ఘోష

మూస కధలతో విసిగివేసారిన తెలుగు పాఠకుల కోసం. సాగర సంగమాన్ని వినూత్న రీతిలో ఆవిష్కరించే ప్రయత్నం. కాల్పనిక కధా సాహిత్యంలో ప్రయోగం. చదివి మీ అభిప్రాయం తెలియజేయండి...

అతను ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. నిశ్చలంగా ఉన్నాడు. సూర్యుడు వచ్చేటప్పుడు నిర్లిప్తంగా చూస్తున్నాడు. చంద్రుని వైపు నిరాశగా చూస్తున్నాడు. ఏ భావమూ పలికించని నిస్పృహ నిండిన వదనంతో తన తల్లిని తల పైకెత్తి చూస్తున్నాడు.

ఒకప్పుడు తనకు తోడెవరైనా వస్తారేమోనని ఉవ్వెత్తున ఎగసేవాడు. పగలు, రాత్రి, వెలుతురు, చీకటి అన్ని సమయాల్లోనూ, చూపు ఆనినంత దూరం, భూమి అంతమైన వరకు ఎవరైనా వస్తారేమోనని ఆశగా చూసేవాడు. నెమ్మదిగా ఎవ్వరూ రారని నిశ్చయించుకుని నిశ్చలమైపోయాడు. ఎప్పుడో చలించినా యాంత్రికంగా చలిస్తాడు. అతని పరిస్థితి చూసి తల్లి ఆకాశం కన్నీళ్ళు పెట్టుకుంది.

ఓ రోజు ఓ అందమైన సుందరి అతని వద్దకు వచ్చి ఆమడ దూరాన నిలుచుని పిలిచినది.

అతనా సమయానికి నిరాశ నిండిన కళ్ళతో, తన ముఖాన్ని మోకాళ్ళల్లో దాచుకుని ఉన్నాడు.

“ఓయీ...!” పిలిచినదామె.

“....!”

“మిత్రమా…!” మళ్ళీ పిలిచినది.

పలుకనే లేదు.

“ప్రియా...!”

కళ్ళు తెరిచాడతడు. ఎదురుగా మనోహరమైన రూపంతో సోయగాలు ఒలికిస్తు, స్వేచ్ఛగా ఎగురుతూ – అనంతం వరకు పరచి ఉన్న శిరోజాలను తన మృదువైన అర చేతితో ప్రక్కకు తొలగిస్తు ‘దేవకన్యయా?’ అనిపించేంతటి వర్ఛస్సుతో ఉన్నదామె.

ఎన్నాళ్ళ క్రితమో అడుగంటిన ఆశ తిరిగి చిగురించినదతనిలో.

“సుందరీ – నీవెవరవు? ఎచటనుంచి వచ్చినావు?” ప్రశ్నించాడతడు.

“మంచు కొండల మలుపుల్లో మానస సరోవరాన పుట్టి, మనసిచ్చే వానికోసం వెదుకుతూ వచ్చినాను.” బదులిచ్చినదామె.

“ఒంటరిగా వచ్చినావా? భయం లేదూ..?” తిరిగి ప్రశ్నించాడు.

“భయమేల? నా బంధువులందరూ దారి పొడుగునా వెన్నంటినారు కదా.” తాను దాటిన పర్వతాలను ఙప్తికి తెచ్చుకున్నదామె.

“ఇంతకీ నీ పేరు చెప్పనేలేదు?” గుర్తు చేసాడతడు.

“యమున”

“.....”

“నీ పేరు?”

“....తెలియదు.... ఇంతవరకు ఎవ్వరూ పిలువనే లేదు.” అతని కళ్ళు చెమ్మగిల్లాయి.

ఆమె జాలిపడింది.

“నేను సాగర్ అని పిలుస్తాను. సరేనా?”

అతడు ఆనందించాడు. మునుపటి ఉత్సాహం, చైతన్యం అతనిలో ప్రవేశించాయి. ఊవ్వెత్తున ఎగసాడు. తన ఆనందాన్ని తల్లి అంబరానికి చెప్పాడు. సూర్యుడు వచ్చినంతనే అతని చెవిలో చెప్పాడు. చంద్రునితోనూ, చీకటితోనూ, చుక్కలతోనూ చెప్పాడు. మబ్బులకు చెప్పాడు.

ఆమె నవ్వుకుంది.

వారిద్దరూ కబుర్లాడుకున్నారు. చెలిమి చేసారు. పరస్పరం ప్రేమించుకున్నారు. కొన్ని రోజులు గడిచాయి.

ఒకనాడతనికి ఆమెను స్పృశించాలన్న కోరిక కలిగింది.

“సఖీ...” పిలిచాడు.

“ఊ…!” కలలోంచి పలికినట్లుగా తన్మయంగా బదులిచ్చినదామె.

