మర్మగీతం
సందేహి సంచారం మొదలయ్యింది. దేశదేశాలన్నీ చుట్టి వచ్చాడు. దట్టమైన ఘీకారణ్యాలలో సంచరించాడు. ఎడారులలో, మంచు పర్వతాలలో ప్రయాణించాడు. ప్రసిధ్ధ పుణ్యక్షేత్రాలనూ, నదులనూ సందర్శించాడు. అర్ధంకాని అస్పష్ట స్వప్నాలలో విహరించాడు. కానీ అతని సందేహాలేవీ తీరలేదు.
అమావాస్య వచ్చింది. అమావాస్యతో పాటుగా సందేహి 'మర్మగర్భ' చేరాడు. మర్మగర్భ ప్రజలు అతడ్ని సాదరంగా అహ్వానించారు. మర్మగర్భ పాలకుడు అన్వేషి, సందేహిని తన ఏకాంతంలో పిలిపించుకున్నాడు.
వారిరువురి మధ్య సంభాషణ సాగింది.
"నీ రాకలోని ఆంతర్యం?" అన్వేషి ప్రశ్నించాడు.
"తెలియదు"
"నీ స్వస్ధలం?"
"తెలియదు"
"నీ గమ్యం?"
"తెలియదు"
"అసలింతకీ నీవెవరవు?" చివరి ప్రశ్న అడిగాడు.
సందేహి తల దించుకున్నాడు.
"అది తెలుసుకుందామనే వచ్చాను." జవాబు చెప్పాడతడు.
అన్వేషి కళ్ళు మెరిసాయి. "మంచిది. మన అభిప్రాయాలు కలిసాయి. మన మన లక్ష్యాలు నెరవేరే వరకు నీవు మా ఆతిధ్యం స్వీకరించాలి"
సందేహి మౌనం అంగీకారమైంది.
అన్వేషి సహపంక్తిలో ఆ రాత్రి సందేహికి విందు ఏర్పాటు అయ్యింది. విందు ముగిసిన వెంటనే సందేహికి రాజలాంఛనాలతో అన్వేషి ప్రాసాదం ప్రక్కనే ఉన్న అతిధి గృహంలో ఆతిధ్యం ఇవ్వబడింది.
అయితే ఆ రాత్రి రెండవ ఝాము గడిచే సరికి సందేహికి నిద్రాభంగం అయ్యింది.
ఆ అర్ధరాత్రి సమయంలో ఎవరో గునపంతో తవ్వుతున్న చప్పుడుకి సందేహికి మెలకువ వచ్చింది.
సందేహి వసారాలోనికి వచ్చి శబ్దం విన్నాడు. అన్వేషి నివాసంలో నుంచి అతనికి ఖణేల్ ఖణేల్ మంటూ తవ్వుతున్న చప్పుడు వినపడింది. అతనికేమీ అర్ధం కాలేదు. ఆకాశం వంక చూసాడు. అమావాస్య కావటంచే చీకటి దట్టంగా ఉంది.
నేరుగా అన్వేషి నివాసానికి వెళ్ళాడు. అన్వేషి ఏకాంత మందిరంలో నుండి ఆ శబ్దం వస్తున్నట్లు గ్రహించాడు. సందేహి తలుపు తోసుకుని అన్వేషి ఏకాంత మందిరంలోనికి ప్రవేశించాడు.
ఆక్కడి దృశ్యం సందేహిని ఆశ్చర్యపరచింది. అన్వేషి తన శయనాగారాన్ని ప్రక్కకు జరిపి ఆ ప్రదేశంలో పెద్ద సొరంగం తవ్వుతూ కనిపించాడు. సందేహి ఆశ్చర్యంగా సొరంగం వద్దకు చేరి లోనికి తొంగి చూసాడు.
సందేహి రాకను ఊహించిన వాడల్లే అన్వేషి అతని వంక ఓ చిరునవ్వు నవ్వి, గునపాన్ని ప్రక్కకు విసిరి కాగడాతో పైకి వచ్చాడు.
“తమకు నిద్రాభంగం కలిగించినట్లుంది నా కార్యం?” సందేహిని అడిగాడు.
