శిల - 1 వ భాగము


ఇంకా తెలవారలేదు. అమావాస్య చీకటి దట్టంగా ఉంది. బహుశా మూడవ ఝాము గడచి ఉండవచ్చు. తెల్లవారితే జమిందారి పుట్టినరోజు సంబరాలు మొదలవుతాయి. జమిందారంటే వయసు మళ్ళిన వాడిని ఊహించుకోనవసరంలేదు. పాతికేళ్ళకు మించి ఉండదు అతని వయస్సు. అమావాస్య నాడే పుట్టాడు. ప్రస్తుతం తన తల్పంపై గాఢనిద్రలో ఉన్నాడు. అతనికి చాలా అస్తవ్యస్తమైన కలలు వస్తున్నాయి. అవి కూడా అస్పష్టంగా కనిపిస్తున్నాయి. సరే అటువంటి కలలను వివరించటం ఎలాగూ సాధ్యంకాదు. కనీసం అతని మనస్తత్వాన్ని, బాహ్య స్వరూపాన్ని లోపు తెలుసుకుందాం.

అతడు చాలా పీలగా ఉంటాడు. పొడుగ్గా ఉంటాడు. దినదినానికీ క్షీణిస్తూ ఉంటాడు. నేడు చూసిన వారెవరైనా మరుసటి రోజు చూస్తే కొంత తరిగాడా అనిపిస్తుంది. భుజాలను తాకే కేశాలతో, నున్నటి గడ్డంతో ఉంటాడు. అతడు మీసాలు పెంచటం ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు. బహుశా పరగణాలలో మీసాలు లేని జమిందారు ఇతడొక్కడేనేమో! అతనివదనం ఎన్నడూ కూడా విధమైన భావమూ పలికించదు. నవ్వినా, కోపగించినా, లేక విచారించినా అతని ముఖవైఖరిలో మార్పు ఉండదు. అతని నోటి కదలికలు అతని మనఃస్థితిని తెలుసుకునేందుకు దోహదపడతాయి. కానీ అతనికళ్ళు ఎప్పుడూ - శాశ్వతంగా భావమూ ఒలికించకుండానే ఉంటాయి. అందుకనేనేమో అతని కళ్ళు తేజోపేతంగాఉంటాయి. అతని కళ్ళల్లోనికి సూటిగా చూస్తే అతను చాలా విభిన్నమైనవాడని గుర్తించవచ్చు. శరీరం బలహీనంగాఉన్నా, కళ్ళ వల్లనే అతను, అకర్షణీయంగా - ఆసక్తికరంగా కనిపిస్తాడు. నిజానికి అతని శరీరం కూడా అతనిచే శిక్షింపబడుతున్నదేమోనని అనిపిస్తుంది తప్ప, మరే ఇతర కారణాల వల్ల అలా బలహీనంగా ఉన్నది కాదు.

అతనికి తల్లితండ్రులు లేరు. ఆనందాలు లేవు. దుఃఖం లేదు. ఆలోచనలు లేవు. అయినా తన శరీరాన్ని శిక్షించుకోవటం అతడు మానడు. ఎందుకంటే అతని మనస్తత్వమే అంత.

***************

తెల్లవారింది. జమిందారికి మెలుకువ వచ్చింది. పట్టుపరుపుపై, చేతులు వెనక్కి అన్చి కూర్చున్నాడు. కాళ్ళను నేలపై దించి తదేకంగా క్రిందికి చూస్తూ రాత్రి స్ఫురించిన అస్పష్ట స్వప్నాన్ని మననం చేసుకునేందుకు యత్నిస్తున్నాడు. కల అతని ఊహకు అందటంలేదు. అతనికి చదరంగం అంటే చాలా ఇష్టం. తల ప్రక్కకి తిప్పి చూసాడు. అక్కడ ఆట పేర్చబడి ఉంది. అతనికి కలలో చదరంగం బల్ల ఉన్నట్లు మాత్రం గుర్తుకు వచ్చింది.

