విస్మరింపబడిన వివేకుని విశ్వసందేశం

'వివేకానందుడు' - ఈ పేరు వినగానే భరతమాత పులకిస్తుందనటం అతిశయోక్తి కాదేమో! అయితే ప్రస్తుత ఆధునిక యాంత్రిక జీవనంలో ఎంత మందికి వివేకుని ఆదర్శాలు తెలుసు? అతడు ప్రపంచానికి ఏమి చెప్పాలనుకున్నాడో నేటి విద్యావిధానాలు ఎలాగూ అందించవు. ఆసక్తితో తెలుసుకోవాలనుకునే వారికి వందలకొద్దీ పేజీలతోనున్న పుస్తకాలు డీలా పరుస్తాయి. అందుకే క్లుప్తంగా వివేకానందుని ఆదర్శాలు తెలుసుకుందాం.


1893 కాలంలో ప్రపంచానికి వివేకానందుడు ఇచ్చిన సందేశం ఏమయ్యుంటుందో అలోచించారా?

అధిక శాతం పశ్చిమ దేశస్థులు ఆ సందేశాన్ని ఒక అద్భుతమైన యోగా సిధ్ధాంతాల పరిచయంగా పేర్కొంటారు. భారతీయులు ప్రపంచానికి పరిచయం చేయబడ్డ నిజమైన హిందుత్వంగా భావిస్తారు. మరికొంత మంది వివేకానందుడు తన గురువు రామకృష్ణ పరమహంస కోరిక మేరకు ఒక విశ్వ మతాన్ని సృష్టించే ప్రయత్నమంటారు. వీరందరి అభిప్రాయాల్లో కొంత నిజమున్నప్పటికినీ స్వామీ వివేకానందుడు చెప్పదలుచుకున్న నిజమైన సందేశం ఇవి కావు.

కొంత మంది కమ్యూనిస్టులూ, క్రైస్తవులూ మరో అడుగు ముందుకేసి, స్వామిని తమ ధృక్పధం నుంచి చూడ ప్రయత్నించారు. వీరు వివేకానందుని సంఘసంస్కర్తగా, అణగారిన, వెనుకబడిన వర్గాల ఉధ్ధరణకు నడుంబిగించిన వ్యక్తిగా (హిందుత్వ వ్యతిరేక ముద్రతో) వారికి అనుకూలమైన దృష్టిలో చూసారు. అయితే వీరి వాదనలకు అంతగా ప్రాముఖ్యత లభించలేదు.

స్వామి యోగా ని ప్రవచించటం నిజమే! కానీ అతని ముఖ్యోద్దేశం అది కాదు. స్వామి పేర్కొన్న భౌతిక యోగాసనాల వల్ల తమకు ‘లాభం' ఉంది కనుక అవి మాత్రమే ప్రపంచ ప్రాచుర్యం పొందాయి. ఇప్పటికినీ పశ్చిమ దేశాల్లో యోగా భోధకులు, స్వామి ఫొటొ పెట్టుకుని, కేవలం యోగాసనాలకే ప్రాచుర్యం కల్పిస్తూ లబ్ది పొందుతున్నారు.

వివేకానందుడు పరిచయం చేయ సంకల్పించింది అత్యుత్తమ మానవీయ విలువలతో కూడిన వేదాంత సారాంశం, ఆత్మ, సత్య శోధనా విధానాలూనూ. వీటిని ఇప్పుడు సమీక్షిద్దాం!

జ్ఞానయోగం: వివేకానందుడు వేదాంతాలు చాటి చెప్పిన 'అహం బ్రహ్మస్మిః' (నేనే దేవుడను) సిధ్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసాడు. వేదాంతాల ప్రకారం అన్ని శాస్త్రాల, మతాల పరమార్ధం జ్ఞాన సముపార్జన. జ్ఞానం అంటే ప్రకృతిలోనూ, విశ్వంలోనూ, అన్ని భౌతిక పదార్ధాలలోనూ ప్రవహించే అవిభాజ్యమైన, అఖండమైన ఆత్మ స్పృహను గుర్తించటం.

