింది. ఈసారి దేవపుత్రుడు జన్మించాడు. దేవత మురిసిపోయింది. రాక్షసుడూ మురిసాడు. ఎందుకంటే అతనికి దేవతల విలువ తెలుసు. కానీ రాక్షసుల మధ్యకు చేరితే అతడా విలువను మర్చిపోతాడు.

పిల్లలిద్దరూ పెరిగి పెద్దవారయ్యారు. రాక్షసుని ప్రవర్తనలో మార్పులేదు. దేవత వద్ద ఒక రకంగా, రాక్షసుల మధ్య మరో రకంగా ప్రవర్తించేవాడు. రాక్షసులు అతడిని ఇప్పటికీ 'వాజమ్మ' అనేవారు. అతడు బుర్రూపేవాడు. కానీ వాళ్ళ దగ్గరకు వెళ్ళటం మానలేదు. తనవాళ్ళనీ, రక్తసంబంధీకులనీ ప్రేమ. హృదయం లేనివాడికి తన జాతి పై మాత్రం ప్రేమ ఎలా వచ్చిందంటే సమాధానం చెప్పలేం. రక్తసంబంధం కనుక ఆ ప్రేమ రక్తంలోనే ఉన్నదనుకోవాలి.

అదేంటోగానీ రాక్షసుడు దేవతని విడిచి రాక్షసుల వద్దకు పోయి ఎన్ని రోజులైనా ఆనందంగా గడపగలిగేవాడు. కానీ అతడిని విడిచి దేవత ఒక్క క్షణం గడప దాటినా ఉండలేకపోయేవాడు.
ఎప్పుడైనా ఆమె పుట్టింటికి వెళితే, దేవత లేని తన ఇంట్లో పిచ్చాడైపోయేవాడు. అలాంటప్పుడే అతనికి దేవత విలువ తెలిసొచ్చేది.

పిల్లలు మరింత పెద్దవారయ్యారు. రాక్షసపుత్రిని చూసి రాక్షసులు గర్వపడేవారు. రాక్షసుడూ గర్వపడినా అతడు తనకు దేవపుత్రుడు జన్మించినందుకు కూడా ఆనందించేవాడు. మిగిలిన రాక్షసులకు ఆ ఆనందం లేదు. వారికి రాక్షస కుమారుడైతేనే బాగుండుననిపించేది. రాక్షసుడు మాత్రం ఇద్దరి మీదా మమకారం పెంచుకున్నాడు. ఇది కూడా రక్త సంబంధమే కనుక ఆ ప్రేమ కూడా రక్తంలోనిదే అనుకోవాలి.

దేవపుత్రుడిది విలక్షణ వ్యక్తిత్వం. తన తల్లికున్నంత కరుణ అతనికి లేదు. నిజానికి అంతటి కరుణ, దయ ఉండకూడదని అతని విశ్వాసం. అతనివి చాలా విశాల భావాలు. ఉన్నత ధృక్పధంతో అలోచించేవాడు. అతనికెంతో ఆదర్శవంతమైన ఆశయాలున్నాయి. తన ఆశయ సాధనలో దుష్టుల మనస్సు నొప్పించటానికైనా వెనుకాడేవాడు కాదు. అతనికి తండ్రి ప్రవర్తన నచ్చలేదు. తల్లి మామూలు దేవతలా కాక, దేవతలకే దేవతలా కనిపించింది. తండ్రికి హృదయం లేదని, రంగులు మారుస్తాడని తెలుసుకున్నాడు. అయితే ఆ రంగులు మార్చటంలో తండ్రికి స్వార్థం లేదని గ్రహించాడు.

రాక్షసునికి మాత్రం పుత్రునిపై విపరీతమైన ప్రేమ. ఆ విషయం దేవకుమారునికి కూడా తెలుసు. అందుకే తండ్రిని ఈసడించుకోవాలనుకున్నా ఆ పని చేయలేకపోయేవాడు. తండ్రి మనస్సు నొప్పించే సాహసానికి ఒడిగట్టబుధ్ధి కాలేదతనికి.

అయితే తండ్రి సాంగత్యం వల్ల తల్లిలో వచ్చిన మార్పులను సహించలేకపోయేవాడు. తల్లిపై విసుగును, కోపాన్ని ప్రదర్శించేవాడు. ఆమె తప్పులు ఎత్తి చూపేవాడు. పాపం ఆమె మాత్రం ఏం చేయగలదు? దుర్గుణాలను ప్రవేశించకుండా నిరోధించటానికి, ఆమెకు కొడుక్కున్నంత సునిశిత దృష్టి, ఆలోచనా సరళి, ఆదర్శ భావాలూ లేవు. కొడుక్కున్నంతటి విలక్షణ వ్యక్తిత్వం, పరిఙ్ఞానం ఆమెకు లేవు. కాని కొడుకు గుండె కంటే వెన్నపూసలాంటి మనసున్నది. అందుకే ఆమెలో దైవత్వం పోలేదు.

