అమ్మమ్మ అదృష్టమో, దురదృష్టమో గానీ, కొన్ని రోజులకు మావయ్య కోలుకున్నాడు. అమ్మమ్మ కబురు పంపింది సంబరంగా. అయితే ఆ మరుసటి రోజే చెప్పాపెట్టకుండా మావయ్య హాస్పిటల్ నుంచి మాయం అయ్యాడు. డాక్టర్ల ఫీజుల కోసం అప్పు చేసి తెచ్చిన 10 వేల రూపాయలు కనిపించలేదు.
అమ్మ, నేను వెళ్ళేసరికి అమ్మమ్మ హాస్పిటల్ లో రోదిస్తూ ఉంది. అమ్మ ఫీజు చెల్లిస్తున్నప్పుడు డాక్టరు చెప్పాడు. మరోసారి తాగడమంటూ చేస్తే మావయ్య ఖచ్చితంగా నాలుగు రోజుల్లో ఛస్తాడని.
అమ్మమ్మని మా ఇంటికి తీసుకు వచ్చాం. వస్తుండగా అమ్మమ్మ నాకో ఉత్తరం ఇచ్చి చెప్పింది.
"నీ కోసమే ఉత్తరం పెట్టిపోయాడు."
నాకప్పుడు ఆ ఉత్తరం చదవాలనిపించలేదు. జేబులో పెట్టుకున్నాను. అందులోనే ఒక వందనోటు కూడా ఉంది.
మా ఇంట్లో ఉన్న పది రోజులూ అమ్మమ్మ మావయ్య సంగతులే చెప్పేది. చిన్నప్పుడు మావయ్య చెడు తిరుగుళ్ళు ఆపలేకపోయానే అంటూ నెత్తి కొట్టుకునేది. 'వాడ్ని ముద్దు చేసానేమిటే' అంటూ అమ్మ దగ్గర వాపోయేది. అమ్మమ్మ మా ఇంట్లో ఎక్కువ రోజులుండటానికి ఇష్టపడలేదు. 'ఒక్కదానివే ఎందుకక్కడ' అని అమ్మ నచ్చజెప్పినా వినక వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది.
అలా వెళ్ళిన నెలరోజులకే కబురు వచ్చింది. అమ్మమ్మ పరిస్థితి బాగాలేదని. వెళ్ళేసరికి అమ్మమ్మ మూలుగుతూ ఉంది. అమ్మమ్మ పదేపదే ఒకటే వాక్యం ఉఛ్ఛరిస్తోంది. 'తాతబాబూ, నా మాట వినరా'
ఆ మాట కూడా కొద్ది సేపటికి ఆగిపోయింది. అమ్మమ్మ గాల్లో చూస్తూ శ్వాస విడిచింది. ఆమె శూన్యంలోనికి చూస్తుందో,గోడకు తగిలించి ఉన్న మావయ్య ఫోటో వైపు చూస్తుందో తెలియటంలేదు. ఆమె చూపుల్లో మాత్రం తన కొడుకెక్కడో ఇంకా క్షేమంగా ఉన్నాడన్న భావం కనిపిస్తోంది.
తన చితికి నిప్పు పెట్టటానికి అతడు తప్పక వస్తాడన్నట్లు ఎదురుచూస్తున్న భావం వ్యక్తమవుతోంది.
అమ్మమ్మ కోరిక నెరవేరలేదు. పెదనాన్న చేతుల మీదుగా దహనసంస్కారాలు పూర్తయ్యాయి.
'అప్పుడనగా మూసిన ఆ ఇంటి తలుపులు ఇప్పటికీ తెరుచుకోలేదు. లోపల అమ్మమ్మ ఆత్మ మావయ్య ఆత్మకి ముద్దలు తినిపిస్తూ ఉంటుంది. వాణత్త స్వయంగా తలంటుతూ ఉంటుంది. మావయ్యకు ఇప్పుడే వ్యసనమూ లేదు. ఊరంతా మావయ్యని దేవుడ్ని చూస్తున్నట్లుగా చూస్తారు. పండక్కి మేమంతా ఆ స్వర్గంలో కాలు పెట్టే భాగ్యాన్ని పొందుతూ ఉంటాం.'
*********
నేను ఊహలు అంతటితో ఆపేసాను.
నా స్నేహితులంతా ఓ క్షణకాలం స్తబ్దులై నించున్నారు.
"అయితే మీ మావయ్య చచ్చిపోయాడా?" హేమ అడిగింది.
"ఏమో, చచ్చిపోయాడనే అనుకుంటున్నాం." చిరునవ్వుతో నా సమాధానం.
కాసేపు మౌనం.
"ఇక పోదాం. కారు బాగై ఉంటుంది" రెడ్డి తొందరపెట్టాడు.
దూరం నుంచి రవి కేకలు వినిపించాయి. కారు బాగైంది, రమ్మంటూ.
అందరం పరుగులాంటి నడకతో రోడ్డున పడ్డాం.
