ఎవ్వరికీ చెప్పను




మంచుగడ్డ కరగటం కంటే విషాదం ఏముంటుంది?

కాలం గడిచే కొద్దీ
మంచు కరగటమే కాదు
నువ్వూ నా చెంతనే
ఉంటావని ఏమిటి నమ్మకం?

అందుకే నీ సహచర్యంలో
సమయం నడవటం కూడా
నే సహించలేను.

గడుస్తున్న సమయం
తిరిగి గతంలోలా
నన్ను ఒంటరిని
చేస్తుందేమోనని భయం

అందుకే ప్రస్తుతం
శాశ్వతంగా ఇలాగే నిలచి పోవాలి
భూత భవిష్యత్తులన్నీ
వర్తమానంలో ఐక్యమవ్వాలి

ఈ ప్రస్తుతం పొడుగునా
నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.
ఒట్టు! విసుగు చెందను.

కొందరు అడుగుతారు నన్ను
ఎవరిని ప్రేమిస్తున్నావని
చిరునవ్వుతో చెప్తాను
ఎవరినీ లేదని...

కానీ వాళ్ళకూ తెలుసు
నా మాటలు అసత్యాలని
ఐతే నిన్ను,
ఓ అమ్మాయిగా ఊహించుకుంటారు.

వీలయినప్పుడల్లా
గేలి చేస్తారు
చుట్టూ చేరి గోల చేస్తారు
నీవెవరో చెప్పమని.

నా మౌనంలో మళ్ళీ
నాకు ఈడైన అమ్మాయిని వెతుక్కుంటారు.

కొందరు గ్రహిస్తారు, నువ్వు
ప్రేయసివి కావని...
అయితే నిన్ను
మరెవరిగానో చిత్రించుకుంటారు.

తల్లనుకుంటారు, చెల్లనుకుంటారు.
మిత్రుడనుకుంటారు, అదీ కాకపోతే
మళ్ళీ ముక్త కంఠంతో
“స్వప్న సుందరి” అంటారు.

మరికొందరుంటారు.
మనస్తత్వ వేత్తల్లా
పరిశోధించి
అసలు నువ్వే లేవని నిర్ధారిస్తారు.

నే తప్పించుకుని వచ్చి
గదిలో గడియ బిగించి కూర్చుని
నీకెదురుగా ఈ ప్రస్తుతం పొడుగునా
నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.

అయితే ప్రస్తుతం మాత్రం
నా కోరికతో తనకేమిటి
నిమిత్తమన్నట్లు
మళ్ళీ మూడు రూపాలూ ధరిస్తుంది.

నే గది వదలి బయటకు వచ్చినా
దేవుడ్ని వేడుకుంటూనే ఉంటాను
నీ చెంతలో వర్తమానం
ఒక్కటే ఉండాలని

నీ కలయికలో క్రొవ్వత్తి
కరగకూడదు
అమర దీపమై వెలగాలని

నీ బంధంలో కాలం
నడవకూడదు
జడమై పడి ఉండాలని

నీ జతలో కనురెప్పలు
ఆర్పకూడదు
ఎడమై నిన్నే గమనించాలని

నా ఊపిరి సైతం మన ప్రేమకు
విఘాతం కలిగించకూడదు
వర్తమానం ఒక్కటే నిలవాలని.

బయట మళ్ళీ అడుగుతారు
ఎవరిని ప్రేమిస్తున్నావని
చిరునవ్వుతో చెప్తాను
ఎవరినీ లేదని

నా మాటలు అసత్యమని
వాళ్ళకీ తెలుసు
నాకూ తెలుసు

అయినా నీ గురించి
ఎవ్వరికీ చెప్పను.
ఒట్టు!!
నీ ఉనికిని పదిలంగా
నా గుండెల్లోనే దాచుకుంటాను.

ఎవ్వరికీ చెప్పను!!

**********

ఎవరికీ చెప్పనని ఎన్నో ఏళ్ళగా ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచినా, ఈ రోజెందుకో చెప్పేయాలనిపిస్తోంది.
నే చెప్పే ముందు మీరు ఓ సారి ఎవరో కనుక్కునే ప్రయత్నం చేయొచ్చు కదా...
చిన్న క్లూ కూడా ఇస్తా... పై కవితలోనే ఆ ఎవరనేది ఉంది.

సమాధానాన్ని క్రిందన డబుల్ కోట్స్ మధ్యన ఫాంట్ సైజ్ తెగ తగ్గించేసి పెట్టా...! వేరే ఎక్కడైనా(లేఖినిలో అయినా ఫర్వాలేదు) కోట్స్ తో సహా కాపీ చేసుకుని, మాగ్నిఫై చేసి కనుక్కోండి. :)

"
కవిత (అమ్మాయి పేరు కాదండీ బాబూ...! :( నిఝ్ఝంగా నిజం కవితే...)
"

తొండి లేకుండా ఉండాలంటే మీ సమాధానం కామెంట్లో పెట్టిన తరువాత మాత్రమే చూడాలి మరి...

22 comments:

కొత్త పాళీ said...

cool. I like mystical and mysterious stuff.

Sravya V said...

too much:)

Sravya V said...

btw no need to paste anywhere, just goto comments window select "Show Original Post" thats it:)

బృహఃస్పతి said...

హమ్మో శ్రావ్యగారూ, మీరు సమాధానం కోసం సుళువైన పధ్ధతి కనిపెట్టేసారు. కాపీ పేస్ట్ చేయకుండా. మీ ఈ కామెంట్ కొన్నాళ్ళు దాచేద్దామనుకున్నా :) సరేలెండి. అలా చెయ్యాలన్నా ఓ రెండు క్లిక్స్ చెయ్యాలి కదా...

