శిల - 7 వ భాగము


తను శిలలో ప్రవేశించాడు. అతని కంటికి ఏమీ కనిపించలేదు. అలా అని అంధకారంగా లేదు. కళ్ళ ముందు అంతా ప్రకాశవంతంగా ఉంది. ఆ తేజస్సుని అతని కళ్ళు భరించలేకపోతున్నాయి. ఓ అడుగు ముందుకు వేసాడు.

అతడు బయటకు వచ్చాడు.

అతడిప్పుడు శిలకు మరో ప్రక్క ఉన్నాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు.

'ప్రేమ అంతటి శక్తిమంతమైనదా? ప్రేమ కోసం భగవంతుడు ఇలాంటి అద్భుతాలు సృష్టించి తన కోసం కేటాయించి ఉంచాడా?' అతడికి ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలో తెలియలేదు. ఏ విధంగా చెప్పాలో తెలియలేదు.

ఓ సారి చుట్టూ పరికించి చూసాడు. తానిప్పుడు ఎడారిలో ఉన్నాడు. ఎటుచూసినా ఇసుక పసుపుపచ్చని రంగులో కనిపిస్తుంది. ఇక్కడ వెన్నెల కురవటంలేదు. ఎండ కాస్తోంది. ఆ ఎండ ఎడారిపై పడి మరింత పసుపు వర్ణంలో కనిపిస్తోంది. అసలతని కంటికి అక్కడ మరో వర్ణమేదీ కనిపించలేదు. నీలాకాశం తప్ప. ఆకాశంలో మబ్బులు కూడా లేవు. అలా పూర్తి నీలివర్ణంలో మబ్బులు లేకుండా ఆకాశాన్ని అతడు అరుదుగా చూసాడు. అప్పుడు కూడా ఇంతటి నీలివర్ణాన్ని చూడలేదు. ఎక్కడో అనంతం వద్ద ఆ నీలివర్ణం ఎడారిని ముద్దాడుతూ రెండు రంగులనీ విభజించి ఏకం చేస్తోంది.

అతడు వెనక్కి తిరిగి శిలను చూసాడు. శిలను కృతజ్ఞతా పూర్వకంగా నిమిరాడు. అతని చేతికి శిల మృదువుగా తగిలింది. అతడికి శిలను ముద్దాడదామనిపించింది. కళ్ళు మూసుకున్నాడు. రెండు చేతులను ఆన్చి శిలను చుంబించాడు. వెచ్చని శిల స్పర్శ అతని పెదవులను తాకింది.

అతనికి కర్తవ్యం గుర్తుకువచ్చింది. లేచి నిలబడ్డాడు. వెనక్కి తిరిగి మరోసారి శిల వంక ప్రేమగా చూసాడు. అతని చూపులు శిలకు శెలవు చెబుతున్నట్లుగా ఉన్నాయి. కళ్ళతో వీడ్కోలు చెబుతూ ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టాడతడు.

చాలా మంది ఒంటరితనాన్ని అనుభవిస్తారు. ప్రేమని అనుభవిస్తారు. విరహాన్ని అనుభవిస్తారు. అయితే అందరిలోనూ ఈ భావాలు ఒకే విధంగా ఉండవు. వాటి తీవ్రత ఒక్కొక్కరిలోనూ ఒక్కో విధంగా ఉంటుంది. ఆ భావాల తీవ్రతని అనుభవించని వారు ప్రేమను తప్ప మిగిలినవాటిని అంతగా ఇష్టపడరు. వారికి విరహం, ఒంటరితనం కంటకంగా అగుపిస్తాయి. కానీ ప్రేమలోని తీవ్రతను స్పృశించిన వారు ఒంటరితనాన్ని, విరహాన్ని కూడా ఆస్వాదిస్తారు. ఒక ప్రక్క తమ ప్రేయసి నిరీక్షణలో తీవ్రఒత్తిడికి గురిఅవుతూనే మరో ప్రక్క తమకోసం ఆ భగవంతుడు పెట్టిన పరీక్షగా భావిస్తూ హృదయంలో ప్రేమను ప్రబలం చేసుకుంటారు. అలాంటి వారికి మిగతా ఆనంద సమయాల్లో కూడా ఆ విరహ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి తెలియని సంతృప్తిని మిగిలుస్తాయి.