రాక్షసపుత్రి వివాహం జరిగింది. దేవపుత్రుడు ఒక రాక్షసమూర్తి తమ ఇంటినుంచి కదిలిందని ఆనందించాడు. దేవత మాత్రం తన కూతుర్ని విడిచిపెట్టాల్సివస్తోందని ఏడ్చింది. అదీ తల్లీ కొడుకుల మనస్తత్వాల్లోని బేధం. రాక్షసునికి మాత్రం ఎప్పటిలానే దేవత కన్నీళ్ళు చూసి ఏడుపొచ్చింది.

రోజులు గడచాయి. దేవపుత్రుడు తనపై తల్లితండ్రులు ప్రేమను కురిపిస్తున్నా విదుల్చుకుంటున్నాడు. అతడికి వారి ప్రేమ కంటకంగా తోచింది. ఇద్దరి దగ్గరా ఒక్కలానే దురుసుగా ప్రవర్తించేవాడు. తల్లి దేవతని, ఆమె దైవత్వాన్ని ఏ మాత్రం కోల్పోలేదని అతనికి తెలుసు. అయినా ఆమెలో కొన్ని దుర్గుణాలని చూసి ఓర్వలేకపోయేవాడు. కొడుకు ప్రవర్తనకు వారెంతగానో నొచ్చుకున్నారు. అయినా ప్రేమ కురిపించటం మానలేదు.

ఓ రోజు దేవతకు జబ్బు చేసింది. రాక్షసునికి ఏడుపొచ్చింది. దేవకుమారునికి మరింత ఏడుపొచ్చింది. దేవకుమారుడు తల్లి కాళ్ళపై పడి భోరున విలపించాడు. రాక్షసుడు మాత్రం నిగ్రహించుకున్నాడు. తన భార్య మగవారంతగా ఏడవకూడదని చెప్పినట్లు అతనికి గుర్తుంది. రాక్షసపుత్రికి మాత్రం అది తన కుటుంబం కాదేమోననిపించింది. చిన్నప్పుడు దేవకుమారుడు తల్లితండ్రులతో దురుసుగా ప్రవర్తిస్తే తానెలా మందలించేదో, తల్లితండ్రులపై తాను ఎంత ప్రేమ ప్రకటించేదో అవన్నీ మరచిపోయింది. అయినా బాగుండదేమోనని కన్నీళ్ళు కార్చింది.

దేవతకి చివరి రోజులు సమీపించాయి. దేవపుత్రునికి విపరీతమైన ధుఃఖం కలుగుతోంది. రాక్షసునికైతే పిచ్చి పట్టేట్లుంది. దేవత కొడుకుని పిలిచి అద్దం తెమ్మంది. ఆ అద్దంలో ఒకసారి తన ముఖాన్ని చూసుకుంది. కళావిహీనంగా ఉన్న ముఖంతో శవంలా కనపడుతోంది. నెమ్మదిగా నోరు తెరచి చూసుకుంది. నిజమే! కొడుకు చెప్పినట్లు ఆమెకు దవడలపై దంతాలు చిన్న కోరల్లా రూపుదిద్దుకున్నాయి. ఒకప్పటి తన మనోహరమైన గంధర్వ రూపాన్ని గుర్తుకు తెచ్చుకుంది. ఎంతగానో కుమిలిపోయింది. అయినా భర్తపై క్రించిత్ ద్వేషమైనా కలుగలేదు.

కొడుకుని అక్కున చేర్చుకుని అతడి నుదుటిని ముద్దాడింది. కూతురి వైపు శెలవన్నట్లు చూసింది. భర్తను దగ్గరకు పిలిచి అతని పాదాలపై పడి ప్రాణం విడిచింది. రాక్షసునికి ఒక్కసారిగా తన పాదాల క్రింద భూమి కంపించినట్లనిపించింది. తూలిపోబోయి నిభాయించుకున్నాడు. అతనికి శ్వాస ఆడటం లేదనిపించింది. 'గాలి స్తంభించిందా?' అన్నట్లు వెర్రి చూపులు చూసాడు. దేవకుమారుడు తల్లి శవాన్ని చూసి చచ్చేంతగా ఏడ్చాడు. ఆ ఏడుపుకి అతని దవడలు నొప్పి కలిగి చచ్చుబడినట్లనిపించాయి. అయినా అతడు ఏడుపు ఆపలేదు.