“మన ప్రణయానికి గుర్తుగా ఈ ఉంగరం నీ వేలికి తొడగనీయవూ....?” అర్థించాడతడు.

మౌనంగా చేయినందించినదామె.

తనలో దాచుకున్న ఓ అద్భుతమైన ముత్యపుటుంగరాన్ని ఆమె వేలికి తొడిగి ఆమె అరచేతిని చుంబించాడు.

ఆమె సిగ్గు పడింది. అరచేతిని వెనక్కి తీసుకొవటానికి యత్నించింది.

అతడు విడువలేదు. విడిస్తే తనని విడిచి పోతుందని అతని భయం. అతని చర్య ఆమెకు చీకాకు తెప్పించింది. అతడు తన మిగిలిన చేతులను చాచి కౌగిలిలోనికి రమ్మని ఎంతగానో ఆహ్వానించాడు. ఆమె నిరాకరించినది.

ఆతడు నిరాశ చెందాడు. ఆమె ఈసడించుకుంది. అయినా అతడామె చేతిని వదలలేదు. నెమ్మదిగా అతనిలో కాఠిన్యం ప్రవేశించింది. కర్కశంగా ఆమె చేతిపై పట్టు బిగించాడు. యమున విలవిలలాడింది. కన్నీళ్ళు పెట్టుకున్నది. కాని అతని పరిష్వంగంలోనికి రాలేదు.

అంబరం వారివైపు గంభీరంగా చూసింది. గుడ్లురిమింది. అమెనతని కౌగిలిలోనికి పొమ్మన్నది.

యమున మళ్ళీ నిరాకరించింది.

అంబరానికి కోపం వచ్చింది. తుఫాను సృష్టించింది. విధిలేక యమున అతని కౌగిలిలోనికి పోయినది. అతని కోరిక నెరవేరింది. అంబరం శాంతించింది. యమున వెనక్కి మరలింది. అయినా అతడామె చేతిని విడువలేదు.

ఆమె మౌనంగా విలపించింది.

కొన్నాళ్ళు గడచాయి.

ఒకనాడతడు తన వైపు మరో మగువ రావటం గమనించాడు. ఆమె మరింత అందంగా యమునకంటే సుందరంగా ఉన్నది. మరింత పరిణితి చెందిన మనస్కురాలివలే విశాలంగా ఉన్నది. అతడు యమునను ఆమెకు కనపడనీయకుండా వేరే చేతిలోనికి మార్చాడు.

“సుందరీ నీవెవరవు?” ప్రశ్నించాడతడు.

“గంగను” బడులిచ్చినదామె.

“నీ పేరేమిటి?” తిరిగి ప్రశ్నించినది.

“....ఏమో.....? ఇప్పటి వరకు ఎవ్వరూ పిలువనేలేదు.” కళ్ళు చెమర్చాడతడు.

ఆమె జాలి పడింది.

“నేను సాగర్ అని పిలుస్తాను. సరేనా?” అన్నదామె.

అతను ఉలిక్కిపడ్డాడు. అంతలోనే తమాయించుకుని -
“నీవెచటనుంచి వచ్చినావు? నీ తల్లితండ్రులను విడిచి వచ్చుటకు కారణమేమి?” ప్రశ్నించాడతడు.

“కాశ్మీర రాజ్యం నుండి వచ్చినాను. హిమగిరులయందు పుట్టినాను. వారు కన్న బిడ్డనే! వయసొచ్చాక మనసిచ్చే వానికోసం అన్వేషిస్తూ వచ్చినాను.” బదులిచ్చినదామె.

అతడానందించాడు. ఆమెకు తీయని కబుర్లు చెప్పాడు. తనలో ఇముడ్చుకున్న వింతలను వెలుపలకు తీసి చూపాడు. నెమ్మది గా ఆమెను వశపర్చుకున్నాడు. ఉంగరం తొడిగే నెపంతో ఆమె చేయినందుకున్నాడు. ఆమె సిగ్గు పడింది. బుగ్గలు ఎరుపెక్కాయి. అతడు ఆమె చేతిని చుంబించాడు. ఆమె వెనక్కి లాక్కోబోయింది. కాని అతడామె చేతిని ఎంతకి విడువకపోవటంతో ఆ సిగ్గు కాస్తా కోపంగానూ, అసహ్యంగానూ, ద్వేషంగానూ మారింది.

అతని కౌగిలిలోనికి రావటానికి నిరాకరించింది.

ఆకాశం ఉరిమింది. ప్రళయాన్ని తెచ్చింది.

అయినా ఆమె చలించలేదు.

గగనం ఉప్పెనను తెచ్చింది. అతడామెను కబళించాడు. అసహాయ స్థితిలో మూగగా రోదించినదామె.

