అడవిలో మొదటి గులాబీ పూసింది. ఆకాశాన్నంటే చెట్ల మధ్య అందంగా పూసింది. ఐతే గులాబీ అందుకు ఆనందంగా లేదు. తన అందమంతా అడవిన గాచిన వెన్నల్లా అయిపోయిందని దిగాలుగా కూర్చుంది. మిగిలిన చెట్లన్ని తన అందాన్ని చూసి అసూయ పడాలనుకునేది గులాబీ. కానీ అసూయ పడటానికయినా తనని గమనించే వారేరి? ఆకాశాన్నంటే చెట్లకు కళ్ళు కూడా నెత్తిన ఉంటాయి. క్రిందకి బుర్రొంచి చూసేదే తక్కువ.
"హు! తెలివి తక్కువ చెట్లు. తన అందం గురించి వీటికేం తెలుసు?" 'తన అందాన్ని కళ్ళప్పగించి చూసేవాళ్ళు కనపడితే ఎంత బాగుంటుంది? ఈ ముసలి చెట్ల మధ్య కాక నాగరిక ప్రపంచం లో తనకు చోటు దొరికితే?'
గులాబీ ఆ ఆలోచనలతోనే ఒక వసంతం గడిపింది.
ఆ రోజు గులాబీ చాలా చూసింది. ఎవరో కొంత మంది వచ్చి చెట్లు నరుక్కుపోవటం దారి చేసుకుంటూ అడ్డంగా ఉన్న చిన్న మొక్కల్ని తొక్కేయటం పీకివేయటం అన్నీ చూసింది.
గులాబీకి భయం వేసింది. 'తనని కూడా తొక్కేస్తారేమో!'. ఏం చెయ్యాలో తోచలేదు. ముళ్ళు నిక్కబొడుచి ఊపిరి బిగబెట్టుకుని చూసింది. తన ముళ్ళు వారినేం చెయ్యగలవు? అయితే వాళ్ళు ఇటు ప్రక్కకు రాకుండానే వెళ్ళిపోయారు.
ఆ రోజంతా గులాబీ చాలా అలోచించింది. "ఎలాగైనా ఈ అడవి నుండి బయటపడాలి. తన అందాన్ని గుర్తించే నాగరిక ప్రపంచంలో అడుగుపెట్టాలి. అక్కడ తన అడుగులకి మడుగులొత్తే వాళ్ళని సంపాదించుకోవాలి."
గులాబీ ఓ నిశ్చయానికి వచ్చింది. అనుకున్నదే తడవుగా గాలిని పిలిచింది.
"నాకు పట్నం పోవాలని ఉంది. ఇల్లు చూసి పెట్టవూ?" ప్రాధేయపడింది.
సరేనంటూ గాలి బయలుదేరింది.
తియ్యటి కలలతో మరుసటి రోజు గాలి రాకకై ఎదురుచూస్తూ ఆ రాత్రి గులాబీ నిద్రపోయింది.
తెల్లవారింది. ఉసూరుమంటూ గాలి విసుగ్గా వచ్చి ముందు వాలింది. గాలి కొంచెం నల్లబడింది.
అది గమనించే స్థితిలో గులాబీ లేదు.
"ఇల్లు దొరికిందా?" ఆత్రంగా అడిగింది గాలిని.
"ఓ!"
"ఎలా ఉంది?"
"ఇంటికేం? బ్రహ్మాండమైన భవంతి. కానీ..." నసిగింది గాలి.
"ఇంకేం? బయలుదేరుతా!" గులాబీ తొందరపడింది.
"అగాగు. అద్దె క్రింద నెలకు పది పూవులైనా ఇవ్వాలని నేల చెప్పింది." అసలు విషయం చెప్పింది గాలి.
అంతవరకు సంభాషణ వింటున్న నేల ఉలిక్కి పడింది. "ఏంటి? అద్దె చెల్లించాలా? ఇడెక్కడి చోద్యం? పట్నంలో నేలకి ఇంత విలువా? ఇక్కడ చూడు... ఈ మొక్కలు, చెట్లు ఏ అద్దె చెల్లించకుండా మా మీద పడి ఎలా బ్రతుకుతున్నాయో!" ఆశ్చర్యాన్ని ప్రకటించింది.
"అద్దె లేదంటావేమిటి? నేనెందుకు కురుస్తున్నాను? వీటి తరపున అద్దెగా వానని చెల్లిస్తున్నా కదా!" మేఘం నేలని గద్దించింది.
పెద్ద చెట్లు, గడ్డి పరకలు "అహ్హహ్హ" అంటూ పకపకలాడాయి.