సందేహి సొరంగం లోనికి మరొక సారి తొంగి చూసాడు. ఆది సొరంగం వలే కాక వెడల్పుగా మరింత లోతుగా ఉన్న గోతివలే ఉంది.
“మీరేం చేస్తున్నారు?” ప్రశ్నించాడు అన్వేషిని.
“శోధిస్తున్నాను.”
“దేనిని?” మళ్ళీ ప్రశ్నించాడు సందేహి.
“రహస్యాన్ని”
“ఏ రహస్యాన్ని”
అన్వేషికి ఆ ప్రశ్న అర్ధం కాలేదు.
“చెప్పాగా రహస్యాన్నని. ఏ రహస్యమో తెలిస్తే, అది రహస్యం ఎలా అవుతుంది?” తిరిగి ప్రశ్నించాడు.
సందేహికి ఆ సమాధానం అర్ధం అయ్యింది.
“అయితే ఇక్కడే వెతకటం దేనికి?” మళ్ళీ ప్రశ్నించాడు.
అన్వేషి మౌనంగా రెండడుగులు నడచి నోరు విప్పాడు.
“నా కంటికి సృష్టి యావత్తూ నగ్నంగా కనపడుతోంది. ఈ గాలి, ఈ ఆకాశం, మబ్బులు, వనాలూ అన్నీ వలువలు ఊడదీసినంత స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ ప్రకృతిలో నాకే రహస్యమూ ఉన్నట్లుగా అనిపించలేదు. అందుకే నా కాలి క్రింద ఏమైనా రహస్యముందేమోనని ఈ అన్వేషణ” అన్వేషి ముగించాడు.
“రహస్యముందో లేదో కూడా తెలియనప్పుడు ఈ అన్వేషణ పట్ల ఆసక్తి ఎందుకు?” సందేహి ప్రశ్నించాడు.
అన్వేషి సందేహి ప్రశ్నకు అడ్డు తగిలాడు.
“నాకీ రహస్యం పట్ల ఆసక్తి లేదు.”
ఓ క్షణకాలం సందేహి ఆశ్చర్యపోయాడు.
“అయితే ఈ ప్రయాస అంతా దేనికోసం?” ప్రశ్నించాడు.
అన్వేషి కాసేపాగి సంభాషణ కొనసాగించాడు.
“నేనీ కార్యాన్ని బాధ్యతగా తలంచాను. రోజూ దీపాలను ఆర్పే వేళ ప్రారంభించి మూడవ ఝాము ముగిసేదాకా తవ్వుతాను. మూడవ ఝాము కాగానే పని ప్రక్కన పెట్టి తెల్లారే వరకు ఈ గోతిలో నిద్రిస్తాను.”
“ఎన్నాళ్ళ నుంచి ఇలా చేస్తున్నారు?” సందేహి ప్రశ్నించాడు.
“నా పదహారవ ఏట నుండి తవ్వుతున్నాను. మొదట్లో ఎంతో మమకారంతో తవ్వే వాడ్ని. తరువాత కాలం గడిచే కొద్దీ, యాంత్రికంగా తవ్వటం అలవాటయ్యింది.” గోతిని చూస్తూ అన్వేషి జవాబిచ్చాడు.
“బాధ్యతగా భావించానన్నారు. ఎవరు అప్పగించిన బాధ్యత ఇది?” సందేహి మళ్ళీ ప్రశ్నించాడు.
"ఎవరో అప్పగించినది కాదిది. నాకై నేనుగా ప్రారంభించాను." ఓ లిప్తపాటు కాలం అన్వేషి గోతి వంక చూసి కొనసాగించాడు. "ఆ ప్రారంభాన్ని ఏకాంతంలో నా కాలి క్రిందనే మొదలుపెట్టాను."
“ఈ గోతిలో నిద్రించటం దేనికి?” సందేహి ప్రశ్నించాడు.
అన్వేషి తలదించుకున్నాడు. అతని వదనంలో కొంత దుఃఖం వ్యక్తమయ్యింది.
“నా చిన్నతనంలోనే నా తల్లి పోయింది.” జవాబిచ్చాడు. “ఈ గోతిలో నిద్రిస్తే నా తల్లి ఒడిలో పడుకున్నట్లు ఉంటుంది."
