ప్రళయంలో పదనిసలు



మునుపెన్నడూ రానంత వరద వచ్చింది. ప్రళయమే వచ్చింది. చెట్లు, పుట్టలేం ఖర్మ! ఏకంగా ఊళ్ళూ, నగరాలే నాశనమైపోయాయి. జనాలంతా కొట్టుకుచచ్చిపోయారు. తన్నుకుని కాదు. నీటిలోనే కొట్టుకు చచ్చారు. ఎంతమంది చనిపోయారో, లెక్కించి నిర్ధారించాల్సిన అధికారులూ కొట్టుకునిపోయారు. నదులూ, సముద్రాలూ అన్నీ ఇష్టానుసారం పొంగి రాజ్యమేలటానికా అన్నట్లు తిరుగుబాటు చేసి నేలను కావలించుకున్నాయి. ఎక్కడో నూటికొక్కడు బాగా ఈత వచ్చినవాడు మాత్రం బతికి నీట్లో పడ్డాడు.

ఓ సైంటిస్టు ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని ఈదుకుంటూ ఆధారం కోసం వెతుకుతున్నాడు. అతడి నోట్లో ఏదో కాగితాల కట్ట ఉంది. పాపం అతడు వెతుకుతున్న ఆధారమేదీ అతనికి దొరకటం లేదు. నీళ్ళు ఆకాశం కంటే నింపుగా ఉన్నాయి. అయినా సైంటిస్టు పట్టుదలగా ఈదుతున్నాడు. అతడికి దారిలో జ్ఞాని కలిసాడు. సైంటిస్టుకి జ్ఞానితో మాట్లాడాలనిపించింది. అంతలోనే నోట్లోనున్న కాగితాల కట్ట గుర్తుకువచ్చి ఆగిపోయాడు. జ్ఞాని మాత్రం తన మానాన తాను ఈదుకుంటూ పోతున్నాడు.

కొంచెంసేపు ఈదాక సైంటిస్టుకి ఎదురుగా కాస్త నేల కనపడింది. అతను ఆత్రంగా నేలను చేరాడు. అంతలోనే జ్ఞాని సంగతి గుర్తొచ్చి అతడ్ని పిలిచాడు.

"Hey man! come here.." చప్పట్లు చరుస్తూ అరిచాడు సైంటిస్టు. జ్ఞాని అక్కడ చోటు కనపడటంతో, ఈదుకుంటూ నేలను చేరుకుని సైంటిస్టు వైపు కృతజ్ఞతా పూర్వకంగా నవ్వాడు.

"Do you know English?" ప్రశ్నించాడు సైంటిస్టు.

జ్ఞాని మౌనంగా గాల్లోకి చూస్తూ ఉండిపోయాడు.

"ఓహ్! సరే, ఈ కట్ట ఉంది చూసావ్??" తన చేతిలోని కాగితాలని చూపించి అన్నాడు. "ఇందులో మహామహా గొప్ప సైంటిస్టులు కనిపెట్టిన వివరాలున్నాయి. ఈ పరిస్థితులన్నీ చక్కబడ్డాక నేను ఒక కొత్త శకాన్ని సృష్టించబోతున్నాను."

జ్ఞాని మౌనంగా తలదించుకుని తన మొల వైపు చూసుకున్నాడు. అక్కడ ఒక భరిణె ఉంది.

"Whats that?" సైంటిస్టు ప్రశ్నించాడు.

సమాధానం చెప్పకుండా మూత తీసి చూపించాడు జ్ఞాని. అది ఖాళీగా ఉంది. కానీ సైంటిస్టుకి జ్ఞాని తనను మోసం చేసాడనిపించింది. అందులో ఏదోఉన్నా తనకు చూపించకుండా మాయ చేసాడనిపించింది.

నీళ్ళు అక్కడి నేలను నెమ్మదిగా తాకుతున్నాయి.

"ఈ కట్ట ఉంది చూసావూ! ఇందులో ఎన్నో రకాల పరిశోధనల ఫలితాలున్నాయి. వీటి ద్వారా నేను భూమ్మీదనే స్వర్గాన్ని సృష్టించగలను. ఒక విలాసవంతమైన జీవితాన్ని సృష్టించగలను"

"నా దగ్గర కొంచెం రొట్టె ఉంది మీరు తింటారా?" అడిగాడు జ్ఞాని.

