విప్లవ తరంగం - రామ్ స్వరూప్

మతాలని విమర్శించే ప్రక్రియలో నాస్తికుల పుస్తకాలను పక్కన పెడితే, కొన్ని మత ప్రభోధాలు కూడా ఇతర మతాలను ఎండగట్టాయి. అయితే ఇతర మతాలను విమర్శించే హిందూ ఆధ్యాత్మిక పుస్తలాలు దాదాపు లేవనే చెప్పాలి. ఇదిగో... సరిగ్గా ఈ లోటుని భర్తీ చేసినవారే రామ్ స్వరూప్. ఈయన రాసిన "A Hindu View of Christianity and Islam" ఆ రెండు మతాలనూ హిందూ ఆధ్యాత్మిక పరంగా విశ్లేషించి విమర్శించింది. ఈయన తూర్పు ఆసియా మతాలను (హిందూ, బౌధ్ధం, జైన, సిక్కు వంటివి) అంతర్గిక అన్వేషణగా(internal quest) పశ్చిమ దేశమతాలను(ఇస్లాం తో కలిపి) సాంఘిక, రాజకీయ కారణాల వల్ల ఉద్భవించినవిగా వర్గీకరించాడు.

ఒక హిందూ ఆధ్యాత్మికవాది ఇతర మతాలపై వ్యక్తం చేసిన సందేహాలు, విమర్శలూ మనకు దాదాపు లేవు. ఇందుకు కారణాలు అనేకం. అలానే నిజమైన హిందుత్వాన్ని పరిచయం చేసే పుస్తకాలు కూడా ప్రపంచ మార్కెట్ లో మృగ్యం. దీనికీ అనేక కారణాలున్నాయి. ముఖ్యమైనది హిందుత్వం మీద పరిశోధనా పుస్తకాలు ఎక్కువగా వెలువరించినది హిందువులు కాని విదేశీయులూ(ఎక్కువగా క్రైస్తవులు)మరియూ విద్యా వ్యవస్థలో భాగంగా మార్కిస్టు దృక్పధానికి అలవాటైన భారతీయ విద్యావంతులూనూ.

వీరు హిందుత్వాన్ని విమర్శిస్తూ రాసిన పుస్తకాలే హిందుత్వాన్ని తెలుసుకోవటం కోసం చదవాల్సిన పుస్తకాలుగా చలామణీ అయ్యాయి. ఎంత విషాదమో చూసారా? ఇక మరో కారణం హిందుత్వ వ్యాప్తిలో పుట్టుకొచ్చిన గురువులూ, స్వామీజీలూ ప్రపంచానికి సనాతన ధర్మానికి బదులు తమ గురువుల సందేశాలనో, యోగాసనాలనో, భక్తి తత్వాలనో ఉపదేశించారు. కాస్తో కూస్తో ప్రచురించబడిన నిజమైన హిందుత్వానికి నిలువుటద్దంలాంటి పుస్తకాలు ప్రచురణ-క్వాలిటీ లేమి తోనో, పబ్లిసిటీ లోపంతోనో ఎవరో అనామకులు రాసిన పుస్తకాలుగా భావింపబడి విస్మరింపబడ్డాయి.

ఇక మన దేశంలో ఉన్న క్రైస్తవ, ముస్లిం విశ్వాసాల దృష్ట్యా ఆయా మతాలను విమర్శించే పుస్తకాలు దాదాపు కనిపించనివ్వవు మన ప్రభుత్వాలు. మతపరంగా హిందువులపై జరిగిన అన్యాయాలు కూడా (మతమార్పిడిలూ, హింస) రాజకీయ ప్రయోజనార్ధం సాంఘిక సమస్యలుగానే చూపించబడ్డాయి. రామ్ స్వరూప్ ఈ విధమైన రాజకీయ కారణాల వల్ల అణచివేయబడ్డ సత్యాన్ని వెలికి తీసి, ఇతర మతాలలోని మంచినీ, చెడునూ నిర్భయంగా విశ్లేషించాడు.

భారతీయ విద్యావంతుల్లో అధికశాతం మంది మరియూ హిందుత్వం పై పరిశోధనలు చేసిన విదేశీయులూ అందరూ హిందుత్వమంటే విగ్రహారాధన, కుల విచక్షణ, సతీసహగమనాలూ, బాల్య వివాహాలూ, వరకట్న చావులూ అన్న చందాన పరిచయం చేసారు. నా ఇదివరకూ వ్యాసాల్లో చెప్పినట్లు 2, 3 శతాబ్దాలకు పూర్వం భారతదేశం అన్న స్పృహే ఉండేది కాదని, అనేక సంస్థానాలుగా, విభిన్న సంస్కృతులతో ఏ కీలుకాకీలువలే వుండేదని భారతీయ విద్యా వ్యవస్థ సైతం ప్రకటించిన నేపధ్యంలో ప్రపంచానికి ఆ విధమైన అభిప్రాయం కలగటంలో తప్పులేదేమో!

