శిల - 2 వ భాగము


మేనా బయలుదేరింది.

ప్రతి జన్మదినానికి, జమిందారు ఊరిలోని శివాలయాన్ని దర్శిస్తాడు. తరువాత అక్కడ ప్రజల మధ్య సంబరాలు జరుగుతాయి. ఈ పధ్ధతి పూర్వీకుల కాలం నుండి ఆనవాయితీగా వస్తూఉంది.


మేనా ఆలయాన్ని చేరుకుంది.

జమిందారు పాదరక్షలు మేనాలోనే విడిచిపెట్టి క్రిందికి దిగాడు. ఆ ఆలయానికి అతడు తరచుగా వస్తూ ఉంటాడు. మామూలుగా దండం పెట్టుకుని వెళ్ళిపోతాడు. అయితే జన్మదినాన మాత్రం గర్భగుడిలో ప్రవేశించి అర్చన చేయాలి. గుడిలోని పూజారి ఊరి ప్రజలందరి చేత పూజలు చేయిస్తాడు. కానీ జమిందారు వంశస్థులు మాత్రం తామే స్వయంగా పూజించుకోవాలి.

అతడు గర్భగుడిలోనికి ప్రవేశించాడు. అప్పటికే ఆలయ పూజారి వెలుపలకు వచ్చేసాడు. నియమం ప్రకారం జమిందారు భక్తిశ్రధ్ధలతో పూజించాలి. కానీ అతనికి భక్తి అంటే ఏమిటో తెలియదు. తల్లి బ్రతికి ఉంటే అతనికి చాలా విషయాలు తెలిసి ఉండేవి. చిన్నప్పుడు అతడి తల్లి ఇదే గుడిలో అతని చేత పూజలు చేయిస్తూ ఉండేదిట. ఎవరో చెప్పుకోగా విన్నాడు. అతడికి మాత్రం ఆ విషయం గుర్తులేదు. అసలతడికి తల్లి రూపమే సరిగా గుర్తులేదు. ప్రతీ ఏడాదీ పూజిస్తున్న విధంగానే అర్చన చేసి ముగించాడు.


అతడు గుడి వెలుపలకు వచ్చాడు. మేనా వద్దకు చేరుకుని పాదరక్షలు ధరించాడు. ఆ గుడి ఆవరణలోనే సంబరాలు జరుగుతాయి. ఆ సంబరాలు చూడటానికి ఊరివారే కాక ప్రక్క ఊరినుంచి కూడా వస్తూఉంటారు. గారడీలు, కోడిపందాలు లాంటివి జరిగినా ఎక్కువగా నృత్య ప్రదర్శనలకు ప్రాముఖ్యతనిస్తారు. ఆ రోజు నర్తించిన వారికి జమిందారు ఘనమైన బహుమానాన్ని కూడా ఇస్తాడు.


నృత్య ప్రదర్శన మొదలయ్యింది.


ఆ నిశ్నబ్ద వాతావరణంలో డప్పుల చప్పుడు లయబధ్ధంగా ప్రారంభమయ్యింది. గజ్జెల సవ్వడి నెమ్మదిగా హెచ్చింది. జమిందారి మనసులో ఆతృత రేగింది. హోరుమని సుడిగాలి చప్పుడు వలే ఎవ్వరికీ వినపడని నాదం జమిందారి చెవిని తాకింది. అతడి మనసు ఎందుకో హెచ్చరిస్తోంది. ఏవో సంకేతాలని ఇస్తోంది.


'ఏదో విపత్తు వస్తోంది. తనని కబళించబోతోంది.'

అతడు నృత్యం చేస్తున్న స్త్రీ వంక చూసాడు. ఆమె మేలిముసుగులో ఉంది. వాయిద్యాలకి అనుగుణంగా నర్తిస్తోంది. ఆమె ధరించిన దుస్తులు కూడా ఆ నృత్యానికి అమరిన విధంగా ఉన్నాయి. ఎర్రని ఆ దుస్తులపై గుండ్రటి అద్దాలు కుట్టబడి ఉన్నాయి. ఎందుకనో ఆమె ఇతర ఆభరణాలు ఏవీ ధరించలేదు. సాధారణంగా అటువంటి నృత్యప్రదర్శనల్లో నిండుగా గాజులూ, మెడలో హారాలూ ధరిస్తూ ఉంటారు. ఆమె మాత్రం గజ్జెలు మినహా మరే ఇతర ఆభరణాలూ ధరించలేదు.


అతడామె పాదాలవంక చూసాడు. అతడి గుండె వేగంగా కొట్టుకుంది. అతనికి తన స్వప్నాలు గుర్తుకువస్తున్నాయి ఆమె పాదాలు చూస్తుంటే. ఆమెని చూడాలన్న కోరిక ప్రబలమయ్యింది.


