శిల - 5 వ భాగము
ఆమె ఊబిలో పడిపోయింది. గిలాగిలా కొట్టుకుంటుంది. అతడి సహాయాన్ని అర్ధించటానికి మనస్కరించలేదు. తన దురదృష్టాన్ని నిందించుకుంటూ బయట పడటానికి అవస్థపడుతోంది.
అతడు అక్కడకు చేరుకున్నాడు. ఊబిలో కూరుకుపోతున్న ఆమెను చూసాడు. ఆమెను ఎలా రక్షించాలో తెలియలేదు. దిక్కులు చూసాడు. ఇంక ఆలస్యం చేస్తే ఆమె దక్కదని అర్ధం అయ్యింది. ఊబి ఒడ్డునుండి చేయి అందించటానికి ప్రయత్నించాడు. ఆమె అందలేదు. ఒడ్డున బోర్లాపడుకుని కాళ్ళను గట్టుపై ఉంచి ఊబి వైపు జరుగుతూ ఆమె చేతిని అందుకోవటానికి ప్రయత్నించాడు. అప్పటికే ఆమె సగానికి పైగా కూరుకుపోయింది. ఆమె చేతిని అతడు అందుకోగలిగాడు. ఆమెకు తన చేతిని అందిచాలనిలేదు. కానీ అతని సహాయం లేకపోతే తాను బయటపడటం కష్టం అని గ్రహించి మౌనంగా చేతిని అందించింది.
ఆమెను బయటకు లాగటానికి అతడు విశ్వప్రయత్నం చేస్తున్నాడు. అతడి శక్తి సరిపోవటంలేదు. ఊబిలో మరింతగా కూరుకుపోకుండా ఆపగలిగాడుకానీ ఆమెను బయటకు రప్పించలేకపోతున్నాడు. ఆమెను రక్షించలేకపోతున్నాననే బాధ అతడిని పట్టు సడలించకుండా నిలుపుతోంది. అతను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆమెను కొంచెం ముందరకు రప్పించగలిగాడు. రెండు చేతులతో ఆమెను పైకి లాగటానికి ప్రయత్నించాడు. ఆమె మరింత చేరువగా వచ్చింది. ఆమెను తన బాహువుల్లో బంధించాడు. ఇప్పుడతనికిఆమెను రక్షించగలనన్న నమ్మకం కుదిరింది. తన పూర్తి బలాన్ని ఉపయోగించి ఆమెను పైకి లాగాడు. అతడామెను కాపాడగలిగాడు. ఆమె ఒడ్డుపైకి చేరుకుంది. తన ప్రయత్నం వృధా పోనందుకు ఆనందం వేసింది. ఇద్దరూ అలసిపోయారు. వెనక్కి చతికిలపడి సేదతీరారు. అతడామె వంక చూసాడు. ఆమెలో మునుపటి భయం కనిపించటంలేదు. అతనిపై నమ్మకం కుదిరింది. కొంతసేపటికి లేచి నిలబడింది. ఇంక వెళ్ళిపోదామన్నట్లుగా ముందుకు నడిచింది. అతడామెను అనుసరించాడు.
ప్రేమ తనంతట తాను పుట్టాల్సిందే తప్ప బలవంతాన ఒకరి మనసులో ప్రేమను చొప్పించలేం. అయితే మన ప్రవర్తన ద్వారా ఒక్కోసారి అవతలి వ్యక్తి విశ్వాసాన్ని చూరగొని చేరువ కావొచ్చు. ఆ విశ్వాసం తదుపరి కాలం ప్రేమగా మారవచ్చు. మారకపోనూవచ్చు.
అతడామె విశ్వాసాన్ని పొందగలిగాడు. ఆమె ముభావంగా ముందుకు నడుస్తుంది. ఆమె మనసులో రకరకాలైన ఆలోచనలు పరిగెడుతున్నాయి. సాధారణంగా మగవారు ఎలా ప్రవర్తిస్తారో ఆమెకు తెలుసు. అయితే అతడు మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాడని గ్రహించింది. తనపై అతడు అంత ప్రేమను ఎందుకు పెంచుకున్నాడో అర్ధం కాలేదు. అతడు తామిద్దరం ఒకరికోసం ఒకరు పుట్టామన్న విశ్వాసానికి వచ్చేసాడు. ఆమెకు మాత్రం కాలం గడుస్తున్న కొద్దీ అతడిపై ఇష్టం కలగసాగింది. ఆ ఇష్టం తనని రక్షించినందుకా? ఏమో!
