భారతదేశం - భిన్నత్వంలో ఏకత్వం


"మనవాళ్ళొట్టి వెధవాయిలోయ్!" అన్నట్లు భారత్ దేశాన్ని ఆధునిక జపాన్ తోనూ, జర్మనీతోనూ పోల్చి చూపుతూ విమర్శించే వాళ్ళకి మన దేశంలో కొదువలేదు. భయంకరమైన యుధ్ధ పరిస్థితులనూ, ప్రకృతి వైపరీత్యాలనూ కూడా తట్టుకుని ప్రబల శక్తిగా ఎదిగిన ఈ దేశాలను చూపి అంతకంటే పెద్ద దేశమై ఉండి కూడా(వనరుల రీత్యా, ప్రాదేశికంగానూ) భారత దేశం అభివృధ్ధిని సాధించలేకపోయిందనే ఈ వాదన చాలా సహేతుకంగానే అనిపిస్తుంది. అయితే మన సమస్య ఇంత వీజీగా జపాన్, జర్మనీలతో పోల్చి చూసి నిర్ణయించుకోగలిగినదా? చూద్దాం!

నిజానికి భారత దేశం తన ఏకత్వాన్ని కాపాడుకోవటంలో మిగిలిన దేశాల కంటే ఎంతో మిన్నగా వ్యవహరించింది. సఫలీకృతమయ్యింది. ఈ ఏకత్వాన్ని కాపుడుకోవలసిన అగత్యం, సవాలూ అన్ని దేశాలకూ కలుగలేదు. ఇలా పోల్చి చూస్తే యూరోప్ ఖండానికీ, భారత దేశానికీ సారూప్యత కనిపిస్తూంది. ప్రాదేశికంగా యూరోప్ వైశాల్యంతో (యూరోప్ లోని వివిధ దేశాలను భారతదేశంలోని రాష్ట్రాలతో పోల్చి చూడవచ్చును) దాదాపు సరితూగగలిగే భారత దేశం ఎన్నో విపత్కర పరిస్థితులను తట్టుకుని ఒక్కటై నిలచిందే తప్ప చిన్న దేశాలుగా విడిపోలేదు.

యూరోప్ ఖండం యొక్క దేశ-రాష్ట్ర(nation-state) విభజన సిధ్ధాంతం సరిహద్దులను పంచుకునే చిన్న చిన్న దేశాలకు ముఖ్యంగా సంస్కృతి జనాభాలలో సారూప్యత కలిగి ఉన్న దేశాలకు వర్తిస్తుంది. సాధారణంగా యూరోప్ దేశాలకు పెద్దగా చరిత్ర లేకపోవటం వల్ల ఇది సాధ్యపడింది. భాషా ప్రాతిపదికన, జాతుల వర్గీకరణ ఆధారంగానో జరిగిన ఇట్టి విభజన సైతం రెండు ప్రపంచ యుధ్ధాలకు దారి తీసింది.

ఈ విభజన సిధ్ధాంతాన్ని ఇండియా, చైనా వంటి పెద్ద దేశాలకు వర్తింపచేయటం అంత సులభమేమీ కాదు. అందునా దీని వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువన్న సంగతి యూరోప్ దేశాలు సైతం నేడు గ్రహించి ఒక్కటయ్యేందుకు (ఆర్ధిక పరంగా ఒకే కరన్సీని తెచ్చి, ఇంకా ఒకే వీసా విధానాన్ని తెచ్చి) ప్రయత్నిస్తున్నాయి.

యూరోప్ నేలిన రాచ వంశీకులు సైతం( వోలటైర్, గోతె వంటి రాజులు) దీనిని గ్రహించే అఖండ యూరోప్ గురించి కలలు కన్నారు. అయితే అప్పటి రాజకీయ పరిస్థితుల రీత్యా nation-state సిధ్ధాంతం బలం పుంజుకోవటంతో నెపోలియన్ వంటి వారు ఎంత ప్రయత్నించినప్పటికినీ ఇది సాధ్యపడలేదు. చిన్న దేశాలు ఎప్పటికైనా పెద్దదేశాలపై ఆధారపడే పరిస్థితి వస్తుందని ఇప్పుడిప్పుడే నిరూపితమవుతోంది.

