ఆనంద నిర్వచనం - తీర్థరాముని సందేశం

వివేకానందుని ఆత్మ సిధ్ధాంతాన్ని క్రితం వారం చదువుకున్నాం కదా... ఈ వారం రామ తీర్థుని ఆనంద నిర్వచనాన్ని తెలుసుకుందాం. ముందుగా రామతీర్థులు తెలియని వారిగురించి రెండు పరిచయ వాక్యాలు. రామ తీర్థులు వివేకానందుని బాటలో ప్రపంచ యాటన చేసి హిందుత్వాన్ని, వేదాంత సారాంశాన్ని ఎలుగెత్తి చాటిన మహనీయుడు. ముఫ్ఫై రెండేళ్ళ వయసులోనే మరణించిన ఈతడు తన ప్రసంగాలను బధ్రపరచుకునే ఆసక్తి కూడా లేకపోవటంతో ఎన్నో విలువైన సందేశాలు మరుగున పడ్డాయి.

ఈయన ఆనందం గురించి చెప్పిన ఒక ఉపన్యాస సారాంశం:





ఈ ప్రపంచం మొత్తం వెంపర్లాడేది సంతోషం కొరకేనని మనమందరం ఏకీభవిస్తాం. కొందరు జ్ఞానం కోసమనో, లక్ష్యం కోసమనో వాదించినప్పటికినీ సూక్ష్మంగా గమనిస్తే వారి జ్ఞాన, లక్ష్య సాధన వెనుకన నిగూఢంగా, అంతర్లీనంగా ఆత్మ సంతృప్తి, ఆనందం దాగిఉంటాయి. ఎంత కాదనుకున్నా గానీ మన జీవిత పరమార్ధం ఈ సంతృప్తినీ, సంతోషాన్ని పొందటమే.

ఈ రోజు ఈ ఆనందమన్నది ఎక్కడ నివసిస్తుందో కనుగొందాం. అందమైన భవంతుల్లోనుంటుందో, సౌందర్యవంతులైన ముద్దుగుమ్మల వద్దనుంటుందో, బంగారు ఆభరణాలు, సంపదలలో ఉంటుందో కనుగొందాం.

అసలీ సంతోషం స్వస్థలం ఎక్కడ? మనలో ఒక్కోసారి ఉంటూ, ఒక్కోసారి వీడుతుంది అంటే సంతోషం కూడా ప్రయాణిస్తూనే ఉండాలి కదా. ఈ సంతోషం ప్రయాణాన్ని తెలుసుకునేందుకు ఒక ఉదాహరణగా కధ చెప్పుకుందాం.

అప్పుడే పుట్టిన బిడ్డకు సంతోషం ఎక్కడ లభిస్తుంది? తల్లి కొంగు చాటున, తల్లి ఒడిలో, పాలిండ్లలో. అతగాడి సంతోషం మొత్తం ఈ ప్రదేశాలలోనే తిరుగుతుంది. తల్లి ఒడిలో కొంగుతో ఆడుకునే పసిపాపాయి బోసి నవ్వులను చూడండి. ప్రపంచంలో ఏ ఇతర వస్తువూ, విషయమూ అతనికి అంతకు మించిన ఆనందాన్ని అందించలేవు. పుస్తకాలతనికి అర్ధంకానివి. సంపదలతనికి నిరుపయోగమైనవి. పళ్ళూ, మిఠాయిలూ రుచిలేనివి. అతని సంతోషం మొత్తం తన తల్లి వద్దనే కేంద్రీకరించబడి ఉన్నది.

ఒక సంవత్సర కాలం గడిచింది. ఇప్పుడు ఆ పసివాని ఆనందం ప్రయాణించి ఉండిఉంటుంది. మునుపటిలా అతడిప్పుడు తల్లి వద్ద సంతోషాన్ని పొందలేడు. ఇప్పుడతనికి ఆటబొమ్మలు కావాలి. ఆ ఆటబొమ్మలకై తన తల్లితో పోట్లాడుతాడు కూడా.పోనీ అతని ఆనందం ఈ ఆటబొమ్మల వద్ద నిలచి ఉంటుందా? ఉహూ..! కొన్నేళ్ళకు అతని ఆనందం మళ్ళీ స్థానభ్రంశం చెంది ఉంటుంది.