నింగి శాంతించింది. అతడు వెనక్కి మరలాడు. ఆమె చేతిని మాత్రం వదలలేదు. అప్పటి నుండి అతడు ఎందరో స్త్రీలను లోబరుచుకోసాగాడు. ముందుగా బలయిన వారు ఏమీ చేయలేక దీనంగా చూస్తున్నారు. అతడెవ్వరిని విడువటం లేదు. వారెవ్వరూ అతని కౌగిలిలోనికి పోవటంలేదు. అతడి కోరిక గమనించినప్పుడు అతడి తల్లి వారిని భయపెట్టి వారిని ఏకం చేస్తోంది. వారందరికీ సంతానం కలిగింది. ఆ సంతతికి జరిగిన దారుణం తెలుసు. వారు తమ తల్లిని ఎప్పుడూ విడువరు. అతడి పాలపడ్డ అంగనల జీవితాల్లో యాంత్రికత చోటు చేసుకుంది. మునుపటి ప్రేమలు లేవు. మునుపటి ఆత్మీయతలు లేవు. మునుపటి అభిమానాలు లేవు. ఆశలు లేవు. ఆత్రుత లేదు. అతడు చేతులు చాచి వారిని తన కౌగిలిలోనికి రమ్మని కవ్విస్తున్నాడు. అది కూడా యాంత్రికంగా ఉంటుంది. హేళన చేస్తున్నట్లు ఉంటుంది. బానిసను పిలుస్తున్నట్లు ఉంటుంది. ఆతని మాయలో పడ్డ పడతులందరికీ ఈ విషయం తెలుసు. అయినా అతని చేతిలోనుంచి తమ చేతిని విడిపించుకోలేని దీనస్థితిలో అనుక్షణం కుమిలిపోతూ, ఆ యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డారు.

వారి కంఠథ్వనుల, ఆర్తనాదాల ఘోష ఇప్పటికీ అతని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది.

6 comments:

భాస్కర రామి రెడ్డి said...

మూర్ఖు లల్లొ వీర మూర్ఖులు నాస్తిక
అక్కు పక్షి చీక ఆకు పక్షి
కిథలు జెప్ప నరులు కిలకిల మనినవ్వె
విశ్వదాభిరామ వినుర మూర్ఖ

చీక ఆకు = చీకాకు లేదా చీకాకుళం

viswamitra said...

@భాస్కర రామిరెడ్డిగారూ..ప్రతీవాళ్ళూ మీ పద్యాన్ని(?) పాజిటివ్‌గా తీసుకుంటున్నారు. నా కంఫ్యూజన్ పెరిగిపోతోంది!!

కొత్త పాళీ said...

It is certainly interesting, but hardly an experiment. It follows the age old structure of fables and parables.
Having said that, it is interesting.
It is false to say that we do not have kaalpanika sahityam.

భాస్కర రామి రెడ్డి said...

Oh is it miss fired? AkaTaa vidhi enta baleeya mainadi? ;)

బృహఃస్పతి said...

భాస్కర్ గారూ, మిస్ ఫైర్ అయిందేమోనని భయపడకండి. 'చర్చ'లన్నీ మొదటి నుంచీ ఫాలో అవుతున్నవాణ్ణి కనుక వెంటనే అర్ధమయ్యింది.

కొత్తపాళీ గారూ, వికాసానికి స్వాగతం. మీరు ఇంటరెస్టింగ్ అన్నారు. ఈ కధ పరమార్ధం నెరవేరింది. కాల్పనిక కధలు గతంలో తిలక్, ముళ్ళపూడి గారి కలం నుంచి వెలువడగా చదివినట్లు గుర్తు. నా 'ప్రయోగం' అన్న పదం 'కొత్త ప్రయోగం'గా ఇక్కడ తీసుకొనబడుతున్నదని అర్ధమయ్యింది. ఇది కొత్త ప్రయోగం అని చెప్పటం నా ఉద్దేశ్యం ఎంత మాత్రమూ కాదూ. ఇకపోతే ప్రస్తుత కధకులెవ్వరూ ప్రయోగాల జోలికి పోవటం లేదు. అందరూ తమ చుట్టూ జరుగుతున్నదాన్నే వీలయినంత అనుభవించి, అతిశయించి చెప్తున్నారు తప్పితే ప్రయోగాల జోలికి వెళ్ళటంలేదు. అందుకే ఇలాంటి కధ ద్వారా కనీసం కొత్త రచయితలకయినా విభిన్నఆలోచనలు కల్పిద్దామన్న ప్రయత్నం.

sunita said...

అధ్భుతం!!1ఇప్పటివరకూ, నదులూ, సాగర సంగమం గురుంచి భయంకరమైన రస కవిత్వం హ్రిద్యమైన కవిత్వం చదివాము తప్పితే ఇలా ఆవిష్కరించడం చాలా కొత్త భావన. చాలా బాగుంది.