...మజిలీ కధ - 7

క్కోసారి మావయ్య పిచ్చిపిచ్చిగా మాట్లాడేవాడు. గాలిలో వేలు చూపిస్తూ ఎవరికో ఏవో సలహాలిస్తూ ఉండేవాడు. ఒంటిమీద బట్టలు కూడా సరిగ్గా ఉంచుకునేవాడు కాదు. సుగర్ ఎక్కువ కావటం చేత వచ్చిన పిచ్చి అని డాక్టరు చెప్పారు. తప్పని సరై డబ్బులెక్కువైనా స్పెషల్ వార్డ్ లో చేర్చాల్సి వచ్చింది మిగిలిన రోగులకు ఇబ్బంది కలుగకుండా. అమ్మమ్మ పరిస్థితి నిజంగా వర్ణనాతీతం. మాటల్లో చెప్పలేని సేవలు చేసింది మావయ్యకి. పసిబిడ్డకు చేయాల్సిన సపర్యలన్నీ చేసింది. నాకు ఒక్కోసారి కళ్ళు తిరిగి వాంతు వచ్చేది సేవలు చూస్తుంటే. అక్కడ ఉండలేక సముద్రం ఒడ్డుకు పోయి ఇసుకలో పిచ్చాడికి మల్లే నడిచేవాడిని. హాస్పిటల్లో ఉన్న నెల్లాళ్ళూ నరకం అనుభవించానంటే అతిశయం కాదేమో. అక్కడే మురికిలో దుప్పటి పరుచుకుని క్రిందన పడుకునేవాణ్ణి. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా మావయ్య వేసే కేకలకి, చూసే పిచ్చి చూపులకి భయపడేవాణ్ణి.

పగలంతా ఎవరో ఒకరు వస్తూ ఉండేవారు మావయ్యని చూడటానికి. ఓసారి పిన్ని వాళ్ళు వచ్చారు. పెదనాన్నవాళ్ళూ వచ్చారు. గంట కూర్చుని వెళ్ళిపోయారు. మరో రోజు వాణత్త, వాళ్ళ అమ్మా, నాన్న వచ్చారు. వాణత్త ఏడ్చుకుంది. వాళ్ళూ గంట కూర్చుని వెళ్ళిపోయారు.

తెలివిలో ఉన్నప్పుడు మాత్రం మావయ్య అక్కడ నర్సులకి, అందరికీ నా గురించి గొప్పగా చెబుతుండేవాడు.

"మా మేనల్లుడు చదువులో ఫస్టు" అనేవాడు.

"వాళ్ళ స్కూలు క్రికెట్ టీమ్ కెప్టన్"

"బొమ్మలు చాలా బాగా వేస్తాడు. కవితలు బాగా అల్లుతాడు. దేని మీదనైనా సరే."

ఇదీ వరస.

డాక్టరు మావయ్యని పరీక్షించి ఇంటికి తీసుకుపోవచ్చన్నాడు. అయితే మరెప్పుడూ తాగకూడదని హెచ్చరించాడు. సుగర్, బి.పి. అన్నీ హెచ్చు స్థాయిలో ఉన్నాయిట. తాగుడు మానేస్తేనే బ్రతికే అవకాశం ఉందన్నాడు.

మొత్తానికి హాస్పిటల్ నుంచి బయటపడ్డాడు మావయ్య.

నేను కూడా అదృష్టం కొద్దీ పరీక్షలు బాగా రాసాను. సెలవుల్లో మావయ్య దగ్గరకు వెళ్ళాను.

అయితే అక్కడ పరిస్థితి నేను ఊహించిన దానికి భిన్నంగా ఉంది.

హాస్పిటల్లో చేసిన సేవలన్నీ అమ్మమ్మ ఇంటి దగ్గర చేస్తోంది. మావయ్య మాత్రం అమ్మమ్మని తిడుతూ ఉన్నాడు. ఎదురింటి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి సొంత ఇంటికి వెళ్ళిపోయారు. ఒంటికన్ను రాక్షసుడు అప్పుడప్పుడూ వచ్చి సీసాలు గలగలలాడే సంచి ఇస్తూ ఉండేవాడు. అమ్మమ్మతో పోట్లాడైనా సరే మావయ్య వాడికి డబ్బులిస్తూ ఉండేవాడు. మావయ్య జీవితం ఒక్క ముక్కలో చెప్పాలంటే లాటరీ టికెట్టులా నడుస్తూఉంది. నాకక్కడ ఉండాలనిపించలేదు. అమ్మమ్మ బ్రతిమాలినా వినకుండా వచ్చేసాను. వచ్చే ముందు మావయ్య నా జేబులో వంద నోటు లాక్కున్నాడు తనకా అధికారం ఉందన్నట్లుగా.

