అతడామెను శిలపైకి విసిరివేసాడు.
ఆ క్షణం కాలం ఆగిపోయింది. గాలి స్తంభించింది. ఊరి జనం నిశ్చేష్టులై బొమ్మల్లా నించుండిపోయారు. అతని గుండె మాత్రం ఇంకా కొట్టుకుంటూనే ఉంది. తన చర్యను తానే నమ్మలేకపోయాడు. అతడి మెదడు మొద్దుబారింది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఎన్నడూ ఎరుగనంత తలనొప్పి పుట్టింది. అతని కళ్ళ ముందరి దృశ్యం మసక బారుతూ నెమ్మదిగా అదృశ్యమవుతోంది. కొంతమంది అప్పటికే తేరుకున్నారు. ఒక శూలం విసురుగా వచ్చి అతని భుజాన్ని రాసుకుంటూ పోయింది. అతనిలో ఆలోచన మేల్కొంది. పరిస్ధితి అర్ధం అయ్యింది. మరిన్ని శూలాలు అతనిపైకి దూసుకువచ్చాయి.
అతడు క్రిందికి దూకేసాడు. ఆ శూలాలు అతనిని తాకక మునుపే శిలపైకి దూకేసాడు. పడుతూ శిల వంక చూసాడు. తనను ఆలింగనం చేసుకోవటానికి శిల ఆహ్వానిస్తున్నట్లుగా అనిపించింది. అయితే శిల పై ఆమె దేహం కనిపించలేదు. మొట్టమొదటి సారిగా శిలకు చేరువౌతున్న అనుభూతిని పొందాడు. మరిన్ని ఆలోచనలు రాకముందే రెప్పపాటు క్షణంలో అతడు శిలను ఢీకొన్నాడు. అతని కళ్ళు మూతబడ్డాయి. కళ్ళముందు పూర్తిగా చీకటి కమ్ముకుంది.
************
కొంతమంది ఊరిప్రజలు కోట ప్రక్కగుండా త్రోవ చేసుకుని శిల వద్దకు వచ్చారు. జమిందారు భుజాలకు తగిలించుకునే పొడవాటి ఆకుపచ్చ రంగు పరదా శిలను కొంతమేరకు కప్పి ఉంది. ఊరి ప్రజలు చుట్టుప్రక్కల గాలించారు. వారికి అతడి జాడగానీ, ఆమె జాడగానీ ఎక్కడా కనిపించలేదు. అసలు అప్పటికే వారిద్దరూ మరణించి ఉంటారని గ్రామస్థులు భావించారు. అయితే మృతదేహాలు కనిపించలేదు. శిలపై పడుతున్న తూరుపు కిరణాలు పరావర్తనం చెంది శిలకు మెరుపునిచ్చాయి. ఒక బలిష్టుడైన గ్రామస్థుడు పొడవాటి శూలంతో శిలవద్దకు వచ్చాడు. అతడికి శిల ప్రేక్షకుడిలా తమను గమనిస్తున్నట్లనిపించింది. అన్నీ తెలిసిఉండి, మౌనంగా ముభావంగా ఉంటూ - ఏదో రహస్యాన్ని తనలో దాచుకున్నట్లనిపించింది. శూలాన్ని పైకెత్తి శిలపైనున్న పరదాను తొలగించాడు. శూలం తాకిడికి శిల ఖంగుమంది.
************
అతడు కళ్ళు తెరచాడు. అతనొక బురదగుంటలో పడిఉన్నాడు. పైకి లేవబోయాడు. భుజానికి బండ తగలటంతో భారంగా నిట్టూర్చాడు. అతడి కుడి భుజానికి నెత్తురు స్రవిస్తోంది. బహుశా శూలం చేసిన గాయం కావచ్చు. ముందు కొంత దూరంలో వెలుగు కనిపించింది. పాకురుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడంతా విశాలంగా ఉంది. లేచి నిలబడ్డాడు. వెనక్కి తిరిగి చూసాడు. అతడు శిలకు మరో ప్రక్క ఉన్నాడు. ఆ కొద్దిపాటి వెలుతురులో అతడికి శిల రూపం స్పష్టంగా కనిపిస్తోంది. అచ్చం హృదయాకారంలోనే ఉంది. గంభీరంగా ఉంది. అతనికి శిలను తాకుదామనిపించింది. చేతిని పైకెత్తి శిలను నిమిరాడు. అతనికి స్వప్నాలు గుర్తుకువచ్చాయి. ఆమెను విసిరేసినట్లుగా గుర్తుకువచ్చింది. మనసులో ఆతృత రేగింది. ఓ రెండడుగులు ముందికు వేసి చుట్టూ చూసాడు.
