...మజిలీ కధ - 5

భోగి మంటల్లో పిడకలు, కర్రలు వేసాం. రేగుపళ్ళు, పాత బట్టలు వేసాం. మంట దగ్గర అర్ధరాత్రి దాకా ఆడుకున్నాం. సంక్రాంతి నాడు అమ్మమ్మ పూజ అయినంత వరకు ఉపవాసం ఉన్నాం. సాయంత్రం వాణత్త అక్కలకి గోరింటాకు పెట్టింది. నేను కూడా గోరింటాకు పెట్టించుకున్నా చేతులకి.

సెలవులు అయిపోయాయి. ఎవరి ఇళ్ళకు వాళ్ళం వెళ్ళిపోయాం. ఆరో తరగతి పరీక్షలయ్యి నేను ఏడో తరగతికి వచ్చాను. రోజు టెలిగ్రాం వచ్చింది. మావయ్యకు సుస్తీ చేసిందని. అమ్మ నన్ను తీసుకుని పోయింది.

మావయ్య మంచం మీద పడుకుని ఉన్నాడు. చాలా నీరసంగా, ముఖం పీక్కుని పోయి ఉన్నాడు. నలభై ఏళ్ళ వాడల్లా అరవై ఏళ్ళ ముసలాడిలా కనిపిస్తున్నాడు.

పలకరిస్తుంటే సరిగ్గా మాట్లాడలేక పోతున్నాడు. తెల్లటి పంచెతో ఠీవీగా నడిచే మా హీరో మావయ్య, ఇతనూ ఒక్కడేనా అని ఆశ్చర్యం కలిగింది. ప్రక్కనే వాణత్త కూర్చుని ఉంది.

డాక్టర్ చెప్పుకుపోతున్నాడు. ఒంట్లో ఆల్కహాల్ శాతం చాలా ఎక్కువగా ఉంది. సుగర్ పెరిగి పోయింది. ఇప్పట్నుంచైనా అలవాటు మానకపోతే కష్టం అంటూ...

అమ్మ, అమ్మమ్మ పూటంతా ఏడుస్తూ కూర్చున్నారు. అమ్మ వాచీ చూసుకుంది.

"వస్తాం అమ్మా. చాలా వేళయ్యేట్టుంది" అంటూ లేచింది.

అమ్మమ్మ రాత్రి ఉండమని పట్టుబట్టింది. నాన్నకు అక్క వండిపెడుతుందిలే అని సర్దిచెప్పింది.

"దానికేం చేతనౌనూ" అంటూ దీర్ఘాలు తీసింది అమ్మ.

********

సంవత్సరం పండక్కి మేం మావయ్య ఇంటికి వెళ్ళలేదు. నేను ఏడో క్లాసు, అక్క పదో క్లాసు కావటంతో నాన్న ససేమిరా అన్నాడు. మేం ఏడ్చినా ఎందుకనో మునుపటిలా మంకుపట్టు పట్టలేకపోయాం.

నా పరీక్షలు అయిపోయాయి. మంచి మార్కులు వచ్చాయి. వేసవి సెలవుల్లో మావయ్య ఇంటికి వెళ్తానని మారాం చేసాను. పంపక తప్పింది కాదు నాన్నకి.

ఇంతకు ముందులా పండగ సెలవులు కాకపోవటం చేత ఎవ్వరూ రాలేదు. నేనొక్కణ్ణే. మావయ్య ఇంట్లో ఎవ్వరూ పెద్ద ఉత్సాహంగా లేరు. అంతా యాంత్రికంగా ఎవరి పని వారు చేసుకుపోతున్నారు. వాళ్ళని చూస్తే 'జీవితం మీద విసుగు పుట్టదా వీళ్ళకి' అనిపించింది. మావయ్య ఉదయమనగా వెళ్ళిపోతాడు. ఒక్కోసారి మధ్యాహ్నానికై కేరేజీ తీసుకుపోతాడు. ఎక్కడికి వెళ్తాడో చెప్పడు. మళ్ళీ అర్ధరాత్రి వేళకు ఇంటికి చేరుకుంటాడు. అయితే నాకు కధల పుస్తకాలు తేవటం మాత్రం మర్చిపోడు.