వివేకానందుడు ముఖ్యంగా ప్రవచించిన జ్ఞానయోగం ఈ విధమైన వేదాంతసారాన్ని అందిస్తుంది కానీ భౌతిక యోగాసనాలను కాదు.

భక్తియోగం: ఇది కూడా ఒక ముఖ్యమైన అవసరంగా వివేకానందుడు పేర్కొన్నాడు. ఇందులో హిందూ దేవుళ్ళయిన శివుడు, పరాశక్తి స్తోత్రోఛ్ఛారణలకు, ఓంకారానికి గల ప్రాముఖ్యతలను విశదీకరించాడు. (అయితే భారత దేశానికి చెందిన మరొక ఆధ్యాత్మికవాది తీర్థ రాముడు కొంత మేరకు ఈ భక్తి యోగతో విభేదించాడు. ఈయన భోధనలు కూడా బహు ఆసక్తి కరంగా ఉంటాయి. తీర్థ రాముని గురించి పూర్తి వివరాలు రాబోయే టపాల్లో తెలుసుకుందాం.)

రాజయోగం: ఇది సూక్ష్మ గ్రహణత పెంపొందించుకునేందుకు నిర్దేశింపబడినది. రాజయోగం ప్రకారం, మనసుని, సంకల్పాన్ని ఆధీనంలో ఉంచుకోవటం ద్వారా ఆత్మ విశ్వాసాన్ని, తద్వారా వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవచ్చును. ఏకాగ్రతకు సంబంధించిన వివేకానందుని అనుభవాలు ఈ రాజయోగం వర్గానికి చెందినవి.

కర్మయోగం: ఇది శ్రమనుద్దేశించినది. ఇందులో నిరంతర శోధన, మనిషిలోని అంతఃశక్తి నిర్వచింపబడినవి. ఫలితాన్ని ఆశించకుండా ఆచరించాల్సిన బాధ్యతలు, కార్యాలు ఈ కోవలోనికి వస్తాయి.

హఠయోగం: ఆరోగ్య సిధ్ధికై ఉపయోగ పడే భౌతిక ఆసనాలు(ప్రాణాయామం మొదలైనవి) ఈ కోవలోనికి వస్తాయి.

వివేకుడు అందించిన మిగిలిన యోగాలతో పోల్చి చూస్తే హఠయోగం అల్ప ప్రాముఖ్యత కలిగినది. జ్ఞాన, భక్తి, రాజ, కర్మ యోగాలను ఆచరించిన వారు తమ క్రమశిక్షణనూ, ఆరోగ్యాన్నీ ఆధీనంలో ఉంచుకుని తద్వారా మనో నిబ్బరాన్ని పొందేటందుకు ఉద్దేశించబడినదీ హఠ యోగం.

అయితే దురదృష్టవశాత్తూ అత్యుత్తమ యోగసాధనాలను విడిచి పెట్టి, ప్రపంచం ఆరోగ్యపరంగా తమకు లబ్ది చేకూర్చే హఠయోగాన్ని మాత్రమే అక్కున చేర్చుకుంది.

ఈ విధమైన వివేకానందుని పూర్తి జీవితం, అత్యుత్తమ హిందూవేదాల ఆధ్యాత్మికతకు దర్పణం. ఇతడు తన ఆధ్యాత్మిక భోధనలతో హిందువులను ఉత్తేజపరచి హిందూ ఆచారాలకూ, సంస్కృతికీ గౌరవం దక్కేలా కృషి చేసాడు. వేద, పురాణ, ఉపనిషత్తుల, చారిత్రాత్మక, ఇతిహాస, తంత్ర్యాలతో కూడిన ఇతని తర్కాలూ, ఉపన్యాసాలు హిందూ సంస్కృతి మొత్తాన్నీ ఒక్క తాటి పై తీసుకురాగలిగాయి. వివేకానందుని కాలానికే చెందిన ఎంతో మంది మహానుభావులూ, అభ్యుదయవాదుల వలే ఇతను తన హిందుత్వ జాతీయతను దాచుకోలేదు. ఆసియాలోని మిగిలిన ఆధ్యాత్మిక సంస్కృతులకంటే, పశ్చిమ దేశాల సంస్కృతులకంటే ఎంతో ఉన్నతమైన హిందుత్వ విలువలను ఎలుగెత్తి చాటాడు.

