శిల - 3 వ భాగము



మెకు స్పృహ వచ్చింది. తాను కోటలో ఉన్నానని ఆమెకు అర్ధం అయ్యింది. పరుపు అదిమి చూసింది. తల్పంచుట్టూ పరదా అమర్చబడి ఉంది. ఆమెకు అంతా అయోమయంగా ఉంది. మనసంతా ఆందోళనతో నిండిపోయింది. పెల్లుబికిన ఏడుపుని అణచి పెట్టుకుని పరదా ప్రక్కకు తొలగిస్తూ బయటకు వచ్చింది.

ఎదురుగా అతడు కూర్చుని తనవంక రెప్ప వేయకుండా చూస్తున్నాడు. ఆమెకు భయం వేసింది. ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. ఒక్క ఉదుటన పరిగెత్తుకుంటూ లోగిలి లోనికి పోయింది. జమిందారు మనసు ఎంతగానో బాధపడింది. రెండ్రోజులు ఆగితే ఆమె నిజం తెలుసుకుంటుందిలే అని సర్ది చెప్పుకున్నాడు.

ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. లోగిలిలో చివరగానున్న స్తంభాన్ని పట్టుకుని జారుతూ క్రిందికి ఒరిగింది. జమిందారుకి ఆమెను ఓదార్చాలని ఉంది. ఆమెకు ఎదురుగా నాలుగడుగుల దూరంలో కూర్చున్నాడు. ఇద్దరి మధ్యన నిశ్నబ్దం అలముకుని ఉంది. నిశ్నబ్దాన్ని భగ్నం చేస్తూ ఆమె వెక్కిళ్ళు వినిపిస్తూ ఉన్నాయి.

చీకటి పడింది.

ఆమె ఏడుపు ఆగింది. అతని మనసు కుదుట పడింది. అతనికి ఆమె పేరు అడగాలని ఉంది. ఆమెకు మాత్రం తనని విడిచి పెట్టమని ప్రాధేయపడాలని ఉంది. అతడామె రూపాన్ని చూస్తూ మైమరచిపోతున్నాడు. ఇక్కడ ఆమె రూపాన్ని వర్ణించాలని ఉంది. అయితే అది అలవి కాదనిపిస్తోంది. అలా అని ఆమె అద్భుత సౌందర్యరాశి కాదు. ఆమె అందమైన రూపాన్ని చూడటానికి అందమైన మనసు కావాలి. వర్ణింప సాధ్యం కాని పరిపూర్ణ సౌందర్యం ఆమెది. అంతే!

అతడు ఆకాశం వంక చూసాడు. అతడికి చాలా చిత్రంగా అనిపించింది. నిన్న ఇదే వేళకు దట్టమైన అమావాస్య చీకటి. ఆకాశంలోనూ, తన జీవితంలోనూ..! నేడు మాత్రం వెన్నెల కురుస్తోంది. ఆకాశంలోనూ, తన జీవితంలోనూ..!

వెన్నెలను ఆస్వాదించే వారందరికి అది ఎంత అందంగా ఉంటుందో తెలుసు. అతడూ వెన్నెలను ఆస్వాదించేవాడే! ఇప్పుడతనికి ఆమె రూపం వెన్నెలకన్నా చల్లదనాన్ని ఇస్తోంది. చిన్నప్పుడు తాను వెన్నెల్లో చందమామని తాకుతానని మారాం చేసేవాడు. మళ్ళీ అతనికిప్పుడు ఆమెను తాకాలనిపిస్తోంది. ఆమె పెద్దగా దూరంలో లేదు. అతను ఆమెను తాకటం కోసం కొంచెం ప్రక్కకు జరిగాడు.