తాను గొప్ప విషయాన్ని చెబుతుంటే ఆసక్తి కనపరచకపోవటమే కాక మధ్యలోనే తుంచి, రొట్టె గురించి మాట్లాడటం సైంటిస్టుకి చికాకు తెప్పించింది.

"ఈ కట్ట ఉంది చూసావూ? వీటి సహాయంతో నేను మానవుడికి నిద్రాహారాల అవసరమే లేకుండా చేయగలను." గర్వంగా బదులిచ్చాడు సైంటిస్టు.

నీళ్ళు కొంచెం కొంచెంగా చుట్టుముట్టి చిన్ని అడుగులతో ముందుకొస్తున్నాయి. చీకటి పడింది.

"ఈ కట్ట ఉంది చూసావూ?" సైంటిస్టు జ్ఞాని వైపు చూసాడు. అతడప్పటికే నిద్రపోయాడు.

"హూ! Country man!" మూతి వంకరగా పెట్టి నవ్వుకున్నాడు సైంటిస్టు.

సైంటిస్టుకి ఎంత ప్రయత్నించినా నిద్రపట్టటంలేదు. నెమ్మదిగా కమ్ముకుంటున్న వరదనీరు, అప్పటికే కమ్ముకున్న చీకటి అతడిని ప్రశాంతంగా ఉండనివ్వటంలేదు. అసహనంగా జ్ఞాని వైపు చూసాడు. జ్ఞాని గాఢనిద్రలో ఉన్నాడు.

"Poor fellow..." ఒక నిట్టూర్పు విడిచి అతడి మొలవైపు చూసాడు సైంటిస్టు. అక్కడ ఒక భరిణె ఉంది. తనకు ఆ భరిణిని ఖాళీగా చూపించటం గుర్తుకు వచ్చింది. అందులో ఏముందో చూద్దామనిపించింది. నెమ్మదిగా జ్ఞానిని చేరుకున్నాడు. వణుకుతున్న చేతితో ఆ భరిణె స్పర్శించాడు. జ్ఞాని కొంచెంగా కదిలాడు.

సైంటిస్టుకి భయం వేసింది... తాను చులకన ఐపోతానేమోనని. ఒక్క ఉదుటన భరిణె లాక్కొని ఏమీ ఎరగనట్లు రెండో ప్రక్కకు తిరిగిపోయాడు. జ్ఞాని మళ్ళీ కొంచెం కదిలాడు.

సైంటిస్టుకి మనసులో సిగ్గుగా ఉంది.

"ఛ, ఛ! అనవసరంగా తీసాను. అయినా ఆ Dirty country rogue దగ్గర ఏముంటుంది? ఇప్పుడు అతడికీ విషయం తెలిస్తే తల ఎలా ఎత్తుకునేది?" మనసులో తిట్టుకున్నాడు.

అయితే జ్ఞాని లేవలేదు.

సైంటిస్టు ఊపిరి పీల్చుకుని ఓ అరగంట ఆగి తరువాత భరిణె తీసి చూసాడు. ఏమీ కనపడలేదు.

"Its already dark now. I shall see this later in the sun light." మనసులో అనుకున్నాడు.

నీళ్ళు నెమ్మదిగా ఆక్రమిస్తున్నాయి.

భరిణె జేబులో వేసుకున్నాడు సైంటిస్టు. అతడికి నిద్ర పట్టింది. ఉదయాన జ్ఞాని లేపినంత వరకు లేవనేలేదు.

"మీ కాగితాలు ఇక్కడ వదిలివేసారు. నే చూడకుంటే గాలికెగిరి కొట్టుకుపోయుండేవి" సైంటిస్టు కాగితాలను అప్పజెప్పాడు జ్ఞాని.

"Thanks, thanks a lot" కాగితాలను తీసుకుని జ్ఞాని మొలవైపు చూసాడు. అక్కడ భరిణె యధాతధంగా ఉంది. సైంటిస్టుకి ఏమీ అర్ధం కాలేదు.