సందేహికి ఏం ప్రశ్నించాలో తెలియలేదు.
మౌనంగా కాసేపు చుట్టూ పరికించి చూసాడు. అతని చూపు ఓ నాలుగడుగుల దూరాన ఉన్న రాతి స్తంభం దగ్గర ఆగింది.
ఓ సారి అన్వేషి వంక చూసాడు. అన్వేషి ఇంకా తల దించుకుని ఏదో ఆలోచిస్తున్నాడు. సందేహి స్తంభం వంక చూసాడు. స్తంభం చాటు నుండి ఎవరో తమను గమనిస్తున్నారు. స్తంభం వెనుకనున్న గోడపై ఆ వ్యక్తి నీడ అస్పష్టంగా కనపడుతోంది. సందేహి మనసు కీడు శంకించింది. మెల్లగా అన్వేషి దగ్గరగా వచ్చి భుజం తట్టాడు.
“ఆ స్తంభం వెనుకన మనల్ని ఎవరో గమనిస్తున్నట్లుగా ఉంది.”
అన్వేషి తల పైకెత్తాడు.సందేహి చెప్పిన స్తంభం వైపు దృష్టి సారించాడు. ఓ ముసుగు మనిషి తమ సంభాషణ ఆసాంతం వినటానికి ప్రయత్నిస్తున్నట్లు అన్వేషికి అర్ధం అయ్యింది. పిడికిలి బిగించాడు. కనుబొమలు ముడిపడ్డాయి. దృష్టి తీక్షణం చేసాడు.
“నీవు ఆ ప్రక్క నుండి వెళ్ళు. నేను ఈ ప్రక్కగా వచ్చి ఆ ఆగంతుకుణ్ణి బంధిస్తాను.” సందేహికి ఆఙ్ఞాపించినట్లుగా అన్నాడు.
సందేహి మౌనంగా అన్వేషి మాటలను పాటించాడు.
ఒక్క ఉదుటన తనపై పడ్డ ఇద్దరి బారి నుండి ఆ ముసుగు మనిషి తప్పించుకోలేకపోయాడు. సందేహి రాకను గమనించి మరో ప్రక్కకు పారిపోతూ అన్వేషి చేతికి చిక్కాడు.
అన్వేషి ముసుగు మనిషిని వెనుకనుండి తన బాహువులలో బంధించి సందేహి సహాయం కోరాడు. సందేహి సహాయంతో ముసుగు మనిషిని క్రిందకు పడవేసి ఆ ఆగంతుకుని ఛాతీ పై కూర్చున్నాడు. ఆతని కుడి చేతిని తన ఎడమ చేతితో బంధించి, తన కుడి మోకాలిని అతని ఎడమచేతిపై బిగించి పిడిబాకుని అతని గుండెలకాన్చగా, సందేహి కాగడా పట్టుకుని వచ్చి ఆ ఆగంతకుని ముఖానికి ఉన్న ముసుగుని తొలగించాడు.
ఒక అపరిచితుడు అతి ప్రశాంత వదనంతో తాను బంధింపబడతానని ఊహించినవాడల్లే నవ్వుతూ కనిపించాడు.
ఆ అపరిచితుని చిరునవ్వు చూసి అన్వేషి మండిపడ్డాడు.
“ఎవరు నీవు?” కరుగ్గా గద్దించాడు.
“చెప్పు నీవెవరవు?” సందేహి రెట్టించాడు.
ఆ అపరిచితుడు క్షణకాలం ఇద్దరినీ పరికించి చూసి బదులిచ్చాడు.
“నేను సత్యాన్ని”
అన్వేషి కళ్ళు ఆనందంగా మెరిసాయి.
‘సత్యం’ స్వగతం అనుకుంటూ సందేహి వంక చూసి “ ఇన్నాళ్ళ నా శ్రమ వృధా కాలేదు. నీ సహచర్యంలో నా శోధనకు సార్ధకత లభించింది. నా అన్వేషణ అర్ధవంతమయ్యింది.” అన్నాడు.
సందేహి అన్వేషికి బదులిచ్చాడు.