ఆమె అతని చర్యలన్నీ గమనిస్తోంది. ఆమెకు దుఃఖం పొంగుకు వచ్చింది. మోకాళ్ళల్లో ముఖాన్ని దాచేసుకుంది. ఆమె రోదిస్తోంది. కానీ బయటకు చప్పుడు రావటంలేదు. అతనికి ఆమె రోదిస్తున్నట్లు అర్ధం అయ్యింది. ఆమె భుజం పై వేయబోయిన తన అరచేతిని వెనక్కి తీసుకున్నాడు. అతడికీ చాలా బాధగా ఉంది. ఆమె తనను గానీ తన ప్రేమను గానీ అర్ధం చేసుకోనందుకు.

అతడు నించున్నాడు. అతడు తన దుస్తులు మార్చుకోలేదు. మరచిపోయాడు. ఇప్పుడు గుర్తుకు వచ్చింది. అతడికి నిద్రకు ఉపక్రమించే ముందు బట్టలు మార్చుకోవటం అలవాటు. అయితే ఆమె కటిక నేలపై ఉండగా తాను తల్పంపై నిద్రించటం అనుచితంగా అనిపించింది. అందుకే దుస్తులు మార్చుకోలేదు. ఆమె కూడా నృత్య ప్రదర్శన కోసం ధరించిన దుస్తులలోనే ఉంది. ఆమె దుస్తులను అతడు సారి గమనించాడు. అద్దాలతో కుట్టబడిన ఎర్రటి దుస్తులలో తలపై పరదా చాటున అచ్చం పల్లెపడుచులా ఉందామె. ఆమె దుస్తులపై కుట్టబడిన అద్దాలతడిని ఆకర్షించాయి. అద్దాలలో పరావర్తనం చెందుతున్న వెన్నెలతో ఆమే స్వయంగా వెన్నెలను విరజిమ్ముతున్న జాబిల్లి లా ఉంది. అతని ముఖంలో చిరు దరహాసం మెదిలింది. అంతలోనే ఆమెకు తనపై నమ్మకం కుదరలేదని జ్ఞప్తికి వచ్చింది. మౌనంగా నించుండిపోయాడు... ఎప్పటిలా భావాన్నీ పలికించకుండా! ఆమె ఇంకా రోదిస్తూనే ఉంది. తన చూపును తానెప్పుడూ గమనించే శిల వంక మరల్చాడు. ఆమె కంటి నుండి ఒలుకుతున్న కన్నీటి చుక్కలు తాను గమనించే శిల పై పరావర్తనం చెందుతున్నాయా అనిపిస్తోంది అతనికి.

****************

అతడికి మెలకువ వచ్చింది. రాత్రి తాను నిద్దట్లోనికి జారుకున్నట్లు అతడికి గుర్తులేదు. ఆమెకు ఎదురుగా కటిక నేలపై నిద్ర పోయాడు. రాత్రి అతడికి కలలు కూడా రాలేదు.

అప్పటికి ఇంకా పూర్తిగా తెలవారలేదు. నిద్రిస్తున్న ఆమె వంక తేరిపారా చూసాడు. ఆమె మోము ఇంకా వెన్నెలని కురిపిస్తూనే ఉంది. నిన్న తెలుసుకోలేక పోయిన విషయం ఒకటి అతడికి నేడు బోధ పడింది. ఆమె తన కోసమే సృష్టింపబడింది అని.

అతడు నించున్నాడు.

స్తంభానికి ఆనుకుని ఎప్పటిలా క్రిందినున్న శిల వంక చూస్తూ ఉండిపోయాడు. అతనికి ఏదో కోలాహలం వినిపించింది. జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించాడు. అరుపులు, కేకలు వినపడుతున్నాయి. కోలాహలం నెమ్మదిగా పెద్దదయ్యింది. ఆమెకు నిద్రాభంగం అవుతుందేమోనని భయపడ్డాడు. అనుకున్నట్లే అయ్యింది. ఆమె కళ్ళు తెరచింది. కళ్ళు తెరవటానిక్కి ముందునుండే కోలాహలం వింటున్నట్లుగా నించుని ఆలకించింది. కోలాహలం మరింత పెద్దదయ్యింది. గొడవ గొడవగా ఉంది.