'ఇన్నాళ్ళుగా తనకు వస్తున్న అస్తవ్యస్త స్వప్నాలన్నీ ఎదురుగా చేరి నాట్యం చేస్తున్నాయి. తనని చూసి నవ్వుకుంటున్నాయి. కవ్విస్తున్నాయి. అస్పష్టత తొలగించటానికా అన్నట్లు తిరిగి అన్నీ ఏకమై ఒకటే రూపుని సంతరించుకుంటున్నాయి.'

అతనికి కళ్ళు మసకబారాయి. తన ఎదురుగానున్న దృశ్యం నెమ్మదిగా మందగిస్తున్నట్లు అర్ధం అయ్యింది.


జమిందారు నించున్నాడు.

అతని ఎదురుగా ఆమె ఉంది. మేలి ముసుగులో నర్తిస్తుంది. అతడు మాత్రం తన స్వప్నాలన్నీ సంతరించుకున్న శిల్పాన్ని పరదా చాటున చూస్తున్నాడు.

అతడామె చేతిని పట్టుకున్నాడు.


నృత్యం ఆగిపోయింది. నిశ్నబ్దం ఆవరించింది. అంతా ఖిన్నులయ్యారు. అతడామె ముసుగుని తొలగించాడు.

అతని మనసు ఉవ్వెత్తున ఎగసింది. అతడు అంబరాన్ని తొలగించాడు. ఇనాళ్ళ తన సందేహాలపై ముసుగు తొలగింది. అతడామెను చూడగలిగాడు. ఎన్నేళ్ళనుండో తనను వెంటాడుతున్న స్వప్నం బహుశా ఆమేనని అతడు భ్రమించాడు. అతనికి లోకం అంతా సర్వ సుందరంగా కనిపిస్తోంది. ఈ క్షణం కోసమే భూమి, ఆకాశం, నక్షత్రాలూ, సప్త సముద్రాలూ, సృష్టి యావత్తూ వేచి ఉన్నాయనిపిస్తోంది. అతని హృదయం ఆనందంతో పులకించింది. ఇన్నాళ్ళుగా ఆమె ఆలోచనలే వెంటాడకపోయినప్పటికినీ, తన జీవితం ఆమె రాక కోసమే నిరీక్షిస్తున్నదని అతను అర్ధం చేసుకోగలిగాడు.

చాలామంది తొలిచూపులో పుట్టిన ప్రేమను ఒప్పుకోరు. స్త్రీ పురుషులు ఒకరినొకరు అర్ధం చేసుకున్నాకనే నిజమైన ప్రేమ పుడుతుందని వాదిస్తారు. కానీ స్వఛ్ఛమైన ప్రేమ తొలిచూపులోనే పుడుతుంది. రోమియో జూలియట్లలో ప్రేమ తొలిచూపులోనే పుట్టింది. లైలామజ్నూలు ఒకరినొకరు అర్ధం చేసుకున్నాక ప్రేమించటం ప్రారంభించలేదు.

నిజానికి మొదటి వర్గంవారు చెప్పింది అవకాశవాదంతో కూడుకున్న ప్రేమ. ప్రేమ ఒక మత్తు పదార్ధం. అది లోబరుచుకోలేని వ్యక్తిలేడు. కనుకనే స్త్రీ పురుషులలో పరిచయం పెరిగే కొద్దీ ఆకర్షణ ముదిరి ప్రేమగా మారుతుంది. అయితే కొందరు దీనికి అతీతంగా స్పందిస్తారు. అటువంటి వారికి తొలిచూపులోనే ప్రేమ పుడుతుంది. ఈ ప్రేమ పైన చెప్పిన మత్తు పదార్ధం కాదు. అది మనుషులను లోబరుచుకున్న ప్రేమ కాదు. మనస్సులో తానే బందీ అయిన ప్రేమ. ఆ ప్రేమ పైన చెప్పిన ప్రేమను మించి గొప్పదిగా ఉంటుంది. పుట్టినప్పుడే అటువంటి ప్రేమకు ప్రాప్తులైన వారి తలరాతల్లో నిర్దేశించబడి ఉంటుంది. ఆ నిర్దేశించబడిన వ్యక్తి కనపడనంత వరకు వారిలో ప్రేమ పుట్టదు. కానీ కనపడిన మరుక్షణం వారు తమ ప్రేయసి/ప్రియుడి ని గుర్తిస్తారు. తమ జన్మ జన్మల అనుబంధాన్ని గ్రహిస్తారు. ఒక్కోసారి ఇటువంటి ప్రేమ ప్రేమికులిద్దరిలోనూ జనిస్తుంది. అలాంటి ప్రేమ కధలు అమరంగా నిలచిపోతాయి. అటువంటి ప్రేమ బహు కొద్ది మందిలోనే పుడుతుంది. కోటికొక జంటలో పుడుతుంది. దురదృష్ట వశాత్తూ మిగిలిన ప్రేమలలో కలసిపోయి తేడా గుర్తించనివ్వదు. ఆ ప్రేమను ఆస్వాదించిన వారికి తప్ప. ప్రేమలో పడిన వారందరూ త్యాగాలకు సిధ్ధపడతారు. ఎందుకంటే ప్రేమ ముందు చెప్పినట్లుగా ఒక మత్తుమందు. ఆ మత్తుమందుకు అలవాటు పడిన వారందరూ అది లేకపోతే విలవిలలాడి పోతారు.


