వెన్నెల దట్టంగా కురుస్తోంది. అతడెన్నడూ లేనంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అతడిని ఏ విధమైన కలలూ కలవరపరచటంలేదు. ప్రశాంత వదనంతో రేపటికోసం ఎదురు చూస్తూ నిద్రిస్తున్నాడు. అతని ముఖంలో మళ్ళీ ఆమెను చూసే సమయం కోసం అతడు పడుతున్న ఆరాటం, ఆతృత స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వెన్నెల ఎంతగా కురుస్తున్నప్పటికినీ ఆ వెన్నెల వెనుక చీకటి అలముకుని ఉంటుంది. అది ఎప్పుడెప్పుడు వెన్నెలను కబళిద్దామా అని నిరీక్షిస్తూ లోకాన్ని అంధకారం చేయటానికి సిధ్ధంగా ఉంటుంది. జీవితమూ అంతే! ఒక్కోసారి అనుకోని సుఖపరిణామాలు సంభవిస్తూ ఉంటాయి. మన ప్రమేయం లేకుండానే మనసుని తట్టి చోటు చేసుకుంటాయి. అయితే ఆ ఆనందకర సంఘటనలు శాశ్వతం కాజాలవు. వాటి వెనుక ఎన్నో దుఃఖాలూ, అపజయాలూ పొంచి ఉంటాయి. అవకాశం చిక్కినప్పుడు నిర్దయగా కబళిస్తాయి. అతని జీవితం అందుకు మినహాయింపు కాదు.
అతనికి మెలుకువ వచ్చింది.
ప్రక్కన ఆమె కనిపించలేదు. అతని మనసు ఏదో కీడుని శంకించింది. ఒక్క ఉదుటన లేచి నిలబడ్డాడు. ఎటు పోవాలో తెలియని వాడిలా కాసేపు అన్ని ప్రక్కలా పరిగెత్తుకుంటూ పోయి చూసాడు ఆమె కనిపిస్తుందేమోనని. నిరాశే ఎదురయ్యింది.
ఆమె నిష్క్రమణం కల కాదు కదా?
ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయాడు. అతని చెక్కిళ్ళు కంపించసాగాయి. దవడలు చచ్చుబడినట్లుగా అనిపించింది. హృదయం పగిలి మనసు మొద్దుబారింది. అతనికి కళ్ళు తిరగటం ఆరంభించింది.
మోకాళ్ళపై కూలబడ్డాడు. తలదించుకున్నాడు. పొడవాటి కేశాలు ముఖాన్ని కప్పివేసి అతని భావాలను బయటకు తెలియనివ్వటంలేదు. కన్నీటి చుక్కలు కేశాల మీదుగా క్రిందికి జాలువారాయి.
ఆమె నగవు లేకపోయె - మూగబోయె ప్రకృతి
ఆమె స్పర్శ లేకపోయె - మౌనమయ్యింది జగతి
ఆమె చూపు కోసమై కలవరించసాగె నింగి
ఆమె రూపు ఎదుట లేక పరితపించె అతని మది
కాలం కష్టాలనే గాయాలను చేస్తూ కాటేసింది.
అతడు మళ్ళీ ఒంటరి అయ్యాడు.
కాసేపటికి అతను స్ధిమితపడ్డాడు. తనలాగనే ఆమె కూడా తన కోసం వ్యధ చెందుతూ ఉంటుందని సర్దిచెప్పుకున్నాడు. అతడామెను వెతకటానికి నిశ్చయించుకున్నాడు. తల త్రిప్పి పక్కకు చూసాడు. ఆమె పూర్తి చేయని కలువహారాలు అక్కడ ఉన్నాయి. అతనిప్పుడు పూర్వంలా ఉన్నాడు... ఏ భావమూ పలికించకుండా....!
కొలనులో దిగి ఒక కలువ కోసాడు. కారు మబ్బు కమ్మింది. అతనికి విశాల ఆకాశంలో ఆమె విచార వదనం అగుపడుతోంది.
