మామూలు కాలేనూ...?


నిజంగా నేనంతగా మారానా?
నా నవ్వులో మునుపటి స్వఛ్ఛత లేదా?
నా చూపుకి అప్పటి తీక్షణత రాదా?
నా పలుకులో అంతటి గాంభీర్యం లేదా?

నా నడకెందుకు నెమ్మదించింది?
నవ్వేటప్పుడు నోరెందుకు వంకర బోతోంది?

ఖంగుమనే కరుకు మాటకు
వణుకెప్పుడు మొదలయ్యింది?
చురుకు చూపులకు
బెరుకెప్పుడు అలవాటయ్యింది?

నిజంగా నేనంతగా మారానా?
తల భుజాలకు చేరువైనదేమి?
చేతులు కంపించటం ఎప్పటినుంచి?
నిజంగానే నే మారిపోయానా?

ఆ చైతన్యం ఇక రాదూ...?
ఆ ఆత్మస్థైర్యం మరి రాదూ...?
'ఉఫ్..' ఈ మార్పు భరించలేకున్నాను.
'నిజం!' నిద్ర పట్టటం లేదు.

అర్ధరాత్రిలేచి అద్దంలో చూస్తే
మాసిన గడ్డం వెక్కిరిస్తోంది
నిమురుకునేందుకు చెయ్యెత్తితే
పెరిగిన గోళ్ళు హేళన చేస్తున్నాయి

ఆ అద్దంలో, బుగ్గలు లోనికి పోయి
వికారంగా కనిపిస్తున్నాయి
నాశికపై ఇరుప్రక్కలా, నిర్జీవంగా
రెండు లోతైన గుంటల్లా కళ్ళున్నాయ్

ముఖాన చర్మం పీక్కుపోయినదెందుకు?
వెనుకన ఈ గూనెప్పటి నుండి?
నిజంగా నేనంతగా మారానా?

తినేందుకు అరగంటెందుకు పడుతుంది?
తీరా చూస్తే మునుపటి తిండిలో సగమే!
ఆకలేసినా అన్నం సహించదేం?
ఆక్రోశించటానికైనా మనస్కరించదేం?


అసలు కన్నీళ్ళే ఇక రావా?
లోతైన కళ్ళు మరి వర్షించవా?
కళా విహీనంగా తయారైన తనువు
మునుపటి తేజస్సు విరజిమ్మదా?

శవకళ ఉట్టిపడుతున్న కట్టెకు
ఇక పూర్వపు పుష్టి కలుగదా?
నిర్జీవంగా జడలు కట్టిన కురులకు
గతోత్సాహం లభించదా?

గుండెకు ఆ నిబ్బరం రాదా?
పిడికిలికి మునుపటి శక్తి రాదా?
నిజంగా నేనంతగా మారానా?
ఇక తిరిగి మామూలు కాలేనా?

16 comments:

వీరుభొట్ల వెంకట గణేష్ said...

Excellent. ఈ కవిత చదివిన తరువాత జీవితం క్షణ భంగురం అని మళ్ళీ గుర్తుకొచ్చింది.

సుభద్ర said...

బాగు౦ది...మళ్ళి ఓసారి మీ ప్రత్యకత చూపుతూ......

రమణ said...

బాగుంది

జయ said...

బాగుందండి. ఇది జీవిత సత్యం. ఆ దశ తప్పదు అని తెలిసినా, ఎలా తప్పించుకోవాలా అన్న ఆలొచనే! భయం వేస్తోంది.

Sravya V said...

ఇంకా ఎన్ని రోజలండి ఈ కవితల వ్రతం? :(

sunita said...

బాగుంది!

బృహఃస్పతి said...

గణేష్, సుభద్ర, వెంకటరమణ, సునీత గారూ, ధన్యవాదాలు.

జయగారూ, తప్పించుకునే కన్నా అహ్వానించటమే మేలండీ. కొంతైనా నేర్చుకోవచ్చు. అనుభవాలేవీ వ్యర్ధం కావు. గెలుపైనా, ఓటమైనా...

శ్రావ్యగారూ, మీకు కవితలు నచ్చవా? లేక నా కవితలు నచ్చవా? :(
మీరన్నారు కనుక ఇదే లాస్ట్ కవితండీ. దీపావళికి ఇంటికి వెళ్తున్నా! మళ్ళీ బుధవారం కతలు మొదలెడతా :)

Unknown said...

బాగుందండి.
సత్యం శివం సుందరం
మీరు వ్రాసినదంతా సత్యం
అది శివస్వరూపం
మరియు సుందరంగా అనిపిస్తుంది నాకు.

బృహఃస్పతి said...

నరసింహగారూ, ధన్యవాదములు. సాధారణంగా మా ఈడు వారి రచనలలో అపరిపక్వత తొంగిచూస్తుంది. మీ ప్రశంస పొందిందంటే నా కవితకు ఆ అడ్డంకి తొలిగిందన్నంత ఆనందంగా ఉంది.

భావన said...

బాగుంది మార్పు మానవ సహజం... ఈ మార్పులు, మరణం కంటే కూడా... అశక్తత, అసహాయత జీవితం లో ఏ మలుపు దగ్గర వేచి చూడకుండా వుంటే అంతే చాలు అని భగవంతుడిని కోరుకుందాము. మనసు భారమయ్యింది.. :(

చిలమకూరు విజయమోహన్ said...

గుండెకు ఆ నిబ్బరం రాదా?
పిడికిలికి మునుపటి శక్తి రాదా?
ఆస్థితిని ఆస్వాదించడం ప్రారంభించడం మొదలుపెడదాం అప్పుడు రాక ఏంచేస్తుంది.

sreenika said...

ఇందులో గొప్ప సందేశం ఉంది.
'నేను'ను అన్వయిచాలంటే..చాలా వచ్చేస్తూన్నాయి.
మనసు, సమాజం ఇంకా..ఇంకా..
ఈమధ్య టూర్లో ఉండబట్టి టపాలు లేటయ్యాయి.
సాహితీమిత్రులకు
ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు

బృహఃస్పతి said...

భావన, శ్రీనిక, విజయమోహన్ గారూ, ధన్యవాదాలు. అందరికీ, ప్రపంచ కవితాదినోత్సవ మరియూ దీపావళి శుభాకాంక్షలు.

నేస్తం said...

బాగుంది but మళ్ళి భయం వేస్తోంది :)

Bolloju Baba said...

వండర్ఫుల్

బృహఃస్పతి said...

బాబా గారూ, ధన్యవాదాలు