భారత దేశంతో విస్తీర్ణతా పరంగా పోల్చి చూడదగ్గ, మనకంటే కూడా సఫలీకృతమైన దేశంగా పేర్కొనబడేది చైనా ఒక్కటే. నిజానికి చైనా లో మనకున్నంత భిన్నత్వం లేదు. 'హాన్ చైనీస్' గా పిలవబడే వర్గానికి చెందిన వారే చైనా జనాభాలో దాదాపు 95% ఉన్నారు. అప్పుడప్పుడూ భిన్నత్వం కారణంగా ఏర్పడిన కలహాలను చైనా పాలకులు ఉక్కుపాదంతో హింసాత్మకంగా అణచివేసారు. ఉదాహరణకు ముస్లింలు ఎక్కువగా నివసించే పశ్చిమ చైనా ప్రాంతాలను గత కొన్నిఏళ్ళగా చైనా హాన్ చైనీయులతో భర్తీ చేసి, ముస్లింలను మైనార్టీలుగా ఉంచటంలో విజయం సాధించింది. ఇదే పధ్ధతిని టిబెట్టులో కూడా అమలు చేయటంతో బౌధ్ధులు (దలైలామాతో సహా) రోడ్డున పడ్డ సంగతి విదితమే. ఈ విధంగా ఏకత్వాన్ని సాధించటంలో చైనా విజయం సాధించినప్పటికినీ, ఆ ఫలితం నియంతృత్వ నిర్ణయాల కారణంగా వచ్చినవి. ఇది భారతదేశంలో ఊహకు సైతం అందనిది, ప్రజాస్వామ్య భారతంలో భారతీయులు ఇష్టపడనివి కూడానూ!

ఇక ఇస్లామిక్ దేశాలేవీ భారత్, చైనా, అమెరికాలకు దీటుగా విస్తీర్ణతను సాధించటంలో విజయం సాధించలేదు. ప్రస్తుత ఇస్లామిక్ దేశాలు చిన్నవైన ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియాలలో మాత్రమే ఉనికిని చాటుకోగలిగాయి. అవికూడా సైనిక, నియంతృత్వ పాలనలలో పరస్ఫర యుధ్ధాలతో రోజులు వెళ్ళదీస్తున్నాయి. ఈ విధంగా ఆసియా ఉప ఖండాన్ని ఒక్కటిగా కలిపి ఉంచటంలో ఇస్లాం సైతం విజయం సాధించలేకపోయింది.

ప్రాధేశికంగా అమెరికా తన అతి పెద్ద విస్తీర్ణతను కాపాడుకోగలిగినప్పటికినీ అక్కడి జనాభాలో అధిక శాతం వలస జీవులే. ఈ విధంగా వలస వచ్చిన వారికి సహజంగానే అమెరికాలో తమకంటూ దీర్ఘకాలిక ప్రతిపత్తిని సాధించుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అదీగాక అమెరికాకు చెందిన నిజమైన జాతీయులు (రెడ్ ఇండియన్లు) పెద్దగా ప్రతిఘటన లేకుండానే ఈ వలస జీవులకు దాసోహమైనారు.

ఇక జపాన్, జర్మనీలు విస్తీర్ణతాపరంగా చిన్నవీ, జనులంతా ఒకే వర్గానికి చెందినవారు కావటంతో ఏకత్వాన్ని సాధించటం సులభమయ్యింది. ఇలా మిగిలిన దేశాలతో విస్తీర్ణాతా పరంగానూ, భిన్న సంస్కృతుల పరంగానూ పోల్చి చూస్తే ఇంత పెద్ద భూభాగాన్ని ఒక్కటిగా కాపాడుకునే అవసరంగానీ ప్రయత్నంగానీ భారతదేశానికి తప్ప మరే ఇతర దేశానికీ కలుగలేదు.