రాక్షసపుత్రి పోయిన వాళ్ళ కోసం వేదన ఎందుకని ఓదార్చి, ఎక్కువ రోజులుంటే భర్త బెంగ పెట్టుకుంటాడని చెప్పి వెళ్ళిపోయింది.

రాక్షసుడు ఆ రోజంతా విరక్తి కలిగిన వదనంతో అలోచించాడు. అతనికి లోకం, భవిష్యత్తూ అన్నీ శూన్యంలా కనిపించాయి. దేవతలేని జీవితం వ్యర్ధంలా కనిపించింది. చచ్చిపోదామనుకున్నాడు. అంతలోనే కొడుకు గుర్తుకొచ్చాడు. పుత్రునిలో అతనికి భార్య కనిపించింది. తాను ఎందుకు జీవించాలో రాక్షసునికి అర్ధం అయ్యింది.

అయితే దేవపుత్రుడు తల్లి లేని ఇల్లు స్మశానమన్నాడు. ఆ స్మశానంలో తాను ఉండలేనన్నాడు. తల్లే పోయినప్పుడు తనకు మిగిలిన వాళ్ళు అఖ్ఖరలేదన్నాడు. రాక్షసుడు కలత చెందాడు. కొడుకు దగ్గర ఏడ్చుకున్నాడు. గడ్డం పట్టుకుని బ్రతిమాలాడు. దేవపుత్రుడు శాంతించాడు. అయితే తండ్రి రాక్షసులతో కలవకూడదని షరతు విధించాడు. సరేనని ఒప్పుకున్నాడు రాక్షసుడు.

కొన్నాళ్ళు గడచాయి. ఓ రోజు ఉదయం దేవపుత్రుడు బయటకు వెళ్ళి సాయంత్రానికి ఇల్లు చేరుకున్నాడు. ఇల్లంతా కోలాహాలంగా ఉంది. 'ఏంటా?' అని చూస్తే ఇల్లంతా రాక్షసులతో సందడిగా ఉంది. రాక్షసులంతా తన తల్లి పటం ఉన్న గది లో మాంసాలు తింటున్నారు. తనకూ, తన తల్లికీ నీచు వాసన కూడా పడదన్న విషయం దేవపుత్రునికి గుర్తుకు వచ్చింది. అయినా తల్లి తన తండ్రి కోసం అప్పుడప్పుడు మాంసం వండటం గుర్తుకువచ్చింది. పళ్ళు బిగబట్టాడు. కోపంగా తండ్రి వైపు చూసాడు. తండ్రి రాక్షసుల మధ్యన ఆనందంగా ఉన్నాడు. రాక్షసులంతా తన తండ్రిని 'వాజమ్మ' వంటున్నారు. తన తండ్రి బుర్రాడిస్తున్నాడు. అతనిలో ఆవేశం కట్టలు త్రెంచుకుంది. రాక్షసులంతా వెళ్ళిపోయాక తానూ ఇల్లు విడిచి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్నాడు. బయలు దేరిన కొడుకుని చూసి రాక్షసునికి భయం వేసింది. వెళ్ళవద్దని ఏడ్చాడు. దేవపుత్రుడు చలించలేదు. కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడ్డాడు. దేవపుత్రుడు శాంతించాడు. తండ్రికి చివరి అవకాశాన్ని ఇచ్చాడు. రాక్షసుడు ఊపిరి పీల్చుకున్నాడు.

మరి కొన్నాళ్ళు గడిచాయి.

రాక్షసులు తమ సోదరుడ్ని తమ వైపు తిప్పుకోవటానికి ప్రయత్నించారు. అతడిని నానారకాలుగా మభ్యపెట్టారు. రాక్షసుడి మనస్సు లాగినా, కొడుకు కోసం ఆ కోరిక అణగద్రొక్కుకున్నాడు. 'వాజమ్మ'వన్నారు రాక్షసులు. అతడు బుర్రూపాడు.

కాలం గడిచే కొద్దీ రాక్షసుడు కొడుకు మాటను పెడచెవిన పెట్టాడు.