ఇప్పుడతని ఆనందం కధల పుస్తకాల వెంబడో లేక ఆటలకై తోటి పిల్లలలోనో ఉంటుంది. ఇదివరకు ఆడుకున్న బొమ్మలు అతనికి ఆనందాన్ని ఈయలేవు. పోనీ సంతోషం ఇక్కడితో తన ప్రయాణాన్ని ఆపేస్తుందా? ఉహూ...!

ఈ బడికెళ్ళే బాలుడు కళాశాలకు వచ్చేసరికి అతని ఆనందం తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఇప్పుడతని ఆనందం శాస్త్ర పుస్తకాల వెనుకనో, లేదా అందమైన ఆడపిల్లల వెనుకనో పడుతుంది. కళాశాలనుండి బయటకొచ్చేసరికి అతని ఆనందం ధనం వెనుకనో, ఉద్యోగం వెనుకనో పరుగులెడుతుంది.

ఇప్పుడతని కలలన్నీ సంపదతో స్థిరత్వాన్ని సృష్టించుకోవటం కొరకే. ఇందులోనే అతడు ఆనందాన్ని పొందగలడు. అయితే ఈ సంపదలను పొందిన అతని ఆనందం అక్కడితో విశ్రమిస్తుందా? లేదు... అతనికిప్పుడు ఒక తోడు కావాలి. జీవిత భాగస్వామి కావాలి.

తల్లి కొంగు అతనికిప్పుడు అర్ధరహితమైనది. ఆటబొమ్మలతనిలో ఏ మాత్రం ఉత్సాహాన్ని కలిగించలేనివి. కధలపుస్తకాలు ఆసక్తిలేనివి. తాను చదివిన చదువు, సంపాదించిన ధనం అన్నీ కూడా జీవిత భాగస్వామి లేకుంటే నిరుపయోగమైనవి. స్వఛ్ఛమైన ప్రేమ కోసం, తోడు కోసం అతను తన ఆర్జితాలను సైతం త్యజించగలిగే స్థితికి వస్తాడు.

సరే ఇతనికి తగిన జోడీ దొరికిందనుకుందాం. అతని ఆనందం ఇప్పటికైనా విశ్రమిస్తుందా? లేదే...! పాశ్చ్యాత్తుల సంగతేమో కానీ సగటు భారతీయుని సంతోషం భార్య పైనుంచి బిడ్డకు ప్రసరిస్తుంది. బిడ్డకొరకు భగవంతుని అర్ధించటమేమిటి? ఎంత సంపదనైనా త్యజించటానికి సిధ్ధపడతాడు.

పైన చెప్పుకున్న వృత్తాంతంలో బిడ్డ అతని ఆనందప్రయాణంలో ఆరవ మెట్టు. బిడ్డ పుట్టాక ఆ తండ్రి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతాడు. అతనిలో ఆనందం శిఖరాన్ని తాకుతుంది. ఇక్కడ కాసేపాగి ఆనంద ప్రయాణ విశేషాలని ఒకసారి గమనిద్దాం. ఇక్కడ సూర్య కిరణాలతో ఆనంద ప్రయాణాన్ని పోల్చిచూద్దాం. సూర్యరశ్మి కూడా ప్రయాణిస్తూనే ఉంటుంది. ఒకసారి జపాన్ పైనున్న కాంతి కొద్దిసేపటికి భారత దేశం మీదకు ప్రసరిస్తుంది. మరికాసేపటికి ఆఫ్రికా, యూరోపుల మీదుగా అమెరికాపై పరావర్తనం చెందుతుంది. అచ్చం మన సంతోషం ప్రయాణించినట్లే... అయితే సూర్యకాంతి ప్రతిఫలించిన ఏ ఒక్క ప్రదేశాన్నయినా (జపాన్, భారత్ తదితర దేశాలూ, ఖండాలూనూ) ఆ కాంతి జనకంగా భావించవచ్చునా? లేదు కదా... ఈ కాంతి సూర్యుని యందు జనియించునన్నది నిశ్చయము.

అదే విదంగా సంతోషమన్నది ఒక్కో సమయంలో ఒక్కొక్క విషయముపై ప్రతిఫలిస్తుంది. అంత మాత్రంచేత ఆ విషయమే కాంతి జనకం కాదు.

