"వాడొక త్రాష్ఠుడు" అనేవాడు నాన్న.
"మా అమ్మ కడుపున చెడబుట్టాడు" అనేది అమ్మ.
ఇక అంతా ఒక చోట చేరితే తిడుతూనే ఉండేవారు.
"ఏం చేస్తాం!? అంతా మా ఖర్మ. భగవంతుడు ఇలా ఏడవమని రాసిపెట్టాడు" అనేది అమ్మమ్మ.
"అదేం కాదు. ఆ కుంటాడు వీడి నెత్తిన ఏదో మందు పెట్టాడు. ఆ నెత్తిని ఎప్పుడూ ఎలా నిమురుకుంటాడో చూడండి." అనేవాడు చిన్నాన్న వీధి వైపు వేలు చూపిస్తూ.
మావయ్య అంటే నాకు చాలా ఇష్టం. అయినా వాళ్ళలా తిడుతూ ఉంటే నాకు కోపం వచ్చేది కాదు. ఎందుకంటే ఆ మాటలు అన్నప్పుడు వాళ్ళల్లో నిజాయితీ కనిపించేది.
ఓ పండక్కి పెద్దాళ్ళంతా కలిసి మావయ్యతో మీటింగ్ పెట్టారు. పక్కనే ఆడుకుంటున్న మాకు అంతా వినపడుతూనే ఉంది.
"తాతబాబూ! నిన్ను నమ్ముకున్న ఆ పిల్లనెందుకయ్యా అలా బాధపెడతావు? ఇప్పటికీ మించిపోయింది లేదు. ఆ పాడు అలవాట్లు మాను" పెదనాన్న చెప్పుకుపోతున్నాడు.
మావయ్య ఏం మాట్లాడలేదు. తల దించుకుని, కాళ్ళూపుతూ కూర్చున్నాడు కుర్చీలో, ఒక చేత్తో బుర్ర నిమురుకుంటూ. పిన్ని, అమ్మ, పెద్దమ్మ చీవాట్లూ, శాపనార్ధాలూ పెట్టారు. అమ్మమ్మ మాత్రం నోరు మెదపకుండా కూర్చుంది. వాణత్త ఆ పరిసరాల్లోనే లేదు.
"వీడికి చెప్పినా, ఆ గోడకు చెప్పినా ఒక్కటే" నాన్న విసురుగా లేచి వరండా ప్రక్కనున్న గదిలోనికి పోయాడు చిన్నాన్న, పెదనాన్నలను వెంటబెట్టుకుని.
ఆ మధ్యాహ్నం మావయ్య మమ్మల్ని పొలానికి తీసుకు పోయాడు. సాయంత్రం వరకు ఏకధాటిగా ఆడుకున్నాం గడ్డికుప్పలమీద, చెరువులో. చింతకాయలు కొట్టాం. చేల్లో పెసలు ఏరుకుని తిన్నాం. ఇంటికి వస్తున్నప్పుడు నేనడిగా మావయ్యని.
"మావయ్యా! నిన్ను అంతా ఎందుకు తిడుతున్నారు?"
"ఇహిహి" అని నవ్వాడు.
జవాబు దొరకలేదు. మమ్మల్ని ఇంట్లో దింపి కధల పుస్తకాలు తెస్తానని వెళ్ళిపోయాడు. రాత్రి పదిన్నర ప్రాంతంలో వచ్చాడు.
మా పిల్లలందరికీ ఉత్సాహం వచ్చింది.
'నే తలుపు తీస్తా'నంటూ పోటీ పడి పరిగెత్తాం.
"ఇంకా పడుకోలేదర్రా" అంటూ మావయ్య కధల పుస్తకాలు అక్క చేతికిచ్చి చెల్లిని ఎత్తుకున్నాడు.
పెద్దక్క ఓ నిముషం అటూ ఇటూ చూసింది. వేలు ముక్కుకి అడ్డంగా పెట్టుకుని చెల్లెల్ని దిగమని సైగ చేసింది. మమ్మల్ని దూరంగా లాక్కొని పోతూ,
"ఛీ! కంపు" అంది.
"ఏంటి?" అంది చెల్లి అమాయకంగా.
*******
మరుసటి రోజు మావిడి తోటలో పిల్లలందరం సమావేశమయ్యాం.
"మావయ్య తాగుతాడు" పెద్దక్క అంది కళ్ళింత చేసుకుని.
పెద్దక్కకు ఓ పధ్నాలుగేళ్ళుంటాయి. పెద్దాళ్ళు మాట్లాడుకునేవన్నీ దానికి మా కన్నా బాగా అర్ధం అవుతాయి.
"ఏం తాగుతాడు?" చెల్లి అడిగింది.
"ఆ మాత్రం తెలియదా?" చిన్నక్క(పిన్ని కూతురు) కసిరింది.
"బ్రాందీ" అన్నాన్నేను.
"కాదు. విస్కీ, సారా" అన్నాడు రాజు గాడు. వాడు మా పెద్దమ్మ కొడుకు. పెద్దక్కకు సొంత తమ్ముడు. నాకన్నా ఏడాది పెద్ద. ఎప్పుడూ నాకు వ్యతిరేకంగా మాట్లాడుతాడు. నేను ఎడ్డెం అంటే వాడు తెడ్డెం అంటాడు. కాసేపు పోట్లాడుకున్నాం. ఆడుకున్నాం.
సెలవులు అయిపోయాయి. ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయాం.
**********
సశేషం - మిగతా కధ రేపటి వికాసంలో...
సశేషం - మిగతా కధ రేపటి వికాసంలో...
8 comments:
రేపటి వరకు వెయిట్ చెయ్యాలా ???
తిరుమల రమ చంద్ర గారు రసిన " హంపీ నుంచి హరప్పా దాకా " గుర్తుకు వస్తొంది మీ మజిలీ కథ చదువుతుంటే... బాగుంది.
ఇంతకీ ఆ ఎదురింటావిడ వేశ్యేనా.....?
అలా ఎందుకన్నానంటే పరిస్థితులన్నీ అలానే కనిపిస్తున్నాయి.
చైతన్య గారూ, మీరు నా పరిస్థితి కూడా అలోచించాలి కదండీ... :( అప్పటికీ ఆఫీసులో కూడా టైప్ చేస్తున్నా... :(
శర్మ గారూ, "హంపీ నుంచి హరప్పా దాకా " గురించి నాకు తెలియదండీ. మీరు ఊహించినది కరెక్టే. అయితే ఏదీ కూడా పూర్తిగా చెప్పకుండా కాసింత నర్మగర్భంగా ఉంచటానికి ప్రయత్నించాను. పదేళ్ళ కుర్రాడి అనుభవం రూపంలో రాయప్రయత్నించినందున ఆ అస్పష్టత అవసరమయ్యింది.
Baagundi!Interesting!
(హమ్మయ్య, నా బ్లాగ్ రెగ్యులర్ రీడర్ కామెంట్స్ వచ్చేసాయ్)
హి..హి.. స్వగతం ఎవరూ చదవకూడదు.
బాగుంది !
శ్రావ్యగారూ, టాంకూ అండీ!
నా కధకు సునీత గారి వ్యాఖ్య, మీ వ్యాఖ్య లేకపోతే చక్కెర లేని కాఫీ తాగినట్లుంటుందండీ... :)
మజిలి కధ --3
ఏంటో మీ అత్త ను తలుచుకుంటే ఒక్క సారి మనసంతా చేదు గా ఐపోయింది..
Post a Comment