ఇతర మతాలను గూర్చి మాట్లాడాల్సి వచ్చినప్పుడు సగటు హిందువు సాధారణంగా అన్ని మతాలూ ఒక్కటేనని, అన్నింటా మంచిని చూడవచ్చని, అన్ని మతాలనూ గౌరవించాలని వ్యక్తీకరిస్తాడు. ఇది హిందువు మిగిలన వారి అభి'మతాలకు' ఇచ్చే గౌరవంగా మనం భావించవచ్చును గాక! కానీ హిందువేతరులు దీనిని హిందువుకు తమ స్వంత మతంపై నున్న అపనమ్మకంగా భావిస్తారు. నిజం...! దీని వల్లనే ఇతర మతస్థులు హిందుత్వాన్ని చులకన చేసే అవకాశం కల్పించబడుతున్నది.

ఇతరమతాలను ఈ విధంగా గౌరవించే హిందువు నిజానికి ఆయా మతాలను సరిగ్గా అధ్యయనం చేసి ఉండడు. (ఎవరికైనా ఈ విషయంలో రామకృష్ణ పరమహంస పై అపోహలుంటే తరువాతి పంక్తులలో వివరించాను). ఇతరమతాలను గౌరవించుకుంటూ పోయే హిందువు ఆయా మతాలు ఏం ప్రభోదిస్తున్నాయో(చాలా వరకు ఆ ప్రభోదాలు హైందవ ధర్మాలకు విరుధ్ధంగా ఉంటాయి) తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో ఇతర మతాలను గౌరవించటం, సహించటం, అలవరచుకోవటం హిందువుకు అలవాటయినాయి.

"అన్ని మతాలూ సమానం కావు. అన్ని మతాలూ ఒకే విధమైన మంచిని ప్రభోదించలేదు" ఇదీ రామ్ స్వరూప్ వెలిబుచ్చిన అభిప్రాయం. అన్ని రకాలయిన నీళ్ళూ ద్రవ రూపంలోనే ఉంటాయి. అయితే అన్నీ తాగేందుకు పనికిరావు. చూసేందుకు ఒకేలా కనిపించినా, త్రాగే నీటిని జాగ్రత్త వహించి గుర్తించాలి. ఇప్పుడు రామకృష్ణ పరమహంస వద్దకు వద్దాం. ఈయన వివేకానందుని గురువుగా మనందరికీ తెలుసు. వీరు 'అన్ని నదులూ సముద్రంలో కలసిన విదంగా అన్ని మతాలూ చేర్చేది ఆ భగవంతుని వద్దకే' అని నినదించి మూడు దినాలు అత్యంత నిష్టతో సాంప్రదాయ ఇస్లాంని ఆచరించారు. ఇదే విధంగా క్రైస్తవాన్ని అనుభవించి హృదయంలో క్రీస్తుని దర్శించారు. ఇక హిందుత్వాన్ని ముఫ్ఫై ఏండ్ల పైబడి బహు నిష్టతో ఆచరించారు. వీరు సమాజాన్ని మతావసరాలతో ముడి వేసి అన్ని మతాలూ చేర్చేది భగవంతుని వద్దకే అన్నారు తప్పితే నిజమైన ఆధ్యాత్మికతను గుర్తించటంలో అన్ని మతాలూ సమానమేనని ఏనాడూ చెప్పలేదు. పరమహంస ఉద్దేశ్యం ప్రకారం మనుషులందరిలోనూ మంచి ఉన్నట్లు, అన్ని మతాలలోనూ మంచిని కనుగొనవచ్చునని. అంతే!

