శిల - తుది



తడు శిలను స్పృశించాడు. అతని చేతికి శిల మృదువుగా తగిలింది. శిలను తన పెదవులతో చుంబించాడు. పెదవులకి వెచ్చని స్పర్శ తాకింది.

అతని చర్యలను శిల ముభావంగా చూస్తోంది.

అతడు శిలలో ప్రవేశించటానికి సిధ్ధమయ్యాడు. శిలలోనికి చేతిని పోనిచ్చాడు. అతని చేయి లోనికి ప్రవేశించలేదు. శిల మొరటుగా అడ్డుకుంది. అతనికి భయం వేసింది. రెండు చేతులను శిలపై ఆన్చి గుండెలతో ఢీకొన్నాడు. అతడిని శిల అనుమతించలేదు.

అతనికంతా అయోమయంగా ఉంది. చెప్పలేనంత బాధగా ఉంది. దుఃఖం కలుగుతోంది.

చివరకు శిల కూడా తనని మోసగిస్తోంది. చిన్నప్పటినుండి తననెరిగిన శిల సైతం తన పట్ల క్రూరంగా ప్రవర్తిస్తోంది.

ఏదేమైనా అతడు శిలలో ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు. నిజానికి అతనిలో ఏమంత శక్తిలేదు. అయినా ప్రయత్నించటానికి నిశ్చయించుకున్నాడు. శిలను బలంగా గుండెలతో ఢీకున్నాడు. అతని ఛాతీ శిలకు తగిలి గుండెలనుండి రక్తం స్రవిస్తోంది. అతడు తన మోకాళ్ళను శిలలోనికి చొప్పించటానికి ప్రయత్నించాడు. మోకాళ్ళు రక్తసిక్తమయ్యాయి. మతి భ్రమించినవాడి వలే కనిపిస్తున్నాడు.

అతనికి స్పృహ తప్పుతోంది. కళ్ళముందు లీలగా శిల హృదయం కనిపిస్తోంది. తనను ఆహ్వానిస్తోంది. తనలో ఐక్యం చేసుకోవటానికి పిలుస్తోంది. ఆమె చెంతకు చేరుస్తానన్నట్లుగా మాటిస్తోంది.

అతడు తలతో శిలను బలంగా ఢీకున్నాడు. నొసలు చిట్లి నెత్తురు కారింది. రక్తం శిలపై చింది శిలను నెత్తుటి మయం చేస్తోంది. నెత్తురు శిలమీదుగా క్రిందికి జారి ఇసుకలో కలిసిపోతోంది.

అతడిలో సత్తువ ఉడిగిపోతోంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. హృదయం మాత్రం ఆమె గురించే ఆలోచిస్తోంది. తొలిసారి చూసిన సంఘటనను గుర్తుకు తెస్తోంది.

మేలి ముసుగులో నర్తిస్తున్న ఆమెను తాను చేయి పట్టుకుని ఆపినట్లు జ్ఞాపకం వస్తోంది.

ఆమెను భుజాలపై వేసుకుని మేనాలో పడుకోబెట్టినట్లు జ్ఞాపకం వస్తోంది.

ఆమెను నిర్భందించినట్లు జ్ఞాపకం వస్తోంది.

ఆమెను శిలపై విసిరేసినప్పుడు తనను గాయపరచిన శూలలు జ్ఞప్తికి వస్తున్నాయి.

ఒక అపరిచితుని కౌగిలిలో నున్న ఆమె తనను గుర్తుపట్టని సంఘటన జ్ఞాపకం వచ్చింది.

అతడు బలంగా తలను శిలపై మోదాడు.

శిలలో చలనం లేదు. అతని తల మాత్రం పగిలిపోయింది. నెత్తురు ధారాళంగా ఉబికి వచ్చింది. శిలపైనున్న అన్ని ఒంపులలోనూ ప్రవహించి ఇసుకలో ఇంకిపోవటానికి క్రిందికి జాలువారుతోంది.