"మీరంతా ఊరుకోండి. ఈ సమస్య నాది. అద్దే కదా! పట్నం పోవాలే కానీ నెలకి పదేంటి? పన్నెండు పూవులైనా ఇస్తాను." గులాబీ బయలుదేరటానికి సిధ్ధమైంది.
"నువ్వొక్కసారి అలోచించు. అక్కడ నువ్వనుకున్నంత బాగా ఉండదు. ఇక్కడి స్వఛ్ఛత స్వేఛ్ఛ అక్కడ ఉండవు." గాలి నచ్చచెప్పటానికి ప్రయత్నించింది.
ఆ మాటలు వినే స్థితిలో గులాబీ లేదు. గులాబీ పట్నం పోవటానికి ఏర్పాట్లు చకచకా పూర్తయ్యాయి.
నేల బాధపడింది. తోటి గడ్డి పరకలు ఏడ్చాయి. పెద్ద చెట్లు తల క్రిందికి వంచి గులాబీ వైపు మౌనంగా చూస్తున్నాయి.
గులాబీ బయలుదేరింది. మార్గమధ్యంలో తుమ్మెద అడిగింది.
"ఎక్కడికీ?"
"పట్నం పోతున్నా! మరి ఇక్కడికి తిరిగి రాను." సంబరంగా చెప్పింది గులాబీ
గాలి పొలిమేర వరకు సాగనంపి గులాబీ బాధ్యతను పట్నం గాలికి అప్పజెప్పింది.
"అదేంటీ? నువ్వు రావా?" ప్రశ్నించింది గులాబీ.
"ఉహూ! ఆ పట్నం వాతావరణం నా వంటికి సరిపడదు"
"అప్పుడప్పుడూ వస్తూ పోతూ ఉండేం.." ఆర్ధ్రంగా అంది గులాబీ.
"అమ్మో! చచ్చినా రాను. అక్కడకు వస్తే ఇంకా నల్లబడిపోతాను. అనుభవ పూర్వకంగా నిన్ననే తెలిసింది."
గులాబీ చిన్నబుచ్చుకుంది. తన నివాసం గురించి గాలి అలా మాట్లాడటం నచ్చలేదు. తాను అంత ప్రేమగా పిలిచినందుకైనా సరే, ఊ అనాల్సింది.
"నువ్వు నూతిలో కప్పవి. అందుకే అడవంటే నీకు అంత ఇష్టం." శెలవు తీసుకుంటూ అంది.
"కాదు. గాలిని. ఎక్కడికైనా వెళ్ళగలను. ఇందు గలనందులేనను సందేహము వల...."నిరూపించటానికా అన్నట్లు మాట పూర్తిచేయకుండానే రివ్వున అంతెత్తున ఎగిరి వెనక్కి వెళ్ళిపోయింది గాలి.
దూరం నుంచి గులాబీని చూసి రెండేసి ఆకులని చెమర్చాయి పెద్ద చెట్లు.
పట్నం వచ్చి పడింది గులాబీ. ముందుగా అనుకున్నట్లే ఇక్కడ తన అందానికి చాలా విలువ ఉంది. ఎవరు అటుప్రక్కగా వెళ్ళినా ఓ క్షణం పాటు తనవైపు కళ్ళార్పకుండా చూస్తారు. తోటి పువ్వులు కూడా అసూయ చెందుతున్నాయి. గర్వంగా నవ్వుకుంది గులాబీ.
ఎటొచ్చీ అద్దె చెల్లించేటప్పుడే కొంచెం బాధగా ఉంది. తన పువ్వుల కాలం తీరక ముందే యజమాని కత్తెర తెచ్చి కోస్తుంటే గుండెల్లో గునపం గుచ్చినట్లుంది.
మునుపైతే అడవిలో వాడిపోయి రాలిపోయే వరకు ప్రాణానికి ఏ కష్టం తెలియకుండా రాలిపోయేది. ఇప్పుడైతే తన ముల్లు తనకే గుచ్చుకున్నంత బాధ కలుగుతోంది. అయినా ముందు కుదుర్చుకున్న ఒప్పందమే కనుక సరిపెట్టుకుంది.