వర్షం కురవటం మొదలయ్యింది.
అతడు తడుసుకుంటూ ఒడ్డుకు వచ్చాడు. తాను తెచ్చిన కలువతో హారాన్ని పూర్తిచేసి రెంటినీ మెడలో వేసుకున్నాడు. అప్పటికే తనువంతా తడిసి ముద్దయ్యింది.
గగనం గర్జించింది. అతనికి ఆ ఉరుముల చప్పుడులో ఆమె రోదన వినిపించింది.
అతని అన్వేషణ ప్రారంభమయ్యింది.
గమ్యం తెలియని పయనంలో గతాన్ని తలుచుకుంటూ తడుస్తూ నడుస్తూనే ఉన్నాడు. వాన చిలికి కుంభవృష్టి అయ్యింది. అతనికి జ్వరం వచ్చింది. అయితే అతని ప్రేమ తీవ్రత ముందు వెలవెలబోయింది. అతనోసారి తల పైకెత్తి చూసాడు.
ముక్కలైన తన మనసులాగనే చెక్కలయ్యిన మేఘాలు
ఉప్పొంగిన తన కన్నీటి లాగనే తెప్పరిల్లని వర్షాలు
మేఘం వర్షిస్తుంటే అతడు ఆ చినుకులలో ఆమె కన్నీటిని కనుగొన్నాడు. అతని కళ్ళు చెమ్మగిల్లి వాననీటితో పాటుగా క్రిందికి జారి కలిసిపోయాయి. అతను చాలా దూరం ప్రయాణించాడు. ఆమె జాడ తెలియలేదు.
వాన వెలసింది. వెన్నెల మాత్రం కురుస్తూనే ఉంది. అతనిలో నెమ్మదిగా వణుకు ప్రారంభమయ్యింది. జ్వరం వల్ల వచ్చిన చలి ప్రభావం అది. కప్పుకునేందుకు అతనికి ఒంటిపైనున్న తడి దుస్తులు తప్ప మరేవీ లేవు. భుజాలకు తగిలించుకునే పరదా కోసం తడుముకున్నాడు. అదీ దొరకలేదు. నడుస్తూనే చేతులు ముడుచుకోబోయాడు. కలువహారాలు నలిగిపోతున్నట్లుగా అనిపించింది. చేతులు క్రిందికి దించేసాడు.
అతనిది సాధారణ ప్రేమ అయిఉంటే బాగుండేది. అప్పుడైతే అతనికి జ్వరం తెలిసేది. అలసట తెలిసేది. ఆకలి తెలిసేది.
చూపు అంతమైన వరకు ఆమెను అన్వేషిస్తూనే ఉన్నాడు. ఆవహిస్తున్న నిస్సత్తువ లెక్కచేయకుండా గాలిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వర్షం పూర్తిగా ఆగిపోయింది. ఎప్పటిలా అంబరం గంభీరంగా వెన్నెలను విరజిమ్ముతూ ఉంది.
ఆ వెన్నెల కాచిన నిండు పున్నమి చంద్రునిలో అతడామె విషాద హృదయాన్ని చూస్తున్నాడు.
ఎవరైనా కనిపిస్తే ఆమె ఆచూకీ ఆడుగుదామనుకున్నాడు.
గాలి నడిగితే చెప్పలేదు ఆమె చిరునామా
మేఘాలనడిగితే గొంతు విప్పలేదు ఒక్కసారైనా
రేయి తప్ప పగలు తెలియని ఆ వెన్నెల లోకంలో అతడెన్ని దినాలు ఆమెను అన్వేషిస్తూ గడిపాడో తెలియటంలేదు.
తన ప్రేమకావ్యంలో ఈ ఘట్టం, ఆమె నిష్క్రమించిందన్న నిజం - కలలా కరిగిపోతే, మనసు నుండి చెరిగిపోతే, రెక్కలొచ్చి ఎగిరిపోతే, తనలాంటి ప్రేమికునికి బాధలు ఉండవు. ఆనందానికి ఆవధులుండవు.
