...మజిలీ కధ - 2

నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ మావయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే మహా ఇష్టం. అక్కకు, నాకు, అమ్మకి, ఆఖరికి నాన్నకు కూడా. అందుకు కారణాలు ఎన్నని చెప్పమంటారు? ఊరంతా పచ్చని పొలాలతో, కొండలతో అందంగా ఉంటుంది. అంతా ఆప్యాయంగా పలకరిస్తారు. నన్నయితే ఇంకా ముద్దు చేసేవారు. ఉన్నన్నాళ్ళూ అమ్మమ్మ ఏదో ఒక పిండివంట చేస్తూనే ఉండేది. మావయ్య రోజూ చదవటానికి మంచి కధల పుస్తకాలు తెచ్చి ఇచ్చేవాడు. జిలేబీలు తెచ్చేవాడు. ఆడుకోవటానికి బూరలు తెచ్చేవాడు. వీధిలో ఐస్ క్రీం బండి వస్తే కొని పెట్టేవాడు. వాణత్త స్వయంగా అన్నం తినిపించేది. మా కోసం ఊయల కట్టి ఊపేది. మే జాంచెట్టెక్కి పళ్ళుకోస్తే క్రిందనుంచుని కొంగు పట్టేది.

అమ్మ అక్కడ ఏ పనీ చేయనక్కరలేదు. చక్కా చిన్నప్పటి స్నేహితురాళ్ళని ఇంటికి పిలిపించుకుని గంటల తరబడి తమ చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకోవచ్చు. నాన్నకైతే వేళకు తిండి, నిద్ర, మిగిలిన సమయమంతా వరండా ప్రక్కనున్న గదిలో పేకాట. ఇదే ధ్యాస.

ఇహ పండుగ రోజుల్లోనయితే మా సందడి చెప్పనలవి కాదు. పిన్ని పిల్లలు, పెద్దమ్మ పిల్లలు అంతా కలసి ఎనమండుగురం ఉంటాం గోల చేయటానికి. అందర్లోకి చిన్నవాళ్ళం నేను, చెల్లాయి. చెల్లాయంటే మా జ్యోతి పిన్ని కూతురు. మేమంతా ఎంత సందడి చేసినా ఎవ్వరికీ ఇబ్బంది కలిగేది కాదు. ఏమంటే ఇల్లు చాలా పెద్దది. ఓ నలభై మందికి అవలీలగా సరిపోతుంది.

మేం ఉన్నన్నాళ్ళూ అమ్మమ్మ మా అమ్మలని ఎప్పుడూ పొయ్యి దరి చేరనిచ్చేది కాదు. అందరికీ తనే వండి పెట్టేది వాణత్త సాయంతో. అమ్మమ్మ గ్యాస్ పొయ్యి జోలికి పోయేది కాదు. పెరట్లో కర్రలపొయ్యి రాజేసి వండేది. అరిసెలు చేసినా, చక్రపొంగలి చేసినా, పాలముంజులు, బూరెలు, గారెలు ఇలా ఏవి చేసినా కర్రల పొయ్యి మీదనే. అమ్మమ్మ వంటలు చాలా కమ్మగా ఉంటాయి. ఎటొచ్చీ పొయ్యి దగ్గరకు ఎవరమైనా వెళితే విరుచుకు పడేది.

మావయ్య మమ్మల్నందరినీ ఎంతో ఆప్యాయంగా చూసేవాడు. మావయ్యకి పిల్లలు లేరు. సరదాగా అప్పుడప్పుడు ఏడ్పించినా, మేం ఏది తెమ్మంటే అది తెచ్చేవాడు. ఎక్కడికి తీసుకుపొమ్మంటే అక్కడి తీసుకుపోయేవాడు.

మావయ్య చాలా అందంగా ఉంటాడు. తెల్ల పంచె కట్టుకుని, వీధిలో నడుస్తుంటే హీరోని చూసినట్లుంటుంది మాకందరికీ. బొద్దుమీసాలు, గంభీరమైన చూపులు, చూడగానే గౌరవించి తీరాలన్న నిండైన విగ్రహం.

