జీవితం



జీవితం అన్న మూడక్షరాల పదం తాలూకు మూలార్ధాన్ని వెతకటం కోసం అతడు ఎంతో కాలాన్ని వ్యర్ధం చేస్తున్నాడు. యుగాల తరబడి జీవితాలని వృధా ప్రయాసకై ఉపయోగిస్తున్నాడు.

అతడు రాతియుగంలో పుట్టాడు. ఒంటరిగా కాదు. ప్రకృతి తోడుగా ప్రకృతిలో పుట్టాడు. పసిగుడ్డు. ఏమీ తెలియదు. అలసటతో ఆదమరచి నిద్రించాడు. అస్తవ్యస్తమైన కలలు వచ్చాయి. కానీ అర్ధం కాలేదు. వాటి భాష తెలియదు. భావం తెలియదు. ఎందుకు వచ్చాయో తెలియదు. ఆకలి వేసినప్పుడు అందుబాటులో ఉన్నవి తిన్నాడు. ఆ తిన్నది అశుధ్ధమై వచ్చింది. కోరిక కలిగినప్పుడు ప్రకృతితో ఏకమయ్యాడు. ప్రకృతి ప్రసవిస్తే అశుధ్ధమని భ్రమించాడు. ఆ అశుధ్ధం చలించటంతో అక్కున చేర్చుకున్నాడు. జీవించటం నేర్చుకున్నాడు. కానీ ‘జీవితం’ తెలియలేదు. అసలు జీవితం గురించి తెలుసుకోవాలన్న జిఙ్ఞాస, పరిఙ్ఞానం లేవు. ఆ పరిఙ్ఞానం పెంపొందించుకునేటప్పటికి ప్రళయం వచ్చింది. తాను అనుకూలంగా మార్చుకున్నవన్నీ మట్టిగొట్టుకు పోయాయి. మళ్ళీ ప్రకృతితో పాటూ మిగిలాడు ఒంటరిగా.

తాను కోల్పోయిన వాటిని పునర్నిర్మించుకునే యత్నంలో అతనికి జీవితాన్ని గురించి ఆలోచించే వ్యవధి దొరకలేదు. మళ్ళీ నాగరికంతో పాటూ పెరిగాడు. చాలా విషయాలు తెలిసినై. 'జీవితం' తెలియలేదు. తెలుసుకోవాలని మధనపడ్డాడు. అంతర్లీనంగా లోలోన కాస్తగా పడ్డ తపన క్షణక్షణానికి బలమై జీవితాన్ని తెలుసుకోవటం కోసమే జీవితాన్ని వెచ్చించే స్థితి దాపురించింది. అయినా 'జీవితం' తెలియలేదు. ఇలాకాదని అన్నింటినీ త్యజించి పోయాడు ఒంటరిగా. ఆఖరికి ప్రకృతిని ఒదిలి.

కాళ్ళు లాక్కెళ్ళిన వైపు పోయాడు. నగ్నంగా కనిపిస్తున్న సృష్టిలో ఒంటరినని నిర్ధారించుకుని, కళ్ళు మూసుకుని జీవితం తాలూకు మూలార్ధాన్ని అన్వేషించసాగాడు. నిద్రాహారాలు లేవు. అలసట లేదు. కోరికలు లేవు. మరో వ్యాపకమేదీ లేదు. బహుశా తపస్సు అంటే అదేనేమో.

అతనికి సమాధానం దొరకలేదు. జీవితం అయిపోయింది. మరోసారి తెలుసుకోవచ్చునని తనను తాను సమాధానపరచుకున్నాడు.

మరో జన్మ వచ్చింది. ఈసారి భారాన్నంతా ఓ అదృశ్య శక్తి పై ఆపాదించాడు. ఆ అదృశ్య శక్తికి భగవంతుడని పేరు పెట్టుకున్నాడు. భక్తుడయ్యాడు. జీవితమంతా భక్తి పారాయణం చేసాడు. జీవితం అంతు చిక్కలేదు. తన జీవితం సరిపోలేదు. మరోసారి తెలుసుకోవచ్చని స్థిమితపడ్డాడు.

అది మొదలు ‘జీవితం’ తెలుసుకోవటం కోసం అనేక జీవితాల తరబడి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

తత్వవేత్త రూపు దాల్చాడు. తెలియలేదు.

ప్రపంచాన్నంతటినీ జయించి ‘జీవితాన్ని’ తెలుసుకోవటం కోసం ఎంతో మందిని నియమించాడు. తెలియలేదు.

రచయితగా పుట్టి జీవితాంతం అన్వేషించాడు. ఉహూ! శాస్త్రవేత్తగా మారి చచ్చే దాకా పరిశోధించాడు. ఫలితం శూన్యమే!

చివరకు సన్యాసిగా అవతరించాడు. అన్నింటినీ త్యజించి తనను తాను పునర్విమర్శ చేసుకున్నాడు. ‘జీవితం’ తెలుసుకోవటం దుస్సాధ్యం అనిపించింది. గతాన్ని తవ్వుకుంటూ తర్కించుకుంటూ పోతే తాను తొలిసారి ప్రకృతి ప్రసవిస్తే ఏమని భ్రమించాడో ఙప్తికి వచ్చింది. నవ్వు వచ్చింది.

అనాగరికంగా, మృగంగా ఉన్నప్పుడు తెలుసుకున్న విషయాన్ని మరచి తిరిగి అదే విషయాన్ని తెలుసుకోవటం కోసం యుగాలు పట్టింది. లెఖ్ఖలేనన్ని జీవితాలు పట్టింది.

అతను ధృఢంగా నిశ్చయించుకున్నాడు.

“నిజం! జీవితం అశుధ్ధం!”

3 comments:

Anonymous said...

మానవుడు ఒక నిరంతర విద్యార్థి. అతడు ఎప్పుడూ ఏదో ఒకటి అన్వేషిస్తూనే ఉంటాడు. పరిమాణ క్రమంలో మనిషి క్రొత్త అవతారం ఎత్తూతునే వున్నాడు. అంత మాత్రాన అతను మునపటి అవతారములో నేర్చుకున్న దానిని మరచిపోయాడు అని అనలేం కదా??!! అతనికి జీవితము గురుంచి పూర్తిగా అర్థం కాకున్నా, ఎంతో కొంత అవగాహన మాత్రం ఉండి ఉంటుంది. ఆ ఉన్న అవగాహనతో తన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి యత్నిస్తూనే ఇంకాస్త అవగాహన సంపాదించడానికై ప్రయత్నిస్తూ వుంటాడు.

Bhãskar Rãmarãju said...

పసిగొడ్డు?? లేక పసిగుడ్డు?

"జీవితం అశుద్ధం" ఇదేదో డీప్గా అలోసించాల్సిందే?

sunita said...

మంచి పరిశీలన!