"ఇతడు లేనప్పుడు భరిణిలో ఏముందో చూడాలి" రాత్రి దొంగిలించిన భరిణెని తడుముకుంటూ అనుకున్నాడు.

నీళ్ళు పూర్తిగా కమ్ముకోవటం ప్రారంభించాయి.

"ఇంక ఇక్కడ ఉండలేం" సైంటిస్టు అన్నాడు.

"నా దగ్గర కాస్త రొట్టె ఉంది తింటారా?" జ్ఞాని అడిగాడు.

సైంటిస్టుకి చిన్నగా కోపం వచ్చింది.

"తిన్నట్లుగానే ఉంది మన పరిస్థితి" అంటూ కాగితాల కట్ట నోటితో కరచి పట్టుకుని మళ్ళీ ఈతకు సిధ్ధమయ్యాడు.

నీళ్ళు పూర్తిగా ఆక్రమించాయి.

సైంటిస్టు, జ్ఞాని మౌనంగా ఈదుతున్నారు. సైంటిస్టుకి జ్ఞాని మొలలో భరిణె ఎలా వచ్చిందో అర్ధంకాలేదు. ఈదుతూ మళ్ళీ జేబు తడుముకున్నాడు. అందులో రాత్రి తాను దొంగిలించిన భరిణె ఉంది. 'బహుశా పొద్దున్న లేచాక ఇంకొకటి కట్టుకున్నాడేమో...'

సైంటిస్టుకి తన గొప్పతనం నిరూపించుకోవాలనిపించింది.

"ఈ కట్ట ఉంది చూసావ్?" అతని మాట పూర్తవ్వక ముందే నోట్లోని కాగితాల కట్ట వరద నీట్లో పడిపోయింది.

"Oh... No... my God!, My inventions...My future..." కేకలు పెట్టాడు సైంటిస్టు. అప్పటికే వరదనీరు కాగితాలను దొరకబుచ్చుకుని రిలే పరుగు పందెంలో పరిగెత్తినట్లు చాలా దూరం పోయింది.

సైంటిస్టు దుఃఖం ఆపుకోలేకపోయాడు. బైటకు ఏడ్చేసాడు. కన్నీళ్ళు వరదనీట్లో కలసిపోయాయి.

"What about my dream world...?" ఏడ్చుకున్నాడు సైంటిస్టు.

అతనికి తాను నిర్వీర్యుడనైనట్లు అనిపించింది.

ఇప్పుడు తాను సామాన్యుడనైపోయానని భయపడ్డాడు.

"బాధపడకండి" ఓదార్చాడు జ్ఞాని.

"నా వద్ద కొంచెం రొట్టె ఉంది తింటారా?"

సైంటిస్టుకి విపరీతమైన ఆగ్రహం వచ్చింది.

"Stop it...! Damn.. with your bloody bread." ఏడుస్తూ అన్నాడు.

జ్ఞాని మౌనంగా ఉండిపోయాడు.

సైంటిస్టు తాను జ్ఞానికంటే సామాన్యుడనైపోయానని ఆత్మన్యూనతా భావం తెచ్చుకున్నాడు.

ఇద్దరూ మౌనంగా ఈదుతున్నారు. కాకపోతే సైంటిస్టు మధ్యమధ్యలో నెమ్మదిగా, చిన్న స్వరంతో ఏడుస్తున్నాడు.

కొంచెం సేపు ఈదాక వారికొక దుంగ కనపడింది. ఇద్దరూ ఆ దుంగ వైపు ఆనందంగా చూసారు.

జ్ఞాని తనలో తాను మనసులో ఇలా అనుకున్నాడు - "ప్రభూ! నా సహచరునికి ఆధారాన్నిచ్చావు. మరి నాకు లేదా?"

సైంటిస్టు ఇలా అనుకున్నాడు - "Oh God! you gave me a support. But what about this poor man?"

ఇద్దరూ దుంగవైపు చూస్తూ, ఆ దిక్కున ఈదుతున్నారు. ఇంకా ఎవ్వరూ దాన్ని అందుకోలేదు.