'తాతబాబు'(మావయ్య పేరు) అంటే ఆ ఊళ్ళో తెలియని వారు లేరు. అసలు మావయ్య చిన్నప్పుడెపుడో సినిమాల్లో చేరటానికి ఇంట్లో చెప్పకుండా నగలెత్తుకుని పోయాడుట. అంతా ఖర్చయిపోగా బుధ్ధిగా ఇంటికి వచ్చేసాడుట. అమ్మ చెప్పేది, అప్పుడప్పుడూ ఇంటినుంచి పారిపోతే ఎదురయ్యే కష్టాలని వర్ణిస్తూ...

మావయ్య ఇంటికెదురుగా కూడా మా వయసు పిల్లలుండేవారు. అయితే పెద్దాళ్ళెవ్వరూ కనీసం వాళ్ళతో మాట్లాడనిచ్చేవారు కాదు. అమ్మమ్మయితే కనీసం ఆ ఇంటి వైపు చూసినా తిట్టేది.

" ముదనచ్చపోల్లతో ఏవిటి సావాసం?" అనేది.

ఆ ఇంట్లో పిల్లలతో పాటుగా ఒకాడావిడ, ఒక మగతను, మరో ముసిలిది ఉండేవారు. ముసలమ్మకు మేమంతా మంత్రగత్తె అని పేరు పెట్టాం. మగతనికి ఒంటికన్ను రాక్షసుడని పెట్టాం. నిజానికతనికి ఒక కన్నే కాదు. ఒక కాలు కూడా పని చెయ్యదు. చేతిని మోకాలిపై మోపి, కుంటుతూ నడుస్తాడు. నల్లగా ఉండేవాడు. బానబొజ్జ. ఆ ఇంటావిడకు మాత్రం ఏం పేరు పెట్టాలో తెలియలేదు. ఆవిడ వీళ్ళలా అపరిశుభ్రంగా కాక, ఎప్పుడూ సింగారించుకుని ఉండేది. ముఖానికి గుప్పెడు పౌడరు కొట్టేది. జడ నిండుగా మల్లెపూలు పెట్టేది. అప్పుడప్పుడూ ఇంత నోరు చేసుకుని వీధిలో వాళ్ళను తిడుతూ ఉండేది.

అమ్మకు ఊహ తెలిసే నాటికే తాతయ్య చచ్చిపోయాడుట. అప్పట్నుంచీ అమ్మమ్మ ఒక్కతే ఈ సంసారాన్ని నడుపుతూ వచ్చింది. ఒక్కడే కొడుకు మూలాన, మావయ్యంటే అమ్మమ్మకు వల్లమాలిన ప్రేమ. మావయ్యకు అన్నీ సమయానికి అందుతున్నాయో లేదోనని ఒహటే బెంగ.

అయితే ఒక్క విషయం మాకు అర్ధమయ్యేది కాదు. మావయ్య ప్రస్తావన వచ్చినప్పుడల్లా పెద్దాళ్ళు మావయ్యని తిట్టేవాళ్ళు.


**********
సశేషం - మిగతా కధ రేపటి వికాసంలో...

6 comments:

sunita said...

NexT.....

చైతన్య.ఎస్ said...

తరువాతది ఎప్పుడు ???

బృహఃస్పతి said...

NexT...

రేపే... :)

Sravya V said...

0అమ్మయ్య కథల్లోకి వచ్చేసారు ఇక కానియండి :)

బృహఃస్పతి said...

శ్రావ్యగారూ, మీరిలానే తొందరపెట్టి త్వరగా కధంతా చెప్పించేస్తారు. :( తరువాత కధ పూర్తయ్యాక ఏ కధ రాయాలా అని నేను జుత్తు పీక్కోవాలి... :(

భావన said...

రెండు రోజులు లేక పోతే చాలా కధ ఐపోయింది కదా, రోజు చూస్తుంటే మాత్రం రాయనే రాయవు. శ్రావ్య బాగా కంగారు పెట్టెయ్యండి మొత్తం ఒక్క రోజు లో రాసేట్లు ;-)
నేను మాత్రం ఒక్కొక్క పార్ట్ చదివి దేనికదే కామెంటుతా..
బాగుంది. మా వూరు గుర్తు వచ్చింది. అమ్మమ్మ ల వూళ్ళు అంటేనే ఆ హాయి వచ్చేస్తుందేమో తెలియకుండా.. గెస్ చేసేను మావయ్య ను ఎందుకు తిడతారో... ఇంకో దానికి వెళ్ళి చూస్తా నా గెస్ సరో కాదో..