...మజిలీ కధ - 6


మావయ్య వెళ్ళటం అమ్మమ్మ, వాణత్త చూడలేదు. నాకు ఏమీ అర్ధం కాలేదు. వీధి గుమ్మంలో నించుని చూస్తూ ఉండిపోయాను. ఒంటికన్ను రాక్షసుడు బయటకు పోయాడు. లోపల నుంచి ఆ ఆడావిడ నవ్వులు వినిపించాయి. మావయ్య కూడా నవ్వుతున్నాడు. 'ఇహిహి' అంటూ. ఒంటికన్ను రాక్షసుడు కాసేపటికి ఓ సంచితో వచ్చాడు. సంచి నుండి సీసాల చప్పుడు వినిపించింది. బయట కూర్చున్న మంత్రగత్తె ముసిలిది నన్ను పిలిచి తినేందుకు ఏదో చేతిలో పెట్టబోయింది. నేను పరుగున లోపలికి వచ్చేసాను. వాణత్త దగ్గరకు వెళ్ళి ఏదో రహస్యం చెబుతున్నట్లుగా, కొత్త విషయం కనుగొన్నట్లుగా కళ్ళింత చేసుకుని చెప్పాను.

"మావయ్య ఎదురింట్లోకి వెళ్ళాడు"

వాణత్త కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. వాణత్త ఏడవటం మొదటిసారి చూసాను. అమ్మ చెప్తే వినటమే తప్ప స్వయంగా ఎప్పుడూ చూడలేదు వాణత్త ఏడవటం. మమ్మల్నెప్పుడూ ఆడిపిస్తూ, నవ్విస్తూ మాకు ముద్దలు పెట్టి మేం జాంపళ్ళు కోస్తే కొంగు పట్టే అత్త మాత్రమే తెలుసు నాకప్పటి దాకా. నన్ను నేను చాలా తిట్టుకున్నాను ఆ విషయం చెప్పినందుకు. అక్కడ ఉండాలనిపించలేదు. మరుసటిరోజు పొద్దున్నే మా ఊరొచ్చేసాను.

మళ్ళీ చదువులు మొదలయ్యాయి. మావయ్య ప్రస్తావన ఎప్పటికప్పుడు ఇంట్లో వస్తూనే ఉంది.

ఓ రోజున వాణత్త వాళ్ళ నాన్నగారు వచ్చారు ఇంటికి. వచ్చినాయన నాన్నని, అమ్మని తీసుకుపోయారు. అమ్మమ్మ వాళ్ళింటికనీ, సాయంత్రానికల్లా వచ్చేస్తామని చెప్పి వెళ్ళింది అమ్మ. అమ్మ వచ్చాక చాలా విషయాలు తెలిసినై.

వాణత్త ఇక అమ్మమ్మ వాళ్ళింట్లో ఉండదుట. వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళిపోయిందిట. అమ్మమ్మ మొన్నెప్పుడో మేడ ఎక్కుతూ కాలు జారి పడ్డదట. అయితే పెద్దగా దెబ్బలేవీ తగల్లేదట. మావయ్య సంగతి వచ్చేసరికి అమ్మ అదోలా అయిపోయింది. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా అంది.

"ఏవిటో!! శవంలా కనిపిస్తున్నాడు. దరిద్రుడు... మరి మారడు." దరిద్రుడు అన్నప్పుడు ఎంతో ఆప్యాయతని, దుఃఖాన్ని కలగలిపి అన్నట్లనిపించింది.

రోజులు గడిచాయి. చాలా తొందరగా... అసలు గడుస్తున్న విషయమే జ్ఞప్తికి రాకుండా. ఈ మధ్య కాలంలో చాలా విశేషాలు జరిగాయి.

పక్క రాష్ట్రంలో ఎవరో ఏదో మందు మంత్రించి ఇస్తారని, అది వేసుకుంటే ఛస్తే ఇక వ్యసనాల జోలికి పోరని, మావయ్యని చిన్నాన్న అక్కడకు తీసుకుపోయాడు. అయితే మావయ్య ఆ మందుని మింగకుండా ఊసేసాడుట.

మరి కొన్నాళ్ళకు అయ్యప్పమాల వేస్తే బాగుపడతాడని ఎవరో చెప్తే, అమ్మమ్మ పట్టుబట్టి మాల వేయించింది. సరిగ్గా ఆ సమయంలోనే ఇంటికి టెలిగ్రాం వచ్చింది. నాకు పదో తరగతి పరీక్షలు ఇంకా రెండు నెలల్లో ఉన్నాయనగా. దాని సారాంశం మావయ్యకు బాగాలేదని. అమ్మా, నాన్న చూట్టానికి వెళ్ళారు. వాళ్ళు వచ్చాక తెలిసింది. మావయ్య ఇక ఎక్కువ కాలం బ్రతకడని. అయినా అమ్మమ్మ వైజాగు తీసుకు వెళ్దామందిట. సాయం కోసం నన్ను పంపమంటే నాన్న నాకు పరీక్షలున్నాయన్నాడుట.