కనుకనే ప్రేమలలో స్వఛ్ఛమైన ప్రేమను గుర్తించటం కష్టమౌతుంది. ఒక్కోసారి ఇలాంటి స్వఛ్ఛమైన ప్రేమ కేవలం ఒక్కరిలోనే పుడుతుంది. వారు తమ ప్రేయసి/ప్రియుడి ని ఒప్పించగలిగితే వారి ప్రేమ సఫలమౌతుంది. లేదంటే వారి జీవితం త్యాగమయం అవుతుంది.

అతడి ప్రేమ స్వఛ్ఛమైనది. ఆమెని చూసిన తొలిచూపులోనే పుట్టిన నిజమైన ప్రేమ. అయితే ఆమెకూ అదే విధమైన భావన కలిగిందో లేదో తెలియదు.


అతడామెను భుజాలపై ఎత్తుకున్నాడు. అంతా నిశ్చేష్టులయ్యారు. ఆమె అరవబోయింది. నోరు పెగలలేదు. అతడితో పెనుగులాడి విడిపించుకోవాలనుకుంది. అవయవాలు సహకరించలేదు. అంతా అతను మంత్రించినట్లుగా స్ధాణువులై నించున్నారు.


రకరకాలైన ఆలోచనలు ఆమెను చుట్టుముట్టాయి. ఆమెకు స్పృహ తప్పింది.

జమిందారు ఆమెను మేనాలో పడుకోబెట్టాడు. పనివారు యజమాని ఉద్దేశ్యం గ్రహించినట్లుగా అతని ఆజ్ఞను శిరసావహించారు.

మేనా బయలుదేరింది.

జమిందారు మేనా ప్రక్కన నడుస్తూ కోటకు వెనుదిరిగాడు.


అతడిని ఎవ్వరూ వారించలేదు. కొందరికి జమిందారిని ఎదిరించే సాహసం లేదు. వారించగలిగే వాళ్ళున్నా వాళ్ళు శిలా ప్రతిమల్లా చేష్టలుడిగి చూస్తూ నించుండిపోయారు.

ఎందుకంటే ఆ రోజు 'అతడి'ది.


**********

(సశేషం) తరువాయి భాగం రేపటి వికాసంలో...

4 comments:

sunita said...

ఇదంతా కధా? లేక ఎక్కడైనా యధార్ధంగా జరిగిన కధా?? చాలా బాగా రాస్తున్నారు. నేను ఇవ్వాళే చూసాను మీ బ్లాగు. కధలు బాగున్నాయి.

బృహఃస్పతి said...

సునీత గారు, ధన్యవాదాలు. జమిందారులూ, కోటలూ అంటుంటే యదార్ధమా అంటారేమిటండీ??

అయినా మీరు ఇన్ని కామెంట్లతో ఉబ్బితబ్బిబ్బు చేయించి, ములగ చెట్టెక్కించారు కనుక మీకు నిజాయితీగా నిజం చెబుతున్నాను. 'శిల' నాకు కలలో వచ్చింది. ఆ కలను నా శక్తి మేరకు కధ రూపంలో వ్రాసాను. ఈ కల వచ్చింది నేను 10th చదివేటప్పుడు. 'శిల' రాసింది ఇంటర్లో. మీరు కాస్తా జాగ్రత్తగా గమనిస్తే ఆ అపరిపక్వత చాలా చోట్ల కనిపిస్తుంది. (అయితే ఆ అపరిపక్వతకు నేనిప్పుడు సిగ్గుపడటం లేదనుకోండీ...)

Sravya V said...

చదివేసా రెండో భాగం కూడా :)

బృహఃస్పతి said...

సిధ్ధం చేసేసా మూడో భాగం కూడా :)