ఆమె కనిపించింది. అక్కడ బురదలో స్పృహతప్పి పడిఉంది. విప్పారిన కళ్ళతో ఆమెను చేరుకున్నాడు. పాలరాతి శిల్పాన్ని బురదలో పడవేసినట్లుంది ఆమెను చూస్తుంటే! ఆమె భుజంపై చెయ్యి వేసాడు. చుట్టు ప్రక్కల తామరపూలు ముడుచుకుని ఉన్నాయి. బహుశా ఆమెతో తమను పోల్చుకున్నాయేమో!
అతడు తలపైకెత్తి చూసాడు. ఇంతవరకు ఆమె ధ్యాసలో ఉండి గమనించలేదు. పైనంతా వెన్నెల కురుస్తోంది. అతడికి వెన్నెల అంటే చాలా ఇష్టం. కానీ ఇంత అందమైన వెన్నెలను అతడు ఇదివరకెప్పుడూ చూడలేదు. అతనో చిత్రకారుడై ఉంటే తప్పకుండా ఆ వెన్నెలను చిత్రించటానికి ప్రయత్నించేవాడు. కవి అయిఉంటే వర్ణించ యత్నించేవాడు. అసలు తానెక్కడ ఉన్నానో అర్ధం కాలేదు. తాను భూలోకంలోనే ఉన్నాడా? భూలోకం ఇంత అందంగా ఉంటుందా? అతనికి ఏ ప్రక్క చూసినా ఆకాశమే కనిపిస్తుంది. ఆ వెన్నెలను గట్టిగా వాటేసుకోవాలనిపిస్తోంది.
ఆమెలో చలనం వచ్చింది. అతడామె చెక్కిళ్ళపై తన అరచేతులను అన్చాడు. ఆమె కళ్ళు తెరచింది.తనవంక ఆరాధనాపూర్వకంగా చూస్తున్న అతని రూపం కనిపించింది. ఆమె ముఖంలో రంగులు మారాయి. అతని చేతులను విదుల్చుకుని లేచి నించుంది. ఆమెకు మళ్ళీ దుఃఖం పొంగుకు వచ్చింది.
అతడికి నచ్చచెప్పాలని ఉంది. ఆమెను సముదాయించాలని ఉంది. తన గుండెలకాన్చుకుని బుజ్జగించాలని ఉంది. రెండు చేతులూ గాల్లో చాచి నించున్నాడు.
ఆమెకు భయం వేసింది. అక్కడనుండి పారిపోవాలనుకుంది. నెమ్మదిగా వెనక్కి అడుగులు వేస్తూ అతడికి దూరంగా జరిగింది. వెనక్కి తిరిగి పరిగెత్తటం ప్రారంభించింది. అతడు తన చేతులను నిస్సహాయంగా దించేసాడు.
అతడికి తన ప్రణయకావ్యం సర్వం లోపాలమయంగా కనిపిస్తోంది. ఆమె పారిపోతోంది. తనకు దూరంగా! కధానాయకుణ్ణి అసహ్యించుకుంటూ పోతోంది. ఒంటరిగా! అసలు తన ప్రణయ కావ్యం మొదలవ్వక మునుపే చరమాంకం పెడుతున్నట్లుగా...
ఈ ప్రేమకధ మొదలవ్వందే తుదిమెరుగా?
తెరతీయక ముందే తెరమరుగా?