భారతీయులకు స్నేహ హస్తాన్నందించమని ప్రపంచాన్ని అభ్యర్ధించిన వివేకుడు, ఆ సహాయాన్ని ఆర్ధికపరమైన, మౌళిక విషయాలకు పరిమితం చేసాడు తప్పితే ఆధ్యాత్మిక, మతపరమైన విషయాలకై కాదు. (వీటిని కొంత మంది అనుకూలవాదులు వివేకానందుడు భారత దేశ సాంఘిక దురాచారాలను రూపు మాపటానికై ప్రపంచాన్ని అర్ధించాడన్న రకాన కధలల్లారు.)

హిందూ సందేశాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్న తపనతో ప్రపంచం నలుమూలలా ప్రయాణించి, మన సంస్కృతి విలువలనూ, ఆధ్యాత్మిక భోధనలనూ చాటి చెప్పాడు. వివేకానందుడు విభేదించిన కుల, లింగ విచక్షణ మరియూ సాంఘిక దురాచారాలు వేదాంత పరిధిలో వ్యక్తమైనవే తప్పితే, వామపక్ష్యవాదులూ, క్రైస్తవులూ పేర్కొనేటట్లు హిందూ వ్యతిరేకతతో కాదు. హిందూ సాంఘిక దురాచారాలను రూపుమాపటానికి వివేకానందుడు ఏనాడూ, ఏ ప్రపంచ సాయం ఆశించలేదు. తన తత్వాలను, తర్కాలను ఇతరులతో పంచుకుని ఆనందపడ్డాడే తప్ప, వారిపై రుద్దటానికి ప్రయత్నించలేదు.

వివేకుడు విశ్వమానవుడు. అన్ని మతాల వెనుకా, అన్ని తత్వాల వెనుకా, అన్ని శాస్త్రాల వెనుకా, ఉన్న సత్యం ఒక్కటేనని భోదించాడు. ప్రపంచంలో ఇతర మతాలనందు కనిపించిన మంచిని వివేకుడు సంతోషంగా అంగీకరించాడు. ఈయన భోధనల్లో బౌధ్ధ, క్రైస్తవ, ఇస్లాం మతాలలోని ఉన్నతమైన సారాంశాలు కూడా చోటు చేసుకున్నాయి. పశ్చిమదేశాల శాస్త్రీయతనూ, తర్కాలలోనున్న నిబధ్ధతనూ, గొప్పదనాన్ని నిస్సంకోచంగా ఒప్పుకున్న వివేకానందుడు స్వేఛ్ఛాయుతమైన ఆలోచనలను ఎల్లప్పుడూ గౌరవించి ఆదరించాడు.

అయినంతమాత్రాన స్వామి ఇతరమతాలను హిందుత్వంతో సమానంగా స్వీకరించాడనుకోవటం పొరపాటే. స్వామి పశ్చిమదేశాలలోని క్రైస్తవ మతాధికారాలను నిర్భయంగా ప్రశ్నించాడు. ఇవి ఆయా దేశాలలో వివాదాస్పదం కూడా అయినాయి. భారతదేశంలో మిషనరీలు చేసే మతమార్పిడిలను నిర్భీతిగా అడ్డుకున్నాడు. ఇస్లాం మత సోదరభావాన్ని అంగీకరిస్తూనే మహ్మద్ ప్రవక్తను ప్రశ్నించాడు. ఇస్లాం మతవ్యాప్తిలో భాగంగా హిందువులపై శతాబ్దాల తరబడి జరిగిన హింసాకాండను ఖండించాడు. మతాలకు అతీతంగా బ్రతికే కొందరు యూరోపియన్ల భౌతిక స్వార్ధపరాయణత్వాన్ని, అవకాశవాదాన్ని విమర్శించాడు.