“ఇన్నాళ్ళ నా గమ్యం తెలియని గమనానికి ఇప్పుడిప్పుడే సరియైన బాట స్పష్టంగా గోచరమౌతోంది. బహుశా మీ మర్మగర్భమే నా చివరి మజిలీ కావొచ్చు.”
“ముందు వీడ్ని గోతిలో పడవేద్దాం అక్కడైతే తప్పించుకోవటం వీనికి సాధ్యం కాదు. తరువాత వీణ్ణి తీరిగ్గా పరిశోధించుకోవచ్చు.” అన్వేషి ఆనందం, ఆదుర్దా కలగలిపిన భావం పలికిస్తూ అన్నాడు.
సత్యం వారి సంభాషణకు అడ్డు తగిలాడు.
“పరిశోధిస్తారా?”
అన్వేషి - సందేహి ముఖముఖాలు చూసుకున్నారు.
“అవును” బదులిచ్చారు.
“నన్నా?” సత్యం మళ్ళీ ప్రశ్నించాడు.
ఇరువురూ అతని వైపు ఆశ్చర్యంగా చూసారు.
ఆతడు తనలో తాను నవ్వుకున్నట్లుగా వారిద్దరినీ చులకన చేసే విధంగా నవ్వాడు.
అన్వేషికి కోపం వచ్చింది.
“ఎందుకు నవ్వుతున్నావ్?” గద్దించాడు.
సత్యం బదులు చెప్పలేదు. తల ప్రక్కకు తిప్పి గాలిలో చూస్తూ మళ్ళీ తనలో తాను నవ్వుకుంటూ బదులిచ్చాడు.
“వినాశకాలే విపరీత బుద్దే”
అన్వేషికి ఒక అపరిచితుడు తనని పరిహసిస్తున్నట్లుగా అనిపించింది. తాను ప్రభువునని గుర్తుకు వచ్చింది. అహం వచ్చింది.
సత్యాన్ని గోతి వద్దకు ఈడ్చుకుంటూ తీసుకుపోయాడు. సత్యాన్ని గోతిలో పడవేసాడు. చేతులు దులుపుకుని సందేహి వంక చూసాడు.
“ఇన్నాళ్ళూ సఫలం అవుతుందో లేదో తెలియని నా కార్యం నీ రాకతో కొలిక్కి వచ్చింది. బహుశా మనిద్దరి భావాలూ, అభిరుచులూ, అభిప్రాయాలూ ఏకీభవించటం వల్లనే ఇది సాధ్య పడిందేమో? నా ఈ ఒంటరి జీవితంలో వసంతాన్ని నింపిన నీ మేలు ఎన్నటికీ మరువలేను.”
సందేహి అన్వేషిని కావలించుకున్నాడు. ఆతని కళ్ళు చెమర్చి ఉన్నాయి.
ఓ క్షణమాగి గోతివంక చూసి సందేహి ఆనందంతో చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంటూ బడులిచ్చాడు.
“ఇక పరిశోధన ప్రారంభిద్దామా?”
అన్వేషి తల పంకించాడు.
ఇద్దరూ గోతిలోనికి దిగి నిశ్చేష్టులయ్యారు. ఆక్కడ వారికి సత్యం కనిపించలేదు.
అన్వేషి తల పట్టుకున్నాడు. సందేహి కాగడా తీసుకుని వెతికాడు.
“పై నుంచి పారిపోయే అవకాశమే లేదు. మరే త్రోవా లేదు కనుక మరో విధంగా జారిపోయే ఆస్కారం లేదు. ఇతడేమయినట్లు?” కసిగా, కోపంగా అన్వేషి తనకు తాను బిగ్గరగా ప్రశ్నించుకున్నాడు.
సందేహి కాసేపటికి స్థిమిత పడ్డాడు. ఆతని వదనంలో క్షణం క్రితం ఉన్న ఆదుర్దా మాయమయ్యింది. శూన్యం లోనికి చూస్తూ అన్వేషితో మాట్లాడాడు.
“ఇది నా చివరి మజిలీ అని భ్రమించాను. నా అనంత పయనం మళ్ళీ కొనసాగించక తప్పదు.”