మళ్ళీ కధలోకి వద్దాం. ఇంతకు ముందు బిడ్డలో బ్రహ్మానందాన్ని పొందిన వ్యక్తి ఆఫీసులో పని చేసుకుంటుండగా ఫోను మ్రోగింది. ఆ ఫోను ఎత్తి విందుడు కదా... అతని హృదయం బ్రద్దలయ్యేంత విషాదకరమైన వార్త. అది ఏమయ్యుంటుంది? అతని మెదడు మొద్దుబారింది. స్పృహ కోల్పోకుండా నిభాయించుకున్నాడు. తక్షణం ఆఫీసు వదలి ఇంటికి బయలుదేరాడు. అతను తన పై అధికారి అనుమతి తీసుకోవాలన్న సంగతి కూడా మరచిపోయాడు. తన సహోద్యోగులకు సైతం ఒక్క మాటైనా చెప్పలేదు. ఎక్కడి పని అక్కడే వదలి వేసి బయలుదేరాడు. బయట తమ యజమాని కనిపించాడు. ఎన్నో రోజులుగా ఓ అయిదు నిముషాలు తన పదోన్నతి గురించి అతనితో మాట్లాడుదామనుకున్నా కుదరటం లేదు. అలాంటిది ఈ రోజు యజమాని తనంతట తానుగా పలకరించినా వినిపించుకోకుండా పరుగున బైట పడ్డాడు. అతడిని ఎరిగిన పోస్ట్ మేన్ ఒక ఉత్తరాన్ని అందించాడు. ప్రాపంచిక విషయాల దృష్ట్యా ఆ ఉత్తరం అతనికి సంతోషం కలిగించాల్సిన విషయం. ఎందుకంటే అందులో అతనికి వచ్చిన కోటి రూపాయల లాటరీ విషయం ఉంది. ఉహూ...! ఇప్పుడతనికి నిష్ఫలం. ఫొనులో అందిన సమాచారం మరింత బరువైనదీ, బాధాతప్తమైనదీనూ.

అతను పరుగున ఇల్లు చేరుకున్నాడు. అతని ఇల్లు దహించవేయబడుతుంది. మంటలు ఉవ్వెత్తున ఎగసి ఆకాశాన్ని తాకుతున్నాయి. తన భార్యనూ, తల్లినీ, మిగిలిన ఆప్తులందరినీ కనుగున్నాడు. కానీ అతని ముద్దుల బిడ్డ అతనికి కనిపించటంలేదు. ఇల్లంటుకున్న ఖంగారులో కోడలి వద్ద ఉందనుకుని తల్లి, అత్త దగ్గర ఉందనుకుని భార్య ఇద్దరూ బిడ్డను లోపలే వదలివేసి వచ్చారు.

అతడు గుండెలవిసేలా రోదిస్తున్నాడు. తన బిడ్డను తెచ్చిన వారికి తన సర్వస్వం ధారపోస్తానని కేకలు పెడుతున్నాడు. నిష్ఫలితం.

ఇక్కడతడు బిడ్డ కొరకు అన్నీ వదలుకోవటానికి సిధ్ధపడుతున్నాడు. అయితే బిడ్డ అతని సంతోషానికి కేంద్ర బిందువా?

బిడ్డ కొరకు అన్నీ త్యజించివేయ బడుతున్నాయి. అయితే బిడ్డ మరేదయినా పరమార్ధం కొరకు త్యజించవేయబడుతున్నాడని ఎందుకు అనుకోరాదు?

సంపదలూ, ఆస్థిపాస్తులూ అన్నీ బిడ్డ కొరకు త్యజించవేయబడేందుకు సిధ్ధమౌతున్నాయి. బిడ్డ కొరకు ఆ మంటల్లో దూకినప్పటికినీ అతడా బిడ్డను కాపాడుకోలేకపోవచ్చును. అయితే ఈ విధంగా త్యాగం చేయబడుతున్న బిడ్డ మరేదయినా పరమార్ధాన్ని అందించనున్నాడా? అదే నిజమైతే ఆ మరేదయినా పరమార్ధమే నిజమైన ఆనంద కేంద్రకం అయి ఉండాలి. అదే అత్మానందం. బిడ్డ కొరకు సంపదలన్నీ త్యజించవేయబడుతున్నాయి. కానీ ఆ బిడ్డ ఆత్మానందం కొరకు త్యజించవేయబడుతున్నాడు. అంటే బిడ్డ అత్మానందం కనుక గొప్ప విషయం కాదు కనుక త్యజించవేయబడుతున్నాడు.