ఆమె ముఖం మెల్లగా సంతోషాన్ని సంతరించుకుంది. ఆమె ఆనందాన్ని చూసాక అతడికి కారణం అర్ధమయ్యింది. అతడికి చాలా కోపం వచ్చింది. ఆమె విధంగా ఆనందించి ఉండాల్సింది కాదు. సమయంలో ఆమె ఆనందించటం అతడి నర నరాల్ని పిండేసినట్లయ్యింది. పళ్ళు పటపటా కొరుక్కోవటం మినహా మరే విధంగానూ ఆమెపై కోపాన్ని ప్రదర్శించలేకపోయాడు.

అతడు కోట ముఖద్వారం మూసివేయిద్దామనుకున్నాడు. కానీ అప్పటికే ఊరి జనం లోపలికి ప్రవేశించారు. అతడిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏం చేయాలో పాలుపోలేదు. చుట్టూ దిక్కులు చూస్తూ నించున్నాడు. అంతలోనే గోడకు తగిలించి ఉన్న పొడవాటి కరవాలాన్ని చేతిలోనికి తీసుకున్నాడు. గది బయటకు వచ్చి మేడపై నుంచి క్రిందికి చూసాడు. అప్పటికే ఊరి జనం చాలా మంది కోటలోనికి ప్రవేశించారు. వారి చేతుల్లో కత్తులు, ఈటెలు ఉన్నాయి. వారు తన సేవకులతో తలపడి వచ్చారని అర్ధం అయ్యింది. అంత మందితో తాను ఒక్కడు తలపడటం అసంభవం అనిపించింది. మళ్ళీ లోపలికి వచ్చాడు. అతడిని తరుముతున్నట్లుగా ఊరి జనం మేడపైకి ప్రవేశించారు. అతడికి చాలా అవమానంగా అనిపించింది. కరవాలాన్ని అసహనంగా జనం మీదకు విసిరివేసాడు. ఊరి జనం అతడి మందిర ముఖ ద్వారం వద్ద ఆగిపోయారు. అతడు - ఆమె లోగిలో ఉన్నారు. ఆమె తన వాళ్ళను గుర్తించింది. ఆమె ముఖంలో ఆనందం ప్రవేశించింది. అతడామెను గమనిస్తూనే ఉన్నాడు. అతనికి దుఃఖం తన్నుకు వస్తోంది. ముఖ్యంగా ఆమె ప్రవర్తన మరింత బాధను కలిగిస్తూ గుండెలను పిండేస్తోంది. ఏదో పిలువబోతున్న ఆమె నోటిని తన ఎడమ చేతితో నొక్కిపెట్టి కుడి బాహువులో ఆమెను బంధించాడు. ఆమె పెనుగులాడుతూ ఉంటే అతని మనసు విలవిలలాడుతోంది. మొట్టమొదటి సారిగా అతని కళ్ళు దుఃఖాన్ని అభినయించాయి. ఔను! ఇన్నేళ్ళగా భావమూ పలికించని అతడి కళ్ళు తొలిసారిగా అతని పంటి క్రింద అణచబడి ఉన్న గుండెల్లో బాధను అశ్రువుల రూపంలో జారవిడిచాయి.

అతడెన్నో పురాణాలు చదివాడు. చరిత్ర చదివాడు. మహాగ్రంధాలూ, ప్రేమ కావ్యాలూ చదివాడు. కానీ విధమైన సన్నివేశం అతడెప్పుడూ - ఎక్కడా చదివి ఎరుగలేదు. 'సీత రాముణ్ణి చూసి అసహ్యించుకున్నదా?' తొలి చూపులోనే రాముణ్ణి వలచినట్లు తాను చదువుకున్నాడు. అనార్కలి గురించి, లైలా గురించి కూడా తాను విధంగానే చదివియున్నాడు. వారెక్కడా కధానాయకుడ్ని ఈసడించుకోలేదు. 'ఒకవేళ ఆమె తనకై సృష్టింపబడిన ప్రేయసి కాదా? 'ఉహూ! తాను నిరీక్షిస్తోన్న స్త్రీ మూర్తి ఆమేనని తానెప్పుడో నిశ్చయించుకున్నాడు. 'మరి ఆమె విధంగా ఎందుకు ప్రవర్తిస్తోంది?'