వివేకానందుడు ప్రకటించిన విశ్వమతం ఆధునీకరణం చేయబడిన హిందుత్వ వేదాంతాల యొక్క సత్య సారాంశం. ఈ విశ్వమత ప్రతిపాదనలో స్వామి హిందుత్వాన్ని త్యజించలేదు. మతాలకు అతీతంగా ఆచరణ సాధ్యమైన అత్యుత్తమ ఆధ్యాత్మిక వేదాంతాన్ని మానవాళికి పరిచయం చేయ సంకల్పించాడు.

హిందుత్వాన్ని అన్ని మతాలకూ మాతృమూర్తిగా అభివర్ణించాడే తప్ప మిగిలిన మతాల గాటిన కట్టలేదు. ఏ సంస్కృతినైనా తనలో కలుపుకోగలిగిన విశాల మనస్వినిగానే హిందుత్వాన్ని గర్హించాడు.

వివేకుని ప్రకారం, వేదాంతం అన్నది మేధావులో, ప్రపంచానికి వేరుగా జీవించే సాధువులో మాత్రమే ఆచరించేది కాదు. ఆచరణీయమైన వేదాంతాన్ని, ఆత్మ స్పృహ కొరకు నిత్యజీవితంలో సగటు మానవుడు అభ్యసించగలిగే శాస్త్రంగా పేర్కొన్నాడు. ఈ ఆచరణయోగ్యమైన వేదాంతం స్వేఛ్ఛాయుత ఆలోచన, వ్యక్తిత్వ వికాసంలతో కూడి ఎదుటివారిలో దైవత్వాన్ని గుర్తించగలిగినది.

ఈ సిధ్ధాంతం ప్రకారం, ఏ ఒక్కరూ బలహీనులు కారు. 'నేను' అంటే ఈ భౌతిక దేహమో, మన అలోచనో కాదు. 'నేను' అనునది ఒక ఆత్మనో, భగవంతుని బిడ్డనో కూడా కాదు.

'నేను' అనునది 'భగవంతుడు'. ఇంకా స్పష్టంగా భగవంతుని కంటే గొప్పవాడు. భగవంతునికన్నా గొప్పదైన శక్తికి విభాజ్యత ఉండదు. కనుకనే మనుషులందరిలోనూ, సృష్టి స్థితిగతులలోనూ, ప్రకృతి లయజతులలోనూ, విశ్వంలోనూ అవిభాజ్యంగా అఖండితంగా ప్రవహిస్తున్న 'నేను' ఒక్కటే! దీనికి బహువచనం లేదు.

ఈ సత్యం అర్ధమయ్యేందుకు ఓ చిన్న కధ చెప్పుకుందాం:

ఒక పసివాడు అద్దంతో ఆడుకుంటున్నాడు. ఆ అద్దం క్రిందపడి ముక్కముక్కలయ్యింది. పిల్లవాడు పాకురుకుంటూ వెళ్ళి చూడగా, ప్రతి ముక్కలోనూ అతని దరహాస ప్రతిబింబం కనిపిస్తోంది. అతనికి ఎన్నో 'నేను'లు కనిపిస్తున్నారు. ఆ పసివాడు తన చేష్టలతో వారందరితోనూ ఆడుకుంటున్నాడు. అందులో కనిపిస్తున్న వారందరూ తానొక్కడినేనన్న సత్యం తల్లి చెప్పినా కూడా అర్ధం కాదతనికి. సరిగ్గా ఈ పసివాని మాదిరిగానే మనమందరం మనలో ప్రవహించే 'నేను' ఒక్కటేనన్న సత్యాన్ని గ్రహించలేకున్నాం.

మనుషులందరిలోనూ, పశుపక్ష్యాదులలోనూ, వృక్షాలలోనూ, సృష్టి స్థితిగతులలోనూ, ప్రకృతి లయజతులలోనూ, విశ్వంలోనూ, కాలంలోనూ అవిభాజ్యంగా అఖండితంగా ప్రవహిస్తున్న 'నేను' ఒక్కటే! దీనికి బహువచనం లేదు. ఇది లేని ప్రదేశం లేదు. దీనికి చావు పుట్టుకలు లేవు.