ఆమె ఒకచోట ఆగింది. అక్కడ మంచినీటి కొలను ఉంది. తన దుస్తులను చూసుకుంది. శరీరమంతా బురద. అతని పరిస్థితీ అలానే ఉంది.
ఆమె కొలనులో కాలు పెట్టింది. నీరు చల్లగా తాకింది. వెన్నలంతా ఆ కొలనులో ప్రతిబింబిస్తుంది. జాబిల్లి ఆ కొలనులో బంధింపబడినట్లుగా కనిపిస్తుంది. ఆమె మరికొంచెం ముందుకి వెళ్ళింది. నీళ్ళు మోకాళ్ళ వరకు వచ్చాయి. ఆమె చేతులను నీటిపై తేలియాడిస్తూ వెనక్కి తిరిగి అతడివంక చూసింది. ఆమె స్నానం చేయబోతోందని అతడు గ్రహించాడు. ఆమె ఉద్దేశ్యం అర్ధమైనట్లుగా అక్కడినుండి దూరంగా పోయి కూర్చున్నాడు. ఆమె అతని వంక చూసింది. ఇప్పుడిప్పుడే అతని ప్రవర్తన ఆమెకు నచ్చుతోంది. అతడామెకు కనిపిస్తున్నాడు. కానీ వెనక్కి తిరిగి ఉన్నాడు. అతని సంస్కారం ఆమెను ఆకట్టుకుంది.
అతడి ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. తామెక్కడ ఉన్నదీ అతడు ఊహించలేకపోతున్నాడు. ఆమెను శిలపైకి విసిరివేసినట్లు, తాను కూడా క్రిందికి దూకినట్లు అతనికి గుర్తుంది. మరి తాము ఇక్కడకెలా వచ్చింది అతనికి అంతు చిక్కటంలేదు. ఆ ప్రదేశం అతడిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అక్కడ రాత్రికి ఉదయంలేదు. వెన్నెలకు కొదువలేదు. రేయి పొడుగునా వెన్నెల కురుస్తుంది. కాలం పొడుగునా రాత్రి మాత్రమే నిలుస్తోంది. అక్కడ తామిద్దరం తప్ప మానవ మాత్రుడెవరూ కనిపించటం లేదు.
ప్రేమికులు ఈ ప్రపంచానికి దూరంగా మూడవ వ్యక్తిలేని ఏకాంత ప్రదేశంలో ప్రేమించుకుంటూ గడపాలని కోరుకుంటారు. ఒకవేళ ఇది తమకోసం సృష్టించబడిన అటువంటి ప్రేమలోకమా? ఏమో! అయిఉండవచ్చు. తన ప్రేమకు అంత శక్తి ఉండనూవచ్చు. అదే నిజమైతే తామిద్దరూ యుగాల పొడవునా ఈ ప్రేమలోకంలోనే మిగిలి పోవాలి. తాము మరణించినా తమ మనస్సులు అక్కడే పరిభ్రమిస్తూ సదా ప్రేమించుకుంటూ ఉండిపోవాలి.
ఆమె స్నానం ముగించుకుని వచ్చింది.
ఆమె తడిబట్టల్లో ఉంది. రెండు చేతులలో కలువపూలను కోసుకు వచ్చింది. ఆ కలువల మధ్యన ఆమె ముఖపద్మం అతనికి పారిజాతంలా అనిపించింది. అతడు ఆమె పెదవుల వంక చూసాడు. చలికి వణుకుతున్న అధరాన్ని ఆమె మునిపంటికింద నొక్కి ఉంచింది. అతడు తన ఒంటిని చూసుకున్నాడు. తన పుట్టిన రోజున దుస్తులు బురదతో అపరిశుభ్రంగా కనిపించాయి. స్నానం చేసేందుకు నించున్నాడు.