మిగిలిన మతాలు హిందుత్వం గుర్తించిన అత్యున్నత విషయాలను విస్మరించాయి, విభేదించాయి. హిందుత్వంలోని కర్మ, పునర్జన సిధ్ధాంతాలూ మిగిలిన మతాలు ఎరుగనివి. మన జన్మ సిధ్ధాంతానికి విరుధ్ధంగా క్రైస్తవం, ఇస్లాం - స్వర్గం, నరకాలను నిర్వచించాయి. హిందుత్వం అత్యున్నత లక్ష్యాలుగా ఆత్మ స్పృహని, భగవంతునితో ఐక్యతనూ నిర్వచిస్తే, మిగిలిన మతాలు మానవుడిని భగవంతుని సేవకునిగానే నిర్దేశించాయి. హిందుత్వం మహోన్నత లక్ష్యమైన ఆధ్యాత్మికతకు మార్గంగా క్రమశిక్షణతో కలిగిన ధ్యానం, యోగాలను నిర్వచిస్తే, మిగిలిన మతాలు ప్రార్ధనలను, సమాజ సేవను, ఇంకొంచెం ముందుకు పోయి మతమార్పిడులనూ ప్రోత్సహించాయి(జాగ్రత్తగా చూస్తే ఇవన్నీ దేవునికి ఇచ్చే లంచాల వలే లేవూ?).

హిందూ ఆధ్యాత్మికత వ్యక్తిగతమయ్యింది తప్పితే సంఘ ప్రయోజనలాతోనో, సేవలతోనో, సామూహిక ప్రార్ధనలతోనో ముడి పెట్టబడలేదు. చరిత్ర చూస్తే ఇతరమతాలలో ఇలా వ్యక్తిగత ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిచ్చినవారు మతం నుండి వెలివేయబడ్డారు. లేదా అతి తక్కువ శాతంలో మిగిలి విస్మరింపబడ్డారు.

మన ఆది వేదమైన ఋగ్వేదం ప్రవచించిన మొట్టమొదటి ప్రవచన సారాంశం "సత్యం ఒక్కటే.. అది వివిధ రూపాలను సంతరించుకుంటుంది" అని. ఇది "అల్లా తప్ప వేరే దేవుడు లేడ"నియో, "మహ్మద్ ప్రవక్త చిట్టచివరి ప్రవక్త" అనియో "కేవలం క్రీస్తు మాత్రమే భగవంతుని కుమారుడు" వంటి ప్రభోదాలు చెప్పలేదు.

పైన చెప్పిన ఇతర మత సిధ్ధాంతాలు ఆయా మతస్థుల చుట్టూ ఒక గిరి గీస్తే, హిందుత్వం "సత్యం ఒక్కటే.." నంటూ మానవుడిని స్వేఛ్ఛా జీవిని చేసింది. అయితే "సత్యం ఒక్కటే" నన్న నిజమైన సత్యం మనచే అపార్ధం చేసుకోబడి అన్ని మతాలూ ఒక్కటే నన్న భ్రమలోనికి నెట్టాయి. హిందువు అన్ని మతాలలోనూ మంచి ఉన్నదని ఒప్పుకొనటం ద్వారా, మిగిలిన మతాలకు తెలియని - హిందుత్వంలో కనుగొనబడిన సత్యాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి ని ప్రపంచానికి సన్నగిల్లేలా చేసాడు. దీని వల్లనే హిందుత్వంలోనున్న వర్గాల ప్రాముఖ్యత - అవసరాలూ, విగ్రహారాధన ముఖ్యోద్దేశాలూ, కుల వర్గీకరణకు మూల కారణాలు, సంస్కృతి, భూమి, వృక్ష, జంతుజాల, ప్రాణికోటి పరిరక్షణ సిధ్ధాంతాలూ ప్రపంచానికి అర్ధం కాకుండా పోయాయి.

వీటన్నిటినీ రామ్ స్వరూప్ సమర్ధవంతంగా ఎత్తి చూపాడు. ఈయన యోగ, ఆధ్యాత్మికతలతో నిండిన హిందూ ధార్మిక ఆచారాలకూ, మిగిలిన మత విశ్వాసాలకూ గల భేదాలను తన "A Hindu View of Christianity and Islam" పుస్తకంలో విడమరచి చెప్పాడు. ఇతని రచనలు స్పష్టంగా సూటిగా ఉంటాయి తప్పితే సమాజ శ్రేయస్సునో లేక మరేదయినా ప్రయోజనాలనో ఆశించి నిజాలను దాచే విధంగా ఉండవు. రామ్ స్వరూప్ క్రైస్తవ, ఇస్లాం మాధ్యమాలనుండి (ఖురాను, బైబిలు) యధాతధంగా తీసుకున్న విషయాలను తార్కికంగా విశ్లేషించి లోటుపాట్లను ఎత్తి చూపాడు. ఈయన శైలి ఇతర మతాలపై హిందువు స్పందనలా ఉండదు. ఈ ప్రపంచానికి సంబంధం లేని ఒక మనిషి భవిష్యత్తు అవసరాల నిమిత్తం అన్ని మతాలపై పరిశోధన చేసి మానవాళి శ్రేయస్సుకై హిందుత్వాన్ని సిఫార్సు చేసినట్లు ఉంటుంది.