అతనిలో శిల తనను అనుమతిస్తుందన్న ఆశ చావలేదు. అంచేతనే తన ప్రయత్నాన్ని ఉధృతం చేస్తున్నాడు. మరోసారి తన ముఖాన్ని శిలకేసి మోదాడు. నాశిక చిట్లి నెత్తుటి చారలు చెక్కిలిపై ఆరిపోయాయి. పెదవులు తెగి పళ్ళు రాలిపోయాయి.

అతను చూడటానికి చాలా భయం గొలుపుతూ ఉన్నాడు. ముఖం అంతా నెత్తుటి మయంతో ఒళ్ళంతా గాయాలతో ఉన్నాడు. అతని కళ్ళు మాత్రం తేజస్సును విరజిమ్ముతూ ఉన్నాయి. మునుపటి కంటే ప్రకాశవంతంగా ఉన్నాయి. అతనిలో శక్తి క్షీణిస్తున్న కొద్దీ అతని కళ్ళు మరింత తేజోపేతంగా తయారవుతున్నాయి.

అతనికి అంతిమ ఘడియలు సమీపించాయి. నిజానికి అతనికి చావాలని లేదు. ఎలానైనా సరే తన ప్రేమలోకంలోనికి ప్రవేశించి ఆమెను పొందాలన్న కోరికతో ఉన్నాడు. అందుకు ఏకైక ఆధారం శిల. అందుకనే శిలలో ప్రవేశించటానికి శాయశక్తులా కృషి చేస్తున్నాడు.

బురదలో పాలరాతి శిల్పంలా పడిఉన్న ఆమె రూపం గుర్తుకు వచ్చింది. తలను మరోసారి శిలకేసి మోదాడు.

ఊబిలో నుండి ఆమెను రక్షించినప్పుడు ఆమెను కౌగిలించుకున్న క్షణాలను గుర్తుకు తెచ్చుకున్నాడు.

ఆమె తన ప్రియుని గుండెలపై తలనాన్చి నడవటం గుర్తుకు తెచ్చుకున్నాడు.

తమకోసం ఆమె అల్లిన కలువహారాలు జ్ఞాపకం వచ్చాయి.

చివరగా ఆమెను చుంబించిన సంఘటన గుర్తు చేసుకున్నాడు.

అప్రయత్నంగా అతని పెదవులు మూతబడ్డాయి. శక్తిలేనట్లుగా శిలపై తల వాల్చాడు. అతడి పెదవులు శిలను ముద్దాడాయి. తేజస్సును విరజిమ్మే అతని కళ్ళు నిర్జీవంగా శూన్యంలోనికి చూస్తూ ఉండిపోయాయి.

అతనిలో జీవం ఆరిపోయింది. క్షణంలో రాలేందుకు తారలు లేవు. అతడిని చూసి కన్నీళ్ళు కార్చేందుకు మానవమాత్రులెవరూ దరిదాపుల్లో లేరు. అతడు శిలపై నిర్జీవంగా పడి ఉన్నాడు. తన చేతులను శిలపై చాచి కావలించుకోవటానికి ప్రయత్నిస్తున్న భంగిమలో శిలను చుంబిస్తూ శవమయ్యాడు.

అతని అవశేషం తన తల్లి ఒడిలో సేద తీరుతున్నంత ప్రశాంతంగా నిద్రిస్తోంది.

అతని కళ్ళల్లో మాత్రం ఆమెను కలుసుకోలేకపోయానన్న క్షోభ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కళ్ళు ఆమె కోసం నిరీక్షిస్తున్న భావనను ప్రతిబింబిస్తున్నాయి.

అతనిలో ఆరిపోయిన ప్రాణం శిలలో ప్రవేశించినట్లుగా శిల క్షణకాలం వెలుగును చిమ్మింది.

శిల హృదయం ఇప్పుడు జాలిగొలుపుతూ ఉంది. విలపిస్తున్నట్లుగా ఉంది. అతడిని ఒడిలో చేర్చుకుని నిస్సహాయంగా కన్నీరు కారుస్తున్నట్లుగా ఉంది.

ఔను! అతని నెత్తుటి చారల ప్రక్కనే శిల కార్చిన కన్నీరు క్రిందికి జాలువారి ఇసుకలో కలిసిపోతోంది.