జమిందారు నించున్నాడు. తెల్లని పట్టుపంచె ముడిని సరి చేసుకున్నాడు. ఛాతీ పై విధమైన ఆఛ్ఛాదనమూ లేదు. స్నానపానాదులు ముగించుకుని వచ్చాడు. అతడిని ముస్తాబు చేయటానికి పనివారు ఇంకా చేరుకోలేదు. అతడు తన శయన మందిరానికి ప్రక్కగా ఉన్న లోగిలిలోనికి వచ్చాడు. కొండ క్రిందనున్న ఊరంతా కనిపిస్తుంది. ఇక్కడ కాసేపు జమిందారి నివాసం గురించి తెలుసుకోవాలి.

అతడి నివాసాన్ని అంతా 'కోట' అనే సంబోధిస్తారు. ఒక చిన్ని కొండ మీదనున్న చిన్నకోట అది. కోట ని అంతా 'ఎండలబండ' అని పిలుస్తారు. కొండపై భూతద్దం వేసి గాలించినా, ఒక్క మొక్క కూడా కనపడదు. బోడిగా, మరింత నల్లగానిగనిగలాడుతూ ఉంటుంది. కొండపై కోట కూడా అదే విధమైన రంగుతో - ఎప్పుడో అంతరించిపోయిన రాచరికాలకు సాక్ష్యంగా, అప్పుడప్పుడూ జరిగే ఇలాంటి సంబరాలలో మాత్రం సింగారించుకుంటూ ఉంటుంది.

'కోట'

పదం వినగానే అక్కడ నివసించే జనం అదో విధమైన అనుభూతిని పొందుతారు. ఊరి జనానికి కోటలో ప్రవేశం నిషిధ్ధం. బహుశా అందువల్లనేనేమో! కళ్ళ
ముందరే ఉన్నా శోధించటానికి అవకాశంలేని దానిపై ఆసక్తిని పెంచుకోవటం మానవనైజం. ఇదీ అంతే!!

'కోట'

కోట నుండి క్రిందకు దిగటానికి కొండపై మూడువందల రాతి మెట్లు ఉన్నాయి. ఒక్కొక్క మెట్టు దాదాపుగా ఐదు అడుగుల పొడవు, పన్నెండు అడుగుల వెడల్పుతో ఉంటుంది. పెద్ద కోట మూలాన, అదీకాక పాత కట్టడం అయిఉండటం వల్లన, కోట వెలుపలి గోడలు చాలా భాగం నాచు పట్టి ఉంటాయి. ముఫ్ఫై గదుల కోటలో జమిందారితో పాటుగా ఇరవైమంది పనివారు ఉంటారు. జమిందారు ఊరి పాలకుడు కాదు. వ్యక్తి పాలనా విధానాలు అతడి తాత ముత్తాతలకాలంతోటే సమాధి అయ్యాయి. అయితే అక్కడి ప్రజలు జమిందారు వంశాన్ని చాలా గౌరవంగా చూస్తారు.

కోటలో తూర్పు దిక్కున మేడపై జమిందారి శయన మందిరం ఉంటుంది. దానిని ఆనుకుని ఉన్న లోగిలిలోనికి రావాలంటే శయనమందిరాన్ని దాటుకుని రావాల్సిందే! కనుకనే అక్కడికి సాధారణంగా జమిందారు తప్ప వేరెవరూ వచ్చేందుకు ఆస్కారం లేదు. అక్కడి నుండి కొండ, క్రిందన ఉన్న ఊరు చాలా అందంగా కనిపిస్తాయి. జమిందారు మాత్రం అందాలను ఆస్వాదించడు. అతడి దృష్టి ఎప్పుడూ మేడ క్రిందనున్న బండరాయి మీదనే ఉంటుంది. బండ ప్రవేశద్వారానికి లంబ దిశలో ఉంటుంది. దానిని చేరుకునేందుకు ప్రత్యేకమైన త్రోవ ఏదీ లేదు. జమిందారుకి బండనుచూసినప్పుడల్లా మానవ హృదయం గుర్తుకు వస్తుంది. సహజసిధ్ధంగా రాయి - ఆకృతిని కలిగి ఉండటంతో అతనిలోఆసక్తి పెరిగింది. తనకు వచ్చే అస్తవ్యస్త స్వప్నాలన్నీ బండని చూడగానే మరోసారి కళ్ళముందు కదలాడుతూఉంటాయి. అస్పష్ట స్వప్నాలన్నీ ఒక్కసారిగా బండమీదికి దూకి చుట్టూ తిరుగుతూ నృత్యం చేస్తూ ఉంటాయి. అస్పష్టత తొలగించటానికా అన్నట్లు ఒకదానిలో ఒకటి ఐక్యమవుతూ ఉంటాయి. అంతలోనే అంతర్ధానమై తిరిగి ఎడబాటుని మిగులుస్తాయి. అందుకే అతడు ఎక్కువ సమయం అక్కడే గడుపుతాడు. 'ఎప్పటికైనా అస్పష్టత తొలగకపోతుందా' అని ఎదురు చూస్తూ...