ఈ ప్రయత్నంలో భారతదేశం ఒకే ఒక్కసారి పరాజయాన్ని చూడవలసి వచ్చింది (1947 దేశ విభజన రూపంలో). అప్పుడుకూడా ఇస్లామిక్ చట్టాలకు లోబడి ఈ విభజన జరిగిందనది తెలిసిన విషయమే. యూరోప్ దేశాలవలే భారతదేశంలోని రాష్ట్రాలు స్వతంత్ర్యదేశాలుగా చీలకపోవటం వల్ల లాభించిందే తప్ప నష్టం కలుగలేదు. నేడు యూరోప్ కూడా భారత్, చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియాల వలే ఏకత్వంలోని లాభాలను గ్రహించి అటుగా అడుగులు వేస్తోంది.

భారతదేశం జర్మనీ, బ్రిటన్, జపాన్ల వలే అభివృధ్ధిని సాధించలేకపోయిందనేది ఒక అపవాదు మాత్రమే. నిజానికి అఖండ భారతావని ఇన్ని భిన్న సంస్కృతులను నిలుపుకుని, అభివృధ్ధి కంటే మరెంతో గొప్పదైన ఆదర్శాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.

మిగిలిన దేశాలవలే భారతదేశంలో భిన్నత్వాలు అణచివేయబడలేదు. ఇవి ఏకత్వాన్ని సాధించగలిగాయి. లోతుగా అలోచించి చూస్తే ఇందుకు మూల కారణం ప్రకృతి సిధ్ధాంతాలతో నిర్మింపబడ్డ హిందుత్వమే.

భారతావని నిర్వచించిన ఈ దేశీయతా విధానం నేడు ప్రపంచం మొత్తానికీ అవసరం. ఈ విధానాలు ప్రపంచీకరణకు ఎంతగానో ఉపయోగపడతాయి. అదే జరిగితే ప్రపంచం మొత్తం ఒక్కటిగా అవుతుందన్న ఊహా సైతం ఎంత ఆనందాన్ని ఇస్తుంది. నిజమైన హిందుత్వ ఆత్మ మేలుకుంటే ఇది జరిగే అవకాశం ఉంది కదూ...! హిందుత్వాన్ని ఆచరించి, తన అస్థికలను గంగా నదిలో కలపమని కోరిన John Lennon(Beatles గ్రూపు సభ్యుడు) - imagine పాటను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి....

http://www.youtube.com/watch?v=VM0Z75KEd_o

5 comments:

చిలమకూరు విజయమోహన్ said...

‘నైనం చిందన్తి శస్రాణి’ అన్న కృష్ణభగవానుని మాట ప్రకారం ఆత్మకు చావులేదు కానీ ఈ హిందూత్వ ఆత్మను నేటి మన రాజకీయ నాయకులు పూర్తిగా చంపేస్తున్నారు కదండి ఇక మేలుకొనేదెక్కడ

Anonymous said...

Good write up.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

అనేక సంస్థానాలుగా ఉన్నసమ్యంలో కూడా భరతజాతి అనే ఒకేగొడుగుకింద బతికిన చరిత్రమనది. అల్పజ్ఞానంతో మిడిసిపడే వారికి అందులోని విలువలు ఎలాతెలుస్తాయి. యూరోప్ ఇప్పుడు కలుస్తోంది అంటే అందుకు ఆర్ధిక రాజకీయ కారణాలు ఎన్నో ఉనాయి. కాని భరతజాతి సమైక్యత వీటన్నిటికీ అతీతం.

బృహఃస్పతి said...

విజయ మోహన్ గారూ, నిజమే మేల్కునే అవకాశాలు మృగ్యమే. అందుకు రాజకీయ నాయకులను మాత్రమే విమర్శించి ప్రయోజనం లేదు కదా. భాధ్యత ఆందరిదీనూ.

శ్రీకర్ గారూ, thanks అండీ.

@ చైతన్య గారూ: మీరు చెప్పింది అక్షరాలా నిజం. యూరోప్ ఆర్ధిక కారణాల వల్ల ఒక్కటవుతూ ఉంటే, సమైక్య భారతం అందుకు అతీతం. ఒక్క వాక్యంలో నే చెప్పదలుచుకున్న సారాంశం చక్కగా చెప్పారు.

cartheek said...

బృహస్పతి గారు చాలా బాగా చెప్పారు.