'ఒక వేళ తాను కధానాయకుడిని కాదా?'

అతడిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తాను కధానాయకుడిని కాదన్న ఊహని సైతం అతను భరించలేకపోయాడు. ఆమెను రెండు చేతులతో పైకి ఎత్తాడు. వెనక్కి ఒక అడుగు వేసాడు. అతడి భుజాలకు స్తంభం తగిలింది. ఊరి జనం ఒక్కొక్కరూ లోనికి ప్రవేశిస్తున్నారు. తాను కధానాయకుడిని కాదన్న విషయాన్ని జ్ఞప్తికి తెస్తున్నట్లుగా ఆమె ఇంకా పెనుగులాడుతూనే ఉంది. అతడిలో ఓర్పు నశించింది. క్రిందికి చూసాడు. అతడెప్పుడూ గమనించే శిల, గతంలో అతనిలా భావమూ పలికించకుండా తమని గమనిస్తున్నట్లుగా అనిపించింది. అంతలోనే అతని స్వప్నాలన్నీ శిలపైకి చేరి నర్తిస్తున్నట్లుగా కనిపించింది. స్వప్నాల విలయ తాండవానికి శిల మూగగా రోదిస్తున్నట్లుగా గమనించాడు. నృత్య ధాటికి శిల బీటలు వారి పగులుతున్నట్లుగా అనిపించింది. అతనికి నృత్యం ఆపాలని ఉంది. ఎలా శాసించాలో తెలియలేదు. ఇంక ఆలస్యం చేయదలచుకోలేదు. ఆమెను శిల పైకి విసిరివేసాడు.

**********

(సశేషం) తరువాయి భాగం - రేపటి వికాసంలో...

2 comments:

sunita said...

కోటలూ , జమీందారులూ , మనకు ఎక్కువకా పరిచయం లేని చాలా ప్రదేశాల్లో వాటి గురుంచి స్తానికులు కధలు, కధలు గా చెప్తారు. అందుకే అలా అడిగాను.ఐతే అబ్బాయీ, నీకు మంచి కల్పనా శక్తి ఉన్నది. చిన్నప్పుడే ఇంత బాగా అలోచించగలివావంటే నువ్వు మున్ముందు మంచి రచయితవు అవుతావు.

బృహఃస్పతి said...

సునీత గారూ, ధన్యవాదాలు.

"మున్ముందు మంచి రచయితవు అవుతావు."

ఇక మరి చాన్స్ లేదేమోనండి :( ఎందుకంటే ఆ మున్ముందు పూర్తయ్యి చాలా ఏళ్ళయ్యింది. ఆల్రెడీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ (ఐ మీన్ భూమ్మీదకొచ్చీ...) ఈ సంవత్సరమే పూర్తి చేసా...

నేను కధలు రాసుకుంటూ పాడయిపోతున్నానని మా అమ్మ అప్పుడే డిగ్రీలో నా చేత ఒట్టేయించేసుకుంది. ఇప్పుడు చేతులు దురద పెడితే వ్యాసాలు రాసుకుంటున్నా... (అమ్మ కిచ్చిన మాట కోసం -- :) సెంటిమెంట్. హి..హి..) కధల్నీ, కవితల్నీ పూర్తిగా పక్కన పెట్టేసి నేనిప్పుడు బ్రహ్మీ నయిపోయా.

డిగ్రీ వరకు రాసుకున్నవన్నీ వీలున్నప్పుడల్లా ఆ పాత పుస్తకాల దుమ్ము దులిపి పోస్ట్ చేస్తున్నా. ప్రస్తుతం ప్రయత్నిస్తున్నవన్నీ హిందూ ఆధ్యాత్మిక పరిశోధనలే (పెద్ద పదమయ్యిందేమో?!)