అతడికి ఆమెను పొందగలనన్న నమ్మకం ఏర్పడింది. అందుకే అతనంత కాలం భరించిన విరహ వేదన తీయని అనుభూతిని ఇస్తోంది.

'కలువ మాలలుంటే బాగుండేది.' అతను మెడ తడుముకున్నాడు. ఆమె కనిపిస్తే తనని చూసి ఎంత ఆనందపడుతుందో అతని ఊహకు అందటంలేదు. వదనంలో చిరు దరహాసం మెదిలింది.

అతని అన్వేషణ పునఃప్రారంభమయ్యింది. అయితే ఇప్పుడు నూతనోత్సాహంతో ఉన్నాడు. ఆమె తప్పని సరిగా కనిపించి తీరుతుందన్న ధీమాతో ఉన్నాడు. అక్కడే ఎక్కడో తనతో ఆమె దాగుడుమూతలు ఆడుతున్నట్లుగా భావించాడు.

ఆ ఎడారిని చూస్తే అతనికి తన అన్వేషణ, నిరీక్షణ గుర్తుకు వస్తున్నాయి. ఎవరికోసమో అక్కడి ఇసుక దిబ్బలు ఎదురుచూస్తున్నట్లుగా అనిపించింది.

ఇసుక కుప్పలు - ఎదురు తిప్పలు
ఇసుక దిన్నెలు - ఎదురు తెన్నులు

ఆ ఎడారిని తన జీవితంతో అన్వయించుకున్నాడు.

అతనికి ఎండమావులు గుర్తుకు వచ్చాయి.

ఆమె ఉనికి ఎండమావి కాబోదు కదా...!

అతను నడుస్తూ చాలా దూరం వచ్చేసాడు. అతడు పొరబడ్డాడు. తాను ఉన్నది ఎడారిలో కాదు...సముద్రపుటొడ్డున. అయితే సముద్రం ఎంత విశాలంగా ఉందో అదే విధంగా ఇసుక కూడా అనంతంగా పరచి ఉంది. అందుకే తాను దానిని ఎడారిగా భ్రమించాడు.

అతనిదివరకెప్పుడూ సముద్రాన్ని చూసి ఉండలేదు. కధల్లో విన్నాడు. కానీ కళ్ళారా చూడటం ఇదే తొలిసారి. అతనికి సాగరాన్ని చూడాలన్న కోరిక కలిగింది. సముద్రం ఇంకా చాలా దూరంలో ఉంది. అతని నడకలో వేగం హెచ్చింది.

సముద్రం ఒడ్డుకు చేరుకున్నాడు.

అతనికా సంద్రం చాలా చిత్రంగా అనిపించింది. కెరటాలు విచిత్రంగా అనిపించాయి. అలలను చూస్తే బహుశా తన ప్రేయసిని అందుకోవటం కోసం సముద్రం పడుతున్న ఆరాటమేమోననిపించింది. అంతటి విశాలమైన సంద్రాన్ని చూస్తే అతనికి తన ప్రేమ గుర్తుకు వచ్చింది. తనది ఇంతకంటే విశాలమైన ప్రేమ. ఆకాశమంతటి విశాలమైన ప్రేమ. అతను గాలిలో చేతులు చాచి పైకి చూసాడు. ఇప్పుడిప్పుడే ఆకాశంలో తెల్లని దూదిపింజెలవలే నున్న మేఘాలు అడుగిడుతున్నాయి. కాసేపు మైమరచి అలలో ఒదిగిపోదామనుకున్నాడు. ఆమె కనిపించాక, ఆమెతో కలసి ఆ అలల్లో కేరింతలు కొట్టవచ్చని అనుకుంటూ ఆ అలోచన వాయిదా వేసుకున్నాడు.

అతనికి కాసేపు అసహనంగా అనిపించింది. ఆమె దాగుడుమూతలిక కట్టిపెడితే బాగుండేది. తాను వచ్చి చాలా సేపయ్యింది. ఇప్పటికే విరహాన్ని భరించలేకున్నాడు. ఆమె వస్తే ఆమాంతం కౌగిలోనికి తీసుకుని ఏడవాలని ఉంది. ఇన్నాళ్ళూ తనలో రేగిన విరహాన్ని వర్ణించాలని ఉంది. కలువహారాలను తేలేకపోయినందుకు క్షమాపణ అడగాలని ఉంది. అంతలోనే తన్ను వదలి వచ్చినందుకు అలిగి కూర్చోవాలని ఉంది.