నేను వచ్చిన వారం రోజులకే మళ్ళీ టెలిగ్రామ్ వచ్చింది, మావయ్యకు బాగాలేదని. అమ్మా, నాన్న వెళ్ళారు. పరిస్థితి మరింత దిగజారిందంట. అప్పటికే మావయ్యని వరండాలో వేసేసారట. బ్రతికితే విడ్డూరమే అన్నారు డాక్టర్లు. అమ్మమ్మ వైజాగు తీసుకు వెళ్దామంది. నన్ను సాయం పంపమంది. అమ్మ వచ్చి చెప్పింది. నిర్ణయం నాకే వదిలేసింది.

"నేను ఛస్తే వెళ్ళను." దృఢంగా చెప్పాను

"వాడి ముఖం కూడా చూడను" మావయ్యని వాడు అని అంత తేలికగా ఎలా అన్నానో నాకే అర్ధం కాలేదు.

అమ్మ నిర్లిప్తంగా చూసింది. మునుపటిలా ముద్దు పెట్టుకోలేదు, కోప్పడనూ లేదు.

తర్వాత తెలిసింది అమ్మమ్మ ఒక్కతే మావయ్యని వైజాగు తీసుకుపోయిందిట.

**********
సశేషం - చివరి భాగం రేపటి వికాసంలో...

6 comments:

నాలోనేను said...

ఇవాళే అన్ని భాగాలు ఏకబిగిన చదివాను. చాలా బాగా రాశారు. మద్యం, మగువ రెండూ మనిషిని పాతాళానికి ఎలా తోసుకుపోతాయో చెప్ప గలిగారు. వీటి వలలో చిక్కుకున్న వారి గతి, వారి చుట్టూ వున్న వారిని ప్రేమించే వ్యక్తులకు మధ్యన జరిగే సంఘర్షణను బాగా చిత్రీకరించారు. అభినందనలు.

sunita said...

ముగింపు అర్ధమవుతూనే ఉంది.ఏదైనా మలుపు ఉంటే తప్ప . ఐనప్పటికీ చక్కని ప్రయత్నం. ప్రాక్టికాలిటీ ఉన్న కధ.

బృహఃస్పతి said...

@ నాలోనేను: ధన్యవాదాలు. అధఃపాతాళానికి తీసుకుపోయేవాటిగా మద్యం, మగువను సూటిగా పేర్కొనేకంటే వాటికి మనిషి బలహీనతలు అన్న పేరు పెట్టటానికి ఇష్టపడతాను.

సునీతగారూ, మీరు ఊహిస్తున్న ముగింపు కాదండీ. నిజానికి ముగింపు మొదటి భాగంలోనే చెప్పాను. ఓ సారి గుర్తుకు తెచ్చుకోండి. :)

చైతన్య.ఎస్ said...

హ్మం... రేపటితో ఆఖరా ??

వీరుభొట్ల వెంకట గణేష్ said...

________________________
"మావయ్య వెళ్ళిపోయాక అమ్మమ్మ ఒక్కతే ఉండేది కానీ నెల్లాళ్ళకే పోయింది దిగులుతో"
_________________________

బృహఃస్పతి గారు, ఇదేనా మీరు అనుకుంటున్న ముగింపు (:-?

బృహఃస్పతి said...

చైతన్య గారూ, ఈ కధను డైలీ సీరియల్లా ఎన్ని రోజులైనా రాయొచ్చు. అయితే ఫీల్ పోకుండా ఉండాలంటే 10 రోజుల్లోనే ముగించాలని నా ఆలోచన.


గణేష్ గారూ, మీరెంత టెంప్ట్ చేయించినా సరే రేపటి కధ ఈ రోజు చెప్పనుగా... :)