అతనోసారి మెడవంక చూసుకున్నాడు. తామర పుష్పాలు వాడిపోసాగాయి. ఒక్కొక్క కలువ రాలనారంభించింది. ఆమెను కలవలేనేమోనన్న భయం వేసింది. బెంగ పట్టుకుంది. అతనో క్షణం ఆగిపోయాడు.
ఆ శూన్యంలో అతనికి ఎటు చూసినా ఒకే విధంగా కనిపిస్తోంది. కళ్ళు ఉండి గ్రుడ్డివాడయ్యాడు.
ఏ ప్రక్కకు పోవాలో తెలియక ఆగిపోయాడు. కాళ్ళు ఉండి కుంటి వాడయ్యాడు.
ఆమె ఆచూకీ నడిగేందుకు ఎవ్వరూ కనిపించలేదు. నోరుండి మూగవాడయ్యాడు.
అతనూహించుకున్న బంగారు భవిష్యత్తు ఫలించేలా అనిపించటంలేదు. అతను శాపగ్రస్తుడు అయ్యాడు.
అతడెక్కడో చుక్కల్లో ఆమె రూపాన్ని చూస్తున్నాడు.
చిక్కుల్లో తన బ్రతుకుని చూస్తున్నాడు.
దిక్కుల వంక దిక్కులు చూస్తున్నాడు.
బహుశా దక్కని దానికై అర్రులు చాస్తున్నాడేమో!
ఆమెను చూడకుండా ఒక క్షణమైనా ఉండలేని తనకు ఒకవేళ జీవితకాలం నిరీక్షణమా?
అతనా ఊహని సైతం తట్టుకోలేకపోయాడు. అతనో రచయిత అయిఉంటే తనలో జ్వలించే ప్రేమసెగలను గ్రంధస్త పరిస్తే ప్రతి సంపుటీ, ప్రతీ పదమూ ప్రేమతో నిండి ఉండేది. సర్వం విరహమయం అయి ఉండేది.
అతను మళ్ళీ నడవటం ప్రారంభించాడు. అతని అన్వేషణ తీవ్రమవుతోంది. అప్పటికే అతని మెడలోని తామరహారాలు పూర్తిగా రాలిపోయాయి.
నిస్సత్తువగా నడుస్తున్న అతని కాళ్ళు ఒకచోట ఆగిపోయాయి. అనంతం వరకు ఆమెను అన్వేషిస్తున్న అతని చూపు ఒక చోట నిలచిపోయింది. అతనికి ఎదురుగా కొంత దూరంలో శిల ఉంది. గంభీరంగా ఉంది. అచ్చం హృదయాకారంలో ఉంది. ఏదో రహస్యాన్ని తనలో ఇముడ్చుకున్నట్లుగా ఉంది. అతనిలో తెలియని ఆశ రేగింది.
అతను కళ్ళు తుడుచుకున్నాడు. శిల వైపు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాడు. అతనిలో ఆశ చిగురిస్తోంది. ఎందుకనో శిలని చూస్తుంటే అతనికి ఆఖరి మజిలీలా అనిపిస్తోంది. ఇంత కాలం తాను అన్వేషిస్తున్న గమ్యంలా కనిపిస్తోంది. అతనిలో ఉత్సాహం ప్రవేశించింది.
కలువ కోసేటందుకు కొలనులో దిగినప్పుడు కమ్మిన కారు మబ్బులో తాను చూసిన ఆమె విచార వదనాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆ విచార వదనం అతనికిప్పుడు సిగ్గుపడే ఆమె నగుమోములా అనిపిస్తోంది.
గగనం గర్జించినప్పుడు ఆ ఉరుముల చప్పుడులో ఆమె రోదన విన్నాడు. ఇప్పుడది ఆమె స్వాగతగీతికగా అర్ధమయ్యింది.