అన్వేషి కి ధుఃఖం పొంగుకు వచ్చింది.
“నా జీవితంలో నీ అధ్యాయం ఎన్నటికీ ముగిసిపోకూడదు.” సందేహి చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డాడు అన్వేషి.
సందేహి సందేహంలో పడ్డాడు. ఆతను తన ప్రయాణాన్ని కొనసాగించాలో వద్దో తేల్చుకోలేకపోయాడు.
అన్వేషి సందేహిని ప్రార్ధించాడు.
“నీవు విడిచి పోతే తిరిగి ఒంటరినవుతాను. ఇక్కడే సమాధినవుతాను.”
సందేహి అన్వేషికి తోడుగా ఉండడానికి నిర్ణయించుకున్నాడు.
“అయితే మన కర్తవ్యం?” ప్రశ్నించాడు అన్వేషిని.
అన్వేషి గునపాన్ని చేతిలోనికి తీసుకుని బదులిచ్చాడు.
“శోధన”
“బాధ్యత గా భావించనా?” సందేహి ప్రశ్నించాడు.
“ఉహూ!”
“మరి?!”
“లక్ష్యంగా భావిద్దాం” గునపాన్ని నేలలోనికి దింపుతూ అన్వేషి పలికాడు.
సందేహి కాగడాను ప్రక్కన తగిలించి పలుగును పట్టాడు.
ఇద్దరూ నిర్విరామంగా నిద్రాహారాలు మాని నిరంతరం శోధిస్తూనే ఉన్నారు. రేయింబవళ్ళు పొడుగునా తవ్వుతూనే ఉన్నారు.
అలుపనేదే ఎరుగక, ఆసక్తి అణుమాత్రమైనా కోల్పోక తవ్వుతూనే ఉండిపోయారు.
రోజులు, మాసాలూ గడిచినై.
ఋతువులు గడిచినై.
ఏండ్లు పూండ్లు గడిచినై.
శకాలు గడిచినై.
మర్మగర్భ శిధిలమై సముద్రమయ్యింది.
వారిరువురు యుగాల తరబడి శోధిస్తూనే మిగిలిపోయారు.
Subscribe to:
Post Comments (Atom)
16 comments:
మరి సత్యం జాడ ఎప్పుడు దొరికినట్లు?
రవి గారూ, ధన్యవాదాలు. సందేహి, అన్వేషి అన్నవారు మన మనసులోని భావాలు. సందేహం, అన్వేషణ అన్నవి మన అంతరంగంలో కొలువున్ననాడే సత్యం ఆచూకీని కనుగొనగలం. ఏ ఒక్కని ద్వారా మాత్రమే ఈ సత్యం బోధపడదు. రెండూ కావలసిందే. సత్యశోధన అన్నది ఒక నిరంతర ప్రయాణం. 'నాకు సత్యం చిక్కింది' అనుకున్న రోజున అది మన నుంచి అంతర్ధానమౌతుంది.
chaalaa baavuMdi
Good post!!!
బాగుంది. 'నిజంతో కాసేపు' అని నేనిదివరలో వ్రాసిన రచన జ్ఞాపకం తెప్పించారండి నాకు.
ముసుగులో ఉన్నావు ఎవరు నీవు?
నీలో సగాన్ని, నీ ఇజంలో సగాన్ని.
అంటే నిజానివా?
అది నువ్వు పెట్టిన పేరే.
నిజం తప్ప ఏ ఇజమూ నిజం కాదా?
నిజం కాని అన్ని ఇజాలు అబద్ధాలే.
నువ్వు సగం ఇజానివన్నావు అంటే సగం అబద్ధమనేగా?
కాదు నీ ఇజంలో నిజమైన సగం ఇజాన్ని
అంటే, నా ఇజంలో సగం నిజం ఉన్నట్లేగా!
మాటల గారడీ చాలు. అబద్ధంతో కలసిన నిజం కాబట్టి, నీ ఇజం అబద్ధం.
సరే, అసలెందుకు వచ్చావు?
నేను రాలేదు. నువ్వే తొంగి చూసావు.
నీ మాట తప్ప, నువ్వు కనిపించవా?