ఓ రోజు దేవపుత్రుడు ఇంటికి వచ్చేసరికి తండ్రి కనిపించలేదు. 'వెర్రి తండ్రి ఏమయినాడా?' అని దేవపుత్రుడు ఎంతగానో కలవరపడ్డాడు. తనకు తెలిసిన ప్రదేశాలన్నింటా వెతికాడు. చివరకు తన తండ్రి రాక్షస నగరంలో తన వారి మధ్య కేరింతలు కొడుతూ కనిపించాడు. రాక్షసులు తన తండ్రిని 'వాజమ్మ' అంటున్నారు. తండ్రి బుర్రూపుతున్నాడు. తండ్రికి తన అవసరం లేదనిపించింది. వెంటనే వెనుదిరిగాడు దేవపుత్రుడు. రాక్షసుడది గమనించాడు. అతడి గుండె గుభేలుమంది. గభాల్న కొడుకు వద్దకు వచ్చి క్షమించమని ప్రాధేయపడ్డాడు. కొడుకు కాళ్ళపై పడి పసిపిల్లవానివలే ఏడ్చాడు. కొడుకు లేకపోతే చచ్చిపోతానన్నాడు. దేవపుత్రుడు చలించలేదు. తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు.

రాక్షసునికి ఉన్న ఒక్క ఆశ అడుగంటినట్లనిపించింది. ఆఖరి దీపం కూడా ఆరిపోయినట్లనిపించింది. ఆకాశం నుంచి దేవత తనను పిలుస్తున్నట్లనిపించింది. కొడుకు తనని విడిచి పోవటం మరోసారి గుర్తుకు తెచ్చుకున్నాడు. తను చూసిన కొడుకు చివరి రూపాన్ని మరోసారి గుర్తుకుతెచ్చుకున్నాడు. మళ్ళీ అంతలోనే తన భార్య చితి గుర్తుకువచ్చింది. తను అప్పుడు ఎంతగా ఏడ్చాడో గుర్తుకుతెచ్చుకున్నాడు. తన ముద్దుల కూతురి ప్రవర్తన, తనవారైన రాక్షసుల అభిమానం గుర్తుకువచ్చింది. మరింత ముందుకు పోయి, దేవతతో తనకు జరిగిన వివాహాన్ని, మొదటి సంతానాన్ని గుర్తుకుతెచ్చుకున్నాడు. వివాహం జరుగుతున్నప్పుడు సిగ్గు పడుతున్న దేవత వదనం అతని కళ్ళ ముందు ప్రత్యక్ష్యమయ్యింది. అంతలోనే చనిపోయేటప్పుడు ఆమె ముఖం ఎంత వికృతంగా తయారయ్యిందో ఙ్ఞప్తికి వచ్చింది. ఏడుపొచ్చింది. చచ్చిపోదామనుకున్నాడు.

రాక్షసులు అతడిని చుట్టుముట్టారు. దేవతలతో పూర్తిగా తెగతెంపులు అయినందుకు సంతోషించమన్నారు. మౌనంగా తలాడించాడు. తినమంటూ మాంసం తెచ్చి ఇచ్చారు. భార్య కోసం మానలేకపోయినా, కొడుకు కోసం అన్నాళ్ళనుంచి తినటం మానేసిన మాంసాన్ని చూసి అతనికి నోరూరింది. ఆబగా తిన్నాడు.

'వాజమ్మ'వన్నారు రాక్షసులు.

బుర్రూపాడతడు.

రాక్షసుల మధ్యకు చేరి కేరింతలు కొట్టాడు. ఇప్పుడతనికి తన దేవత, పుత్రుడు గుర్తులేరు. వారిని పూర్తిగా మరచిపోయాడు.

రాక్షసుల మధ్యన చేరి, తిరిగి రాక్షసుడైపోయాడు.

6 comments:

anju..... said...

daanavuni jeevanam,,kata chaduvutunte naku drshyam kanabadindi,,,,,kukkatoka vankara ante idenemo,,,banda kattinanta sepu bagne vuntundi,,,,anudke manchivallato savasam cheyali antaru,,,,ok nandi

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

నాకు చదువుతున్నంతసేపు ఒకేమనిషిలోని వివిధపార్స్వాలను చూపినట్లుగా అనిపించింది.

బృహఃస్పతి said...

@అంజూ: మీ పోలిక బాగుంది.
@చైతన్యా: ఇంతకీ బాగుందో లేదో చెప్పలేదు.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

చాలాబావుంది. కాబట్టే వ్యాఖ్యనించాను.

sunita said...

నాకేంటో మనుషుల్లోనే జరిగిన వివాహాలు, దేవతా ప్రవ్రుత్తి, దానవ ప్రవుత్తి, వేవు లెంగ్థ్ కుదరని పెళ్ళిళ్ళు గుర్తుకోచ్చాయి.

బృహఃస్పతి said...

కరెక్టు గా పట్టేసారు. ఈ కధ నిజంగా వాస్తవ ఘటనల ఆధారంగా అల్లుకున్నదే...