అయితే దురదృష్ట వశాత్తూ మనదేశంలో మైనారిటీల విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని ఈయన పుస్తకం నిషేదింపబడింది. (ఈ పుస్తక బహిష్కరణకు కారణమైన వర్గమే గతంలో సల్మాన్ రష్దీ "satanic verses" నిషేదానికి కారణమయ్యింది. మరో విషయం ఏమిటంటే "satanic verses " పుస్తకాన్ని నిషేదించిన మొట్ట మొదటి దేశం భారత దేశం)

ఈ పరిస్థితులను చూస్తే మన దేశంలో హిందుత్వాన్ని విమర్శించేందుకు, దూషించేందుకు ఏ విధమైన అవరోధాలూ, ఆటంకాలూ ఉండవనిపిస్తోంది. భగవంతుడిని చిల్లరగాళ్ళన్నా, పురాణ పురుషుల మధ్యన గల సంబంధాలను వక్రీకరించినా, అభ్యంతరకరమైన విధంగా హిందూ దేవుళ్ళ చిత్రాలు సృష్టించినా, తిట్టినా, తగులబెట్టినా దేనికీ అడ్డు ఉండదు. మిగిలిన మతాలపై ఇలాంటి సాహసం ఎవ్వరూ చెయ్యరు. చేసినా గట్టి వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితులలోనే రివర్స్ గేర్ వేసిన ఏకైక(ప్రాముఖ్యత కలిగిన) హిందుత్వవాది రామ్ స్వరూప్.

మన దౌర్భాగ్యం - హిందూ దేశమైవుండీ, హిందుత్వ సంరక్షణలో భాగంగా వెలువడిన ఇటువంటి పుస్తకాలు బహిష్కరింపబడటం. హిందువు గోడు ఇక్కడనే గొంతు నొక్కబడితే, ఇంకెక్కడ వెలువడుతుంది చెప్పండి? మనదేశంలో మతసహనలేమికి(హిందుత్వానికి మినహాయింపు) ఈ నిషేదం చక్కని ఉదాహరణ. దీనికి నిజమైన కారణం ఏమిటో తెలుసునా? పరిపక్వత కలిగిన సంస్కృతీ, ఆ సంస్కృతికి చెందిన మనుషులూ - నిందలనూ, ఆరోపణలనూ, విమర్శలనూ హూందాగా స్వీకరిస్తారు. వీటిని హూందాగా స్వీకరించలేని మతం పరిణితి చెందినది కాదు. ఈ అపరిపక్వత వివేకాన్ని నాశనం చేస్తుంది. క్రీస్తును గానీ, క్రైస్తవాన్ని గాని విమర్శించిన క్రైస్తవుడు మతం నుండి వెలివేయబడతాడు. అతడు క్రైస్తవునిగా పిలవబడడు. అదే విధంగా ఇస్లాం ని విమర్శించిన ముస్లిం, ముస్లింగా పిలవబడే అర్హత కోల్పోతాడు. కానీ హిందువో? ఎంత తిట్టినా అతను హిందువుగానే గుర్తింపబడతాడు.

మన సనాతన హిందూ ధర్మ గ్రంధాలు సైతం విభేధాలు వచ్చినప్పుడు ముఖాముఖీ చర్చల్లో పోటీ పడినట్లు చెబుతాయి. హిందుత్వం వేల ఏళ్ళుగా వివిధ వర్గాలనూ, సంస్కృతులనూ - ప్రశ్నించి, విభేదించి, తర్కించి, చర్చించి వివేకాన్ని, విజ్ఞానాన్ని పెంపొందించుకుంది. సంఖ్యా శాస్త్రాలలోనూ, వేదాంతాల పరంగా, ఆచారపరంగా వైరుధ్యం కనిపించినప్పుడు హిందుత్వంలోని ఆయా వర్గాలు ముఖాముఖీ చర్చించుకునెడివి తప్పితే నిషేదమనో, బహిష్కరణయనో ప్రతిపాదించలేదు(ఉదాహరణకు శైవ, వైష్ణవ విభేదాల సమయంలో ఆది శంకరాచార్యుడు ఇలాంటి చర్చల్లోనే పాల్గొనేవాడు).

ఎవరి అహమో, ఏదయినా వర్గం విశ్వాసం దెబ్బతింటుందని తమ సందేహాలను దాచుకొననూలేదు. హిందుత్వంలో సత్య శోధన బాహాబాహీగానే ప్రతి ఒక్క విషయాన్ని ప్రశ్నించుకుంటూ జరిగింది.