ఆ పసివాని అందమైన నవ్వు మనకు సంతోషదాయకం. ఎందుకంటే మన సంతోషం ఆ నగుమోముపై ప్రసరిస్తుంది కనుక. అంతే కానీ ఆ కాంతి కారకం బిడ్డ కాదు. బిడ్డ సంతోషకారకం అయి ఉంటే బిడ్డ మృతితోనే ఆ తండ్రి సంతోషం అంతమయ్యి ఉండాలి. కానీ అలా జరగదు కదా... ఆ సంతోష కారకం ఏమయ్యుంటింది? బిడ్డ తనకు తానుగా మనకు ఆనందాన్ని ఇవ్వటం లేదు. మన ఆనందం బిడ్డ పై ప్రతిఫలించటం వల్ల ఆ పసివానిలో ఆనందాన్ని పొందగలుగుతున్నాం. భార్య, సంపదలు తమంతట తాముగా ఆనందాన్ని మనకు కలిగించటం లేదు. మన ఆనందం వారిపై ప్రతిఫలించటం వల్ల ఆనందాన్ని వారిలో పొందగలుగుతున్నాం. ఇదే సత్యం.

అందరూ అంటుంటారు. ఫలితాన్ని ఆశించకుండా ప్రేమించమని. కానీ ఇది సాధ్యం కానిది. ఆ ఫలితం కనీసం మన ఆత్మానందం అయి తీరుతుంది.

భార్యా భర్తలు ఒకరికొకరు ఆనందాన్ని పంచుకోలేని నాడు విడిపోతారు. సంపద ఆనందాన్ని కలిగించని నాడు త్యజించవేయ బడుతుంది. రోమ్ చక్రవర్తి నీరో గురించి మీకు తెలిసే ఉంటుంది. అతనికి సంపదలు ఆనందాన్ని కలిగించలేదు. ఫలితం తన పట్టణాన్నంతటినీ తగులబెట్టించి కొండపై ఫిడేలు వాయించుకుంటూ చూసాడు. అతనికి ఆ మహోజ్వాలల దావానలం సంపద కంటే ఆనందాన్ని కలిగించింది.

అయితే మరి ఈ సంతోషం కేంద్రం ఎక్కడ ఉంది? ఈ పాటికి మనలోనే ఉంటుందని గ్రహించే ఉంటారు. అయితే ఎక్కడ ఉంటుంది? మన పాదంలో ఉంటుందా? ఉహూ...! అలా అయితే కాళ్ళు లేనివాడు ఆనందపడకూడదు కదా...! పోనీ చేతులలోనో, కళ్ళలోనో ఉందా? ఉహూ...! ఇదీ నిజం కాదు. కళ్ళు కాళ్ళ కంటే ప్రీతిపాత్రమే కావచ్చు. కానీ సంతోషం అక్కడ కూడా లేదు. అలా అయితే గుడ్డివాళ్ళు కూడా సంతోషపడకూడదు కదా. కళ్ళ కంటే ప్రీతిపాత్రమైనవి ఊహించండి. మీరు ప్రాణం అని చెప్పే అవకాశం ఉంది. అయితే రాముడు సంతోష కేంద్రం మన దేహంలోనే లేదని చెబుతున్నాడు. దేనికంటే ప్రీతిపాత్రమైనది లేదని మనం ఘంటాపధంగా చెప్పగలమో అది సంతోషానికి కేంద్రం అయిఉండాలి. మన ఆలోచన, మెదడు అన్నిటికంటే ప్రీతిపాత్రమైనదని చెప్పేవారికి ఒక వివరణ.

ఇప్పటికిప్పుడు ప్రాణాన్నిస్తావా? లేక మతి స్థిమ్తాన్ని ఇస్తావా? అని ప్రశ్నిస్తే ఎందరు ప్రాణాన్ని ఎవ్వటానికి సిధ్ధపడతారు? ఇక్కడ ప్రాణం కొరకు మతి సైతం త్యజించవేయబడుతున్నది.

అయితే ప్రాణం అన్నింటికన్నా ప్రీతిపాత్రమైనదా? వేదాంతాలు ఈ ప్రాణాన్ని కూడా సంతోష జనకాకంగా పేర్కొనటం లేదు.

రాముడు ఒకసారి మరణావస్థలోనున్న యువకుడిని చూసాడు. అతను పడుతున్న బాధ, నొప్పి ఆపాద మస్తకమూ కనిపిస్తున్నాయి. నొప్పిని భరించలేని అతడు అన్న మాటలివి: "భగవంతుడా! ఈ ప్రాణం నన్నొదిలి ఎప్పుడు పోతుంది?"