ఇంతలో ఒక పెద్ద అల భయంకరంగా, అమితవేగంతో వారి వెనుకగా రావటం గమనించారు.

సైంటిస్టుకి భయం వేసింది. ఇక తాను ఆలశ్యం చేస్తే దుంగ తనకు దక్కదని అనుకున్నాడు. జ్ఞాని కూడా దుంగను చేజిక్కించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడనిపించింది. వెంటనే జ్ఞానిని ప్రక్కకు తోసేసాడు. ఆతృతతో గభాల్న దుంగను తన చేతుల్లోనికి తీసుకుని కావలించుకున్నాడు.

తమ వెనుక వచ్చిన ఆ భయంకరమైన అల కమ్మింది. అలతో పాటుగా జ్ఞాని అంత ఎత్తున ఎగసాడు. అక్కడనుండే అతను -

"మిత్రమా! ఇది ఉంచు ఉపయోగపడుతుంది" అంటూ తన మొలకున్న భరిణె తీసి సైంటిస్టు వైపు విసిరాడు.

అల క్రిందికి ఉరికింది. జ్ఞాని కూడా క్రిందికి జారాడు. భరిణె తేలుకుంటూ సైంటిస్టు వద్దకు వచ్చింది. ఒక చేత్తో దుంగ పట్టుకుని రెండో చేత్తో భరిణె తెరచి చూసాడు. ఖాళీగా ఉంది.

"హూ... Empty one."

అంతలోనే రాత్రి దొంగిలించిన భరిణె గుర్తొచ్చింది.

అది తీసి, తెరచి చూసాడు.

అదీ ఖాళీగానే ఉంది.

"He made me a fool" తిట్టుకుంటూ దూరంగా కనపడుతున్న జ్ఞాని(శవమో లేక బ్రతికే ఉన్నాడో తెలియదు) వైపు విసిరేసాడు. జ్ఞాని మొలలో ఇప్పటికీ మరో భరిణె ఉంది. దూరం ఎక్కువ కావటంతో అది సైంటిస్టుకి కనపడలేదు.

వరద ఉధృతి మునుపటి కంటే కొంచెం తగ్గింది.

దుంగ పట్టుకుని ఉన్న సైంటిస్టు దగ్గరకు జ్ఞాని తెచ్చిన రొట్టెముక్క తేలుకుంటూ వచ్చింది.

సైంటిస్టుకి తాను రెండ్రోజులనుంచీ ఏమీ తినలేదని గుర్తుకు వచ్చింది.

ఆత్రంగా రొట్టె నందుకుని ఆబగా తిన్నాడు.

22 comments:

sunita said...

Hmm!! Interesting!!

sunita said...

నా కెందుకో అసంపూర్ణం అనిపించింది. రొట్టె అందుకోవడం వరకూ O.K. ఖాలీ భరిణె గురుంచి అతనికి ఏమి అర్ధం ఐనట్లు? ప్రతీ సారి ఙ్ఞాని దగ్గర ఒక ఖాళీ భరిణె ఎలా వచ్చిందో అతనికి తెలియదులేదు కదా?

బృహఃస్పతి said...

సునీతగారూ, భరిణి - జ్ఞానం. అందుకే ఎప్పటికప్పుడు జ్ఞాని వద్ద మరొకటి ఉంటూనే ఉంటుంది. ఇక అది దొంగిలిద్దామనుకున్న వారికి అది ఖాళీగానే కనిపిస్తుంది.

జ్ఞాని వీడిపోయే ముందు అత్యవసరమైన జ్ఞానాన్ని ఇచ్చినా అజ్ఞానికది ఉపయోగపడదు. రొట్టె మాత్రం పనికొస్తుంది.

Bolloju Baba said...

అద్బుతంగా ఉంది.
గొప్ప మెటాఫెర్.

సునీత గారి అనుమానమే నాకూ వచ్చింది. మీరు వివరణ ఇవ్వకపోయినట్లయితే అర్ధం అయిఉండేది కాదనిపిస్తుంది. ఈ వివరణనే కధలో అన్యాపదేశంగా చొప్పిస్తే బాగుండేదేమో.