తన జీవితం అలానే ప్రశ్నల మయంగా తోస్తోంది. అతడికి ఏంచేయాలో అర్ధం కాలేదు. ఆమెను వెంబడించాలా వద్దా అని నిర్ణయించుకోలేకపోతున్నాడు.
అదే మంచిదనుకున్నాడు. ఆమె వెనుక పరుగునారంభించాడు. ఆమెను ఆగమని చెబుదామనుకున్నాడు. కానీ అతడికి ఆమె పేరు తెలియదు. ఏమని సంభోదించాలో తెలియలేదు. మౌనంగా వెంబడించాడు.
**********
ప్రేమ అనే భావం చాలా చిత్రమైనది. అది మనిషికి మత్తెక్కిస్తుంది. పిచ్చివాడ్ని చేస్తుంది. ఎంతటి త్యాగానికైనా సిధ్ధపడేలా చేస్తుంది. ప్రేమ అందరి మనసుల్లోనూ ఉంటుంది. కానీ స్వఛ్ఛమైన ప్రేమ అందరు మనుషుల్లోనూ ఉండదు. ఒక కవి వర్ణించినట్లు ప్రేమ ప్రేతాత్మ లాంటిది. దాని గురించి అందరూ మాట్లాడుకుంటారు. రూపురేఖలూ, గుణగణాలూ వర్ణిస్తారు. కానీ బహు కొద్దిమంది మాత్రమే చూసి ఉంటారు. అనుభవించి ఉంటారు. కాలం, దూరం పెరిగే కొద్దీ చాలామంది హృదయాల్లో ప్రేమకు రెక్కలు పుడతాయి. కానీ నిజమైన ప్రేమ మాత్రం వటవృక్షమై మరింత దృఢమౌతుంది. అలాంటి ప్రేమ వృత్తాంతాలే అమరమౌతాయి. యుగాల పొడుగునా నిత్య నూతనంగా భాసిల్లుతాయి. నిజమైన ప్రేమను ఉత్తేజపరుస్తూ ఉంటాయి.
అతడి ప్రేమ సత్యం. అయితే ఎందుకనో ఆమె మనసులో అతడిపై ప్రేమ ఇంకా అంకురించలేదు. అసలామె అతడి ప్రేమను అర్ధం చేసుకున్నదో లేదో తెలియదు. ఒకవేళ అర్ధం చేసుకున్నా అతడంటే అయిష్టమేమో తెలియదు. బహుశా ఆ బ్రహ్మ పరధ్యానంలో ఉండి వారి తలరాతల్లో ఈ విధమైన తప్పులు దొర్లించాడేమో!
**********
వాళ్ళు పరిగెడుతూ చాలా దూరం వచ్చేసారు. ఆమె అలసిపోయింది. అయినా ఆగాలనిలేదు. ఆగితే అతనికి చిక్కుతానని భయం. అతనికి అలసట తెలియటంలేదు. ఆమె ప్రవర్తనకు బాధ మాత్రం కలుగుతోంది. భుజాన స్రవిస్తోన్న నెత్తుటిని మరో చేత్తో అదుముకుంటూ పరిగెడుతున్నాడు.
ఆ ప్రదేశంలో ఒక ఊబి ఉంది. ఆ సంగతి ఆమె గమనించలేదు. అతనిని తప్పించుకునే తొందరలో ఊబికి చేరువగా వచ్చి వెనుదిరిగి చూసింది. అతడు దగ్గరకు సమీపిస్తున్నాడు. ఆమె పారిపోదామనుకుంది.
ఊబిలో పడి చిక్కుకుంది.
**********
(సశేషం) తరువాయి భాగం - రేపటి వికాసంలో...
(సశేషం) తరువాయి భాగం - రేపటి వికాసంలో...
4 comments:
3, 4 భాగాలు కూడా బాగున్నాయండి !
శ్రావ్య గారూ, మీరిలా తబ్బిబ్బిబ్బిస్తూ ఉంటే నాకు శిల ముగించాలనిపించట్లేదండీ... :)
ఇంకా మంచిది ఐతే మీరు వ్రాస్తుపోండి , మేము చదువుతూ ఉంటాం ! :)
Baagundi.
Post a Comment