మన జీవిత పరమార్ధం ఈ 'నేను'ని గ్రహించటంలోనే ఉన్నది తప్పితే భౌతిక వాంఛలలోనో, ఈ అధికార, వస్తు వ్యామోహాలలోనో కాదు. వేదాంతాలలోని, హిందుత్వలోని ఉన్నత విలువలను నేటి ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా చెప్పిన స్వామీ వివేకానందుడు ఈ ప్రక్రియలో దేనికీ తలవంచక, రాజీ పడక నిర్భయంగా సత్యాన్ని ప్రకటించాడు. సంస్కృతంలో పాండిత్యం సంపాదించిన ఈతడు, సంస్కృతంలో లిఖించబడిన ఎంతో విలువైన, మహోన్నతమైన వేదాంత సారాన్ని సామాన్య మానవునికి అర్ధమయ్యే రీతిలో వర్ణించాడు.

వివేకానందుని గౌరవించటం అంటే తరతరాల మన హిందుత్వాన్ని గౌరవించుకున్నట్లే!

7 comments:

చింతా రామ కృష్ణా రావు. said...

వికాసం లో వివేకానందుని హృదయాన్ని ఆవిష్కరించెడి బుద్ధిలో బృహస్పతీ! అభినందనలు.జ్ఞానులు మాత్రమే జ్ఞానోజ్వలమైన అంశాల్ని స్పృశించ కలరి. అట్టి వారిలో మిమ్ములను చూడ గలగడం మా అదృష్టం.
మీరు వ్రాసినది హత యోగము కాదనుకొటాను, హఠ యోగమనుకొంటాను. సరిచేయ వలసి ఉందేమో చూడ గలరు.
శా:-
ఆనందంబయె మీ వికాసమరయన్.అత్యద్భుతంబౌ వివే
కానందామృత వాక్ప్రవాహమహతిన్ కానంగ జేయంగ మీ
రేనాడో కృతపుణ్యమూర్తులగుటేఈనాటి మా భాగ్యమౌన్.
జ్ఞానంబందుబృహస్పతీ!రచన సత్జ్ఞానంబు సూచించెగా!
భవదీయుడు.

బృహఃస్పతి said...

రామకృష్ణారావు గారు, మీ స్పందన నన్నెంతగానో ఉత్తేజితుడను చేసింది. మీ స్పందన వివేకానందునికి దక్కిన గౌరవం. పదుల సంఖ్యలో, వందల కొద్దీ పేజీలతో నున్న వివేకుని గ్రంధ సందేశసారాన్ని ఒక్క పేజీలో పంచిపెట్టగలనో లేదో నని భయపడ్డాను. మీరా భయాన్ని పటాపంచలు చేసారు. అక్షరదోషాన్ని మీరు చెప్పిన తరువాత గుర్తించి సరిదిద్దాను. ధన్యవాదములు.

durgeswara said...

ధర్మజాగరణలో మీ కృషి ,శ్రమ అభినందనీయము . ధన్యవాదములు

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

నినటి నుంచి మీ టపా చదువుదామనుకున్నా ఇది కొంచెం ఏకాగ్రతతో చదవాలి అని వాయిదా వేసుకొంటూ వచ్చాను. ఇప్పటికి కుదిరింది. "జైఅహింద్"

జయహొ said...

చాలా మంచి సమాచారం అందిస్తున్నారు మీరు. ధన్యవాదములు. మీనుంచి మరింత ఆశిస్తూ ...

బృహఃస్పతి said...

దుర్గేశ్వర & జయహో, ధన్యవాదములు. ఇప్పటివరకు ప్రచురించినవి మీకు నచ్చినట్లైతే, తప్పకుండా ఇక ముందు చర్చించేవి కూడా నచ్చే విధంగానే ఉంటాయని నమ్ముతున్నాను.

@చైతన్యా, అయోధ్య 'వివాదం' లో పడి వివేకుని సందేశం కుదించాను :(. ఏకాగ్రతతో చదవాలి అని వచ్చిన మీకు నిరాశ పరచలేదనుకుంటున్నాను.

Anonymous said...

nice post.

keep going