అంటే ప్రాణం సైతం ఆనంద జనకం కాదన్న మాట. ఇప్పుడు ప్రాణం కంటే ప్రీతిపాత్రమైనదాని కొరకు ప్రాణం త్యజించవేయ బడుతున్నది. ప్రాణం అత్యంత దగ్గరగా ఉండటం వల్ల అది ఆనంద కేంద్రకం అనుకుంటాం. కానీ అది కూడా ఆనంద కారకం కాదు. ఆ అత్యంత ప్రీతిపాత్రమైనదాన్ని గుర్తించండి. మీ ఆనంద కేంద్రబిందువు అదే. స్వర్గం, నరకం రెండూ నీలోనున్నవే.

పసి పాపాయి తన నీడను పట్టుకునేందుకు ఎంత వెంటబడినా ఆ నీడ చేజిక్కదు. తల్లి ఆ పాపను తన తలను తానే పట్టుకున్నట్లు నేర్పిన క్షణాన ఆ నీడ తన వశమైన భావన ఆ పాపాయిలో కనిపిస్తుంది. ఇది మనకూ వర్తిస్తుంది. ఆనందం కొరకు దేని వెంటో పడకుండా మనలోని ఆనంద కేంద్రాన్ని గుర్తించి పట్టుకుంటే నిజమైన ఆనందం వశమవుతుంది. అప్పుడు మనం నిర్దేశించుకున్న విషయాలపైననే కాక, లోకం సర్వం ఆనందమయంగా కనిపిస్తుంది.

ఒకనాడు ఒకామె తన ఇంట్లో సూదిని పోగొట్టుకున్నది. ఆమె దీపం కూడా లేని బీదరాలు. వీధి దీపం వద్దకు వచ్చి వెతుకుతున్న ఆమెను దారినపోయేవారు ఏం వెతుకుతున్నావని అడిగారు. సూది కోసం అన్న ఆమెను 'ఎక్కడ పోగొట్టుకున్నావ'ని ప్రశ్నించారు. ఇంట్లో నన్న ఆమె సమాధానానికి అందరూ నవ్వగా ఆమె కోపగించుకుంది. ఇంట్లో దీపం లేదు కనుక వీధి దీపంలో వెతుకుతున్నానన్నది ఆమె తర్కం. సరిగ్గా మనమందరం ఇలానే ప్రవర్తిస్తున్నాం. మనలోనున్న సంతోషాన్ని హృదయంలో అంధకారముందని బయటి వెలుగులో వెతుకుతున్నాం.

మరో కధలో ఒక పిచ్చివాడు వీధి పిల్లలందరికీ రాజుగారు మిఠాయిలు పంచిపెడుతున్నారని అబధ్ధం చెప్పాడుట. పిల్లలందరూ నిజమని నమ్మి రాజుగారింటికి వెళ్ళగా అక్కడలాంటిదేమీ లేదని తెలిసింది. అయితే వారితో పాటూ వచ్చిన పిచ్చివాడ్ని చూసి పిల్లలు 'మిఠాయిలు పంచటం లేదన్న విషయం నీకు తెలుసు కదా, మరి నువ్వెందుకొచ్చావ్?' అని ప్రశ్నించగా, ఇంత మంది వస్తున్నారు కదా నిజమయ్యుంటుందేమోనని వచ్చా అన్నాడట.

అలా మనమందరం సంతోషానికి కేంద్రం మన హృదయంలోనే ఉందని తెలిసి ప్రాపంచిక విషయాల్లో వెతుకుతున్నాం.

Lecture delivered on December 17, 1902 in the Academy of Sciences, San Francisco, USA.

11 comments:

durgeswara said...

మహాత్ముల మాటలను చదివించి ఇలా సత్సంగం జరిపినందుకు ధన్యవాదములు.

Malakpet Rowdy said...

Thanks for sharing this. Didnt know much about him before

kalpanrentala said...

swaami raama ani pilichEdi eeyanEna? swaami raama teertha gaari time period istaara dayachEsi?

Kalpana Rentala

బృహఃస్పతి said...