ఆమె అతడు కూర్చున్న ప్రదేశంలోనే కూర్చుంది. అతడు స్నానానికై కొలనులో దిగాడు. ఆమె అలోచిస్తూ తన చేతిలోని కలువపూలను హారంగా చేయసాగింది. ఆమెకు అతడి స్వఛ్ఛమైన ప్రేమ అర్ధం అయ్యింది. ప్రేమించబడటం ఎంత గొప్ప విషయమో ఆమెకు తెలుసు. మనసులోనే అతడి ప్రేమను అంగీకరించుకుంది. అతడు తనని అంతగా ప్రేమించటానికి కారణం మాత్రం ఎంత ప్రయత్నించినా అర్ధం కాలేదు. బహుశా ప్రేమ అంటే అంతేనేమో! అతనితో గడపబోయే తన జీవితాన్ని ఊహించుకుంటూ ఒక మాలను పూర్తి చేసింది.
ఆమెకు ఆ ప్రదేశం తెలియనప్పటికీ అక్కడి ఏకాంతం, ప్రశాంతత ఎంతగానో నచ్చాయి. ఆ వెన్నెల నచ్చింది. అక్కడి ఆకాశం నచ్చింది. చీకటి నచ్చింది. అయితే ఆమె దానిని తమకై సృష్టింపబడిన ప్రేమలోకమని గుర్తించలేదు. వీలయినంత త్వరగా అక్కడినుండి బయట పడటం మంచిదనిపించింది.
ఆమె చేతిలోని రెండవ మాల పూర్తికాకుండానే ఆగిపోయింది. పూర్తికావటానికి మరొక్క కలువ తక్కువ వచ్చింది. అతడిని వచ్చేటప్పుడు మరో కలువ కోసుకు రమ్మని చెబుదామనుకుంది. అతడప్పటికే స్నానం ముగించుకుని బయటకు వస్తున్నాడు. సిగ్గు పడుతూ ఆమె పూర్తికాని మాలను ప్రక్కన పెట్టింది.
అతడామె చేరువగా వచ్చి కూర్చున్నాడు. ఆమె దుస్తులు ఇంకా ఆరలేదు. ఆమె కురులపై నుండి కారుతున్న నీటి బిందువులు అతని అరచేతులపై పడ్డాయి. అతడు తన అరచేతిని చుంబించాడు. ఆమె తల పైకెత్తలేదు. అతనికి చాలా విషయాలు చెప్పాలని ఉంది. తమ జన్మ జన్మల అనుబంధాన్ని ఆమెకు గుర్తు చేయాలని ఉంది. తన ప్రేమను నమ్మకపోతే హృదయం చీల్చి చూపించాలని ఉంది.
అతడామె ప్రక్కన ఉన్న కలువహారాలను చూసాడు. ఇంకా ఒక దండ పూర్తికాలేదు. ఆమె ఉద్దేశ్యం అర్ధం అయ్యింది. అప్రయత్నంగా అతని కళ్ళు ఆనందంతో చెమర్చాయి. తన ప్రేమ భగ్నం కాబోదు.
అతడు తక్కువైన కలువను తెచ్చేందుకు వెనక్కి తిరిగాడు. ఆమె అతని చేతిని పట్టుకుంది. ఆ మెత్తని స్పర్శకు అతడు ఆగిపోయాడు. తల తిప్పి ఆమె వంక చూసాడు. ఆమె ఇంకా తల దించుకునే ఉంది. తెలియని ఆనందాన్ని పంటి బిగువున దాచుకుని చిరునవ్వు చిందిస్తోంది. తన చూపుడు వేలిని ఆమె గడ్డానికి ఆన్చి నెమ్మదిగా ఆమె తల పైకి ఎత్తాడు. ఆమె కళ్ళు మూసుకుంది. పెదవులు సన్నగా కంపిస్తున్నాయి. కురుల నుండి జాలువారిన నీటి చుక్కలు చెక్కిళ్ళ మీదుగా ఆమె పెదవులను చేరుకుని అక్కడ ఆరిపోయాయి.
అతడామెకు మరింత చేరువగా వచ్చాడు. ఆమెలోని పరిపూర్ణమైన సౌందర్యాన్ని అతడు చూడసాగాడు. తనకై సృష్టింపబడిన సౌందర్యాన్ని ముద్దాడాలనిపించింది. ఆమెను తన కౌగిలిలోనికి తీసుకున్నాడు. ఆమె నిఛ్ఛ్వాస అతనికి వెచ్చని ఊపిరయ్యింది.