చీకటిని కప్పుకున్న నిజాన్ని, నువ్వు చూడలేవు.
బయటకు రాలేని పిరికివాడివా?
బయటపడితే భరించలేవు.
బెదిరిస్తున్నావా?
బందిఖానాలో పెట్టింది నువ్వే.
ఆడుకోటానికి ఇంద్రధనుస్సు ఇస్తా, నిన్ను చూడనిస్తావా?
అబద్ధాన్ని కాదు ఆడుకోటానికి.
ఏం చేస్తే నిన్ను చూడగలను?
ఒక్క నిజం చెప్పు.
నిజం తెలియని మనిషిని, ఏ నిజం చెప్పను?
ఆ నిజం చాలు... చూడు....
అంత వికృతంగా ఉన్నావే?
నీ మనసులో చచ్చిపోయిన సగం మనిషిని.. నీ ఆలోచనల్లో పెరుగుతున్న సగం జంతువుని.
చాలు ఇక, ఆ చీకటినే కప్పుకో... నేను భరించలేను.
సాయికిరణ్ గారూ, ధన్యవాదాలు. ప్లస్ X మైనస్ = మైనస్ అయినట్లు, సత్యాలతో అసత్యం సాంగత్యం చేస్తే మిగిలేది అబధ్ధమేనని అద్భుతంగా చెప్పారు. నిజాన్ని భరించలేక చీకటిని కప్పుకోమనటం మనిషి స్వభావంపై ఛెళ్ళున కొట్టినట్లనిపించింది.
చాల బాగుంది
"నీకెంత రాంక్ వస్తుందిరా" - తండ్రి ప్రశ్న
"రెండు లోపు" - కొడుకు సమాధానం
==
మీ కధ కూడా అంతే, భలే రాసారు.
@ చైతన్య, సృజన, చిన్ని మరియూ ప్రదీప్: ధన్యవాదాలు
బాగుందండీ. అంతా పకడ్బందీగా రాశారు గానీ. అన్వేషికి కలలో కంపించి చెప్పడం కథ మూడ్‌కి సెట్ అవలేదు (అన్వేషులు irrationalist కారుగా కలల్ని ఫాలో అవడానికి). మరేవిధంగానైనా మార్చి చూడండి.
బుడుగు గారూ, కామెంటినందుకు ధన్యవాదాలు.
సందేహాలు లేని అన్వేషణకి కారణాలు తెలియవు. అందుకే అన్వేషిని ఎందుకు అన్వేషించాలో తెలియనివాడిలా, సందేహిని ఎక్కడ అన్వేషించాలో తెలియనివాడిలా చూపించాను. ఇద్దరూ కలిస్తేనే 'ఎందుకు' 'ఎక్కడ' అన్న ప్రశ్నలకు ఒక్కచోట సమాధానం దొరికి 'ఏమిటి'(సత్యం)ని చూపిస్తాయి.
అయితే మీరన్నట్లు మూడ్ కి సెట్ అవ్వలేదన్నది నిజం కావచ్చు... అక్కడ సూటయ్యే సంభాషణ కోసం ప్రయత్నిస్తాను.
chalaa bagaa chepparu kani kalo chepparu ane kanna inkedaina baguntundemo
@ Ram: ధన్యవాదాలు. ఆ కలలో కనపడి చెప్పారన్న వాక్యం పంటి కింద రాయేనని బుడుగు గారు చెప్పగానే నాకు అర్ధమయ్యింది. తప్పకుండా మారుస్తాను. (సజిషన్ ఏదైనా ఉంటే ఇవ్వరూ..)
Bruhaspathi Garu
I do not have Telugu font to write in but my suggestion is
According to you Anveshi Doesn't know what is he suppose to search, but he started looking for some thing, when he doesn't know what exactly he is searching for also he doesn't even know where to begin!! so, may be, he started from his bed room or (right under his foot)
వేణుగోపాల్ గారూ, మీ సూచన చాలా బాగున్నది. అంధుకు అనుగుణంగా సంభాషణ మార్చి రాసాను. విలువైన అభిప్రాయాలను తెలియజేసినందుకు ధన్యవాదములు.
chaalaa baagundi.
Post a Comment