కల్పన గారు, స్వామీ రామ అనేది రామతీర్థుల వారినే. ఈయన 1873లో పాకిస్థాన్ లో (లాహోర్ లేదా పెషావర్) జన్మించారు. గణితంలో పి.జి చేసిన ఈయన లాహోర్ కళాశాలలో అధ్యాపకునిగా ఉంటూ గణితంలో కూడా పరిశోధనలు చేసారు (గణిత పుస్తకాల్లో కూడా ఈయన పరిశోధనలు చోటు చేసుకున్నాయి). చిన్నపటినుండి వున్న వేదాలపై ఆసక్తి తో వివాహానంతరం సన్యసించి, ప్రపంచయాటన చేస్తూ ఉపన్యసించేవారు (ఎక్కువ భాగం కవితలు, పద్య రూపంలో). ఈయన ప్రపంచయాటనలో నయాపైసా కూడా తనతో తీసుకు వెళ్ళకపోవటం ఒక విశేషం. కేవలం కట్టుబట్టలతో జపాన్, అమెరికా, తూర్పు ఆసియా, ఈజిప్టు మొదలగు దేశాలు తిరిగి క్రైస్తవ, ముస్లిం మత పెద్దల సమక్షంలో కూడా ఉపన్యసించారు. చిన్న వయసులోనే 1906 లో ఈయన మరణించారు. మరిన్ని వివరాలను సమయానుకూలంగా వివరించగలవాడను. తతీమా సందేహాలను మీరు నిరభ్యంతరంగా ఇక్కడ అడగవచ్చును.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

ఎరోజుకు కుదిరింది అండీ ఈమహానుభావుని గురించి చదివేందుకు. మీరు మరింత సమాచారాన్ని ఇస్తే ధన్యులం అవుతాం

kalpanarentala said...

Thanks Bruhaspati gaaru. imkokaayana ni koodaa Swami Rama ani pilustaaru. amdukane naku doubt vachchimdi. kaani eeyana gurinchi asalu teliyadu. meeru veelainamta ekkuva samacharam iste chadivi telusukumtaamu.

Regards

kalpana Rentala

బృహఃస్పతి said...

@ చైతన్యా, కల్పన: ధన్యవాదములు. స్వామీ రామ పేరుతో ఎందరున్నారో నాకు తెలియదుగానీ, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్వామీ రామ - రామతీర్థులు ఒక్కరే. ఈయన సందేశాలూ, ఉపన్యాసాలూ 'In woods of God - realization' పేరుతో 7 సంకలనాలలో వచ్చాయి. ఎందుకనో ఇవి ప్రాచుర్యం సంపాదించుకోలేకపోయాయి. వీలయినప్పుడల్లా రాముని ఉపన్యాసాలు అనువదిస్తాను. ఈ వారంతం చాలా మందికి తెలియని ఒక (బహుశా ఏకైక) హిందూ అధ్యాత్మిక విప్లవవాది ని పరిచయం చేస్తాను. తప్పక చదవండి.

Rajasekharuni Vijay Sharma said...

చాలా బాగుంది. అందరూ చదవాల్సిన టపా ఇది. మంచి విషయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

బృహఃస్పతి said...

శర్మగారూ, ధన్యవాదాలు. మీకు నచ్చిందంటే ఆనందంగా ఉంది. సమయానుసారం రామతీర్థుని ఉపన్యాసాలను ప్రచురిస్తాను.

కొండముది సాయికిరణ్ కుమార్ said...

బృహస్పతి గారు - రెంటాల కల్పన గారు చెబుతున్న స్వామి రామ వేరు. ఈయన వేరు.
ఆ స్వామి రామ కూడా మహాయోగి. ఆయన గురించి తెలుసుకోవాలంటే Living with Himalayan Masters అని ఆయన వ్రాసిన పుస్తకము, అలానే ఆయన శిష్యుడు రాజమణి అన్నాయన వ్రాసిన The Eleventh Hour పుస్తకం చదవాలి. ద్వారకాపీఠానికి శంకరాచార్యగా కూడా నియమితులైనా కూడా, కాదని వచ్చేసారు ఈయన.

బృహఃస్పతి said...

సాయికిరణ్ గారూ, స్వామీ రామ గురించి తెలియజేసినందుకు ధన్యవాదములు. ఈ Living with Himalayan Masters పుస్తకం Google లో వెతికితే దొరికింది. తప్పక చదువుతాను. వీటితో పాటూ ఈయన గురించి కొన్ని controversies కూడా కనిపించాయి. నిజానిజాలెలా ఉన్నా Living with Himalayan Masters మంచి విజ్ఞానాన్ని అందిస్తుందని విశ్వసిస్తున్నాను.