అతను విసుగ్గా సముద్రంకేసి చూసాడు. గాలీ, మేఘాలే కాదు... ఆ తరంగాలు కూడా ఆమె అచూకీ చెప్పటంలేదు. క్షణం క్రితం వరకు ఉన్న సముద్రం మీది ఆసక్తి పోయింది. ఆమెను ధ్యానిస్తూ నడక ప్రారంభించాడు. ఆమె రాక కోసం ఉబలాటపడుతున్నాడు.

దూరంగా అతడికి ఒక వ్యక్తి ఉనికి కనిపించింది. అతనిలో అతృత రేగింది. బహుశా ఆమెయే అయి ఉండి ఉంటుంది. ఈ ప్రదేశంలో వేరే వారెవరూ కనిపించే ఆస్కారం లేదు. అసలు తమ ప్రేమకావ్యంలోనూ, లోకంలోనూ అన్యులకు ప్రవేశమే లేదు.

అతనిలో ఆనందం చోటు చేసుకుంది. గట్టిగా ఆమెను ఎలుగెత్తి పిలవాలని ఉంది. కానీ ఆమె పేరు తెలియదు. తానెంతగానో ఇష్టపడే 'శిల' పేరుతో పిలుద్దామనుకున్నాడు. కానీ ఎందుకనో మౌనంగా ఊరుకుండిపోయాడు.

అయితే ఆ దృశ్యం చేరువయ్యే కొద్దీ వారు ఇద్దరని అతను గమనించాడు. అతని చూపు తీక్షణమయ్యింది.

అతనామె ఎంత దూరంలో ఉన్నా సరే పోల్చుకోగలడు. బ్రహ్మ ఆమెలాంటి రూపురేఖలతో ఎందరిని పోత పోసి తన ముందు నిలిపినా వారందరిలోనూ తన ప్రేయసిని గుర్తించగలడు. తన హృదయాన్ని గుర్తించటంలో సమస్య ఏముంది? తాము ఇరువురం కాము. తనువులు వేరయినా తమ మనస్సులు ఒక్కటే. హృదయ స్పందనలు ఒక్కటే. తమ కళ్ళు పలికించే భావాలు ఒక్కటే.

అతడామెను గుర్తించాడు. తన అన్వేషణ ఫలించబోతున్నందుకు అతనికి సంతోషం కలుగలేదు. ఆమె ప్రక్కన నడుస్తోన్న వ్యక్తిని చూసి అతని మనసు చిన్నబోయింది.

ఆమె ఇప్పుడు వేరే దుస్తులు ధరించి ఉంది. దేవకన్యలా కనిపిస్తోంది.సాధారణంగా స్త్రీలు ధరించే కృత్రిమ అలంకరణ ఒక్కటి కూడా లేదు. ఆమె ముఖంలో ఉట్టిపడుతున్న తేజస్సు చాలును ఆమెకు కృత్రిమ అలంకరణలు ఏవీ అవసరంలేదు అని చెప్పటానికి. పలుచని నీలవర్ణపు బట్టను పొందికగా కట్టుకుంది. ఆమె పాదాల స్పర్శకు ఇసుక రేణువులు పులకరిస్తున్నాయి. ఆమె చిందించే చిరునవ్వుల కోసం పిన్నగాలులు కలవరిస్తున్నాయి. ఆమె అందెలను తాకేందుకు అలలు తపిస్తున్నాయి. ముడి వేయని కురులు స్వేఛ్ఛగా గాలికి ఎగురుతూ ఆమె అందం అంబరాన్నే అబ్బురపరుస్తోంది.

ఆమె అచ్చం ప్రకృతిలా ఉంది. అయితే పక్కన పురుషుని స్ధానంలో తాను లేడు. ఒక అపరిచితుడు ఆమెను అక్కున చేర్చుకుని నడుస్తున్నాడు. ఆమె ఆ వ్యక్తి గుండెలకు తలఆన్చి అతని అడుగులో అడుగు వేస్తోంది.

అతడు పరుగులాంటి నడకతో వారిని చేరుకున్నాడు.

********
(సశేషం) తరువాయి భాగం - రేపటి వికాసంలో...

3 comments:

sunita said...

కధలో ట్విస్టా??బాగుంది.

Sravya V said...

ట్విస్ట్ బాగుంది !

బృహఃస్పతి said...

సునీత గారూ, శ్రావ్య గారూ,
టాంకూ అండీ...! :)