అతడామెను చుంబించాడు.
అతడు అంబరాన్ని చుంబించాడు. విశ్వ విజేత అయ్యాడు. భూమ్యాకాశాలను ఏకం చేస్తున్నాడు. సృష్టి స్థితిగతులను, ప్రకృతి లయజతులను శాసించగలుగుతున్నాడు. ఆమెను చుంబించిన వేళ వెన్నెల వేయి రెట్లయ్యింది. మంచు బిందువుల రూపంలో వెల్లువై కురిసింది. కాలం గాలితో పాటుగా ఆగి ఆ అనుభూతిని శాశ్వతం చేసింది.
అతడు తన బాహువులను సడలించాడు. ఆమె ఇంకా కళ్ళు తెరవలేదు. తొలి చుంబన మధురత్వాన్ని ఇంకా అనుభవిస్తూనే ఉంది. అతడు వెనక్కి నేలపై పడుకున్నాడు. ఎన్నడూ లేనంత ఆనందంగా ఉన్నాడు. అతనికిప్పుడు జీవితంలోని అస్పష్టతలన్నీ తొలగినట్లుగా అనిపించసాగింది. అతనికి నిద్ర వస్తోంది.
రేపన్నది లేని ఆ రేయిలో మరునాడు ఆమెను మనువాడదామని అనుకుంటూ, తమ గాంధర్వానికై ఆమె అల్లిన పూమాల కొరకు మరొక కలువ కోయాలని జ్ఞప్తికి తెచ్చుకుంటూ కళ్ళు మూసుకున్నాడు.
అతడికి మత్తుగా ఎటువంటి కలలూ రాని నిద్రపట్టింది.
**********
(సశేషం) తరువాయి భాగం - రేపటి వికాసంలో...
Subscribe to:
Post Comments (Atom)
8 comments:
బాగుంది ! ఊహ కాబట్టి లాజిక్ వెతకకూడదేమో తామర పూలు కలువపూలు అయినాయి, ఒక్క తామర తూడుతో ఒక్కొక్క దండ చేస్తారు కదా :)
అయ్యయ్యో... ఇది నా నిరక్ష్యరాస్యతకు నిలువెత్తు సాక్ష్యం. తామర పూవు, కలువ పూవు ఒకటి కాదాఅండీ? అలా అయితే అన్నీ కలువలని మార్చాలి. ఇక ఒక్క కలువతో దండెలా అవుతుందండీ?? మీ point నాకు అర్ధం కాలేదు :(
శ్రావ్య గారూ, అన్నట్లు ఊహ అని తేల్చేసారేంటి? ఇది ఊహ కాదు కధ వరకు యదార్ధమే...!
కలువపూలు , తామర పూలు వేర్వేరు కదా ? కలువపూలు రాత్రిపూట పూస్తాయి ! ఇప్పుడు మీరంటే నాకు doubt వస్తుంది let me check once!
ఇంతంకి ఏమిటి ఈ కథ నిజమా ? Really?
కధ కల్పితమేనండీ... అలా అని లాజిక్ మిస్ చేయలేను కదా... మీరు ఊహ అంటే నేను కన్ఫూజ్ అయ్యా. ఒకవేళ కధానాయకుడు కల కంటున్నాడనుంటున్నారేమో అని కధకు సంబంధించి ఇప్పటిదాకా జరిగింది ఊహ కాదన్నా!
BTW, తామరలను కలువలగా మార్చేసా! :)
అమ్మయ్య confim చేస్కున్నాను తామర - పగలు వికసిస్తుంది , ఎర్రగా ఉంటుంది , కలువ - రాత్రి వికసిస్తుంది తెల్లగా ఉంటుంది .
మీ కన్ఫర్మేషన్ కి ముందే నేను జాగ్రత్త పడిపోయా... :)
అన్నటు కలువలని మార్చటం పనికొచ్చిందండోయ్... లాజిక్ గా కూడా వారున్న చోట రాత్రి మాత్రమే ఉంటుంది.
Thanks అండీ!
తామర - పగలు వికసిస్తుంది , ఎర్రగా ఉంటుంది , కలువ - రాత్రి వికసిస్తుంది తెల్లగా ఉంటుంది .
baagundi!!
Post a Comment