మేఘం వర్షిస్తుంటే, గతంలో అతను ఆమె కన్నీటిని ఆ వర్షపు చినుకులను కనుగొన్నాడు. ఇప్పుడా కన్నీటిని ఆమె అమృత ఆనందభాష్పాల వెల్లువలా - వల్లరిలా భావించసాగాడు.
వెన్నెల కాచిన చంద్రునిలో తాను చూసింది ఆమె విషాద హృదయం కాదని, మబ్బు తెరలు వీడిన ఆమె అపురూపమైన సౌందర్యమని గుర్తించాడు.
అతనికి ఆమెను చూస్తానన్న విశ్వాసం కలిగింది. ఏదో ఒకనాడు తమ కలయిక జరుగక మానదనిపించింది. ఈ జన్మలోనే... ఈ జగతిలోనే....!
శిలను చేరుకున్నాడు.
అతనికి స్వప్నాలు గుర్తుకువచ్చాయి. స్వప్నాల నాట్యం గుర్తుకు వచ్చింది. విలయ తాండవం గుర్తుకు వచ్చింది. చిన్నతనం నుండీ తాను చూస్తున్న శిల హృదయం తన వంక ప్రేమగా చూస్తున్నట్లు అనిపించింది. తనను అక్కున చేర్చుకోవటానికి తాపత్రయ పడుతున్నట్లు అనిపించింది.
అతనికి శిలను ముద్దాడాలనిపించింది. మోకాళ్ళపై కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. పెదవులతో శిలను చుంబించటానికి ముందుకు వంగాడు. అతని పెదవులు శిలను తాకలేదు.
అతను తల వెనక్కి తీసుకున్నాడు. అతనికేమీ అర్ధం కాలేదు. నెమ్మదిగా నించున్నాడు. శిలను నిశితంగా గమనించాడు. శిల ఎప్పటిలానే ఉంది. గంభీరంగా - సమస్త రహస్యాలూ తెలిసినట్లుగా!
అతను అనుమానంగా చేతిని పైకెత్తి శిలను తాక యత్నించాడు. అతని చేయి శూన్యంలోనికి పోయినట్లుగా శిలలోనికి స్వేఛ్ఛగా పోయింది.
చటుక్కున చేయి వెనక్కి లాక్కున్నాడు. అతనికంతా అయోమయంగా ఉంది. తనని ఆలింగనం చేసుకోవటానికి శిల ఆహ్వానిస్తున్నట్లుగా ఉంది.
అతను శిలను కావలించుకోవటానికి ప్రయత్నించాడు. దేహం శూన్యంలోనికి పోయినట్లుగా శిలను స్పర్శించకుండా వెళ్ళింది.
అతను శిలలోనికి ప్రవేశించాడు.
************
(సశేషం) తరువాయి భాగం - రేపటి వికాసంలో...
(సశేషం) తరువాయి భాగం - రేపటి వికాసంలో...
5 comments:
Waiting for the next part
అయ్యో ఏమైంది అంత జుంక్ కనపడుతుంది :( "-" ఈ సింబల్ తప్ప ఏమి కనపడటం లేదు .
శ్రావ్య గారూ! సారీ, ముందు బాగానే పబ్లిష్ అయ్యింది. అయితే మళ్ళీ చూస్తే కలువలని తామర అని రాసినట్లు గ్రహించా :) సరిదిద్దే ప్రయత్నంలో ఫాంట్ సైజ్ మారి అలా తయారయ్యింది. ఇప్పుడు సరిచేసా!
బాగుంది ! కథ లో గ్రాఫిక్స్ కూడా ఉన్నాయా :)
(ఈ ప్రశ్నకి నేను అందరు డైరెక్టర్స్ చెప్పినట్లే చెబుతాను)కధ డిమాండ్ ని బట్టే గ్రాఫిక్స్ ఉపయోగించాము. :)
Post a Comment