అయితే రోజులు గులాబీ అనుకున్నట్లు సాగలేదు. ఓ రోజు గులాబీ పూవులను పూయించలేక పోయింది. యజమాని కత్తెర పట్టుకుని తన వైపే రావటం చూసింది. ఒకవేళ యజమాని తననే కత్తిరిస్తుందేమో? ఆమెకేం తెలుసు? తన శరీరం యొక్క ప్రాణం, మనసు, గుండె, మెదడు అన్నీ తనలోనే ఉన్నాయని. అవి తనలో ఉండబట్టే కదా ఇన్నాళ్ళయినా వాడకుండా, రాలకుండా తానొక్కటే నిలచింది. ఆ పాటి ఇంగిత జ్ఞానం యజమానికి ఉంటే ఫరవాలేదు.
ఉహూ! గులాబీ అనుకున్నట్లే అయ్యింది.
యజమాని తనని కత్తిరించింది. విలవిల్లాడింది గులాబీ. కోపంగా ముల్లుతో యజమానిని పొడిచింది. యజమానికి ఒళ్ళు మండింది. ముల్లు విరిచేసింది. రెక్కలు తెగిన పక్షిలా ఎర్రగా రక్తసిక్తం అయినట్టుగా కనపడుతోంది గులాబీ.
"ఇప్పుడు అందంగా ఉంది" యజమాని అనుకుంది.
జీవఛ్ఛవంలా ఓ రోజంతా యజమాని కొప్పులో స్పృహ తప్పి పడుకుంది గులాబీ.
కళ్ళు తెరిచే సరికి ఓ గాజు గ్లాసులో ఉంది. నీళ్ళు కూడా పోసారు. గొంతు తడుపుకుంది గులాబీ.
'తన శరీరం ఏమయ్యిందో? ఈ పాటికి చచ్చిపోయి ఉంటుంది.' గులాబీ కన్నీరు కార్చింది గాబోలు... గ్లాసులో నీటి మట్టం కొంచెం పెరిగింది.
'ఇక తను బంధింపబడింది. మామూలుగా కాదు. అన్ని అవయువాలనీ నరికివేసి ప్రాణాన్ని వేరుగా బంధించేసారు. ఇప్పుడు తానొక రెక్కలు తెగిన పక్షిని' ఆలోచిస్తూ దిక్కులు చూసింది.
పంజరంలో చిలుక కూడా తనలానే ఏడుస్తుంది. "అడవిలో హాయిగా ఉండేదాన్ని. నన్ను పట్టుకుని బంధించేసారు నాయనో" ఘొల్లుమంది చిలుక.
"ఊరుకో.. నేను మాత్రం భూమిలో నాకు నచ్చిన రూపులో ఉండేవాడిని. నన్నిలా బయటకు లాగి వారికి నచ్చిన రూపంలో సాగగొట్టి బంధించలేదూ?" ఓదార్చింది లోహ పంజరం.
"అసలు భూమిలో ఉండటమే నీకు బందీఖానా! బయటే నీకు స్వేఛ్ఛ. ఇక రూపమంటావా? నీకేం? చక్కగా నగిషీలు చెక్కి అలంకరించారు." ఏడుపాపి పంజరం మీద చివ్వున లేచింది చిలుక.
"ఏది ఏమయినా బాధపడి ప్రయోజనంలేదు. నన్ను చూడండి, గానుగెద్దు జీవితమయినా ఎలా పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటున్నానో?" ఫేనుకి బంధించి ఉన్న పట్నం గాలి చక్కెర్లు కొడుతూ అంది.
"నీకేం? ఎన్ని కబుర్లయినా చెబుతావు. మా బాధ మాది. మునుపైతే ఎంత పచ్చగా బ్రతికే దానినో...! నన్ను చంపి ఇలా చేసేసారు. తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది." కర్ర కిటికీ కిర్రుమంటూ ఏడ్చింది.
"నిజమే మేమూ చెఱువుల్లో సరస్సుల్లో ఆనందంగా, స్వేఛ్ఛగా ఈదేవాళ్ళం. ఇక్కడ ఆ స్వేఛ్ఛ ఏదీ? వేళకు తిండి పడేస్తే చాలా? ఆ స్వేఛ్ఛ లేని బ్రతుకు ఎందుకు?" గాజు జాడీలోని చేప పిల్లలు కిటికీకి వత్తాసు పలికాయి.
"నేను మాత్రం? గలగలా పారుతూ అంత ఎత్తు సెలయేరు నుంచి ప్రవహిస్తూ చలాకీగా దూకేదాన్ని. ఇక్కడ కనీసం చలించలేకపోతున్నా" గాజుజాడీ లోని నీరు కూడా కష్టాన్ని చెప్పుకుంది.
గులాబీ అంతా గమనించింది.