బహుసా అలా పాఠకునికి అరటిపండు వలిచి పెట్టకపోవటం కూడా ఒక టెక్నిక్కే లెండి. :-)

బృహఃస్పతి said...

బాబాగారూ, స్వాగతం. మీ ప్రశంస నిజంగా గొప్ప ఆశీస్సు.

బహుసా అలా పాఠకునికి అరటిపండు వలిచి పెట్టకపోవటం కూడా ఒక టెక్నిక్కే లెండి

సరిగ్గా ఈ కారణం చేతనే నేను ఎక్కువ వివరించలేదు. నచ్చిన వాళ్ళు Clarity కోసం తప్పక ప్రశ్నిస్తారని నా నమ్మకం. :)

SRRao said...

మనమేమిటో తెలుసుకోవడానికి ఇలాంటి నీతికథలు అవసరం . మంచి కథని అందించినందుకు అందుకోండి అభినందనలు.

బృహఃస్పతి said...

రావుగారూ, స్వాగతం. మీలాంటి పెద్దల అభినందనలే నాకు ఆశీస్సులు.

చిలమకూరు విజయమోహన్ said...

చాలా బాగుంది.

రాధిక said...

అద్బుతం

బృహఃస్పతి said...

విజయమోహన్ గారూ, రాధిక గారూ - ధన్యవాదములు

Padmarpita said...

అద్బుతంగా ఉంది.....

బృహఃస్పతి said...

పద్మార్పితగారూ, ధన్యవాదాలు.

భాస్కర రామిరెడ్డి said...

మరొక్కసారి, మరొక్కసారి, రోజూ చదువుతూనే వున్నా :)

బృహఃస్పతి said...

భా.రా.రె. గారూ, రోజూ చదువుతారా? :-) :-) కానీ ఎప్పుడో అమావాస్యకోసారి మాత్రమే కామెంటుతారు. అంటే మీరు కామెంటిన ఆ రెండు మూడు టపాలే మీకు నచ్చాయని భావించనా? :-(

భాస్కర రామిరెడ్డి said...

భాస్కరుని అవసరం అమావాస్య రోజుల్లోనే కదా :-D

సిరిసిరిమువ్వ said...

చాలా ఆసక్తికరంగా వ్రాసారు, బాగుంది.
భరిణె-జ్ఞానం..మీరు వివరించకపోతే మాలాంటి అజ్ఞానులకి అర్థం అవదు:)

బృహఃస్పతి said...

భా.రా.రె. గారూ, పోలిక అదిరింది.

సిరిసిరిమువ్వ గారూ, చాలా ధాంక్స్ అండీ - అర్ధం అయ్యేలా రాయలేని నా చేతకానితనాన్ని మీ మీద వేసుకుని కవర్ చేసినందుకు...

Anonymous said...

very Interesting!!

nice blog.

-sk

భావన said...

బాగుంది కథ..చాలా బాగా చెప్పేరు, మీరు వివరణ ఇవ్వక పోతే ఈ అజ్ఞానికి అర్ధం అయ్యేది కాదు ఆ భరిణ ట్విస్ట్... :-(

బృహఃస్పతి said...

SK గారూ, ధన్యవాదాలు. ఈ కధ నచ్చినట్లైతే, ఇంతకు మునుపు రాసిన కధలు కూడా మీకు తప్పక నచ్చుతాయని నమ్మకం. వీలైతే చదివండి.

భావన గారూ, టాంకూ అండీ. మీకు కూడా సిరిసిరిమువ్వ గారికి చెప్పిన సమాధానమే. నా లోపాల్ని కవర్ చేసే మీలాంటి పాఠకులు దొరకటం నా అదృష్టం.

Ruth said...

కథ చాలా చాలా బాగుంది. మీ భరిణ పొఇంట్ నాకు అర్ధం ఐంది కాని అది సైంటిస్ట్ కి ఖాళీ గా ఎందుకు ఉందో మీరు చెప్పాక తెలిసింది. చాలా మంచి కథ !

బృహఃస్పతి said...

Ruth గారూ, ధన్యవాదాలు