దారిలో చంద్ర అడిగింది.
"ఇంతకీ మీ మావయ్య ఉత్తరంలో ఏం రాసాడో చెప్పనేలేదు"
"ఏముందీ! తన ఆస్థినంతా నా పేరున పత్రం రాసినట్లు రాసి సంతకం పెట్టాడు."
"ఇంకేం అదృష్టవంతుడివే" హేమ అంది.
"ఆస్థా??" నవ్వాను.
"సర్లే! చిల్లిగవ్వ కూడా మావయ్య మిగల్చలేదు. పైగా ఊరంతా అప్పులు. నాకొద్దు బాబూ ఆ ఆస్థి" చేతులు అడ్డంగా ఊపుతూ భయం అభినయించాను.
జ్ఞాపకాలు మళ్ళీ కలుద్దామంటూ వీడ్కోలు తీసుకున్నాయి.
********************
మళ్ళీ కలుద్దాం. వీడ్కోలు!!
********************
మళ్ళీ కలుద్దాం. వీడ్కోలు!!
********************
12 comments:
కధ బాగుంది. ముగింపు నేను వేరే విధంగా అనుకున్నాను (:-
భాగుంది!ఐతే మామయ్య పాత్ర ను అలా పాఠకుల ఊహకు వదిలేసారు??
హ్మ్మ్ ఆ కన్న తల్లి గుండె ఘోష ఆ బాధ అబ్బ తలుచుకుంటేనే కళ్ళు సజలాలవుతున్నాయి. కధ కొత్త కాదు పునరావృతమయ్యే చరిత్రే కధనం బాగుంది.. nicely said
హ్మ్...
వ్యాఖ్యానించిన అందరికీ ధన్యవాదాలు.
గణేష్ గారూ, నిన్నటి మీ కామెంట్ చూసి మీరు ముగింపు పట్టేసారనుకున్నానే...
సునీత గారూ, అలా పాఠకుల ఊహకి వదిలేస్తేనే కధలోని మల్టీ డైమెన్షన్స్ ని చదివేవారు స్పృశించగలుగుతారని నా నమ్మకం. :)
భావన గారూ, మీరన్నది అక్షరసత్యం. ఇలాంటి సంఘటనల్లో దారి తప్పినవారి కన్నా, వారిని సరైన దారిలో పెట్టటానికి ప్రయత్నించి విఫలమైనవారే ఎక్కువ సంఘర్షణకు గురౌతారు.
హ్మ్ ! మీ ముగింపు వాక్యాలలో నేను ఒక వ్యక్తి గురించి చాల ఆసక్తి గా ఎదురుచూసాను , కాని మీరు ఏమి వ్రాయలేదు . మీ అమ్మమ్మ గారిని తలుచుకుంటే చాల భాద అనిపిస్తుంది.
Anyway looking forward for the new series.
శ్రావ్య గారూ, మీరు ఎక్స్ పెక్ట్ చేసింది అత్త పాత్రనా? తల్లి తప్ప వేరెవ్వరూ కూడా ఒక లిమిట్ ని దాటి భరించరని చెప్పాలన్న నా ఉద్దేశ్యమే మిగిలిన పాత్రలని ముగింపులో స్పృశించకుండా చేసింది. మిగిలిన వారి జీవనగమనం ఎప్పుడో మారిపోయి తాతబాబు పాత్ర ప్రభావం లేకుండా సాగుతాయన్నదే సందేశం.
అవునండి ! ఆవిడ గురించే ! ఇంతకీ ఇది నిజం స్టొరీ కదూ ?
శ్రావ్యగారూ,
ఇంతకీ ఇది నిజం స్టొరీ కదూ ?
మజిలీ కధ
"యదార్ధ వ్యక్తులు
యదార్ధ సంఘటనలతో
ప్రభావితమైన ఓ కల్పిత కధ"
ఏంటి? ఎక్కడో చదివినట్టుందా అండీ... నా కన్నా ఆయనే బాగా చెప్పాడని కాపీ చేసేసా :)
అభ్యుదయ,స్త్రీవాద కథలు ...
హూ.......... :(
బాగుంది. ఇది నిజం కథే...! నాకు తెలుసు, మా ఊర్లో నలుగురైదుగురున్నారు ఇలాంటి వారు.
కలి గారూ, మీ కామెంట్ ఎప్పటిలానే అర్ధం కాలేదు. :(
శర్మ గారూ, ఇలాంటి వారు ఇంతకు ముందు చెప్పినట్లు 80/90'స్ దాకా వీధికొకరుండేవారు. మనకి తెలిసిన వారికి అన్వయంచుకున్నామంటే నా కధ విజయం సాధించినట్లే :) ఇలాంటి సంఘటనల్లో భార్య వేరే పెళ్ళి చేసుకున్న ఘటనలు కూడా నేనెరుగుదును. అందుకే తల్లి తప్ప వేరెవ్వరూ భరించరన్న ముగింపుకై ప్రయత్నించాను.
Post a Comment