"తనలానే స్వేఛ్ఛని, అందమైన జీవితాన్ని ఇంతమంది కోల్పోయినారా? మరి తానెందుకు కష్టమేదో తనకొక్కదానికే వచ్చినట్లు బాధపడటం? ఈ లోకంలో కష్టాలు అందరికీ వస్తాయి. ఆ కష్టాలు తలుచుకుని బాధ పడటం మూర్ఖత్వం. ఇలా గాలిలా యాంత్రికంగా జీవించటమే ఉత్తమం." నిశ్చయించుకుంది గులాబీ.
ఓ నాలుగు రోజులు గడిచాయి. గులాబీ చచ్చిపోయే క్షణాలు దగ్గరకు వచ్చాయి. అప్పటికే చాలా రేకులు రాలిపోయాయి. సత్తువ ఉడిగిపోయిన గులాబీ చివరి కోరిక కోరుకుంది. "దేవుడా! నా శరీరాన్ని ఒక్క సారి చూపించు."
దేవుడు గులాబీ మొర ఆలకించినట్లుగా యజమాని వచ్చి గులాబీని కిటికీ నుంచి బయటకు విసిరేసింది. గులాబీ వచ్చి తన శరీరానికి సమీపంలో పడింది. అప్పటికే తన శరీరం చచ్చిపోయి ఉంది. అయితే యజమాని ఎందుకనో ఇంకా పెరికివేయలేదు. గులాబీకి తన శరీరాన్ని తాకాలనిపించింది. కానీ అందలేదు. చేరుకునే శక్తి కానీ, కనీసం గాలిని సహాయం అర్ధించేందుకు పలికే శక్తికానీ లేదు.
ఇంతలో యజమాని వచ్చింది.
"ఈ చచ్చిన మొక్క ఇక్కడెందుకు?" అనుకుంటూ పెకిలించి విసిరివేసింది. ఆ శరీరం వచ్చి గులాబీ మీద పడింది. గులాబీ తన శరీరాన్ని ముద్దాడింది.
'ఒకప్పుడు పచ్చగా పొగరెక్కిన ముళ్ళతో ఉండే తన శరీరమేనా ఇది? చచ్చి నల్లగా మారిన ఈ నిర్జీవ దేహానికి, ఆ శరీరానికి ఎంత తేడా? అడవిలోనయితే తాను చచ్చేదా? అక్కడ ఎవ్వరూ చావనివ్వరు. గాలైనా, నేలైనా, మేఘమైనా, గడ్డి పరకలైనా, పెద్ద చెట్లైనా, వానైనా, మరేదైనా ఏదో ఒకటి చేసి బ్రతికించేవి. ఒకవేళ ఆయుష్షు తీరి చనిపోయినా, పెకిలించక అక్కడే నేలలో సమాధి అయినంతవరకు తనని అంటిపెట్టుకుని శ్రధ్ధాంజలి ఘటించేవి'
గులాబీకి అడవి గుర్తొచ్చింది. ఏడుపొచ్చినా ఏడవలేకపోయింది. దేవుడికి మరో కోరిక కోరాలని ఉంది. చనిపోయే ముందు ఒక్కసారి తన అడవిని చూపించమని. కానీ ఆ కోరిక తీరదని తనకీ తెలుసు.
ఇంతలో యజమాని ఎందుకో మళ్ళీవచ్చి గులాబీని, గులాబీ శరీరాన్ని చేతులోనికి తీసుకుంది.
"ఒకవేళ ఇన్నాళ్ళూ అందాన్ని పంచి ఇచ్చినందుకు కృతజ్ఞతా పూర్వకంగా ముద్దాడుతుందేమో" అనుకుంది గులాబీ.
'పోనీ అదో తృప్తి. పోయేటప్పుడైనా పడ్డ కష్టమంతా మరచిపోవచ్చు.'
"ఇక్కడుంటే ఎవరి కాలికైనా గుచ్చుకోవూ?" యజమాని స్వగతం అనుకుంటూ గోడవతల ఉన్న చెత్త కుండీ లోనికి గులాబీనీ, గులాబీ శరీరాన్ని విసిరేసింది.
చెత్త కుండీలో చనిపోతూ గులాబీ బయటకు వెళ్ళగ్రక్కలేకపోయిన మాటను మనసులో అనుకుంది.
'అడవి తల్లీ... నన్ను క్షమించవూ?'
10 comments:
Too good !
చాలా చాలా బాగు౦ది...మనకున్నదా౦తో మనకి తృప్తి ఉ౦డదు.ఇ౦కా ఎదో లేదని ఏడ్చుస్తా౦..."విలువ" విలువని చెప్పేలా ఉ౦ది మీ పోస్ట్.