సారి రెండు రోజులు మావయ్య కనిపించలేదు. అమ్మమ్మ బెంగ పెట్టుకుంది. వాణత్త రాయిలా, స్థాణువులా ఉండిపోయింది. అన్నీ తనకు తెలుసునన్నట్లుగా. 'ఎప్పుడూ జరిగే తంతే కదా' అన్నట్లుగా.

తెలిసిన వారబ్బాయి వచ్చి చెప్పాడు. రెండ్రోజులుగా మావయ్య స్పృహలో లేడని, మిల్లులో పడుకుని ఉన్నాడని. అమ్మమ్మ ఏడ్చింది. అది పైపై ఏడుపు కాదు. లోలోన అనుభవించి, అనుభవించి వెళ్ళగక్కుతున్న దృశ్యం. వీధిలో వాళ్ళు రిక్షా కట్టించి మావయ్యను ఇంటికి తెచ్చి పడేసారు.

మరుసటి రోజు ఒక్కణ్ణే పొలానికి పోయాను ఏమీ తోచక. ఎదురింటి పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. వాళ్ళు పెద్దాళ్ళయ్యారు కొంచెం.

"ఇది మా పొలం" అన్నాన్నేను.

"కాదు మాది"

"మాది"

"మాది మాది" అంతా చప్పట్లు కొడుతూ పొమ్మంటూ ఎద్దేవ చేసారు. కోపాన్నీ, ఉడుకుమోత్తనాన్ని ఆపుకుంటూ వచ్చి వాణత్తను అడిగాను.

"అత్తా, పొలం ఎవరిది?"

వాణత్త కాసేపు మాట్లాడలేదు.

"అన్నం తిందువు పద" లాక్కునిపోయింది నన్ను.

మావయ్యకు స్పృహ వచ్చింది. నీరసం పూర్తిగా తగ్గలేదు. అమ్మమ్మను తిట్టిపోస్తున్నాడు. చీటికీమాటికీ వాణత్త మీద చిరాకును ప్రదర్శిస్తున్నాడు.

రాత్రి తొమ్మిది ప్రాంతంలో నేను చూస్తుండగా ఎదురింటికి వెళ్ళాడు. తలుపు చాటు నుండి నేను గమనిస్తూ ఉండిపోయాను.

**********
సశేషం - మిగతా కధ రేపటి వికాసంలో...

6 comments:

భావన said...

హ్మ్మ్... తెలిసిన కధ, జరిగిన... జరుగుతున్న కధే ఐనా ఏమిటో ఎప్పటికప్పుడే కొత్త గా చూస్తున్నట్లు బాధేస్తుంది... హ్మ్మ్.... మరీ కోడ్ కు మల్లే లైనులు లెక్క పెట్టీ రాస్తున్నావా.. హత విధి...

చైతన్య.ఎస్ said...

అవునండి ఈ విషయం లో భావన గారి మాటే నా మాట మరి ఇలా లెక్క గా వ్రాస్తే ఎలా .. ఎలా అని
ప్రశ్నిస్తున్నా ...

sunita said...

taruvaata??

బృహఃస్పతి said...

మీరెవ్వరూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకండి ప్లీజ్... మరో మూణ్ణాలుగు రోజుల్లో ముగించేస్తా...

Sravya V said...

హ్మ్ !

Rajasekharuni Vijay Sharma said...

నేను చూడనే లేదు 5 వ భాగం ఎప్పుడు ప్రచురించారో. ఇప్పుడే చదివా. బాగుంది. ఏమాట కామాటే ఈ టపా కాస్త పెంచారు. :)

కధలో పాత్ర నాకు సన్నిహితంగా తెలిసిన పాత్ర. తాగుబోతుగా మారి డబ్బు, గౌరవం పోగొట్టు కొని చాలా నీచ స్థితికి దిగజారి చివరికి ప్రాణాలు కోల్పోయారు ఒకాయన. :(