సైన్సు కూడా ఈ విధంగా అభివృధ్ధి చెందినదే. ఓ సారి మతాల పరిస్థితిని సైన్సు కి అన్వయించుకుంటే ఎలా ఉంటుందో చూడండి. అన్ని మతాలూ మంచివే అనుకున్నట్లు అన్ని సైన్సు సూత్రాలూ సరియైనవే అనుకోవాలి (అవి విభేదించుకున్నా కూడా). మైనారిటీ సైంటిస్టులకు ప్రత్యేక హోదాలూ, వారి సిధ్ధాంతాలకు ప్రత్యేక గౌరవాన్ని కల్పించాలి. మెజారిటీ సైంటిస్టులు ఈ మైనారిటీ సైంటిస్టుల సిధ్ధాంతాలలో హేతువును ప్రశ్నించకూడదు.

చూసారా ఎంత అస్తవ్యస్తంగా ఉందో? ఈ తరహా ఆలోచనా విధానం ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ఓట్లకోసం అమలౌతున్నంత వరకూ మనం సత్యానికి చేరువ కాలేము. రామ్ స్వరూప్ ఈ రాజకీయ పరిస్థితులను సవాల్ చేస్తూ చేసిన కౌంటర్ attackవెలుగు నోచుకోలేకపోయింది.

(ఈ నిషేదింపబడిన విప్లవాత్మకమైనపుస్తకం చదవాలనుకుంటున్న వారు EBookకై ఇక్కడ click చేయండి)

హిందుత్వం అన్నది దేశ సరిహద్దులతో సంబంధం లేకుండా మానవాళి మొత్తం పంచుకోవాల్సిన సత్య సందేశం. ఇది నమ్మకాలనూ, విశ్వాసాలనూ, అధికారాలనూ, విద్యావిధానాలనూ, గ్రంధాలనూ మించిన సత్యం. ఈ సత్యాన్ని కనుగొనండి.

6 comments:

Anonymous said...

good information...

Krishna K said...

చాలా బాగా వ్రాసారు. పుస్తకాన్ని చదవాలనిపిస్తుంది.

మీ బ్లాగ్ template, అక్షరాల సైజులు బాగున్నాయ్యి. ఏ template వాడుతున్నారో, ఎలా customize చేసారో వీలయితే చెప్పండి.

బృహఃస్పతి said...

@కృష్ణా: ధన్యవాదములు. పుస్తకం చదవండి. ఆసక్తికరంగా ఉంటుంది. ఇక నా బ్లాగు విషయానికొస్తే 'Jelly fish' అన్న template వాడుతున్నాను. అయితే Edit HTML option ద్వారా post frame పెంచి, side bar alignments మార్చి ఈ విధంగా తయారు చేసాను. మీరు కూడా edit html ద్వారా ప్రయత్నించి చూడండి. పెద్ద కష్టమేమీ కాదు. preview ఉంటుంది కనుక ఎప్పటికప్పుడు allignment చూసుకోవచ్చు. మీకు ఇంకా కష్టంగా అనిపిస్తే మీ email id ఇవ్వండి. sample code పంపిస్తాను

Subba said...

Sir,
Mee blog eemadhyane chadavadam modalu bettanu. Mee blog chaala goppa patalu nerputhundi sir. Thank you very much.

Nenu aa book download cheyalanukonte, delete chesaru ani vasthundi. Meeru daya chesi dr.subba@hotmail.com ku konchem post cheyagalara.

thank you sir.

బృహఃస్పతి said...

సుబ్బ (!?) గారు,

మీరు అడిగిన పుస్తకాన్ని ఈ క్రింద పొందవచ్చు.
http://www.mediafire.com/?qjcnmmgj1jc

Info said...

బృహస్పతి, నువ్వెవరో నాకు తెలీదు. కాని ఎన్నాళ్ళ నుండో నేను చెయ్యాలనుకొని సందేహిస్తున్న పనిని మీరు చేశారు. సెహభాష్. నా ధన్యవాదాలు. రాం స్వరూప్, సీతారాం గోయల్, కూన్రాడ్ ఎల్స్ .. వీరందరి పుస్తకాలను నేను ఎక్కువగా చదువుతాను. ధైర్యంగా ముందడుగు వేసినందుకు నా అభినందనలు. ఒక హిందూ విప్లవ తరంగం గూర్చి అద్భుతంగా వర్ణించినందుకు కృతజ్ఞతలు. ఇప్పటి నుండి క్రమం తప్పకుండా మీ బ్లాగును అనుసరిస్తాను. నా ప్రమాణం.