శ్రావ్యగారూ, టాంకూ అండీ...
సుభద్రగారూ, వికాసానికి స్వాగతం. ఈ కధలో తృప్తి విలువతో పాటుగా, కష్టాలందరికీ ఉండేవేనన్న మనోధైర్యాన్ని కూడా చెప్పటానికి ప్రయత్నించానండీ... మీకు నచ్చిందన్నందుకు ధన్యవాదాలు.
really nice one
కొంచం సాగదీసినట్లు అనిపించింది.but చెప్పాలనుకున్న theme బాగుంది.
వినయ్ గారూ, వికాసానికి స్వాగతం. మీకు నచ్చిందన్నందుకు ధన్యవాదాలు. ఎక్కడెక్కడ సాగదీసినట్లనిపించిందో చెప్పి ఉంటే నాకు సరిదిద్దుకునే అవకాశం ఉండేది కదండీ...
బాగుంది కథ. చదువుతున్నంత సేపు అడవి గులాబి కళ్ళముందు వూగుతున్నట్లు అనిపించింది... అయ్యో ఇలా టెన్షన్ పెడితే ఎలా ఇంక దేనిని మన్స్పూర్తి గా వాడలేము అయ్యో అవేమి బాధ పడుతున్నాయో అని. నేను చేప కధ చెపితే మీరు గులాబి కధ చెప్పేరన్నమాట.. :-)
ఒకేఒక్క మాట ఇంత కన్నా చెప్పలేను "అద్భుతం!" అసలు ఇలా అలోచించవచ్చని ఎలా తట్టింది. ఇంతకుముందు మీరు నదులూ, సముద్రం గురుంచి కూడా ఇలానే వినూత్నంగా రాసారు. ఇంకా మంచి మంచి కధలు రాయండి. (వ్రాయండి)
భావనగారూ, ఈ కాలంలో ఇంకా తల్లో గులాబీలు పెట్టుకునే అమ్మాయిలు ఎక్కడున్నారండీ...? (ఉంటే గింటే చిన్న చిన్న పట్టణాల్లో తప్ప.) అయితే చేపలుతినే వారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగిందండోయ్. కనుక నా కధ కన్నా మీ కధ ఇంపేక్టే ఎక్కువన్న మాట :)
సునీతగారూ, నా అదృష్టం కొద్దీ మీలాంటి పాఠకులకు నచ్చుతున్నాయి కానీ , నా రాతలు నచ్చే వారి శాతం చాలా తక్కువ (ఇందులో నింద అయినా, నేరారోపణ అయినా నా మీదే కానీ పాఠకులపై కాదని మనవి)
అసలు ఇలా అలోచించవచ్చని ఎలా తట్టింది.
మళ్ళీ తబ్బిబ్బిబ్బిస్తున్నారండీ. :) ఇప్పుడంటే ప్రపంచాన్నీ, పంచభూతాలనీ మానవుడు 'కొనే'సాడుగానీ, యుగాల ముందు ఈ భూమాత అందరిదీనూ... అందుకే నాకధల్లో రాళ్ళు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటాయి, నీళ్ళకు కూడా అనుభవాలుంటాయి.
ఓహ్! చాలా బాగుంది.
విశ్లేషించాలంటే..ఇందులో చాలా ఉన్నాయండి.
1. వలస విధానం. People are migrating from their natural habitats. Let there be some controversial reasons behind these...but.
వనాల్లోని కోయిలలు కాకులతో ఏకం కాలేక..ఇలా దీని మీద ఒక వ్యాసం రాయొచ్చు.
2. ప్రకృతిని ఒక ఫ్రేము లో బిగించాలనే మనిషి తృష్ణ. దీని repercussions మనం చూస్తూనే ఉన్నాం.
ఇలా చూసుకుంటూ పోతే..
గర్వం..పతనం.
career planning
and so on and so on...
ప్రకృతిని ఒక ఫ్రేము లో బిగించాలనే మనిషి తృష్ణ.
చాలా బాగా చెప్పారండీ, శతకోటి జీవాలూ, అనంతకోటి పదార్ధాలలో మానవుడు ఒకటి(మాత్రమే) అని మరచిపోయి, అన్నీంటినీ తానే ఏలాలన్న దురాశకు అభివృధ్ధి అని పేరు పెట్టుకున్నాం మనం. తాత్కాలిక విజయం, అభివృధ్ధి(??) కనిపించినా అంతిమంగా దీనివల్ల జరిగేది పతనమే...!
Post a Comment