ఎడబాటు

కవిత మజిలీ కధ ముగింపు కోసం రాసినది. అయితే ఎందుకనో కధకు అతకలేదనిపించింది. అందుకే విడిగా ప్రచురిస్తున్నా! :)

ముంగిటన విలసిల్లు పాడి పశువుల నుండి
మండువాలో విరియు మందరములన్నిటికి,
పెరటిలో
వెలసిన తులసికోటతో పాటు
వాకిటిన
విలపించు మా చిట్టి చిలుకకు,

గాలికీ
, నేలకి, మా వాడ కోవెలకు,
నడవడిక
నేర్పిన ఊరు, పుట్టిపెరిగిన ఇంటికి
ఎడబాటు
మన మధ్య ఇకనుండి తప్పదని
కడసారి
చెప్పె, నా చెమ్మగిల్లిన కళ్ళు

చెమర్చిన
అశ్రువులు తుడువగ ఈనాడు
ఓదార్చ
ఏతెంచె మా వీధి మారేడు

సాగనంపగ
ఏడ్చె మా ఊరి రహదారి
చెఱువైతె
రోదించె పొంగి బైటకి పారి
కుమిలి
ఆక్రోశించె మూగదైన బావి
మౌనంగ
శోకించె మా ఇంటి చావిడి

మందారములు
ముడిచె విరియనే లేక
పాడి
పశువులు గడ్డి ముట్టనేలేదు
వేసారి
అలసింది తులసి చలనము లేక
చిలుకైతె
రెన్నాళ్ళు పలుకనేలేదు

బండబారిన
గుండెతో ఆశీస్సులందించె
అందరికి
అండైన మా రచ్చబండ
దీవింప
ఉబలాటపడెను పొలిమేర
దూరాన
ఉండేటి మా ఊరికొండ

చివరిసారిగా
మా మట్టి వాసన పీల్చి
మరువలేని
అనుబంధములు వదలి
మరల మీ అందరిని కలియు క్షణమునకు
నోరార
మిమ్మల్ని పిలుచు దినమునకు

ఎదురుచూస్తూ
వెనుదిరిగి చూడక
తపిస్తూ నిష్క్రమిస్తున్నా

శిలగ
మారిన మనసు సెలవంటు పలికింది
ఇలపైన కలవంటి మా నెలవు వీడి

4 comments:

sunita said...

hmmm...baagundi! Touching.

Padmarpita said...

బొమ్మ, కవిత రెండూ బాగున్నాయండి!

కెక్యూబ్ వర్మ said...

చివరి వాక్యం మరీను, మనసును పిండేయడం అంటే ఇదే సుమా...

బృహఃస్పతి said...

సునీత గారూ, పద్మార్పిత గారూ టాంకూ అండీ...!

కుమార్ గారూ, మీరిదే మొదటసారి వికాసంలో వ్యాఖ్యానించటం. ధన్యవాదాలు.