********

సమాప్తం

********

కరగక తప్పదుగా...
కదలక తప్పదుగా...

కన్నీటి గాధలకు,

కటిక శిలైనా...
కర్కశులైనా...

కటిక శిలైనా...
కర్కశులైనా...

*********

8 comments:

బృహఃస్పతి said...

ప్రస్తుతం, దేశయాటనలో ఉన్నాను. :) కామెంట్స్ మంగళవారం అప్రూవ్ చేస్తాను.
శిల ముగింపులో నేను కృతజ్ఞతలు తెలుపుకోవలసింది ఇద్దరికి... వారు సునీత గారు, మరియూ శ్రావ్య గారు. మీ ఇద్దరి వ్యాఖ్యలూ లేని పక్షంలో శిల మధ్యలోనే ఆపేసేవాణ్ణేమో! మీ ఇద్దరికీ ధన్యవాదాలు.
నా తరహా కధలు విసిగించకుండా ఉంటే మళ్ళీ మరి కొన్ని కధలతో త్వరలో వస్తాను. అంతవరకూ చల్తే చల్తే మెరే యే శిల యాద్ రఖ్ నా.... :)

Sravya V said...

బాగుంది ! మొత్తానికి ఊహించినట్లు విషాదాంతం చేసారన్నమాట :(
విజయదశమి శుభాకాంక్షలు !

sreenika said...

ఎంటో మనసంతా అదోలా అయి పోయింది.
మరోచరిత్రనుండి ఈ రోజు వరకూ ప్రేమకధలన్నీ విషాదాంతాలే. ఆ విషయం తెలిసి కూడా ఇంకా ఇంకా చదవాలనే అనిపిస్తుంది. I think that is the power of love.
అనుభవం లోంచి జాలు వారిన అక్షరాలు గుండె నిండా ఆవేదనని, కంటి నిండా జలపాతాలని నింపుతుంది.
'శిల' నే కంటతడి పెట్టించారు.
చదువుతూంటే ఇదో అక్షరమాల లా లేదు. దృశ్య మాలిక లా ఉంది.
మీనుండి మరిన్ని ఆశిస్తూ....
మీ అభిమాని.

sunita said...

కధ ముగింపు మరీ విషాదం, నాయిక ఏమైఉంటుందో కొంచం క్లారిటీ ఉంటే బాగుండేది. ఇంకా మంచి మంచి కధలు రాయండి.

బృహఃస్పతి said...

శ్రావ్యగారూ, మీరు విషాదాంతాన్ని ఊహించేసారా? :(

ఈ విజయదశమికి మధుర మీనాక్షమ్మవారి సన్నిధిలో ఉన్నానండి.:)

బృహఃస్పతి said...

శ్రీనికగారు, మీ కవితలకు నేను ఫేన్నండీ...:) మీకు 'శిల' నచ్చటం చాలా సంతోషం కలిగించింది.

బృహఃస్పతి said...

సునీత గారూ, మీరు మళ్ళీ కరెక్ట్ గేప్ పట్టేసారు. :) శిల ఒరిజినల్ వెర్షన్ కు నేను రాసుకున్న కధ ప్రకారం కధానాయకుడు మరణించిన తరువాత 'ఆమె' అక్కడకు చేరుకుని దుఃఖంతో అదేవిధంగా ప్రాణత్యాగం చేస్తుంది. కట్ చేస్తే ఊరి ప్రజలు కోట దగ్గరున్న శిల వద్దనుండి ఇద్దరి మృతదేహాలను తొలగిస్తారు. ఇలా టైమ్ తో సంబంధం లేకుండా వాళ్ళు దూకినప్పటి నుండి మరణించే వరకు జరిగిన ఒక సెకను కాలంలో ప్రేమ కధగా (ఇది వివరించటం కొంచెం కష్టం లెండి) శిల ట్రై చేసాను. అయితే కధ కన్వెన్సివ్ గా లేకపోవటంతో వన్ సైడ్ లవ్ గానే మార్చి ముగించాను. :)

Sravya V said...

అవునండి "శిల" టైటిల్ వలనో మరి ఎందుకో మరి విషాదాంతమే అని ఫిక్స్ అయ్యాను !