***************

జమిందారు శిలవంక తదేకంగా చూస్తూ నించున్నాడు. అప్పటికి పనివారు అతడిని ముస్తాబు చేయటానికి సిధ్ధంగా ఉన్నారు. జమిందారు అద్దం ముందర ఆసీనుడయ్యాడు. అద్దంలో తన ప్రతిబింబం చూడగానే అతని వదనంలో చిరునవ్వు తొణికిసలాడింది. సేవకులు తెచ్చిన బంగారు జరీ అంచు కలిగిన ఎర్రటి పంచెను కట్టుకున్నాడు. ముదురునీలపు రంగులోనున్న పొడవాటి ధోవతీ ధరించాడు. వెనుకన భుజాలకు నేలను తాకేంత పొడవాటి ఆకుపచ్చని పరదాను ధరించాడు. ఒక సేవకుడు అతని మెడలో ఆభరణాలను అలంకరించాడు. అవి చాలా బరువుగా ఉన్నాయి. జమిందారు దండవంకీలను ధరించాడు. ఒక సేవకుడు అతని నుదుటన ఎర్రటి తిలకం దిద్దాడు. మరికొద్ది సేపట్లో అతని అలంకరణ పూర్తయ్యింది. జమిందారు లేచి నిలబడ్డాడు. మేడదిగి క్రింది గదుల్లోనికి వచ్చాడు. అక్కడ పూజమందిరం ఉంది. పాదరక్షలు బయట విడిచిపెట్టి లోనికి ప్రవేశించాడు. అతడిని చిన్నప్పటినుంచి పెంచినామె అతనికి హారతి నిచ్చింది. కళ్ళకు హారతినద్దుకుని ఎదురుగానున్న విగ్రహానికి నమస్కరించాడు. అతడెప్పుడు భగవంతునికి నమస్కరించినా ఏమీకోరుకోడు. నిర్మల మనస్సుతో దండం పెట్టి వచ్చేస్తాడు. అతనికి దేవుని గూర్చి గానీ, భక్తి గురించి గానీ ప్రత్యేకమైన అభిప్రాయాలేవీ లేవు. అలా నిత్యం పూజమందిరంలోనికి వచ్చి నమస్కరించటం అలవాటయ్యింది. అలవాటుప్రకారమే పూజించి వెళ్ళిపోతాడు.

జమిందారు పూజమందిరం నుంచి వెలుపలకు వచ్చాడు. రోజు జమిందారితో పాటుగా అతని పనివారందరూ నూతనవస్త్రాలు ధరించారు. కోటలోనే కాదు, ఊరిలో కూడా జమిందారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతాయి.

అతడు కోట వెలుపలకు వచ్చాడు. అప్పటికే మేనా సిధ్ధంగా ఉంది. మేనా అతని పూర్వీకుల కాలం నాటిది. దానిని మోసేందుకు ఇద్దరు చాలు. అప్పటి వారి పనితనం ఎంత గొప్పదో మేనా చూస్తే తెలుస్తుంది. దానిని తయారు చేయించి, కొన్ని దశాబ్దాలు గడచినప్పటకినీ అది చెక్కు చెదరకుండా మరి కొంచెం నునుపును సాధించుకుని అందంగాకనిపిస్తుంది.

జమిందారు మేనాలో కూర్చున్నాడు.

మేనా బయలుదేరింది.

***************

(సశేషం) తరువాయి భాగం - రేపటి వికాసంలో...

2 comments:

Sravya Vattikuti said...

చాలా బాగుందండి ! చదువుతుంటే మీ వర్ణన కళ్ళ ముందు కనపడుతుంది. తరవాత భాగం త్వరగా వ్రాయండి.

బృహఃస్పతి said...

శ్రావ్య గారూ, వికాసానికి స్వాగతం. మీరలా చదువుతూ ఉండండి... పది రోజుల్లో ముగించేస్తాను.