అమ్మ మాత్రం నిర్ణయం నాకే వదిలేసింది. నేను వెళ్ళటానికి నిశ్చయించుకున్నాను. నాన్న ఏమీ అనలేదు. అమ్మ బుగ్గన ముద్దు పెట్టింది.

నిజానికి పెదనాన్న కొడుకు రాజుగాడు వెళ్ళాల్సిఉంది. అయితే వాడెక్కడో హాస్టల్ లో దూరాన చదువుకుంటూ ఉండటం వల్ల కుదరలేదు. బయట వాళ్ళు డబ్బులు కోసమే తప్ప సరిగ్గా సాయం చేయరని అమ్మమ్మ వద్దంది. అదీగాక అమ్మమ్మ చదువుకోలేదు కనుక ఎవరైనా మోసం చేస్తారని భయం.

వెళ్ళేముందు నేను సబ్జెక్టు పుస్తకాలు తీసుకుని పోయాను. అయితే హాస్పిటల్లో మావయ్య పరిస్థితి నన్ను కనీసం పుస్తకాలను ముట్టుకోనీయలేదు.

**********
సశేషం - మిగతా కధ రేపటి వికాసంలో...

8 comments:

చావాకిరణ్ said...

బాగా వ్రాస్తున్నారు. తరువాతి భాగాలు కోసం ఎదురు చూస్తున్నా

sunita said...

DiTTO with chaavaa kiraN.

Sravya Vattikuti said...

బాగుంది !

భావన said...

చిన్నప్పుడు మా ఇంటిపక్క బాబురావు విజయక్క వాళ్ళు వుండే వారు.. వాళ్ళ కధ చదువుతున్నట్లు వుంది.. నిజం గా ఈ మందు పెట్టటాలు ఇలాంటివి వుంటాయి అంటారా? ఏమో లే ఏది ఏమైనా కధ బాగా చెపుతున్నారు.

బృహఃస్పతి said...

చావాకిరణ్, సునీత, శ్రావ్యగారూ, ధన్యవాదాలు.

భావన గారూ, మీరే మందు గురించి మాట్లాడుతున్నారు? వ్యసనాలు మాన్పించే మందా? వశీకరణ మందా? ఇటువంటివి నేను నమ్మనప్పటికీ ఇలాంటివన్నీ నేను చిన్నప్పుడు విన్నాను. తాగుడు మాన్పించటానికి ఒరిస్సాలో కిళ్ళీలో ఏదో మందు వేసి ఇచ్చేవారుట. అలానే నల్లమందు తరహాలో ఏదో ఒక ముద్ద చేసేవారుట. అది నెత్తిన రుద్దితే మనుషులు ఆ రుద్దినవారు చెప్పినట్లు వినేవారుట. నాకంత నమ్మకంలేకనే ఇతర పాత్రల ద్వారానో, లేదూ 'అట' అంటూనే ఈ విషయాలు చెప్పాను.

మీరు చూసిన జీవితాలని ఈ కధకి అన్వయించుకున్నారంటే నా శ్రమ ఫలించినట్లే. ఇప్పటి జెనరేషన్లో లేకపోయినా ఇలాంటి వాళ్ళు 80/90'స్ వరకు వీధి కొకళ్ళు ఉండేవారు.

cartheek said...

bruhaspathi gaaru namaskaaraalu.
bhaagaa rasthunnaru....
kada bagundandi.

రాజశేఖరుని విజయ్ శర్మ said...

ఈ విరుగుడు మందు మా భద్రాచల ప్రాంతంలో కూడా ఉందిట. కానీ అది ఎవరికీ పనిచేసిన దాఖలాలు లేవు. కానీ అటువంటి పసరు మందు వల్ల తాగుబోతులుగా మారారు అని కొందరి గురించి మావాళ్లు చెప్పుకునే వారు.

" అమ్మ బుగ్గన ముద్దు పెట్టింది "

అన్నప్పుడు ఎందుకో కళ్లల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. :)

బృహఃస్పతి said...

కార్తీక్ గారూ, ధన్యవాదాలు.

"అమ్మ బుగ్గన ముద్దు పెట్టింది" అన్నప్పుడు ఎందుకో కళ్లల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. :)

శర్మ గారూ, నా ప్రతీ కధలో కొన్ని విషయాలు మనసుకు హత్తుకోవాలని తీవ్రంగా మధనపడి రాస్తానండీ. ఆ ప్రయత్నం ఇలా సత్ఫలితాన్ని ఇస్తే అంతకంటే ఆనందమేముందండీ."