కొత్తపాళీ గారూ, మీరు శిలకు కామెంటుతారని expect చేసానండీ :(

Hima bindu said...

చాల బాగుంది ...ఎవరికి చెప్పకపోయినా ;)

Bhãskar Rãmarãju said...

కవితా! ఓ కవితా!!

బృహఃస్పతి said...

చిన్ని గారూ, మెచ్చుకున్నందుకు ధన్యవాదాలండీ... నేను కూడా చెప్పకుండా ఉందామనే అనుకున్నా... కానీ ఎవ్వరూ guess చెయ్యటం లేదండీ...(of course అర్ధం కాకుండా confuse చేసింది నేనే అయినా మన తప్పు మనం ఒప్పుకోంగా :)

భాస్కర్ గారూ, ఇది మీ గెస్సా??

కత పవన్ said...

తుచ్ నేను ఒప్పుకోను...:)) అంతా మొసం
పేరు చేప్పలేదు

కొత్త పాళీ said...

శిల ఇంకా పూర్తిగా చదవలేదు.

బృహఃస్పతి said...

పవన్ గారూ, నేను నిజంగా నిజం చెప్పానండీ... :( మీకు జవాబు నచ్చలేదా? :(

sunita said...

అమ్మాయి పేరు కవితే. ఐతే మీరు క్లూ తప్పు ఇచ్చ్హారు. పై కవితలో కాకుండా కింద వచనంలో ఇచ్చారు అసలు పేరు. ఇంతకీ అమ్మాయికి ఏమన్నా కవిత్వం గట్రా లో కొంచమనా ఇంటర్ష్టు ఉందేమో ముందే కనుక్కోండి.

బృహఃస్పతి said...

అయ్యో... ఒట్టండీ బాబూ... నాకు కవిత అన్న పేరుతో తెలుగు సినీ నటి తప్పితే వేరెవ్వరూ తెలియను కూడా తెలియదు. :(

Bhãskar Rãmarãju said...

అంతా నోట్ చేస్తూనే ఉన్నా!! ఈ కవితేంటో, కాకరకాయేంటో, తొందర్లోనే తేలుస్తా. ఓ ఆకాశకవితక్క ఉత్తరం రాసేసి పంపాల్సిన వాళ్ళకి పంపించేస్తా...

బృహఃస్పతి said...

వామ్మో! మొదటికే మోసం వచ్చిందే... తూచ్... సమాధానం స్కాచ్ బాటిల్ అని చదువుకోండైతే :)

Bhãskar Rãmarãju said...

ఎబ్బే ఇక్కడేంజరగలేదు.
ఆకాశకవితక్కా? అంటే??ఉత్తరమా!! ఎవురికీ?;):)

aswinisri said...

miiiru preamincheadi mii jiivitaanni! Avunaaa! kaadaa! yes! or No! no mysticism and mischief

బృహఃస్పతి said...

అశ్వినిశ్రీ గారూ, సమయానుసారం సమాధానం మారుతుంది మరి. :) అర్ధం చేసుకోరూ....!?!

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

ప్రియనేస్తం! నా పేరు రాఖీ నేనొక తెలుగు కవి,పాటల రచయిత స్వరకర్తను మీకు సాహిత్యం/పాటలు/కవితలు /నానీలు పట్ల మక్కువ ఉన్నట్లైతే నా బ్లాగులు సందర్శించండి.. మీ నిస్పాక్షిక సమీక్షలు/అభిప్రాయాలు/విమర్శలు నాకు శిరోధార్యం.నా ఉన్నతికి అవి సోపానాలు ! దయచేసి బ్లాగుల లోని కామెంట్స్ లో గాని లేదా నా మెయిల్ ఐడి కి గాని పోష్ట్ చేయగలరు.
http://www.raki9-4u.blogspot.com
http://www.rakigita9-4u.blogspot.com
rakigita9@yahoo.com
rakigita9@gmail.com
mobile:9849693324

మురళి said...

ఇవాళే మీ బ్లాగు చూడడం.. చదవాల్సినవి చాలా ఉన్నాయి.. చదివినవి బాగున్నాయి.. (టీవీ చానల్ వాళ్ళ స్లోగన్ కి కాపీ లా అనిపిస్తే నేరం నాది కాదని మనవి)

బృహఃస్పతి said...

మురళీ గారు, వికాసానికి స్వాగతం.
చదవాల్సినవి చాలా ఉన్నాయి..
మీ ఈ కామెంట్ నన్ను ఉప్పొంగించిందంటే నమ్మండీ... ఎందుకంటే నా పోస్ట్లన్నీ చెమటోడ్చి, ఒక్కోసారి నిద్రాహారాలు మాని రాసినవే...!

భావన said...

భూత భవిష్యత్ వర్తమానాలు ఏకమయ్యి మీకోసం ఆగినా కవితా కన్నె మాయం అవుతుంది స్పందించే మనసు మారినప్పుడు... మరి స్పందించే మనసు మీ దగ్గరే వుండాలని, మీరు ఇలాంటి కవితలెన్నో ఇంకా ఇవ్వాలని, కాలం ఆపకుండానే అని మేము కూడా కోరుకుంటాము లెండి..;-). బాగుంది కవిత.

బృహఃస్పతి said...

భావన గారూ, స్పందించే మనసు మారినప్పుడు కవిత కన్నె మాయం అవుతుంది. సరిగ్గా చెప్పారు. అందుకనే పైన అశ్వినిశ్రీ గారికి ఇచ్చిన జవాబులో సమయానుసారం సమాధానం మారుతుందని చెప్పేసా :)